వీళ్లా మగాళ్లు!

వీళ్లా మగాళ్లు! - Sakshi


మహిళకు ఎక్కడా రక్షణ లేదు.

రోడ్డు మీద, బస్సులో, స్కూల్లో, ఆఫీస్‌లో...

చివరికి ఇంట్లో కూడా లేదు!

ఇన్ని భూతాలతో మహిళ నిత్యం పోరాడుతుంటే...

ఇప్పుడు ఇంకో భూతం తయారైంది.

దీని భూతం అనాలా? బూతు అనాలా?

ఇంటర్నెట్‌లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా

చూపించడం... నోటికొచ్చినట్లు కామెంట్ చెయ్యడం...

మళ్లీ వీటన్నిటినీ సర్కులేట్ చెయ్యడం..!

డర్టీ మగాళ్ల పిరికి బిహేవియర్ ఇది.

ఈ సిగ్గులేని, నీతిమాలిన పిరికిపందలు మగాళ్లెలా అవుతారు?!


 

సాగరికా ఘోష్ ప్రసిద్ధ టీవీ జర్నలిస్ట్. ట్విట్టర్‌లో ఆమె చాలా చురుకుగా ఉండేవారు. అయితే సడన్‌గా ఆమె ట్విట్టర్ జోలికే వెళ్లడం మానేశారు. కారణం. తనపై వచ్చిన బ్యాడ్ కామెంట్స్. మొదటైతే ఆ కామెంట్స్‌ని సాగరిక పట్టించుకోలేదు. టీనేజ్‌లో ఉన్న తన కూతురినీ ఆ కామెంట్స్ టార్గెట్ చేయడంతో ఆమె చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏం చేయాలో అర్థంకాలేదు. కొన్నాళ్లు మాటకు మాట ఇచ్చారు కానీ, కామెంట్లు శృతిమించడంతో ట్విట్టర్‌ని వదిలేశారు.



ప్రఖ్యాత మహిళా కార్యకర్త కవితా కృష్ణన్‌దీ ఇలాంటి అనుభవమే. ఒకసారి ఆమె మహిళల మీద హింసకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో చాట్ చేస్తుంటే.. ఉన్నట్టుండి ఓ వ్యక్తి హఠాత్తుగా ‘నిన్ను రేప్ చేయడానికి కండోమ్‌తో వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అసభ్యంగా చాట్ చేయసాగాడు. అంతే వెంటనే ఆ చాట్‌లోంచి సైన్ ఆఫ్ అయిపోయారు కవిత. ‘‘నేను చాట్‌చేసిన సైట్ రెడిఫ్ డాట్ కామ్. అలాంటి పదజాలంతో ఉన్న ఆ చాట్‌ను రెడిఫ్ డాట్ కామ్ బ్లాక్ చేయకపోవడం పట్ల చాలా బాధేసింది’’ అన్నారు కవితా కృష్ణన్ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.



వీళ్లిద్దరి కంటే కొంచెం గుండె దిటవైన మనిషి సోనాక్షీ సిన్హా. ఆమె ‘లావు’ గురించి ట్విటర్‌లో చాలాకాలం పాటు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. వాటిని సోనాక్షీ తిప్పి కొట్టగలిగారు. ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోయింది. సోషల్ మీడియాను కొందరు మగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కళ్లకుకటే ్ట‘సైబర్ బుల్లీయింగ్’ సంఘటనలివి.  



ఇంటర్‌నెట్‌ను, సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లనూ ఉపయోగించి, సంఘంలో పేరు ప్రతిష్ఠలు, సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తులపై ఆకతాయిలు అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం ఇటీవల ఎక్కువైపోయింది. బుల్ అంటే దున్నపోతు. అంటే జడివాన కురిసినా, చలనం లేనట్టుండే బండ జంతువు. సైబర్ బుల్లీయింగ్ కూడా అంతే. అవతలి వారు ఏమైపోతే నాకేం అన్నట్టు... ప్రవర్తించే మానవ మృగాలు చేసే పని కాబట్టి ఆ ప్రవృత్తిని అలా అనడం సమంజసమే!



ఫొటోలు మార్ఫింగ్ చేయడం, ఫేక్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, వారి పేరుతో ఇతరులకు అభ్యంతరకరమైన కామెంట్లు చేయటం, రకరకాల వెకిలి చేష్టలు చేయటం, అశ్లీలమైన ఫొటోలు పోస్ట్ చేయటం... ఇలాంటివన్నీ సైబర్ బుల్లీయింగ్ కిందికే వస్తాయి.

 సైబర్ బుల్లీయింగ్ బారిన పడి ఎన్నో ఎన్నో కాపురాలు కూలిపోయాయి. మరెందరి జీవితాలో బలయ్యాయి. పరువే ప్రాణంగా బతికే సున్నిత మనస్కులు మనస్తాపంతో ఆత్మహత్యలకు ప్రయత్నించే ప్రమాదం ఉంది.



అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించి, వెలుగును పంచవచ్చు, ఇంటి చూరుకు నిప్పు పెట్టి, బతుకును బుగ్గిపాలూ చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దీపం వెలిగించి, వెలుగును పంచడానికే వినియోగించుకోవాలి తప్ప కుసంస్కారంతో సాటి మనుషులను బాధపెట్టకూడదు.    

 

సంస్కారవంతులు పెరగాలి



 ఫోటోషాప్‌లో మొహాలు మార్చేసే ‘మార్ఫింగ్’ ప్రక్రియ నెట్‌లో చాలా జోరుగా సాగుతోంది. అసభ్యంగా ఉండే ఫొటోలకు, అభ్యంతరకర వీడియోలకు సెలబ్రిటీల మొహాలు అతికించేసి, కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంతేకాదు, తమకు ఏ అమ్మాయి మీద అయినా పగ ఉంటే, ఆ అమ్మాయి పరువు తీయడానికి కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది చాలా దారుణమైన విషయం.

 - అదా శర్మ, కథానాయిక

 

 బహిర్గతం చెయ్యకూడదు




 ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఈ సైబర్ ప్రపంచం పెనుభూతంగా మారిందనే చెప్పాలి. ఈ నేరాలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఏకంగా జీవితాలనే నాశనం చేసేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అపరిచితులకు వ్యక్తిగత విషయాలు చెప్పడం శ్రేయస్కరం కాదు. ముఖ పరిచయం లేనివారితో మాట్లాడకపోవడమే క్షేమం.

 - నందిత, నటి

 

చట్టాలేవీ లేవు




సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించి పటిష్ఠమైన చట్టాలేవీ మన దేశంలో లేవు. ఇప్పుడున్న సైబర్ లా (ఇండియన్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000) కూడా సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించిన అంశాల మీద చురుగ్గా ఏమీ స్పందించట్లేదు. అందుకే దీన్ని సైబర్ లాతో అనుసంధానించకుండా సైబర్ బుల్లీయింగ్‌కి ప్రత్యేకమైన చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నేరం చేసిన వాళ్లకు కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 50 లక్షల రూపాయల జరిమానా విధించాలి. అలాగే బాధితులకు జరిగిన

 న ష్టాన్ని, మనస్తాపాన్ని బట్టి వాళ్లకు 50 కోట్ల రూపాయల

 నష్టపరిహారాన్నీ ఇప్పించాలి.

 - పవన్ దుగ్గల్, సైబర్ లా ఎక్స్‌పర్ట్,  సుప్రీంకోర్టు న్యాయవాది

 

 కంప్లయింట్ ముఖ్యం



 ఫేస్‌బుక్ లాంటి వాటిల్లో అబ్యూజ్ లాంగ్వేజ్, న్యూడ్‌ఫోటో పోస్టింగ్స్‌లాంటివి పెట్టి... బాధితులు కంప్లయింట్ చేసినా ఏమీ చేయలేని పరిస్థితీ ఉంటుంది. ఎందుకంటే ఫేస్‌బుక్ అమెరికన్ సంస్థ. అక్కడి చట్టాల ప్రకారం అది రూపొందింది. ఇండియాలో ఫేస్‌బుక్ ద్వారా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద చర్య తీసుకోవడానికి వివరాలు కావాలని ఆ సంస్థకు పంపిస్తే స్పందించదు.  ఇండియాలో అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ అడిగిన ఏ వివరాన్నయినా ఇటు ప్రైవేట్ అటు పబ్లిక్ ఏజెన్సీ ఏదైనా చెప్పి తీరాల్సిందే. అందుకు బాధితుల ఫిర్యాదు ముఖ్యం.

 -  రాజశేఖర్, సీఐ

 (సైబర్ క్రైమ్), హైదరాబాద్

 

 వెంటనే స్టాప్ చేయాలి



 ప్రధానంగా టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... మనం ఆన్‌లైన్‌లో చేసే కామెంట్ ఏదీ అంతమైపోదు. ఎవరో ఒకరి వాల్ మీద   జీవించే ఉంటుంది. దాన్ని గుర్తెరిగి, మనం సంభాషించాలి. ఇక మనమీద వేధింపులు మొదలు కాగానే వాటిని మొగ్గలోనే తుంచేయడం మేలు. ఇక అజ్ఞాతంగా చేసే కామెంట్స్‌నూ లేదా వేధింపులు జరుగుతుంటే అది ఎక్కడి నుంచి జరుగుతోందన్న విషయాలను తవ్వి తీయగల సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. దాంతోపాటు దీనికి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాల మద్దతు ఉండాలి.

 - డాక్టర్ పద్మా పాల్వాయి,

 సైకియాట్రిస్ట్, హైదరాబాద్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top