ఆ క్షణం నుంచి అతనితో పెళ్లయినట్లే! - ఇలియానా

ఆ క్షణం నుంచి  అతనితో  పెళ్లయినట్లే!  - ఇలియానా


తెలుగు చిత్రసీమలో కొంతకాలం పాటు ఇలియానాది తిరుగులేని హవా. అగ్ర తారల నుంచి నవ యువ హీరోల దాకా పలువురి సినిమాల్లో ఈ నాజూకు నడుము గోవా సుందరిదే మెరుపు. అలాంటి ‘ఇల్లూ’ బేబీ ఈ మధ్య తెలుగు తెరపై కనిపించడం లేదు. ముంబయ్‌లో సొంత ఇల్లు కొనుక్కున్న ఈ అందాల భామ అక్కడే హిందీ సినిమాల్లో కనిపిస్తోంది. ఇటీవలే ‘హ్యాపీ ఎండింగ్’లో మెరిసిన ఇలియానా ఇంతకీ మన దగ్గర కనిపించడం లేదెందుకు? మునుపటి కన్నా అందంగా, నాజూగ్గా తయారవడం వెనుక గుట్టు ఏమిటి? ప్రేమ కబుర్లు వినపడుతున్నాయి కానీ... మరి పెళ్ళెప్పుడు? రండి...  ఇలియానానే అడిగి తెలుసుకుందాం...

 డి.జి. భవాని



తెలుగు పరిశ్రమపై కోపమా... వరుసగా హిందీ చిత్రాలే చేస్తున్నారు?



కోపమా?... అదీ తెలుగు పరిశ్రమ మీద. నన్ను కథానాయికను చేసిందే తెలుగు పరిశ్రమ. ఎన్నో మంచి పాత్రలు చేసే అవకాశం దక్కింది. హిందీలో ‘బర్ఫీ’కి ఆఫర్ వచ్చినప్పుడు! చేయాలా? వద్దా అని తర్జన భర్జనపడ్డాను. ఓ తెలుగు దర్శకుడితో ఈ చిత్రకథ చెప్పి, సలహా అడిగితే, ‘మంచి అవకాశం’ అన్నారు. హిందీలో ఒక సినిమా చేసి వెనక్కొచ్చేద్దాం అనుకున్నాను. కానీ, వరుసగా అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చింది.



ఇక్కడివారితో టచ్‌లో ఉంటున్నారా?



హీరోలు రామ్, రానా.. ఇంకా చాలామందితో టచ్‌లో ఉన్నాను. వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను. నాక్కూడా వాళ్లు ఫోన్ చేస్తుంటారు. హైదరాబాద్ నా సెకండ్ హోమ్‌లాంటిది. ఎప్పటికీ మర్చిపోలేను.



అసలే సన్నగా ఉంటారు. ఇప్పుడు ఇంకా సన్నబడ్డారు. కారణం ఏంటి?



‘బర్ఫీ’ ఒప్పుకోగానే సన్నబడమని ఆ చిత్రదర్శకుడు అనురాగ్ బసు అన్నారు. అందులో నటించిన ప్రియాంకా చోప్రా, రణబీర్ కపూర్ చాలా సన్నగా ఉంటారు. వాళ్ల పక్కన నేను లావుగా కనిపిస్తానేమోనని బరువు తగ్గితే బాగుంటుందని అన్నారు. అందుకని తగ్గాను.



తగ్గడానికి ఏం చేశారు?



ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకోలేదు. మా గోవా బీచ్‌లో మూడు, నాలుగు కిలోమీటర్లు వేగంగా పరిగెత్తేదాన్ని. ‘బర్ఫీ’ కోసం ఆరు కిలోలు తగ్గాను.



ఇప్పుడు ట్రైనర్‌ని పెట్టుకున్నారా?



మరో రెండేళ్లల్లో నాకు 30 ఏళ్లు వచ్చేస్తాయి. థర్టీస్‌లోకి అడుగుపెడుతున్నామంటే.. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని యాస్మిన్ అనే ట్రైనర్‌ను పెట్టుకున్నాను. నా డైట్ చార్ట్, ఎక్సర్‌సైజ్‌లు తనే ప్లాన్ చేస్తుంది. ఆ సలహాల వల్లే నేనింకా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటున్నాను.



మీకు 28 ఏళ్లా... అంటే పెళ్లి వయసు వచ్చేసినట్లేగా?

 

పెళ్లికి సరైన సమయం, వయసు ఉంటుందని నేనుకోను. ఇరవయ్యేళ్లొచ్చేశాయి కాబట్టి.. పెళ్లి చేసేసుకోవాలనీ, 30 దాటితే పెళ్లి కాలేదని బాధపడిపోతూ కూర్చోవాలనీ ఎవరన్నారు? మన మనసుకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. ఒకవేళ 70 ఏళ్ల వయసులో అలా అనిపించిందనుకోండి.. అప్పుడే చేసుకోవచ్చు. తప్పేంటి?



కానీ.. పిల్లలు కావాలనుకుంటే వయసు గురించి ఆలోచించాలి కదా!



