ఆళ్లెందుకు కుమ్ముతున్నరు! ఈళ్లెందుకు గమ్ముగున్నరు




సినిమాల్లో మనవాళ్లు కుమ్మినంతగా వాళ్లు కుమ్మలేరు కానీ... మనల్ని మాత్రం వాళ్ల ప్రమోషన్‌ స్టంట్‌లతో కుమ్మేస్తున్నారు. ‘ఆ.. ఓ ప్రమోషన్‌ ట్రైలర్‌ కట్‌ చేస్తే సరిపోద్ది’ అని మనోళ్లు అనుకుంటే... వాళ్లు సినిమా రేంజ్‌లో ప్రమోషన్‌ కట్‌ చేస్తున్నారు! హెయిర్‌ కటింగ్‌లు చేస్తున్నారు వేడివేడిగా జిలేబీలు వేస్తున్నారు బిచ్చం అడుక్కుంటున్నారు దిష్టి తీసి నిమ్మకాయలు కడుతున్నారు. ఓ అర నిముషం ట్రైలర్‌ని డబ్బులిచ్చి టీవీల్లో వేయించుకోవచ్చు. కానీ.. క్రియేటివ్‌ ప్రమోషన్‌ యాక్టివిటీతో ఈజీగా సినిమాను జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు! వాళ్లు అలా మీడియాని కుమ్మేస్తున్నారు. మనవాళ్లు మీడియాకు దొరక్కుండా... గమ్మునుండిపోతున్నారు!



ఆమిర్‌ఖాన్‌ ‘పీకే’ సినిమాను గుర్తుకు తెచ్చుకోండి. అందులో ఒంటి మీద బట్టలు లేకుండా రేడియో పట్టుకుని తిరిగిన ఆమిర్‌ పోస్టర్‌లు చూసి జనం ఉతికి ఆరేశారు. ఆమిర్‌ సరిగ్గా ఆ సీన్‌నే తన మూవీ ప్రమోషన్‌కి వాడుకున్నాడు. ‘పీకే’ రీలీజ్‌ (2014) టైమ్‌లో అచ్చు సినిమాలోలా (నగ్నం గా కాదు లెండి) రేడియో పట్టుకుని జనం మధ్యలోకి వచ్చాడు. ప్రమోషన్‌ హిట్‌. పిక్చర్‌ హిట్‌.



బొమ్మలో దమ్ముంటే చాలదా?

మూవీ ప్రమోషన్‌లో బాలీవుడ్‌ తర్వాతే ఎవరైనా! మన టాలీవుడ్‌ స్టార్‌లు ఏ 50 రోజులో, 100 రోజులో సినిమా ఆడిన తర్వాత సక్సెస్‌ మీట్‌లో కనిపిస్తారేమో కానీ, ప్రమోషన్‌ ఈవెంట్‌కు ఇంట్రెస్ట్‌ చూపించరు. ఈమధ్య ‘దువ్వాడ జగన్నాథం’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఓ విషయం చెప్పారు. ‘గబ్బర్‌ సింగ్‌’ సక్సెస్‌ మీట్‌ అప్పుడు.. ‘మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కల్యాణ్‌ సర్‌’ అని హీరో పవన్‌ కల్యాణ్‌ని అడిగితే.. ‘సినిమా మాట్లాడుతోంది కదా.. ఇక మనమెందుకు మాట్లాడ్డం’ అన్నారట పవన్‌. ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు హరీష్‌ శంకర్‌!!



నిజమే. సినిమాలో దమ్ముంటే దానంతటదే దుమ్ము రేపుతుంది. మరి.. స్టారింగ్‌ దమ్ము, డైరెక్టింగ్‌ దమ్ము, ప్రొడ్యూజింగ్‌ దమ్ము, డిస్ట్రిబ్యూటింగ్‌ దమ్ము.. ఇన్ని దమ్ములు ఉండి కూడా బాలీవుడ్‌ హీరో హీరోయిన్‌లు ఎందుకని తమ పిక్చర్‌ ప్రమోషన్‌కి అంత వాల్యూ ఇస్తారు? ఎందుకంటే.. దమ్మును మించింది ఇంకేదో ఉంది! ఏంటది? ఆడియన్స్‌తో నేరుగా కనెక్ట్‌ అవడం. మేము ఉండేది బాంద్రాలోనే అయినా, కనిపించేది స్క్రీన్‌ మీదే అయినా.. మీలో ఒకరిమే అని చెప్పడం. ఇది టాలీవుడ్‌లో లేదు. ఇక్కడ స్క్రీన్‌కి అవతల స్టార్‌. స్క్రీన్‌ ఇవతల ఫ్యాన్‌.



