భక్తి... ప్రపత్తి... సాధనాలు

భక్తి... ప్రపత్తి... సాధనాలు


ఆత్మీయం

భక్తిని ఎన్నో విధాలుగా ఆచరించవచ్చు గాని, సరైన మానసిక స్థితి, శక్తి, ఓర్పు లేకపోతే ఏ మార్గమూ ఫలించదు.



ఈనాడు మనం జీవితంలో ఎంతో అశాంతిని, అలజడిని, మానసిక ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఇదే పరిస్థితి! ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఏ ముప్పు వాటిల్లుతుందో తెలియదు. మనిషికీ మనిషికీ మధ్య ఎన్నో అడ్డుగోడలు. ఏది మంచి? ఏది చెడు? ఏది  ధర్మం? ఏది అధర్మం? అనే ప్రశ్నలకి సరైన సమాధానం దొరకడం లేదు. అందువల్ల మనందరినీ సృష్టించిన ఆ పరమాత్ముణ్ని భక్తితో నిష్కల్మషమైన మనస్సుతో సేవించి, ఆయన పాద పద్మాలకే, ‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని శరణాగతి చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. సుఖమయమైన, ప్రశాంతమైన పరస్పరం మానవుల మధ్య సహనం, సహకారం, సౌజన్యం, సౌహార్దం కల సాంఘిక జీవనానికి భక్తి – ప్రపత్తి అనేవే సాధనాలనేది ఎవరూ కాదనలేని సత్యం!



‘అయితే మనం భక్తి మార్గాన్ని పాటించాలా? శరణాగతిని చెయ్యాలా?’ అనే సందేహం కలిగినప్పుడు సరైన మార్గాన్ని ఉపదేశించేవారు ఆధ్యాత్మిక గురువు మాత్రమే. భక్తిని ఎన్నో విధాలుగా ఆచరించవచ్చు గాని, సరైన మానసిక స్థితి, శక్తి, ఓర్పు అనేవి లేకపోతే ఏ మార్గమూ ఫలించదు. అటువంటి పరిస్థితిలో – మహావిశ్వాసంతో – మనసా వాచా కర్మణా భగవంతుని శరణు పొందడమే సరైన మార్గం అని మనం గ్రహించాలి.



ఒక వ్యక్తి పైనో, లేక దేవత పైనో, మనకి భక్తి కుదరాలంటే, మనకి ముందుగా వాళ్ల గొప్పదనం (మహాత్మ్యం) తెలియాలి. అప్పుడు మనకి, మిగతా ఎవ్వరిపైన కలగనంత తీవ్రమైన ప్రేమ (స్నేహం) ఎంతో దృఢంగా ఏర్పడుతుంది. అటువంటి మానసిక స్థితికే ‘భక్తి’ అని పేరు. భక్తి లేకపోతే ముక్తి లేదు అనిపెద్దలు నిష్కర్షగా చెప్పారు. ఈ విధంగా ఏర్పడిన భక్తి దినదిన ప్రవర్థమానమై ఉత్కృష్ట దశని చేరుకున్న వ్యక్తిని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. ఆ వ్యక్తికి ఇహం, పరం ఆనందమయం అవుతాయి. ‘అటువంటి భక్తుడి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి  మాట ఇచ్చినట్లు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు, అటువంటి వారు భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తానని కూడా చెప్పాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top