ఎంసెట్‌లలో మెరవాలంటే..

ఎంసెట్‌లలో మెరవాలంటే..


ఎంసెట్..  ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ విద్యార్థుల లక్ష్యం.. ఎంసెట్. ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ఎంసెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తారనడంలో సందేహం లేదు. రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మంది వరకూ ఎంసెట్ ఆశావహులున్నారు. గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఒకే ఎంసెట్ జరగగా..  ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  వేర్వేరుగా ఎంసెట్-2015 నిర్వహణకు ప్రకటనలు విడుదల చేశాయి.



రెండు రాష్ట్రాల్లోనూ (ఆంధ్రప్రదేశ్‌లో మే 8న,  తెలంగాణ రాష్ట్రంలో మే 14న) ఎంసెట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళిక..


 

ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పరీక్ష కాలం




నేటి నుంచి తెలంగాణలో; బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంసెట్ ప్రకటనలు విడుదల చేశాయి. దాంతో ఇటు ఇంటర్ పరీక్షల్లో మార్కులు; అటు ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం అనే ఆలోచనలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇంటర్ సిలబస్‌పై పట్టు సాధిస్తే ఎంసెట్ గురించి ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు అంటున్నారు.

 

ఈ సమయం.. ఇంటర్‌కే




వాస్తవానికి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ఔత్సాహికులు ఇంటర్‌లో చేరిన తొలి రోజు నుంచే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించే దిశగా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. కానీ.. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ పరీక్షలు బాగా రాసి మెరుగైన మార్కులు సాధించడంపైనే దృష్టిపెట్టాలి. ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈలో తుది ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ (ఎంసెట్- 25 శాతం; జేఈఈ మెయిన్- 40 శాతం) ఉంటుంది.

 

టీఎస్ 47.. ఏపీ 38:




ఎంసెట్ అభ్యర్థులు ఇంటర్ పరీక్షల తర్వాతే ఎంసెట్‌కు ఉపక్రమించాలి. పరీక్షల తర్వాత తెలంగాణ ఎంసెట్‌కు 47 రోజులు; ఏపీ ఎంసెట్‌కు 38 రోజుల వ్యవధి ఉంటుంది. రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్స్‌కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇంటర్‌లో అకడమిక్ పరంగా క్లిష్టంగా భావించి విస్మరించిన అంశాల జోలికి వెళ్లకూడదు. ఎంసెట్ ప్రిపరేషన్‌లో సమయపాలన చాలా ముఖ్యం. గంటల కొద్దీ ఒకే టాపిక్‌ను చదవకుండా.. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. రోజూ పది నుంచి 12 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.

 

కాన్సెప్ట్స్.. ప్రాక్టీస్ ముఖ్యం



ఎంసెట్‌లో సిలబస్, ప్రశ్నల స్వరూపాన్ని పరిశీలిస్తే అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్‌లోని భావనల ఆధారంగానే ఉంటున్నాయి. దీన్ని గుర్తించి అన్ని సబ్జెక్టుల్లోని కీలక భావనలపై పట్టు సాధించాలి. భావనలు/ఫార్ములాలతో కూడిన షార్ట్ నోట్స్‌లు రివిజన్‌లో ఎంతో ఉపకరిస్తాయి. ఎంసెట్‌లోని అన్ని సబ్జెక్ట్‌ల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే మ్యాథమెటిక్స్, బొమ్మలు, చార్ట్‌ల రూపంలో ఉండే బయాలజీ అయినా ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్ ఎంతో మేలు చేస్తుంది. ప్రాక్టీస్‌తో ప్రశ్న లేదా సమస్యను సాధించే క్రమంలో మూల భావన ఆధారంగా మరెన్నో కొత్త కోణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రశ్నను ఏ విధంగా అడిగినా రాయగలిగే నేర్పు లభిస్తుంది.

 

ఎంసెట్ కామన్ సక్సెస్ టిప్స్



ఇంజనీరింగ్, మెడికల్ విభాగమేదైనా విద్యార్థులకు ఎంసెట్‌లో విజయానికి మంచి మార్కుల సాధనకు ఉపయోగపడే టిప్స్..

ఎంసెట్‌లో దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అవి ఇన్‌డెరైక్ట్‌గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి.

అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరలో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి.

టేబుల్స్; చార్ట్స్; పాయింటర్‌‌స రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు.

ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం; ద్వితీయ సంవత్సరం అంశాల ప్రిపరేషన్‌కు నిర్దిష్ట టైం ప్లానింగ్ అనుసరించాలి.

ఎంసెట్-2015కు హాజరవుతున్న విద్యార్థులు ఇంటర్ పరీక్షల తర్వాత 15 రోజుల సమయాన్ని మొదటి సంవత్సరం సిలబస్‌కు కేటాయించాలి.

కనీసం మూడు గ్రాండ్ టెస్ట్‌లు, వీలైనన్ని మాక్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది.

