ఒక విరాట్ అక్షరం

ఒక విరాట్ అక్షరం


నివాళి

 

తెలుగువారి విలక్షణ రచయిత, తన నవలలతో తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేసిన డా.కేశవరెడ్డి మరణవార్త విన్నాక సాటి రచయితలు, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రచనలు చేస్తున్న యువ రచయితలు, ఆయన ప్రోత్సాహం అందుకున్నవారు, అభిమానించే పాఠకులు ఎందరో స్పందించారు. వ్యక్తిగా, రచయితగా కూడా కేశవరెడ్డి ఎంతో నిరాడంబరులై ఉండటం ఇందుకు కారణం కావచ్చు. ‘అతడు అడవిని జయించాడు’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘చివరి గుడిసె’ వంటి నవలలతో లోతైన జీవితాలనూ భిన్నమైన శిల్పధోరణులనూ ప్రవేశపెట్టిన డా.కేశవరెడ్డి గురించి ‘సోషల్ మీడియా’లో వచ్చిన వ్యాఖ్యల నుంచి ఏరిన భాగాలు కొన్ని....

 

 నిలబడే చదివేసేవాణ్ణి

 

నాకు కేశవరెడ్డి రచనలతో మొదటి పరిచయం ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన ‘అతడు అడవిని జయించాడు’ ద్వారా ఏర్పడింది. మొదటి భాగం చదవగానే ఆ భాషను ఎలా చదవాలా అనిపించింది. కారణం, అప్పటి వరకూ కథలు, నవలలు అన్నీ కూడా కృష్ణాజిల్లా భాషలోనే ఉండేవి, ఆ భాషే సాహిత్య భాష అనుకుంటూ పెరిగాను. ఈ నవలలోని చిత్తూరు జిల్లా మాండలికం క్రమంగా అలవాటయ్యాక తెలుగులో రచనలకు ఒక ‘సిక్కా వేసిన’ శైలి ఉండవలసిన అవసరం లేదని, ప్రజలు మాట్లాడుకునే అనేక మాండలికాల్లో రాయవచ్చని తెలిసింది. ఆ తెలియడం కూడా మొదట కేశవరెడ్డి నవలతో తెలియడం నా అదృష్టం. ఆయన రచనలు సాహస గాథ అనిపించే ‘అతడు అడవిని జయించాడు’ దగ్గరి నుంచి డిటెక్టివ్ తరహాలో సాగే ‘మునెమ్మ’ వరకూ నాకు తెలుసు. ఆయన స్వీయ అనుభవం అనిపించే నవల ‘సిటీ బ్యూటిఫుల్’. ఈ ఒక్క నవలలో మాత్రం ఆయన హాస్య రసాన్ని కూడా పండించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వచ్చేటప్పుడు నన్ను ఎంతగా ఆకర్షించిందంటే పత్రిక కొనడం ఆలస్యం ఆ షాపు దగ్గరే నిలబడి చదివేసేవాణ్ణి. ఈ కథలో హీరో తన కథ తానే చెప్పుకుంటాడు. ఈ హీరోకు ఒక పడికట్టు మాట ఉంటుంది. తన దృష్టిలో సవ్యంగా ఆలోచించలేని వాళ్లను ‘ఇంబిసైల్ ముండా కొడుకులు’ అని కొట్టి పారేస్తూ ఉంటాడు. ఈ అలవాటును కాపీ కొడుతూ నేను కూడా ఈ మాటను వాడే బలహీనత అప్పుడప్పుడూ చూపిస్తూ ఉంటాను. మరొక  ముఖ్య విశేషం ఏమిటంటే రెడ్డిగారి కథలు అన్నీ కూడా ఒక రోజు నుంచి అతి కొద్దిరోజులు మాత్రమే జరుగుతాయి. ఎక్కువ కథలు ఒక్కరోజు సంఘటనల సమాహారమే. వృత్తిరీత్యా డాక్టరుగా రోగులకు చికిత్స చేశారు. కాని ఆ చికిత్స కంటే తన రచనల ద్వారా సమాజానికి ఎంతో అవసరమైన చికిత్స చేసేవారు. నటన, లౌక్యంలేని ఈ రచయితని మృత్యువు తనదైన పద్ధతిలో తీసుకుపోయింది. కాని తన రచనల ద్వారా ఆయన ఎప్పుడూ చిరంజీవే.

