నిప్పు లో తడి

నిప్పు లో తడి - Sakshi


నిప్పులో నిమ్ము ఉంటుంది.

అబ్బ ఛా! నిప్పులో తడి ఉంటుందా?

కావాలంటే కాలుతున్న కట్టెను చూడు...

నిప్పు అంచున నీరు కనపడుతుంది.

భగభగ మండే గుండె అంచున కూడా

చెమ్మ ఉంటుంది.

దేహం కాలే ముందు..

ఖననం అయ్యే ముందు.. చాలా ముందు...

ప్రక్షాళన జరగాలి.. మనలని మనం..

నిప్పుతో కడుక్కోవాలి.

ఇక్కడే.. వీలైతే ఇప్పుడే.. మన బాధను,

కష్టాన్ని, కోపాన్ని, నష్టాన్ని..

మనసులో ఒక పీడలా మిగిలిపోకుండా...

ఇక్కడే కడిగేసుకోవాలి.

నిప్పులో ఉన్న తడితో కడిగేసుకోవాలి.

మసాన్ సినిమా చూస్తే అదే అర్థమయింది..

దేహం కంటే ముందు.. చాలా ముందు..

మనసును నిప్పులాంటి సత్యంతో..

తడితడిగా ఉండే ప్రేమతో... కడిగేసుకోవాలి.


 

కాశికి పోయినవాడు కాటికి పోయినట్టే లెక్క. కాని కాదు. కాశిలో ఉన్నా సరే కాటికి పోయేంత వరకూ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఒక్కో బాధను వదిలేసుకుంటూ ముందుకు ప్రవహించాల్సి ఉంటుంది.

 అదే ఈ కథ.  మసాన్.

   

కాశి పవిత్ర పుణ్యక్షేత్రం. భూలోక కైలాసం. మానవులను ముక్తిని పొందే అంతిమస్థలం. కాని అక్కడా ప్రజలు ఉంటారు. వాళ్లకూ జీవన వ్యాపారాలు ఉంటాయి. అక్కడా హోటళ్లు ఉంటాయి. ఇళ్లు ఉంటాయి. ఇంటర్‌నెట్ సెంటర్‌లు ఉంటాయి. మనుషుల చేతుల్లో ఫోన్లు ఉంటాయి. వాటిలో అవసరమైనవీ అవసరం లేనివీ కూడా అందుబాటులో ఉంటాయి.  ఆ అమ్మాయి అలాంటివి కొన్ని చూసింది. ఒక అబ్బాయి అమ్మాయి చేసుకునే పనిని చూసింది.

 అదెలా ఉంటుంది?



క్యూరియాసిటీ. దానిని తెలిసేసుకుంటే. తనేం చిన్న పిల్ల కాదు. డిగ్రీ చదివింది. ప్రస్తుతం కంప్యూటర్ సెంటర్‌లో ట్యూటర్‌గా పని చేస్తూ ఉంది. అక్కడికి వచ్చి వెళ్లే ఒక కుర్రవాడితో స్నేహం కూడా ఉంది. ఇద్దరూ మంచివాళ్లే. ప్రేమలో ఉన్నారు. వయసులో ఉన్నారు. తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలనే ఆసక్తిలో ఉన్నారు. అమ్మాయి ఒప్పుకుంది. అతడు ఏర్పాట్లు చేశాడు. హోటల్ గది. ఇద్దరూ దగ్గర దగ్గరగా కూడి... కావలించుకుని... అంతలో తలుపు దడదడలాడింది. పెద్ద చప్పుడుతో ఊగిపోయింది. పోలీసులు. అమ్మాయి అబ్బాయి అదిరిపోయారు. ఒణికిపోయారు. ఏం చేయాలో గ్రహించే లోపు తలుపు బద్దలు కొట్టుకుంటూ పోలీసులు వచ్చేశారు. పట్టేసుకున్నారు. అబ్బాయి బెదిరిపోయి బాత్‌రూమ్‌లో దూరాడు. అమ్మాయిని ఇన్స్‌పెక్టర్ సెల్‌ఫోన్‌లోకి ఎక్కించేశాడు. తప్పులు ఏవైనా కావచ్చు. చట్టాలు ఎన్నైనా ఉండొచ్చు. కాని ఒక తప్పును నిరోధించడానికి ఎదుటివాళ్ల దగ్గర పైశాచిక శక్తి దుర్మార్గమైన పద్ధతి మాత్రం ఉండటానికి వీల్లేదు. కాని ఇక్కడ ఉంది. పోలీసులకు ఉంది. వాళ్లు తలుచుకుంటే ఎంత దూరమైనా పోగలరు. ఎంత ఘోరమైనా చేయగలరు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే? అబ్బాయి అంతకు మించి ఊహించలేకపోయాడు. బాత్‌రూమ్‌లో చేయి కోసేసుకున్నాడు. అంతకు కాసేపటి ముందు వరకూ ఎంతో సంతోషంగా గడిపిన



అబ్బాయి... ఎంతో భవిష్యత్తు ఉండి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయి... ఇప్పుడు లేడు. చనిపోయాడు. కాశిలో ఒక చావు.