ఇంజనీరింగ్ విద్యార్థులు 110 నుంచి 130 మార్కులు; మెడికల్ విభాగం విద్యార్థులు 120 నుంచి 145 మార్కులు పొందే విధంగా చదవాలి.

 

ఎంసెట్‌తో జతగా జేఈఈ



ఎంసెట్ రాసే అభ్యర్థుల్లో దాదాపు సగం మంది జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లకు కూడా పోటీపడుతున్నారు. గతేడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 2,82,799 మంది పోటీ పడగా.. జేఈఈ మెయిన్‌కు హాజరైన తెలుగు విద్యార్థుల సంఖ్య 1.22 లక్షలుగా నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 20వేలకు పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. రెండింటికీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఒకే సమయంలో ఎంసెట్, జేఈఈ ప్రిపరేషన్‌లను ఫలవంతం చేసుకోవచ్చు.

 

ఉమ్మడి ప్రిపరేషన్‌కు టిప్స్..



ఎంసెట్, జేఈఈ మెయిన్ సిలబస్‌ల మధ్య వ్యత్యాసాలు, పోలికలు గుర్తించాలి.

జేఈఈకి అదనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటి కోసం ప్రతిరోజూ కనీసం రెండు గంటల అదనపు సమయం కేటాయించాలి.

జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ప్రశ్నలన్నీ కాన్సెప్ట్, అప్లికేషన్ ఆధారితంగానే ఉంటాయి. ఈ విధానంలో ప్రిపరేషన్ అటు ఎంసెట్‌కూ ఉపయుక్తమే.

ఈ ఏడాది జేఈఈ-మెయిన్ ఆఫ్‌లైన్‌లో ఏప్రిల్ 4న; ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో జరగనుంది. అంటే.. ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ఆఫ్‌లైన్ ఔత్సాహికులకు వారం రోజులు; ఆన్‌లైన్ అభ్యర్థులకు పదిరోజులు సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో జేఈఈ ప్రిపరేషన్‌కు ఎక్కువ టైమ్ కేటాయించాలి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 24వ తేదీన జరగనుంది. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుత ఇంటర్మీడియెట్ సిలబస్ ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు సులువుగానే సన్నద్ధత పొందొచ్చు.

అడ్వాన్స్‌డ్ గత పరీక్షల తీరుతెన్నులు పరిశీలిస్తే ప్రాక్టీస్ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని గుర్తించి విద్యార్థులు ప్రాక్టీస్‌కు పెద్దపీట వేయాలి. ఇది అటు అడ్వాన్స్‌డ్‌కు, ఇటు ఎంసెట్‌కు రెండింటికీ ఉపయుక్తంగా ఉంటుంది.



ఎంసెట్ సమాచారం



తెలంగాణ, ఎంసెట్-2015



అర్హత:

ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.

అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.



దరఖాస్తు విధానం:

- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

- ఇందుకోసం ముందుగా టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాలు లేదా ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల వద్ద ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నెంబర్; పుట్టిన తేదీ; తండ్రిపేరు వంటి వివరాలు తెలియజేసి రూ. 250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ట్రాన్సాక్షన్ ఐడీ పొందాలి.

- ట్రాన్సాక్షన్ ఐడీ ఆధారంగా  www.tseamcet.in వెబ్‌సైట్‌లోని APPLY ONLINE  బటన్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం విండో ఓపెన్ అవుతుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 28, 2015 నుంచి ఏప్రిల్ 9, 2015 వరకు. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు; రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5 వేల అపరాధ రుసుంతో మే 5 వరకు; రూ. 10 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేయొచ్చు.

- ఆన్‌లైన్ అప్లికేషన్‌లో లోపాల సవరణకు అవకాశం: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20 వరకు

- హాల్‌టికెట్ డౌన్‌లోడ్: మే 8 నుంచి మే 12 వరకు.

పరీక్ష తేదీ: మే 14, 2015

వెబ్‌సైట్: www.tseamcet.in



ఆంధ్రప్రదేశ్, ఎంసెట్-2015



అర్హత:

ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.

అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.



దరఖాస్తు విధానం:

- ఏపీ ఎంసెట్ ఔత్సాహికులు కూడా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.

- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 250

- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 6 నుంచి ఏప్రిల్ 11 వరకు;

- రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు; రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5వేల అపరాధ రుసుంతో మే 2 వరకు; రూ. 10వేల అపరాధ రసుంతో మే 6 వరకు దరఖాస్తు చేయొచ్చు.

పరీక్ష తేదీ: మే 8, 2015

వెబ్‌సైట్: www.apeamcet.org



ఏపీ విద్యార్థులూ అర్హులే

తెలంగాణలో నిర్వహించే ఎంసెట్-2015కు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హాజరు కావచ్చు. లోకల్-నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారమే ప్రవేశాలు ఉంటాయి. అంటే.. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల విద్యార్థులు ఓపెన్ కేటగిరీలోని 15 శాతం పరిధిలోకి వస్తారు. పరీక్షలో సిలబస్‌లో పేర్కొన్న అంశాల పరిధిలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్‌లో తమ సబ్జెక్టులపై పట్టు సాధించిన అభ్యర్థులకు మంచి ర్యాంకులు వస్తాయి.

