విశ్వాసమే పునరుత్థానం

విశ్వాసమే పునరుత్థానం


 - డా॥చార్లెస్ స్టాన్లీ, క్రైస్తవ మత బోధకులు

 


 ఏప్రిల్ 20న ఈస్టర్

 

 మానవాళి పాపాలకు పరిహారంగా యేసు క్రీస్తు సిలువపై ప్రాణత్యాగం చేసినరోజు గుడ్‌ఫ్రైడే. ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ పాపవిముక్తి, పునరుత్థానం ఉంటాయని సూచించే రోజు ఈస్టర్. గుడ్‌ఫ్రైడే తర్వాత ఆదివారం రోజు వచ్చే ‘ఈస్టర్’ మహోజ్వలమైన ఉత్సవం. విజయ సంకేతం.

 

 దేవునిపై విశ్వాసాన్ని నిలుపుకోవడం మీకెప్పుడైనా కష్టమనిపించిందా? మీ జీవితంలోని అత్యంత దుర్భర మైన పరిస్థితుల్లో, మిమ్మల్ని ఎలాగైనా దేవుడు గట్టెక్కిస్తాడనీ, ఆ పరిస్థితులు మెరుగవడమో, లేదా వాటిలోంచే దేవుడు మీకు ఇంకేదైనా మంచి మార్గం చూపిస్తాడనో మీరెప్పుడైనా విశ్వసించలేకపోయారా?

 

విశ్వసించలేకపోయానని చెప్పడానికి మీరేమీ ఇబ్బంది పడనక్కరలేదు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తుతో కలిసి తిరిగిన ఆయన శిష్యులే క్రీస్తు శిలువ మరణం తర్వాత తమ విశ్వాసంపై గట్టిగా నిలబడలేకపోయారు. రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పదే పదే - దేవుని కుమారుడు బాధలు పడతాడని; పెద్దలు, ప్రధాన బోధకులు, లేఖకులు ఆయనను తృణీకరిస్తారని, తర్వాత ఆయన సిలువపై మరణిస్తాడని, తిరిగి మూడవ రోజున లేస్తాడని - చెప్పినప్పటికీ వారు సందేహించారు. మానవ పరిధులను దాటి క్రీస్తును, ఆయన చేసిన ప్రమాణాలను వారు విశ్వసించలేకపోయారు.

 

మీరూ, నేను ఇలా... ఈ శిష్యుల మాదిరిగా జీవితంలో ఎన్నిసార్లు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాం! సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆ సమస్యల చుట్టూ తిరుగుతుంటాయి తప్ప, అద్భుతమైన దేవుని ఉద్దేశాలను గ్రహించే శక్తి మనకు ఉండదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనం మన అవగాహనా రాహిత్యం నుండి బయటపడి క్రీస్తు మాటల్లోని అంతరార్థాలను తెలుసుకోగలిగితే మన హృదయం సంతోషంతో నిండుతుంది. మన జీవితాలు అత్యంత వేగవంతంగా పరివర్తన చెందుతాయి. ఎలాగంటే, క్రీస్తు పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులు మారిన విధంగా.

 

సమాధి నుంచి క్రీస్తు తిరిగి లేచాక, ఆయన శిష్యులు గ్రహించిన జీవిత సత్యాలను (జీవితాన్ని మార్చిన సత్యాలు) మనం ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలి. పాపంపై, మరణంపై క్రీస్తు సాధించిన విజయం కారణంగా ఆయన శిష్యులు గ్రహించిన వాస్తవాలను మన జీవితాలకు అన్వయించుకుంటే ఏ సమస్యా మనల్నీ ఏమీ చేయలేదు.

 

ఇంతకీ వారు ఏం గ్రహించారు?


 

మొదటిది: దేవుడు తన ఆలోచనలను ఎల్లప్పుడూ విజయవంతంగానే అమలు చేస్తాడు. ఆ ప్రకారమే దేవుని కుమారుడైన క్రీస్తు, మన అతిక్రమణలకు శిక్ష అయిన మరణం నుంచి మనల్ని తప్పిస్తానని ప్రమాణం చేశారు. అలాగే తప్పించారు కూడా. దేవుడు తన లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుపడే శక్తి ఈ భూమండ లంపై లేదు కాబట్టే ఆయన తలపోసినట్లు జరిగింది.

