డయాబెటిస్ కౌన్సెలింగ్

డయాబెటిస్ కౌన్సెలింగ్ - Sakshi


షుగర్ ఉంటే పాదాలపై అంత శ్రద్ధ ఎందుకు?

 నా వయసు 65. దాదాపు ఐదేళ్ల క్రితం నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. గుండె పరీక్షలు చేయించుకోడానికి వెళ్లినప్పుడు మా డాక్టర్‌గారు పాదాలను జాగ్రత్తగా చూసుకొమ్మని పదే పదే హెచ్చరించారు. ఆయన ఎందుకంత నిర్దిష్టంగా అడిగారు? వివరించండి.

 - కోటేశ్వరరావు, నరసరావుపేట



 డయబెటిస్ వ్యాధి దీర్ఘకాలంలో శరీరంలోని వివిధ రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తుంది. తొలిదశలో నరాలు మాత్రమే దెబ్బతింటాయి. అప్పుడప్పుడూ కాళ్లు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం జరుగుతుంది. షుగర్ వచ్చిన 5 నుంచి 10 ఏళ్ల తర్వాత పాదాలకు స్పర్శ కోల్పోవడం, దానివల్ల తెలియకుండానే చెప్పులు కాలి నుంచి జారిపోవడం వంటి లక్షణాలు చూస్తాం. వ్యాధి తీవ్రమైతే స్పర్శ చాలావరకు కోల్పోయి కాలికి దెబ్బతగిలినా లేక వేడి వస్తువులు తాకినా నొప్పి తెలియదు. ఇలా నొప్పి తెలియకుండా అయిన గాయాలు, పెద్దవవుతాయి. వీటిని న్యూరోపథిక్ అల్సర్స్ అంటారు. అంటే నరాలు దెబ్బతినడం వల్ల నొప్పి తెలియకపోవడం వల్ల పెరిగిపోయిన పుండు అన్నమాట.



 షుగర్ వ్యాధి పదేళ్ల కంటే ఎక్కువ రోజులు ఉంటే కాలి నరాలతో పాటు రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి ఇంతకు ముందు ఏర్పడ్డ న్యూరోపథిక్ గాయం తగ్గాలంటే నరాలు పునరుత్తేజితం కావాలి. నరాలకు ఈ శక్తి రావాలంటే రక్తప్రసరణ కీలకం. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులలో రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల కరండాలు కూడా శక్తి కోల్పోతాయి. కాలి కండాల నరాలలో బలం, సమతౌల్యత లోపించడం వల్ల పాదం వంకరపోతుంది. ఇలా పాదం వంకరపోయిన చోట ఒత్తిడి పెరిగి పుండు ఏర్పడే అవకాశం ఎక్కువవుతుంది. దీన్నే వైద్యపరిభాషలో చార్‌కాట్ ఫుట్ అంటారు. నరాలు, రక్తనాళాలు... ఈ రెండూ దెబ్బతినడం వల్ల ఏర్పడ్డ పుండును న్యూరోఇస్కిమిక్ అల్సర్ అంటారు. ఇలాంటి న్యూరోపతిక్ అల్సర్లను షుగర్ వ్యాధి వచ్చిన 5 ఏళ్ల నుంచి పదేళ్ల సమయంలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ పరిస్థితి ముదిరి కాలిగాయాన్ని నిర్లక్ష్యం చేస్తే పాదం కుళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కండిషన్‌ను గ్యాంగ్రీన్ అంటారు. ఇది జరిగితే కాలిని తొలగించాల్సిన పరిస్తితి వస్తుంది. అందుకే మీ డాక్టర్ పాదం గురించి శ్రద్ధ తీసుకొమ్మని మరీ మరీ చెప్పారు. షుగర్ వ్యాధి తీవ్రత వల్ల ప్రపంచంలో ప్రతి 20 క్షణాలకు ఒకరు కాలిని కోల్పోతున్నారు. మనదేశంలోనూ షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువసంఖ్యలో పెరుగుతున్నారు. కాబట్టి మీ డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top