 - ప్రొఫెసర్ ఎన్.వి. రమణరావు, కన్వీనర్, టీఎస్‌ఎంసెట్-2015

 

సిలబస్ యథాతథం

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్‌లో సిలబస్‌గా గత ఏడాది వరకు ఉన్న సిలబస్‌నే నిర్దేశించాం. కాబట్టి విద్యార్థులు సిలబస్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. 1,70,000 ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్ల కోసం నిర్వహించే ఎంసెట్‌కు రెండున్నర లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికి అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం.

 - ప్రొఫెసర్ సి.హెచ్. సాయిబాబు,కన్వీనర్, ఏపీఎంసెట్-2015

 

ఏకాగ్రతే ముఖ్యం

ఎంసెట్ పరీక్షలో విజయం.. ఇందుకు ప్రిపరేషన్ విషయంలో ఏకాగ్రత ఎంతో కీలకం. సబ్జెక్ట్ పరంగా ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాథమిక భావనలు అధ్యయనం చేయాలి. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవడం లాభిస్తుంది.

- ఎన్. పవన్ కుమార్,బీటెక్ సీఎస్‌ఈ మొదటి సంవత్సరం

ఎంసెట్-2014 స్టేట్ ఫస్ట్ ర్యాంక్; జేఈఈ అడ్వాన్స్‌డ్- 9వ ర్యాంక్


 

సిలబస్‌లోని అంశాలపై పట్టుతో..

ఎంసెట్‌లో విజయం సాధించాలంటే.. ఇంటర్ సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి షార్ట్ కట్ మెథడ్స్, ప్రాక్టికల్ థింకింగ్ అలవర్చుకోవాలి. రోజూ కనీసం పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్‌ను క్లిష్టంగా భావిస్తారు. కానీ ఫార్ములాలను రియల్ లైఫ్‌తో అన్వయించుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగానే ఎదుర్కోవచ్చు.

 - జి. సాయి శ్రీనివాస్,ఎంబీబీఎస్ ఫస్టియర్,జిప్‌మర్ పుదుచ్చేరి

ఎంసెట్-2014 మెడికల్ ఫస్ట్ ర్యాంక్


 

సబ్జెక్ట్‌లవారీగా అనుసరించాల్సిన విధానం



ఎంసెట్ ఇంజనీరింగ్; అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో సిలబస్‌ను పరిశీలిస్తే విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి. ఈ క్రమంలో అనుసరించాల్సిన విధానం సబ్జెక్ట్‌ల వారీగా..

 

గణితం

మొత్తం 160 మార్కులకు నిర్వహించే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 80 మార్కులకు ఉండే మ్యాథమెటిక్స్‌లో సాధించే మార్కులే మెరుగైన ర్యాంకుకు మార్గం వేస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. టైం ప్లాన్‌లోనూ ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యంగా ఎంసెట్ సిలబస్‌ను పరిశీలించి అందులో ఇంటర్‌లో లేని అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. స్టాటిస్టిక్స్‌లోని మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్‌లపై ఫోకస్ చేయాలి. వీటితోపాటు మ్యాథమెటిక్స్‌లో మంచి మార్కుల కోసం వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులస్‌పై పట్టు సాధించాలి.

 

భౌతిక శాస్ర్తం

ఫిజిక్స్‌లో మంచి మార్కుల సాధనకు భావనల ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాల ఫార్ములాలను తెలుసుకోవడంతోపాటు వాటి అనువర్తిత అంశాల తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవాలి. ఒకే ప్రశ్నను కనీసం రెండు పద్ధతుల్లో సాధన చేసే విధంగా యత్నించాలి. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలోనే ఎలక్ట్రో మ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్‌మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెసైస్ అంశాల పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగానూ ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది.

 

రసాయన శాస్త్రం

ప్రశ్నల క్లిష్టత పరంగా సులువుగా ఉండే విభాగం.. కెమిస్ట్రీ. మిగతా సబ్జెక్ట్‌లతో పోల్చితే కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందేందుకు అవకాశాలెన్నో. విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్స్‌పై పట్టు సాధించాలి. ఇవి మార్కుల సాధనలో కీలకంగా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో తులనాత్మక ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ అధ్యయనం చేయాలి.

 

వృక్ష శాస్త్రం

బోటనీ విషయంలో ఇంటర్ రిలేటివ్ అప్రోచ్ ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలోని అంశాలు చాలా వరకు రెండో సంవత్సరంలో కొనసాగింపుగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను ఒకే సమయంలో చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలను తప్పనిసరిగా చదవాలి. అదే విధంగా ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్ల్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

 

జంతు శాస్త్రం

జువాలజీ విషయంలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం అవసరం. కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్‌లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిణామం; అనువర్తిత జీవ శాస్త్రం చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top