బోర్‌ కన్నా బ్యాడ్‌ నయం

ఫినీస్‌ టేలర్‌ బార్నర్‌ 19వ శతాబ్దపు అమెరికన్‌ షో మ్యాన్‌. సర్కస్‌ కంపెనీ ఓనర్‌. ప్రమోషనల్‌ వర్క్‌లో ఎక్స్‌పర్ట్‌. జనాన్ని లాక్కోడానికి అవసరమైతే అరచి గీ పెట్టేవాడు. ‘దటీజ్‌ బ్యాడ్‌ పబ్లిసిటీ’ అనేవాళ్లు ప్రత్యర్థులు. అప్పుడు ఆయన ‘దేర్‌ ఈజ్‌ నో సచ్‌ థింగ్‌ యాజ్‌ బ్యాడ్‌ పబ్లిసిటీ’ అనేవారు. బ్యాడ్‌ పబ్లిసిటీ అనేది ఒకటి లేదని అర్థం. బ్యాడ్‌ పబ్లిసిటీ ఉండకపోవచ్చు. బోర్‌ పబ్లిసిటీ ఉంటుంది. టాలీవుడ్డే ఎగ్జాంపుల్‌. సినిమా ప్రమోషన్‌ అంటే ఓ ఫంక్షన్, అందులో రెగ్యులర్‌గా ఓ యాంకర్, ఓ కామెడీ యాక్టర్, స్టార్‌లు ఒకర్నొకరు పొగుడుకోవడం.. సడెన్‌గా అక్కడ లేని ఒక హీరో ప్రస్తావన, ప్రతిస్పందన గా ఆడియెన్స్‌లోంచి అరుపులు. అక్కడితో ఫినిష్‌!బాలీవుడ్‌లో ఇలా ఉండదు. బ్యాడ్‌ పబ్లిసిటీ ఉండొచ్చు. బట్‌.. బోర్‌ పబ్లిసిటీ ఉండదు. ఇన్నోవేటివ్‌గా, ఇన్వైటింగ్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.



బిచ్చగత్తెగా విద్యాబాలన్‌

2014లో ‘బాబీ జాసూస్‌’ సినిమా వచ్చింది. కామెడీ డ్రామా. విద్యాబాలన్‌ మెయిన్‌ క్యారెక్టర్‌. అప్పట్లో విద్యాబాలన్‌.. హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ బయట బిచ్చగత్తెల మధ్య ఒక బిచ్చగత్తెగా కూర్చున్న సంగతి గుర్తు తెచ్చుకోండి. ‘బాబీ జాసూస్‌’ ప్రమోషన్‌ కోసం విద్యాబాలన్‌ కట్టిన వేషం అది! అప్పటికి సినిమా పూర్తి కూడా కాలేదు. ఆర్నెల్ల ముందే ఆ లెవల్‌లో ప్రమోషన్‌ ఇచ్చారంటే... చూడండి బాలీవుడ్‌ ఎంత కమిటెడ్‌గా, క్రియేటివ్‌గా ఉందో. నిన్న సల్మాన్‌ఖాన్‌ సినిమా ‘ట్యూబ్‌లైట్‌’ విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం రెండు రోజుల క్రితం సల్మాన్‌ మెహబూబ్‌ స్టూడియోలో ఉన్నాడు. అదయ్యాక బయటికి వచ్చాడు. అక్కడ అతడి ఖరీదైన ఎస్‌.యు.వి. కారు ఉంది. దాన్ని వదిలేసి ఆటో ఎక్కి వెళ్లి పోయాడు. ఆ ఫొటోలు నెట్‌కి ఎక్కేయడం ఎంతసేపు? ఆటోకి యాభై రూపాయలైంది. సల్మాన్‌ వెయ్యి రూపాయలిచ్చి వెళ్లిపోయాడు. ఇదంతా సినిమా ప్రమోషన్‌ అనుకోడానికి లేదు. అలాగని ఇది ప్రమోషన్‌ అయిపోకుండా నూ లేదు. కొద్ది గంటలకే సల్మాన్‌ మళ్లీ ప్రమోషన్‌ వర్క్‌కి వెళ్లిపోయాడు. అయితే అది ‘జగ్గా జాసూస్‌’కు రణబీర్, కత్రీనా చేస్తున్న ప్రమోషన్‌ వర్క్‌. మనది మనం ప్రమోట్‌ చేసుకోడానికే టాలీవుడ్‌ బద్దకంగా అవలిస్తుంటే, బాలీవుడ్‌ స్టార్‌లు సాటి స్టార్‌ల ప్రమోషన్‌కీ పరుగులు తీస్తున్నారు.



