దేవుడెన్నడూ హింసను ఆమోదించడు

దేవుడెన్నడూ  హింసను ఆమోదించడు


రోజురోజుకూ ప్రపంచవ్యాప్తంగా హింస పేట్రేగిపోతోంది. వేలాది ప్రజలు చిన్నా పెద్దా తేడా లేకుండా హింసకు బలైపోతున్నారు. తాము ఈ ‘మహత్కార్యాన్ని’ ప్రతీకారం కోసం చేస్తున్నాం అని వాదించే హింసావాదులు ఇలాంటి చర్యలను దేవుడు ఆమోదించడని గ్రహించాలి.  ‘‘మీరు అల్లాహ్ పేరుతో చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి, ప్రజలలో శాంతి స్థాపించడం నుండి ఆటంక పరిచేవిగా కానివ్వకండి. అల్లాహ్ సర్వజ్ఞుడు (అల్‌బఖరహ్ 2:224).



 ‘అల్లాహ్’ అంటే మహోన్నతుడైన దేవుడు. ఆయన సర్వ మానవాళికి సృష్టికర్త అయినప్పుడు, తోటి మానవుడు మనకు సహోదరుడవుతాడు. ఒకడు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళితే వానికి సన్మార్గం గురించి బోధించాలి. వినకపోతే అంతిమ దినాన వానికి తీర్పు చెప్పబడుతుంది. అంతకుమించి వానిని శిక్షించే అధికారం మనకు లేదని ఖురాన్ చెబుతోంది. ‘‘మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథలతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, పక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయిలు చెప్పుకునేవాడిని ప్రేమించడు’’ (అన్ నిసా 4:36)



 ఖురాన్‌లో ‘ప్రతీకారం’ అనే పదం మచ్చుకైనా కనిపించదు. దయ, కరుణ అనే పదాలు వందల సార్లు  కనిపిస్తాయి. దేవునిది నూటికి నూరు పాళ్లు శాంతి మార్గం. ఈ నిజాన్ని ప్రపంచం గ్రహించిననాడు ప్రతి హృదయంలో శాంతి స్థాపన జరుగుతుంది. అప్పుడు ఈ లోకం స్వర్గమయం అవుతుంది.

  - యస్. విజయభాస్కర్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top