 - కప్పగంతు శివరామప్రసాద్

 ‘సాహిత్య అభిమాని’ బ్లాగ్ నుంచి.

 

మనదంతా నవలా కుటుంబం....



సరిగ్గా ఇలాగే అప్పుడప్పుడు వారి గొంతు వినిపించేది. పలకరిస్తూ పరామర్శిస్తూ... ముఖ్యంగా మనదంతా నవలా కుటుంబం అని నవ్వుతూ... మళ్లీ ఎప్పుడు మరొక నవల అని హెచ్చరిస్తూ... మంచిని క్షేమాన్ని కోరుతూ... అప్పుడప్పుడు నవలను అర్థం చేసుకోని, చేసుకోవడానికి ప్రయత్నించని వారి పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తూ.... నవల పీక నొక్కుకు పోతోందని నిరాశ పడుతూ... నవలా మాధ్యమం గురించి విచారిస్తూ.... ఒక చిన్న నవల మొదలుపెట్టమ్మా అని ప్రోద్బలిస్తూ... మన సమకాలీన నవలాకారుడు డా.కేశవరెడ్డి.

 - చంద్రలత, రచయిత్రి. ఫేస్‌బుక్ నుంచి

 

అప్పట్లోనే ఆయనపై విమర్శలు....

 

1993లో ఆంధ్రప్రభ వారపత్రికలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ సీరియల్‌గా వచ్చి 1995లో నవలగా వెలువడింది. అదొక గొప్ప నవలగా అన్ని వైపుల నుంచీ ప్రశంసలు వచ్చినా వామపక్ష వర్గం మాత్రం పళ్లు నూరింది. అందులో ‘అభ్యుదయ నిరోధక భావజాలం’ ఉందంటూ విమర్శకు దిగి దాడి చేసింది. ఆ నవలలోని సన్నకారు రైతు బక్కిరెడ్డి భూమినీ సేద్యాన్నీ కోల్పోతే ఏం చేయాలి? తిరగబడాలి. పీడిత తాడిత ప్రజల మూకుమ్మడి తిరుగుబాటు విప్లవజ్వాలై ఎగిసిపడాలి- అని వామపక్ష వర్గం కోరిక. కాని నవలలో బక్కిరెడ్డి మతి చెడి మరణిస్తాడు. బక్కిరెడ్డి పరితప్త హృదయాన్ని పంచభూతాలు ఆవాహన చేసుకుంటాయి. అతని చావుని గుర్తించి ఆ భూమిని అతను కాక వేరెవరూ దున్నకూడదన్న వరం ఇస్తాయి. ఆ ప్రాంతం బక్కిరెడ్డి పేరిట చిన్నతోపులా మిగిలిపోతుంది. ఇలా రాస్తే నవలను కాకమ్మ కథలాగా పుక్కిటి స్థలపురాణంలాగా దిగజారుస్తావా? అని కేశవరెడ్డి మీద వారి ఆగ్రహం. భారతీయ సాహిత్యంలో అంతర్లీనమైన జానపద సంప్రదాయ కథన పద్ధతిలో వీరగాథ (లెజెండ్)గా చెప్పబడిన అత్యుత్తమ నవలగా ‘మూగవాని పిల్లనగ్రోవి’ పేరొందడం వారి అసహనానికి కారణం. దాంతో ‘నువ్వు మార్క్సిస్టు రచయితవు కాదా’ అని ఆయన వెంటబడ్డారు.



