బతుకు పోరాటమూ విజయమే!

బతుకు పోరాటమూ విజయమే!


డంకర్క్‌ సినిమా రివ్యూ



యుద్ధం అంతిమంగా కోరేది ఒక్కటే.. శాంతి. అయితే అది యుద్ధం ముగిసాకే తెలివిలోకి వచ్చే ఓ చేదు నిజం. ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. గెలుపు, ఓటములు ఎవరెవరివి అన్నది పక్కనబెడితే, యుద్ధంలో కొన్ని వేల ప్రాణాలు ప్రాణం కోసం పోరాడుతూంటాయి. ఓటమి దగ్గరగా కనిపిస్తున్నప్పుడు బతకడమన్నది కూడా ఓ విజయంగా కనిపిస్తుంది. బతుకూ ఓ పోరాటంగా కనిపిస్తుంది. హాలీవుడ్‌ సినిమా డంకర్క్‌ ఆ బతుకు పోరాటాన్ని పరిచయం చేస్తుంది. ఆ బతుకు పోరాటమూ ఒక్కోసారి విజయమే అని చెప్పే సినిమా డంకర్క్‌.

కథ.. అది 1940 మే నెల. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం. అగ్ర రాజ్యాల కూటమిలోని జర్మనీ దాదాపుగా యుద్ధంలో గెలుపు దిశగా అడుగులేస్తోంది. ఫ్రాన్స్‌లోని డంకర్క్‌ తీర ప్రాంతంలో తన శత్రువుల గ్రూప్‌లోని బ్రిటన్, ఫ్రెంచ్‌ సైనికులను జర్మనీ పూర్తిగా కట్టడి చేసింది. ప్రాణాలను చేతిలో పట్టుకొని వేలాది మంది బ్రిటన్, ఫ్రెంచ్‌ సైనికులు డంకర్క్‌ తీరానికి చేరారు. వాళ్లంతా ఇప్పుడు సముద్రం దాటి ఇళ్లకు చేరాలి. జర్మనీ దాడులను తట్టుకుంటూ బ్రిటీష్‌ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఈ సైనికులందరినీ సముద్రం దాటించాలి. క్లుప్తంగా ఇదీ డంకర్క్‌ కథ.  



ఈ కథ చెప్పడానికి దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తనదైన శైలిలో స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సైనికుల తరలింపు అన్న ప్లాట్‌నంతా మూడు భాగాలుగా చేసి నేలపై, సముద్రంపై, గాల్లో జరిగే సంఘటనలు సబ్‌ప్లాట్స్‌గా చెప్పుకొచ్చారు. నేలపై, తీరంలో జరిగే కథంతా వారం రోజులు ఉంటుంది. సముద్రంపై సైనికులను తరలించే ఏర్పాట్లు, ప్రయాణం ఒక రోజు. గాల్లో జర్మనీ ఫోర్స్‌పై బ్రిటీష్‌ పైలెట్ల విమాన దాడులు ఒక గంట. ఈ మూడు సబ్‌ప్లాట్స్‌ను ఒకేసారి, ప్యారలల్‌గా చెప్పడమే డంకర్క్‌ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌.



విశ్లేషణ.. 107 నిమిషాల పాటు నడిచే ఈ సినిమా అనుక్షణం సస్పెన్స్‌ రేకెత్తించేదే! జర్మనీ దాడుల నుంచి తప్పించుకుంటూ టామీ అనే ఓ యువ సైనికుడు డంకర్క్‌ తీరాన్ని చేరుకుంటాడు. అక్కడ వేలాది మంది తనలాంటి సైనికులు నిస్సహాయ స్థితిలో నిలబడి ఉండడం చూస్తాడు. సినిమాలో మొదటి సీన్‌ ఇదే. ఇక్కడి నుంచే కథ ఏం చెప్పబోతోందో తెలిసిపోతుంది. ఇక ఆ తర్వాతంతా వాళ్లను పూర్తిగా ఆవహించిన నిస్సహాయత, పరిస్థితులను చూపిస్తూ గమ్యాన్ని ఎలా చేరుకున్నారో, ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో చెప్పేలా సన్నివేశాలు వస్తూంటాయి.



