మూడు నూర్ల కోడూరు ఫ్యామిలీ

మూడు నూర్ల  కోడూరు ఫ్యామిలీ


-  వాకా మంజులారెడ్డి



అది కృష్ణా జిల్లాలో ఎ.కొండూరు మండలం, కోడూరు గ్రామం. ఆ ఊరికి దార్శనికుడు యెలినేని వెంకయ్య. వీరి పూర్వీకులు చిత్తూరు నుంచి ఖమ్మం జిల్లాకు వలస వెళ్లారు. ఆ తర్వాత ఆరు తరాలకు కొంతమంది కృష్ణాజిల్లాకు వచ్చి స్థిరపడ్డారు. భూమిని నమ్ముకుని ‘వ్యవసాయమే నా తల్లి’ అని చాటిన వెంకయ్య 104 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించారు. ఆయనకు 13 మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. అంతా జీవించి ఉన్నారు. ఇప్పుడాయన కుటుంబం మనుమలు, మనుమరాళ్లు, ముని మనుమలతో కలిసి మూడు వందలకు దగ్గరైంది. వారిలో ఎక్కువమంది అమెరికా, టాంజానియా, సింగపూర్, ఆస్ట్రేలియాలకు విస్తరించారు.



వీరంతా 1998, జనవరిలో వెంకయ్య నూరవ పుట్టినరోజు వేడుకలకు కోడూరు వచ్చినప్పుడు ఊరు ఊరంతా కదిలి వచ్చినట్లనిపించింది. అలాంటిదే మరో వేడుక ఈ రోజు (ఫిబ్రవరి 28) జరగనుంది. వెంకయ్య భార్య చిట్టెమ్మ తొలి వర్ధంతి సందర్భంగా వీరంతా మరోసారి కోడూరులో కలుస్తున్నారు.



‘‘మా నాన్నగారు అన్నేళ్లపాటు ఆరోగ్యంగా జీవించడానికి ఆయన పాటించిన ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. మితంగా తినేవారు, మజ్జిగ మాత్రమే తాగేవారు. ఊరి కోసం... పేద ప్రజల జీవితాలు బాగు పడడానికి పాలసహకార సంఘం, రైతు సహకార సంఘం స్థాపించారు. ఊళ్లో ఎయిడెడ్ పాఠశాలను పెట్టించారు. జొన్న, సజ్జ, కొర్రలు పండే మా ఊరిలో తన సొంత పొలంలో చెరువు తవ్వి వరి సాగు చేసి చూపించారు. ఊరి బాగు కోసం కాలువ తవ్వడం నుంచి అనేక పనుల్లో భాగస్వామి అయ్యారు.

 

కమ్యూనిస్టు ఉద్యమమే జీవితంగా...




మా ఇంటికి పుచ్చలపల్లి సుందరయ్య నుంచి చండ్ర రాజేశ్వరరావు వంటి మేధావులు  వస్తుండేవారు. వారి ఆచూకీ కోసం పోలీసులు ఇంటి మీద దాడి చేసినప్పుడు వారిని మా నాన్న మా ఇంటి వెనుక ఉన్న జొన్నచేలలో దాచేవారు. ఇక మా అమ్మ శాంతమ్మ తండ్రి, మరో అమ్మ చిట్టెమ్మ తండ్రి కూడా కమ్యూనిస్టు కార్యకర్తలే కావడంతో మా నాన్న ఉద్యమంలో కీలకంగా పనిచేయడానికి వారి సహకారం బాగా ఉండేది. మేము నలుగురం పుట్టిన తర్వాత మా అమ్మ పోవడంతో చిట్టెమ్మను వివాహమాడారు నాన్న’’  అని చెప్పారు వెంకయ్య పెద్దకొడుకు సత్యనారాయణ.



జమీందారుల ఏలుబడిలో అన్యా యాన్ని ఎదిరించిన యెలినేని వెంక య్య ప్రస్థానం ఓ ఉద్యమకారుని జీవితాన్ని తలపిస్తుంది. చిట్టెమ్మ కూడా ఆయన బాటలోనే నడిచారు. ఆ దంపతులను స్మరిస్తూ... ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా నేడు కోడూరులో సమావేశం అవుతున్నారు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top