విషం కక్కుతున్నారు!

విషం కక్కుతున్నారు! - Sakshi


ఈ అమ్మాయి కల్యాణి.

తల్లి సత్యవతి... నెలరోజులుగా జైల్లో ఉంది!

అన్న వాసు... అతనూ జైల్లోనే ఉన్నాడు!

తండ్రికి క్యాన్సర్. ఆయన మంచంలో ఉన్నాడు!

ఫుడ్ పార్క్‌ను నిర్మించి కుటుంబాలను, ఊళ్లను విషమయం చెయ్యొద్దన్నందుకు ఈ ఇంటిపై వ్యవస్థ విషం కక్కింది. 

తల్లికి, అన్నకు బెయిల్ రాకుండా చేస్తోంది. వాళ్లు ఇంటికి వస్తేనే తండ్రి బతుకుతాడు.  విష యంత్రాలు వెళ్లిపోతేనే ఊరు బతుకుతుంది. ఇల్లు, ఊరు బాగుండాలని కల్యాణి ఆకాంక్ష..


 


ఆ కుటుంబం ఊరి కోసం పోరాటం చేస్తోంది! ఊళ్లోవాళ్లకు అండగా నిలిచినందుకు ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. ఆ ఇంటి తల్లిని జైల్లో వేశారు. ఆ ఇంటి కొడుకును ఇంకో జైల్లో ఖైదు చేశారు. ఆ ఇంటి పెద్ద అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఇదీ.. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులోని సత్యనారాయణ కుటుంబ పరిస్థితి. ‘‘మా ఊళ్లో ఆక్వా ఫ్యాక్టరీ కట్టొద్దు. ఆ కాలుష్య విషసర్పానికి మా ప్రాణాలను ఫణంగా పెట్టొదు’ అని నినదించిన ప్రజలతో గొంతు కలిపినందుకు సత్యనారాయణ భార్య సత్యవతిని తణుకు జైల్లో పెట్టారు. ఉద్యమానికి ఊతం ఇచ్చినందుకు ఆయన కొడుకు వాసును నరసాపురం జైల్లో బంధించారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారడంతో ఆ ఇల్లు తల్లడిల్లుతోంది. ఊరు ఊరంతా ఆ తల్లీకొడుకుల విడుదల కోసం ఎదురుచూస్తోంది. వాళ్లతో పాటు ఆ ఇంటి ఆడపిల్ల కల్యాణి కూడా.  అమ్మ కోసం, అన్న కోసం...  వెయ్యి కళ్లతో నిరీక్షిస్తోంది. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’... కల్యాణిని పలకరించింది.


 

మీ కుటుంబానికే ఇంత కష్టం ఎందుకు వచ్చింది?


ఇది మా ఇంటి కష్టం కాదు. మా ఊరి కష్టం.



 

కానీ మీ కుటుంబ సభ్యులను మాత్రమే వేధిస్తున్నారు కదా!


ఊరి తరఫున మా అమ్మ, మా అన్న ముందుకొచ్చి మాట్లాడారు. అందుకే మాపై వేధింపులు. ముప్పై ఏళ్ల క్రితం నాన్న తుందుర్రు వచ్చారు. మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. కొద్దిగా పొలం ఉంది. నాన్నే సాగు చేస్తారు. ఆ గింజలు తింటున్నాం. ఈ గాలిని పీలుస్తున్నాం. ఇప్పుడీ గాలి, గింజ... ఫ్యాక్టరీ కారణంగా విషమయం కాబోతున్నాయి. ఈ భయం ఊరంతటికీ ఉంది. కానీ అడిగేవారెవరు? అన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొద్దో గొప్పో లోకం తెలిసినవాడు. ఊళ్లో నోరు లేని వాళ్లకు మా అన్నే నాయకుడు. ‘ఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ’ నాయకుడిగా ఊరు మా అన్నను ఎన్నుకుంది.


 

మీ అమ్మగారిని కూడా జైల్లో వేశారు. ఆమె కూడా మీ అన్నయ్యకు బాసటగా ఉన్నారా?