 బలవన్మరణం. ఎందరో అక్కడ చావు కోరుకుని వస్తారు. ఇక్కడ బతుకు కోరేవాడు చావును పొందాడు.కాశిలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి. మృతదేహాలను దహనం చేసే ఘాట్స్. ఈ కుర్రాణ్ణి కూడా అలాంటి ఘాట్స్‌లో దహనం చేశారు. అంత తీరుబడి, శోకాన్ని అనుభవించేంత వెసులుబాటు ఏమీ ఉండవు. రోజూ వచ్చే అనేకానేక శవాల్లో ఇదీ ఒకటి. వాటి నడుమ దీనినీ వేసి తగులబెట్టాల్సిందే. ఆ అమ్మాయి దూరం నుంచి తన ప్రియుడి దహనకాండను చూసి వెను తిరుగుతుంది. కానీ అక్కడే మరో కథ మొదలవుతుంది. ఆ ఘాట్‌లోనే ఒక కుర్రాడుంటాడు. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్‌లో ఉంటాడు. దళితుడు. శవాలను దహనం చేసే అతడి కుటుంబంలో తండ్రి, అన్న వృత్తిలో ఉంటే వారికి చేదోడువాదోడుగా ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. ఘాట్‌లో శవాల రద్దీ ఉంటే ఇతడూ పొడవైన కట్టె పట్టుకుని మంటకు పైకి లేస్తున్న పుర్రె మీద అయినవారితో అయిదు దెబ్బలు కొట్టించే పని చేయాల్సిన వాడే. ఇతడికి ఒకమ్మాయి మీద మనసవుతుంది. ఇతడు వాడ అబ్బాయైతే ఆమె ఊరి అమ్మాయి. వైశ్యుల ఇంటిపిల్ల. కాని ప్రేమకు ఈ కులం మతం ఏముంటాయి. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఆ అమ్మాయికి కవిత్వం ఇష్టం. మిర్జా గాలిబ్, బషీర్ బద్ ్రఅని ఏవేవో పేర్లు చెబుతుంటుంది. వాళ్లెవ్వరూ ఆ కుర్రాడికి తెలియదు. కాని ఆ కవిత్వం అంత స్వచ్ఛంగా నవ్వడం తెలుసు. అంత కన్నా స్వచ్ఛంగా ప్రేమించడం తెలుసు. మాది తక్కువ కులం. చండాలుల వృత్తిలో ఉన్న కులం. నన్ను నీవు స్వీకరించగలవా? ఆ కుర్రాడు అడిగాడు. ఇది సాధ్యం కాదు.



ఒక వైశ్యుల ఇంటి అమ్మాయి ఒక చండాలుని భార్య ఎప్పటికీ కాబోదు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్నటికీ సమ్మతించబోరు. కాని ప్రేమకు ఒక నిమిత్తాలతో నిమిత్తం ఏముంది? ఎవరు ఏమైనా అననీ నేను నీతో వచ్చేస్తాను అంటుంది ఆ అమ్మాయి. ఆ నిర్ణయం విన్నాక ఆ రోజు రాత్రి ఆ కుర్రాడు హాయిగా ఆదమరిచి నిద్రపోతాడు. బహుశా తెల్లవారుజాము. ఘాట్‌కు చాలా శవాలు వస్తాయి. ఆ కుర్రాడి అన్నకు, తండ్రికి చేతికి మించిన పని. వచ్చి ఈ కుర్రాణ్ణి నిద్ర లేపి సాయానికి పిలుస్తారు. ఇన్ని శవాలా? ఒక్కో శవాన్ని అగ్ని ఆహుతి చేయడంలో నిమగ్నం అవుతాడు. ఒక శవం దగ్గర ఎందుకో అనుమానం వస్తుంది. ఆ చేతికి ఉన్న ఉంగరం ఎక్కడో చూసిన గుర్తు. అదిరిపడే గుండెలతో పైవస్త్రం తొలిగించి చూస్తాడు. అదే... ఆ అమ్మాయే. వైశ్యుల అమ్మాయి. తను ప్రేమించిన అమ్మాయి. బస్సు యాక్సిడెంట్ అయ్యి నదిలో పడిపోయిందట. ఒక్కరూ మిగల్లేదట. కుటుంబంతో పుణ్యక్షేత్రాల యాత్రకు బయలు దేరిన ఆ అమ్మాయి పాపం పుణ్యం ఎరగని ఆ కుర్రాడిని ఏకాకిని చేసి వెళ్లిపోయింది.