ఆమిర్‌ ఖానే అసలు సుల్తాన్‌

అసలైతే పబ్లిసిటీ సుల్తాన్‌.. ఆమీర్‌ఖానే! ఏ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్‌ ఉంటే అలాంటి క్యారెక్టర్‌కు తగినట్లుగా అతడు పబ్లిసిటీ స్టంట్స్‌ చేస్తుంటాడు. 2009లో ‘త్రీ ఇడియెట్స్‌’ సినిమాకు అతడు ప్లాన్‌ చేసిన పబ్లిసిటీ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ సినిమాలో అమీర్‌ ఖాన్‌ కొన్నేళ్ల పాటు అదృశ్యం అవుతాడు. బయట కూడా అలాగే మాయం అయ్యాడు ఆమిర్‌. అయితే తను మాయం అవబోతున్నానని, వెతికితే దేశంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తానని చెప్పి మరీ.. రెండు వారాల పాటు అదృశ్యం అయ్యాడు. తనను పట్టుకునేందుకు కొన్ని క్లూలు కూడా ఇచ్చాడు! వాటిల్లోని ఒక ‘క్లూ’ను సచిన్‌ టెండూల్కర్‌ చేత విడుదల చేయించాడు! మూవీ ప్రమోషన్‌లో ఇంతకన్నా మాస్టర్‌ మైండ్‌ ఉంటుందా? అంతక్రితం ‘ఘజనీ’ రిలీజ్‌కి ముందు కూడా తన డిప్ప కటింగ్‌ క్యారెక్టర్‌ని క్లోన్‌ చేసినట్లుగా కొంతమంది కుర్రాళ్లకు కటింగ్‌ కొట్టించి వాళ్ల మధ్యలో తిరిగాడు. ఒకరిద్దరు ఫ్యాన్స్‌కి తనే స్వయంగా కటింగ్‌ కూడా చేశాడు. ఇక ఈ ఏడాది ఆగస్టులో ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ మూవీ రాబోతోంది. 2018 దీపావళికి ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’, 2019లో శాల్యూట్‌ (రాకేశ్‌ శర్మ బయోపిక్‌), సర్ఫ్‌రోస్‌ 2 రాబోతున్నాయి. చూడాలి. వాటికి ఆమిర్‌ ఎంత క్రియేటివ్‌గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడో!



ప్రమోషన్‌లో ఖాన్‌ దాదా

ఖాన్‌లలో షారుక్‌ స్పెషల్‌ ఖాన్‌. సల్మాన్, ఆమిర్‌లతో కంపేర్‌ చేస్తే ఆయన ప్రమోషన్‌లు తక్కువే కానీ, భారీగా ఉంటాయి! 2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ ప్రమోషన్‌కి ఆయన  పెద్ద ‘స్లామ్‌ టూర్‌’ ప్లాన్‌ చేశారు. అంటే  సందడి టూరు. ఆ సినిమాలోని కో–స్టార్‌లను  వారం పాటు హోస్టన్, న్యూ జెర్సీ, వాషింగ్టన్‌ డీసీ, చికాగో, వాంకోవర్‌.. శాంన్‌ జోస్‌.. ఇలా అమెరికా అంతా తిప్పుకొచ్చారు. ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన ‘ఫ్యాన్‌’ చిత్రానికి, ఈ ఏడాది రిలీజ్‌ అయిన ‘రయీస్‌’ చిత్రానికి కూడా షారుక్‌ వైవిధ్యంగా ప్రమోషన్‌ వర్క్‌ చేశారు.