అన్నకు కాదు. ఊరికి బాసటగా ఉన్నారు. మా అమ్మ మహిళా నాయకురాలు కాదు. కనీసం డ్వాక్రా గ్రూపు లీడర్ కూడా కాదు. ఫ్యాక్టరీ వద్దని ఊరి మహిళల తరఫున మాట్లాడ్డమే మా అమ్మ తప్పయింది!  సెప్టెంబర్ 20న పాలకొల్లులో విశ్వమానవ వేదిక స్వచ్ఛంద సంస్థ సమావేశానికి మా ఊళ్లోవాళ్లంతా వెళ్లారు. అక్కడ మా అమ్మ మాట్లాడింది. 144 సెక్షన్ ఉందని, ఎవరూ మాట్లాడకూడదని చెప్పి అక్కడికక్కడ మా అమ్మను పోలీసులు అరెస్టు చేశారు. జీపులో ఎక్కించుకుని వెళ్లి తణుకు సబ్‌జైల్లో పెట్టారు. నిజానికి ఆరోజు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు. ప్రజల తరఫున మాట్లాడినందుకే అమ్మను అరెస్టు చేశారు. ఆమెను జైల్లో ఉంచి నెలరోజులు దాటిపోయాయి.


 

మీ అన్నయ్యను ఎందుకు అరెస్ట్ చేశారు?

సెప్టెంబర్ 7న తుందుర్రులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఎంక్వయిరీకి వచ్చారు. ఫ్యాక్టరీ వాళ్లను కలసి గ్రామస్తులను సంప్రదించకుండా వెళ్లిపోయారు! దాంతో పోరాటకమిటీ నాయకులు వారిని కలిసేందుకు వినతి పత్రాలు తీసుకుని వెళుతుంటే.. కొంతమంది వ్యక్తులు ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉన్న మరికొంతమంది వ్యక్తులతో కలిసి మా అన్నయ్య వాళ్లను రెచ్చగొట్టారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరుపక్షాలు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. కానీ మిగతా అందర్నీ వదిలేసి అదే రోజు మా అన్నయ్యను, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. మా అన్నయ్యను అరెస్టు చేస్తే ఫ్యాక్టరీ నిర్మాణానికి అడ్డు ఉండదనే ఆలోచనతో పథకం ప్రకారమే రెచ్చగొట్టారు. అన్నయ్యపై హత్యాయత్నం (307 సెక్షన్), రౌడీ షీటర్ కింద కేసు నమోదు చేశారు.


 

ఆక్వా పార్క్ కడితే మీకొచ్చే నష్టం ఏమిటి?

ఊళ్లో ఎవరిని అడిగినా చెప్తారు. తుందుర్రులో నిర్మించే ఫ్యాక్టరీ నుంచి చేపలు, రొయ్యలు రెడీ టు కుక్ పద్ధతిలో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. రోజుకు వెయ్యి టన్నుల చేపలు, రొయ్యలు శుభ్రం చేసే ఈ ఫ్యాక్టరీని ఎక్కడో దూరంగా పెట్టకుండా జనావాసం ఉన్న జొన్నలగరువు, తుందుర్రు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్యే కడుతున్నారు. ఫ్యాక్టరీకీ మంచినీటి చెరువుకూ 100 మీటర్ల దూరం కూడా లేదు. ఫ్యాక్టరీలో అమ్మోనియా నైట్రేట్, సాల్ట్‌లతో చేపలు, రొయ్యలను శుభ్రం చేసి వృథా నీటిని ఈ ప్రాంతంలో వదులుతారు. దీని వల్ల మూడు పంటలు పండే ఊరి భూములు ఉప్పుకయ్యలుగా మారిపోతాయి. జీవనదిగా ఉన్న గొంతేరు డ్రెయిన్ విషతుల్యం అవుతుంది. ఇప్పటికే భీమవరంలోని యనమదుర్రు డ్రైన్ మురికి కాల్వగా మారిపోయింది. ఈ వివరాలన్ని విశ్లేషకులు, నిపుణులు, ప్రజా నాయకులు చెప్పి చైతన్యపరచడంతో గ్రామస్తులలో ఫ్యాక్టరీ నిర్మాణంపై వ్యతిరేకత ఏర్పడింది. అందుకే ఊరు పోరాడుతోంది.