టెక్నికల్‌గా సినిమాకు ఎక్కడా ఓ వంక పెట్టడానికి లేదు. హ్యాన్స్‌ జిమ్మర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా అయిపోయాక కూడా వెంటాడుతుంది. హొయ్‌తో వన్‌ హొయ్‌తమా సినిమాటోగ్రఫీ కథలో లీనమైపోయేలా చేసింది. ఏరియల్‌ షాట్స్‌ అన్నీ ఒక మాయలా కనిపించాయి. వీటితో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ అన్నీ చరిత్రలో నిలబడిపోయే సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.



క్రిస్టోఫర్‌ నోలన్‌ అనగానే స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ను కోరుకుంటూ ఉంటాం. ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్‌ లాంటి నోలన్‌ కాంప్లికేటెడ్‌ స్క్రీన్‌ప్లేలకు ఏమాత్రం తగ్గకుండా డంకర్క్‌ స్క్రీన్‌ప్లే ఉంది. మూడు సబ్‌ ప్లాట్స్‌ల మధ్యన ఎప్పటికప్పుడు వచ్చే షిఫ్ట్‌ నోలన్‌ స్థాయిని మరోసారి చాటిచెప్పే అంశం. ఇక తక్కువ డైలాగులతోనే అద్భుతమైన ఎమోషన్‌ పండించడంలో నోలన్‌ చూపిన ప్రతిభ అనిర్వచనీయం. ‘అలలు పెద్ద టర్న్‌ తీసుకుంటున్నాయి’ అని ఒక సైనికుడు చెబితే, ‘ఎలా చెప్పగలుగుతున్నావ్‌?’ అంటాడు ఆఫీసర్‌. ‘డెడ్‌ బాడీస్‌ కొట్టుకొస్తున్నాయి’ అంటాడు ఆ సైనికుడు. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో! సైనికుడు అనేవాడు యుద్ధంలో ఎలా ఉంటాడో చెప్పే కొన్ని ఇలాంటి సన్నివేశాలు ఏడిపించేస్తాయి. నటీనటులందరూ అద్భుతంగా నటించేశారు. టామీ పాత్ర చేసిన ఫియాన్‌ వైట్‌హెడ్, అలెక్స్‌ పాత్రలో హారీ స్టైల్స్, కమాండర్‌గా కెన్నీత్‌ బ్రనగ్, జార్జ్‌గా బ్యారీ కియాన్‌ ఇలా అందరూ అలవోకగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోలు ఎవ్వరూ లేరీ కథలో. అలా అని హీరో అనలేని ఏ పాత్రా లేదు. అందరిదీ పోరాటమే!



చివర్లో బతుకు పోరాటంలో విజయం సాధించి, ఓ ప్రత్యేక రైల్లో ఇంటికి చేరుతూంటారు సైనికులు. ‘‘ఓడిపోయి వస్తోన్న మనల్ని చూస్తే ఉమ్మేస్తారేమో?’’ అంటాడొక సైనికుడు. నాటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ ఇచ్చిన స్పీచ్‌ పేపర్లో కనిపిస్తే చదువుతూంటాడు మరో సైనికుడు. ‘‘సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే యుద్ధాలు విజయం సాధించడం అనేది అవ్వదు.’’ అంటూ మొదలవుతుంది ఆ స్పీచ్‌. రైలు అలా ఊళ్ల మీదుగా వెళుతూ ఉంటే అక్కడి జనం సైనికులకు బ్రెడ్, నీళ్లు అందిస్తూ ఉంటారు. ఓడిపోయి వచ్చినంత మాత్రాన పోరాటాన్ని తక్కువ చేయలేం. బతుకు పోరాటమూ ఓ విజయమే అన్న విషయాన్ని చెప్పే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది. యుద్ధంలో గెలుపునే కాదు, ఓటమిని కూడా ఓ విజయంగా చూడొచ్చని చూపిన గొప్ప సినిమా డంకర్క్‌. అంతకంటే ఎక్కువే కూడా!!

– వి. మల్లికార్జున్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top