ఈ కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా?

ఈ కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా?


మా నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్. ఆయనంటే అందరికీ చాలా భయం.  ఎప్పుడూ క్రమశిక్షణ గురించే మాట్లాడేవారు. నిజాయతీగా ఉండాలనేవారు. నిజమే చెప్పాలనేవారు. అయితే అవన్నీ మంచికే చెప్తున్నారని అర్థం చేసుకునే వయసు, పరిణతి నాకు లేకపోయాయి. దాంతో ఆయన కంటపడకుండా తప్పించుకునేదాన్ని. ఐదోతరగతి చదువుతున్నప్పుడు అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అప్పట్నుంచీ నాన్నతో మాట్లాడటమే తగ్గించేశాను.



నేను టెన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు మా దూరపు బంధువు ఒకరు భార్యాసమేతంగా వచ్చారు మా ఇంటికి. వాళ్లని చూస్తూనే అరుగు మీద కూర్చుని హోమ్‌వర్క్ చేస్తున్న నన్ను లోపలికి వెళ్లిపొమ్మన్నారు. దాంతో నాకేదో అనుమానం వచ్చింది. లోపల నిలబడి కిటికీలోంచి జరిగేది చూడసాగాను. ఆ వచ్చినావిడ అంటోంది... ‘నా కూతుర్ని నాకు ఇచ్చేయండి’ అని. నాన్న అంటున్నారు... ‘మొదటే చెప్పాం తననిక ఇవ్వడం కుదరదని, తనిప్పుడు నా కూతురు, మీరు వెళ్లిపోండి’ అని. నాకు ఎప్పటికో అర్థమైంది... వాళ్లు మాట్లాడుకుంటున్నది నా గురించే అని.


 


నాకు కోపం, దుఃఖం కలిసొచ్చేశాయి. అంటే  నేను ఆయన కన్న కూతురిని కాదు. అందుకే ఆయనకు నా మీద ప్రేమ లేదు. అలా అనుకోగానే ఇక ఉండలేకపోయాను. పరుగు పరుగున మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నన్నూ తీసుకుపొమ్మని అడిగాను. తను సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుంది. అంతవరకూ వాళ్లతో వాదించిన నాన్న సెలైంట్ అయిపోయారు. వస్తానంటే తీసుకెళ్లండి అన్నారు. దాంతో నేను మా అమ్మానాన్నలతో వెళ్లిపోయాను. కానీ నేనెంత తప్పు చేశానో తర్వాత తెలిసింది.



నేను వెళ్లిన నాలుగోరోజునే కబురొచ్చింది... నాన్న గుండెనొప్పితో చనిపోయారని. అమ్మానాన్నలు నన్ను తీసుకు వెళ్లారు. వాకిట్లో నాన్న శవం ఉంది. చనిపోయాక కూడా ఆ ముఖంలో కాఠిన్యమే కనిపించింది నాకు. అందుకే ఏడుపు రాలేదు. అంతలో పక్కింటాయన నాకో ఉత్తరం తెచ్చి ఇచ్చారు. చనిపోయేముందు నాన్న ఇచ్చారట, నాకు ఇవ్వమని. అది చదివిన నాకు నాన్నంటే ఏమిటో తెలిసి వచ్చింది. నేను పుట్టేటప్పటికి నా కన్నతల్లితండ్రులకు తినడానికి తిండి కూడా ఉండేది కాదట. దాంతో నన్ను ఎవరికో అమ్మేయబోతే నాన్న తాను పెంచుకుంటానని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారట.


 


కేవలం నాకోసమే పిల్లల్ని కనకూడదని నాన్న అనుకున్నారట. అమ్మకూడా అందుకు సరేనందట. ‘నిన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇక జీవితమంతా నీకోసమే బతకాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు, అందుకే వెళ్లిపోతున్నాను తల్లీ, జాగ్రత్త’ అన్న నాన్న మాటలు మనసును పిండేశాయి. నాన్న పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ ఏం లాభం? నా కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా? నా తండ్రిని నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా?



 - ప్రశాంతి, మామిడికుదురు

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top