హృతిక్‌ .. ఎమ్రాన్‌ హష్మీ

‘జిందగి న మిలేగి దొబార’ 2011లో రిలీజ్‌ అయింది. అది కామెడీ ‘రోడ్‌ డ్రామా’. ఆ చిత్రం ప్రమోషన్‌ కోసం హృతిక్‌ రోషన్, అభయ్‌ డియోల్, ఫరా అఖ్తర్, కత్రీనా కైఫ్, కల్కీ కోచ్లిన్‌.. అచ్చు సినిమాలో ఉన్నట్లే.. రోడ్‌ ట్రిప్‌ వేసు కున్నారు. షారుక్‌ ‘రయీస్‌’ కోసం ట్రైన్‌ జర్నీ చేస్తే.. వీళ్లు నలుపురంగు రేంజ్‌ రోవర్‌లో ముంబై నుంచి ఢిల్లీ వరకు సూరత్, అహ్మదాబాద్, ఉదయ్‌పూర్, జైపూర్‌ చుట్టి వచ్చారు. ఇక 2013లో ‘ఏక్‌ థీ దాయన్‌’ చిత్రం ప్రమోషన్‌ కోసం కథానాయకుడు ఎమ్రాన్‌ హష్మీ.. మంత్రగత్తెల మధ్య మాంత్రికుడిగా హ్యూమా ఖురేషి, కొంకణా సేన్, కల్కీ కొచ్లిన్‌లతో కలిసి ముంౖ»ñ లో ఈవెంట్‌లు చేశాడు. ముంబై ఘట్కోపర్‌లోని ఆర్‌–సిటీ మాల్‌లో లెవిటేషన్‌ (మనిషిని గాలిలో లేపడం) మ్యాజిక్‌ చేసి చూపించాడు. ‘ఏక్‌ థీ దాయన్‌’ అంటే.. అనగనగా ఒక మంత్రగత్తె అని అర్థం.



నిమ్మకాయలు.. పచ్చిమిర్చి

ఏక్‌ థీ దాయన్‌ లాంటిదే ‘రాజ్‌ 3. హారర్‌ థ్రిల్లర్‌! భయం, దడ, టెన్షన్, వణుకు.. ఇవన్నీ సినిమాకు ప్రమోషన్‌లే. కానీ వాటితో సరిపెట్టుకోలేదు నిర్మాత మహేశ్‌భట్‌. అందులో నటించిన బిపాషా బసు చేతికి దిష్టి తీసే నిమ్మకాయలు, మిరపకాయలు ఇచ్చి ఆటోలకు కట్టించాడు. ఇవన్నీ సినిమాలకు జరిగిన ప్రమోషన్‌లు. సినిమాకు కాకుండా, సినిమాలోని ఒక పాటకు ప్రత్యేకంగాప్రమోషన్‌ జరిగిన సందర్భం కూడా ఉంది. 2011లో విడుదలైన ‘డబుల్‌ ధమాల్‌’ లోని ‘జలేబీ బాయి’ ఐటమ్‌ సాంగ్‌కి ఆ పాట పాడిన మల్లికా శెరావత్‌ ముం , విలే పార్లేలోని రస్‌ రాజ్‌ హోటల్‌లో జిలేబీలు చేసి యూనిట్‌ సభ్యులకు తినిపించారు.



సిల్లీ అండ్‌ సీరియస్‌

ఈ జిలేబీలు, మిరపకాయలు, మంత్రగత్తెలు–బిచ్చగత్తెల వేషాలు, టూర్‌లు, దాగుడు మూతలు.. సిల్లీగా అనిపించవచ్చు. కానీ సీరియస్‌గా ఉండే ప్రమోషన్‌ల కన్నా సిల్లీగా ఉండేవే జనానికి ఎక్కుతాయి. సినిమాపై ఆసక్తిని కలుగజేస్తాయి. ఎన్నాళ్లని ఈ ఇన్‌డోర్‌ ఇంటర్వ్యూలు, ప్రమోషనల్‌ ఈవెంట్లు? వెరైటీ ఉండాలి. సృజనాత్మకత ఉండాలి. ఇవి రెండూ బాలీవుడ్‌లో కావలసినంత ఉన్నాయి. అక్కడి హీరో హీరోయిన్‌లు ఎనర్జిటిక్‌గా ఉంటారు. టాలీవుడ్‌ ప్రేక్షకులకు లేని భాగ్యం ఇది. టాలీవుడ్‌ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లకు దక్కని అదృష్టం ఇది.