 అఫ్‌కోర్స్.. కానీ, ఇప్పుడు నేనంత దూరం ఆలోచించడం లేదు.



వివాహ బంధం మీద మీకు నమ్మకం ఉందా?

 

ఉంది. ఒకవేళ నేనెవరినైనా ఇష్టపడ్డాననుకోండి. ఆ బంధానికి కొనసాగింపు పెళ్లి అనుకుంటాను. అతనితో ఉంగరాలు మార్చుకుని, ప్రమాణాలు చేస్తేనే పెళ్లయినట్లుగా భావించను. ఎవరికైనా కమిట్ అయితే... కమిట్ అయిన క్షణం నుంచి మానసికంగా అతనితో పెళ్లయినట్లుగా భావిస్తాను. అంతేకానీ, పార్టీ ఇచ్చి, ‘హేయ్.. ఉయ్ ఆర్ మేరీడ్’ అని ప్రపంచానికి చాటి చెప్పాలనుకోను.



ఇంతకు ముందు కన్నా మీ అందం రెట్టింపైనట్లనిపిస్తోంది.. ఆ రహస్యం?



మంచి ఆహారపుటలవాట్లు. అంతకుమించి వేరే కారణం ఏదీ లేదు. కానీ, ఒక్కటి మాత్రం చెబుతాను. ఈ మధ్య చాలా ఆనందంగా ఉంటున్నాను. బహుశా అందం రెట్టింపు కావడానికి అదే కారణమేమో!



{పేమలో పడ్డవాళ్లల్లో కనిపించే వింత మెరుపేదో మీలో కనిపిస్తోంది...?



ఏమోనండి! ఆ టైప్ మెరుపుల గురించి నాకు తెలియదు (నవ్వుతూ).

 కానీ, ఆ నవ్వుకి అర్థం మాకు తెలిసిపోయింది...

 చెప్పుకోండి చూద్దాం.



కచ్చితంగా ప్రేమలో పడ్డారు... మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి?



ఈ మధ్యకాలంలో నన్నెవరు కలిసినా, నా లవ్ లైఫ్ గురించే అడుగుతున్నారు. కానీ, మరో వ్యక్తికి సంబంధించిన విషయాన్ని నేను బయటపెట్టలేను. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, ఏం చెప్పినా నా స్వేచ్ఛ పోతుంది. ఏదేదో మాట్లాడి నా స్వేచ్ఛను నేనే చెడగొట్టుకోలేను.



ఆ మరో వ్యక్తి ఎవరో?



రైట్ టైమ్ వచ్చినప్పుడు చెబుతాను.



రైట్ టైమ్ ఎప్పుడు వస్తుంది?



వచ్చినప్పుడు వస్తుంది. అయితే ఒకటి... పెళ్లి చేసుకునేంతవరకూ నేను సింగిల్‌గా ఉన్నట్లే!



ఈ మధ్య మీరెక్కడికెళ్లినా ఆండ్రూ నీబోన్ (ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్) మీతో కనిపిస్తున్నారు... ఆయనతో మీకు ఎఫైర్ ఉందనే వార్త http://img.sakshi.net/images/cms/2014-12/41418492231_Unknown.jpgవస్తోంది?



 ఆండ్రూ నాకు చాలా చాలా స్పెషల్ పర్సన్. అందుకే, నేనెక్కడికెళ్లినా నాతో వస్తుంటారు.

 

ఇటీవల మీరుచేసిన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమాలో కూడా ఆండ్రూ నటించారు. దానికి కారణం మీరేనా?



 నా కోసం ఆ చిత్రం షూటింగ్ లొకేషన్‌కి వచ్చేవారాయన. చిత్ర దర్శకులు రాజ్-డీకేలు అడిగితే, నటించారు.



అవునూ.. ముంబయ్‌లో సొంత ఇల్లు కొనుకున్నట్లున్నారు?

 

ఓ చిన్న స్వీట్ హోమ్ కొన్నా. ఒక్కదాన్నే ఉంటున్నాను.



ఆ మధ్య శ్రుతీహాసన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో వ్యక్తి లోపలికి చొరబడటానికి ట్రై చేశాడు. ఒంటరిగా ఉంటే ఇలాంటి సమస్యలుంటాయేమో?

 

ఉండొచ్చు. కానీ, ఆ సమస్యల కారణంగా ఒంటరిగా ఉండటం మానుకోకూడదు. ఇంటిపట్టున ఉన్నప్పుడే ప్రమాదాలు జరగాలని లేదు. బయటికెళ్లి కారు ఎక్కుతున్నప్పుడు హఠాత్తుగా ఎవరైనా వచ్చి చెయ్యి పట్టుకోవచ్చు.. ఇంకేదైనా చేయకూడని పని చేయొచ్చు. ఎక్కడా సేఫ్టీ లేదు. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

 

ఇంతకీ, మళ్లీ తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తారు?

 

మంచి కథ, పాత్ర వస్తే... తప్పకుండా కనిపిస్తా!

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top