 

చాలాకాలంగా పోరాటం చేస్తున్నట్లున్నారు...

అవును. చాలాకాలంగానే. సుమారు 40 గ్రామాల ప్రజలకు, ఫుడ్‌పార్కు యజమానులకు మధ్య జరుగుతోంది. రెండున్నరేళ్ల క్రితం ఈ  ప్రాంతంలోని ఆనంద గ్రూప్ సంస్థ  రూ.150 కోట్ల సబ్సిడీతో రొయ్యలు, చేపల శీతల గిడ్డంగుల ఫ్యాక్టరీని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. భీమవరం మండలంలోని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్యన దీనిని నిర్మించేందుకు పనులు కూడా మొదలుపెట్టారు. ముందుగా రైతుల నుంచి - చేపల చెరువులు వేస్తున్నామని చెప్పి - 68 ఎకరాల భూమిని రూ. 8 నుంచి 12 లక్షలకు  కొనుగోలు చేశారు. కానీ అది అబద్ధం అని తర్వాత తెలిసింది. 6 నెలలు తరువాత ఆ భూమిలో ‘గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు’ అని బోర్డు పెట్టారు. 


 

ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు మీ ప్రాంతంలోని ప్రజల అభిప్రాయం తీసుకోలేదా?

లేదు. మేమే వెళ్లి కలెక్టర్‌కు, సబ్‌కలెక్టర్‌కు, ఇతర ఉన్నతాధికారులకు గోడు వెళ్లబోసుకుంటున్నాం. ఫ్యాక్టరీ వద్దని ఈ ప్రాంత ప్రజలు  సుమారు 6 వేల మంది  జనవరి 22న శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు ప్రజలకు, పోలీసులకు తీవ్రవాగ్వాదం జరిగింది. అది తెలిసి నేను అత్తగారింటి నుంచి మా వాళ్లు ఎలా ఉన్నారో చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు మా అన్నయ్య విపరీతమైన ఒత్తిడిలో ఉండడం చూశాను.


 

ఎలాంటి ఒత్తిడి?

అన్నయ్య ఫుడ్‌పార్కు పోరాటం నుంచి తప్పుకుంటే ఫ్యాక్టరీ యజమానులు రూ. 50 లక్షలు నగదు, కోరుకున్న చోట స్థలం, ఉద్యోగం ఇస్తామంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. అన్నయ్య వినలేదు. అందుకే  అక్రమంగా నిర్బంధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


 

స్థానిక ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు?


పవన్ కల్యాణ్ చెప్పడంతో మేము టీడీపీకి ఓట్లేశాం. మొదట్లో నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఫ్యాక్టరీ ఆపేస్తున్నాం అని చెప్పారు. మేం ఊపిరి పీల్చుకున్నాం. మళ్లీ మూడు నెలలకు వచ్చి  ఫ్యాక్టరీ ఉంటుందనీ అయితే దాని వల్ల నష్టాలు ఉండవని చెప్పారు. మా సమస్యలు తీర్చాల్సిన నాయకులే అలా అంటే ఎలా చెప్పండి?


 

మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

ఆయన క్యాన్సర్ పేషెంట్.  లివర్ దగ్గర కణితి ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకున్నాడు. అమ్మే సపర్యలు చేస్తోంది. భార్య తన దగ్గర లేదన్న బెంగే క్యాన్సర్ కన్నా ఎక్కువగా ఆయన్ని కుంగదీస్తోంది.






వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మా పోరాటానికి మద్దతు ఇచ్చి మా దగ్గరకు వచ్చి భరోసా ఇవ్వడంతో ఫ్యాక్టరీ నిర్మాణం ఆగుతుందన్న నమ్మకం మాలో కలిగింది. ఫ్యాక్టరీ నిర్మాణం ఆగేవరకూ పోరాడుతాం. సాక్షి పత్రికే మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకువచ్చింది. - కల్యాణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top