‘జగ్గా జాసూస్‌’ ప్రమోషనల్‌ వీడియో

జూలై 14 ‘జగ్గా జాసూస్‌’ రిలీజ్‌. రణ్‌బీర్‌ కపూర్, కత్రీనా కైఫ్‌ హీరో హీరోయిన్‌. వేరే ప్రమోషన్‌ అక్కర్లేదు. మ్యూజికల్‌ అడ్వెంచర్‌ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌. వేరే ప్రమోషన్‌ అక్కర్లేదు. కనిపించకుండా పోయిన తండ్రిని టీనేజ్‌ డిటెక్టివ్‌ కొడుకు వెతుక్కుంటూ పోవడం కథ. వేరే ప్రమోషన్‌ అక్కర్లేదు. సినిమాలో ఇరవై పాటలు ఉన్నాయి! వేరే ప్రమోషన్‌ అక్కర్లేదు. అక్కర్లేదని మనం అనుకుంటే సరిపోయిందా? బాలీవుడ్‌ అనుకోవద్దూ.



జగ్గా జసూస్‌ ప్రమోషన్‌ ఎంత నవ్యంగా ఉందో చూడండి! ‘హలో.. నమస్కార్‌. జగ్గా జాసూస్‌ అనే రోమాంచిత యాత్రకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. (వీడియోలో ఇక్కడ ఫ్లైట్‌ పైకి లేస్తుంది). మీ భద్రత కోసం సీట్‌ బెల్టులు కట్‌ చేసి ఉన్నాయి. రెండు వైపులా బయటికి వెళ్లే ద్వారాలకు తాళాలు వేసి ఉన్నాయి. మీ సెల్‌ఫోన్‌లను, చేతి గాజులను చప్పుడు కానివ్వకండని వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యాత్ర సాగుతున్నంత సేపు కుడి, ఎడమ, పైన, కింద, పక్కన చూసే పని లేదు. ఎందుకంటే పిక్చర్‌ ఇటువైపు (కత్రీనా కైఫ్‌ తన వెనుక వైపు ఉన్న స్క్రీన్‌ని చూపిస్తుంది) నడుస్తుంటుంది కాబట్టి. ధన్యవాద్‌’.



వీడియోలో రణబీర్‌ కపూర్‌ మెగాఫోన్‌తో స్టూల్‌ మీద కూర్చొని ఉంటాడు. పక్కనే కత్రీనా కైఫ్‌ నిలబడి ఉంటుంది. ‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్‌లో..’ అనే స్టయిల్‌లో రణబీర్‌ కపూర్‌ మెగాఫోన్‌లో మాట్లాడుతుంటే, అతడి మాటలకు అనుగుణంగా కత్రీనా కళ్లు తిప్పుతూ, చేతులు కదిలిస్తూ అభినయం చేస్తుంటుంది. సినిమాలో కలిసి నటించాం కదా. చాలు.. అని  ఆగిపోవచ్చు. నిజ జీవితంలో ప్రేమ బ్రేకప్‌ అయింది కదా.. చాలు.. అని అక్కడితో ఆగిపోవచ్చు. కానీ రణబీర్, కత్రీనా అలా ఆగిపోలేదు. సినిమా ప్రమోషన్‌ కోసం ఇంకో సినిమా చేసినంతగా ప్రోమోలు ఇస్తున్నారు. పాత ప్రేమను మర్చిపోయి, కొత్త స్నేహితులుగా సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. ‘సకుటుంబ సమేతంగా మా సినిమా చూడండి’ అని ఇగోలు లేకుండా వీళ్లు ప్రచారం చేస్తున్న ఈ వీడియోను యు.టి.వి. ఫిల్మ్‌ రెండు రోజుల క్రితమే ట్వీట్‌ చేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top