రీల్ గజనీ కాదు... రియల్‌గానే..!

రీల్ గజనీ కాదు... రియల్‌గానే..!


ఓ వ్యక్తి ఉంటాడు. అతనికి సడెన్‌గా ఏదో ప్రమాదం సంభవిస్తుంది. కోమాలోకి వెళ్లిపోతాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ లోకంలోకి వస్తాడు. కానీ తనకి గతానికి సంబంధించిన విషయాలు ఎంతకీ గుర్తు రావు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. కానీ నిజజీవితంలో అలాంటిది జరిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! అందుకే మరి బెన్ మెక్ మెహాన్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

ఆస్ట్రేలియాకి చెందిన ఇరవై రెండేళ్ల యువకుడు బెన్ మెక్ మెహాన్. చాలా హుషారైన వాడు. స్నేహితులతో షికార్లు, అల్లర్లు, పార్టీలు... అందరిలానే సంతోషంగా ఉండేవాడు. కానీ 2012లో అతడి జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. చనిపోవాల్సినవాడే... కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మూసిన కన్ను తెరవకుండా మంచం మీదే పడి వున్నాడు. బహుశా అతడు ఇక కోమాలోంచి బయట పడకపోవచ్చేమోననుకున్నారు వైద్యులు. కానీ ఓ వారం పదిరోజుల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోమాలోంచి బయటపడ్డాడు బెన్. కానీ అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఒకటి జరిగింది.

 

కళ్లు తెరచినప్పటి నుంచీ బెన్ మాండరిన్ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటివరకూ అతడికి ఆ భాష రాదు. ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. కానీ ఉన్నట్టుండి ఆ భాషను అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థమవ్వలేదు అతడి కుటుంబ సభ్యులకి. మాండరిన్ అనేది చైనాలోని ఓ సమూహం మాట్లాడే భాష. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు చైనాకు వెళ్లినా, అక్కడి భాష మాత్రం రాదు బెన్‌కి. అందుకే తమ కొడుకు ఆ భాష ఎలా మాట్లాడుతున్నాడో అంతు పట్టలేదు వారికి. వైద్యులు కూడా ఎంతగా ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు.

 

కట్ చేస్తే... బెన్ ఓ చైనీస్ చానెల్లో యాంకర్‌గా చేరాడు. మాండరిన్ భాషను గలగలా మాట్లాడేస్తూ మతులు పోగొట్టేస్తున్నాడు. ‘ఇదెలా సాధ్యం బెన్’ అంటే... ‘ఏమో... నాకా భాష అంత బాగా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు, ఎలాగూ వచ్చింది కాబట్టి క్యాష్ చేసుకుంటున్నా’ అంటున్నాడు నవ్వుతూ. వైద్యులు మాత్రం ఈ అద్భుతం ఎలా జరిగిందా అని ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉండటం కొసమెరుపు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top