అంతేకాదు అంతకు చాలా ఏళ్ల క్రితం రాసిన ‘అతడు అడవిని జయించాడు’ను దీనికి కూడా జత చేసి ముద్దాయిగా నిలబెట్టారు. దాంతో కేశవరెడ్డి 1996 నాటి సుప్రభాతం పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ‘మూగవాని పిల్లనగ్రోవి, అతడు అడవిని జయించాడు నవలలు ఒక ఫిలాసఫీకి చెందినవి. అంతమాత్రాన నేను మార్క్సిస్టును కాకుండా పోతానా’ అని మొత్తుకున్నారు. అంతేకాదు ‘మూగవాని పిల్లనగ్రోవి’పై మార్క్సిస్టుల విమర్శను చూసి తానేమిటో గుర్తు చేయడానికి 1986లో రాసిన ‘రాముడుండాడు రాజ్జివుండాది’ నవలను హడావిడిగా 1997లో పునర్ముద్రించారు. ఇతర నవలలు ఉండగా ఈ ఒక్క నవలనే ఎందుకు పునర్ముద్రించారు? ఇందులో మార్క్సిస్టులు మెచ్చే భావజాలం దన్నుగా ఉండటమే కారణం. పైగా ముందుమాటలో ‘సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకి ఆర్థిక అసమానతలే మూలకారణమనీ దానికి అంతిమ పరిష్కారం వర్గపోరాటమేననీ నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని చెప్పుకున్నారు. అప్పటికే ఆయన ‘చివరి గుడిసె’ రాసేయడం వల్ల అది వెలువడిందిగానీ ‘మూగవాని పిల్లనగ్రోవి’ విషయంలో అలా కార్నర్ చేయబడ్డందుకేనేమో పదేళ్లుపైగా నిశ్శబ్దమైపోయారు. 2008లో ‘మునెమ్మ’ వరకూ ఆయన కలం మూగబోయింది. ఇక ‘మునెమ్మ’ విషయంలో జరిగిన చర్చ తెలుగు విమర్శ కురచదనాన్ని మరింత తేటతెల్లం చేసింది. నేటి పెరుమాళ్‌మురుగన్ పరిస్థితి కేశవరెడ్డి 15 ఏళ్ల క్రితమే ఎదుర్కొన్నారు.

 - నున్నా నరేశ్, విమర్శకులు, ఫేస్‌బుక్ నుంచి

 

 

వెన్నెల లాంటి మనిషి


 

పుస్తకాలు పరిచయమై కనిపించినవాటినల్లా చదివేసే అలవాటున్న రోజుల్లో ఒకరోజు నాకు మా యింటి లైబ్రరీలో  ‘అతడు అడవిని జయించాడు’ కనిపించింది. పుస్తకం తిరగేస్తుంటే బొమ్మలు ఆకర్షించాయ్. ఆ బొమ్మలు కేతినీడి భాస్కర్ గారివి. ఇంత అందమైన బొమ్మలున్న ఈ కథ యేమిటో చూడాలన్న కుతూహలం కలిగింది. చదివాను. మళ్లీ చదివాను. అందులోని ఆ అడవి ఆ వెన్నెల మరి నన్ను వదలకుండా పట్టుకున్నాయి.



చలంగారి మైదానం మొదటిసారి చదివినప్పుడు అందులోని చింతచెట్టు అల్లిక నుంచి జల్లులు జల్లులుగా కురిసే మధ్యాహ్నపు ఎండ మైమరపించినట్టుగా ఈ నవలలోని అడవీ అడవిలోని వెన్నెల నడకలు హత్తుకున్నాయి. ఆ తరువాత చాలా కాలానికి కేశవరెడ్డిగారు పరిచయం అవ్వగానే ‘ఆ వెన్నెల అడవి భలే రాశారు’ అని చెప్పాను. ఆయన నవ్వారు. మళ్లీ నవ్వారు. నవ్వటం ఆపి ‘యింత అందంగా కొత్తగా ఆ పుస్తకం గురించి నాకు యెవ్వరూ చెప్పలేదు. ఇప్పటి వరకూ అంతా చాలా గంభీరమైన ఫీడ్‌బ్యాకే చెప్పారు’ అన్నారు. తన రచనల గురించి కానీ తన ఫలానా నవల చదివారా అని కానీ ఆయన అడగటం నేనైతే వినలేదు. మనకి అనిపించినవి చెపితే శ్రద్ధగా వింటారు. అవసరమైతే తప్పా తన రచనల గురించి మాటాడరు. అసలు మనం వో విశిష్టమైన సుసంపన్నమైన రచయితతో మాట్లాడుతున్నామనే భావన కలగదు. ఆయనెప్పుడూ యెదుటివాళ్ల మీదకి తనలోని రచయితకి సంబంధించిన బలం, బరువు అనే వలలని విసిరేయడం నేను చూడలేదు. వినలేదు. కేశవరెడ్డిగారు మనుష్యుల పట్ల మృదువుగా, ప్రేమగా వుంటూ ఆత్మీయంగా పలకరిస్తూ యెందరో అభిమానుల హృదయాలని జయించారు వెన్నెలంత తేటగా.

 - కుప్పిలి పద్మ, రచయిత్రి, సారంగ వెబ్‌జీన్ నుంచి

 

పున్నా కృష్ణమూర్తి



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top