ప్రేమకు స్త్రీలింగం పుంలింగం లేదు. శవం అనే మాటకు కూడా స్త్రీలింగం పుంలింగం లేదు. ఆ అమ్మాయి తను ప్రేమించినవాడి చేతిలోనే చితి మంటకు చితచితలాడుతూ అంతిమవీడ్కోలు తీసుకుంటుంది. సృష్టిని నువ్వు తప్పించలేవు. లయను కూడా.ఈ రెంటి మధ్య జీవితం మాత్రం నీదే. నడూ. పరిగెత్తు. కింద పడు. పైకి లెయ్. తప్పులు చెయ్. ప్రాయశ్చిత్తం పొందు. ప్రక్షాళనం చేసుకో. కాని బతుకు. ముందుకు సాగు. హోటల్‌లో ప్రియుడి చావుకు కారణమైన ఆ అమ్మాయి తాను చనిపోవాలనుకోదు. తనను హేళనగా, తిరుగుబోతుగా, బరితెగించినదానిగా చూస్తున్న సమాజానికి భయపడిపోవాలనుకోదు. జరిగిన తప్పును ఒక తప్పుగా స్వీకరిస్తుంది. అది

 ఇరువురు కలిసి చేసిన తప్పుగా భావిస్తుంది. నిరాశ వల్లో నిస్పృహ వల్లో కృశించకుండా ఇంకా ముందుకు ఎలా వెళ్లాలా ఆలోచిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అంత వరకూ ఉద్యోగం చేయాలని కూడా అనుకుంటుంది. ఆమె తండ్రి కూడా జరిగిన దారుణానికి ఉరి పోసుకోడు. కూతురి గొంతు నులిమి చంపేయాలని అనుకోడు. ప్రేమిస్తాడు. ఆమె తప్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇదంతా అంత సులువైన పని కాదు. చావు కంటే కష్టమైన పనే. ఎన్నో అవమానాలు ఈసడింపులు... ఇద్దరూ పడతారు... కాని నిలబడతారు. బతుకును కొనసాగిస్తారు. తన ప్రియురాలిని కోల్పోయిన ఆ దళిత కుర్రాడు కూడా అంతే. మొదట పిచ్చివాడైపోతాడు.



వెర్రివాడైపోతాడు. ఆమె జ్ఞాపకాలలో తనను తాను మర్చిపోతాడు. కాని మెల్లగా ఆ దు:ఖం నుంచి కోలుకొని ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. కాశిలో ప్రాణశక్తి ఉంది. అవును. అక్కడ ప్రాణం పోసే శక్తే ఉంది.

   

మసాన్- కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. రెండు కాన్స్ అవార్డులు పొందింది. తాజాగా విడుదలయ్యి దేశంలో అనేకమంది ప్రశంసలు పొందుతోంది. దర్శకుడు నీరజ్ ఘేవాన్ కొత్తవాడు. నటించినవాళ్లూ కొత్తవాళ్లే. కానీ అందులో కనిపించిన జీవితం మాత్రం సనాతనమైనది. సుపరిచితమైనది. మానవ రక్త సంచయంలో ఏదో ఒక పురాస్మృతిని తట్టి లేపేది. సినిమా మొదలు నుంచి దర్శకుడు గంగానది ప్రక్షాళనను ప్రస్తావిస్తుంటాడు. అయితే అంతకన్నా ముందు ప్రక్షాళనం కావలసినవి ఈ దేశంలో ఎన్నో ఉన్నాయని చెబుతాడు.



కుల వ్యవస్థ ప్రక్షాళన, హోటల్‌లో దొరికిన అమ్మాయినీ అతడి తండ్రినీ మూడు లక్షలు ఇవ్వమని పీక్కు తీనే పోలీసు వ్యవస్థ వంటి పాలనా వ్యవస్థల ప్రక్షాళన, ఆ డబ్బు కోసం అంత మంచి తండ్రి కూడా ఒక అనాథ పిల్లవాణ్ణి నదిలో దూకే ఆటకు ప్రేరేపించి ఆ పిల్లవాణ్ణి చావు వరకూ తీసుకెళ్లడానికి వెనుదీయని మానవ బలహీనతల నుంచి ప్రక్షాళన, ఈ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చేసే ప్రక్షాళన... ఇవన్నీ అవసరం అంటాడు.



ఒక్క గుడి కూడా చూపించడు.కాని మానవ హృదయాలలోని గర్భగుడులలో ఉండే చీకటిని చూపిస్తాడు. మసాన్ అంటే- స్థానిక పలుకుబడిలో శ్మశానం అని అర్థం. అక్కడ ఇంత సుందరమైన బంతిపువ్వు పూయడమే ఇటీవలి విడ్డూరం.

 - ఖదీర్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top