 

మీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఎలాంటి విషమస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక ఆయన అభీష్టం మేరకు మీరు మీ జీవితాన్ని కొనసాగించండి.

 

రెండవది: క్రీస్తు మన రక్షకుడని ఒకసారి మనం విశ్వసించాక ఇక ఏదీ కూడా, చివరికి మరణం కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదని శిష్యులు గ్ర హించారు. సిలువపై క్రీస్తు మరణంతో ఆయన్ని కోల్పోయామని భావించినప్పటికీ ఆయన పునరుత్థానం తర్వాత ఇక దేవుని సన్నిధి నుండి తామెన్నటికీ విడిపోమని గ్రహించారు.

 

అదే విధంగా మనం కూడా దైవ మహిమతో సఖ్యత చెందాలి. దీనర్థం మనకు మార్గం చూపిస్తూ, మంచిని బోధిస్తూ, అవసరాలను తీర్చేవిధంగా దేవుడిని మన హృదయంలో ప్రతిష్టించుకోవాలి. సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మన రక్షకుడు.  ఆయన మనల్ని  ఓడిపోనివ్వడు. విడిచిపెట్టడు.

 

మూడవది: క్రీస్తు తన త్యాగంతో మనకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు కనుక మనం అనుభవించే బాధ ఏదైనా అది తాత్కాలికమేనని శిష్యులు గ్రహించారు. దేవుని ప్రవచనాలను బోధిస్తే తమపై వ్యతిరేకత వస్తుందని, తమను హింసిస్తారని తెలిసినప్పటికీ, భూమిపై దేవుడు తమకు రక్షకునిగా ఉంటాడు కనుక, స్వర్గానికి వెళ్లేటప్పుడు తనతో పాటు తమనూ తీసుకెళతాడు కనుక భయపడేదేమి లేదని వారు విశ్వసించారు. తమ భవిష్యత్తు శక్తిమంతమైన దైవ హస్తాల నడుమ భద్రంగా ఉందని నమ్మారు.

 

మీరూ అలాంటి హామీనే, అలాంటి రక్షణనే కలిగి ఉన్నారు. ప్రస్తుతం మీరున్న కష్టాలనుంచి మీరెప్పటికీ గట్టెక్కలేరని మీరు భావిస్తుండవచ్చు. ఆ కష్టాలు అనంతమైనవని అనుకుని మీరు అధైర్యపడి ఉండవచ్చు. అలసిపోయి ఉండవచ్చు. కానీ ఆశను వదులుకోకండి. తన కోసం వేచి ఉన్నవారిని నిరాశ పరచను అని దేవుడు ఇచ్చిన మాటను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని దరిచేరుస్తాడు.



పై మూడు సూత్రాలను కనుక మీరు మీ జీవితాన్ని అన్వయించుకుని చూస్తే మీ సమస్యలు తేలిపోయి, వాటిపై మీరు విజయం సాధిస్తారు. దేవుడు మనకు ఇచ్చిన మాట ప్రకారం మనల్ని సంరక్షిస్తాడని మీరు పూర్తిగా విశ్వసిస్తారు. మరణం కూడా దేవుడి నుంచి మిమ్మల్ని విడదీయలేదని మీరు నమ్ముతారు. మీరు ఒంటరి వారు కాదని, మీకు దేవుడి అండ ఉందనీ గ్రహిస్తారు. సమస్యలు తాత్కాలికమనీ, జీవితం శాశ్వతమనీ తెలుసుకుంటారు.

 

పునరుత్థానం నుంచి క్రీస్తు శిష్యులు తెలుసుకున్న ఈ వాస్తవాలన్నిటినీ మదిలో పెట్టుకుని, వాటిని అనుదినం మననం చేసుకోడానికి మీరూ ప్రయత్నించండి. మరణం నుంచి తిరిగి లేచిన మన రక్షకుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఈ ఈస్టరు మీకు సంతోషకరమైనదిగా ఉండేలా ఆయన దీవిస్తాడు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top