అలా... నా అల్లరి తగ్గింది!

అలా... నా అల్లరి తగ్గింది! - Sakshi


కనువిప్పు

 

సినిమాల్లో లెక్చరర్‌లను స్టూడెంట్లు ఆటపట్టించే దృశ్యాలను చూసీచూసీ... తెలియకుండానే వాటి ప్రభావానికి లోనయ్యాను. క్లాసులోకి లెక్చరర్ రావడమే ఆలస్యం... ఏదో ఒక జోక్ పేల్చేవాడిని.

 అమ్మాయిలు నవ్వడంతో మరింత రెచ్చిపోయేవాడిని.

 కొన్నిసార్లు బ్లాక్‌బోర్డ్  మీద ఏవో రాతలు రాసేవాడిని.

 మా కెమిస్ట్రీ లెక్చరర్‌కు  ‘విషయం ఏమిటంటే...’ అనేది ఊతపదం. పాఠం చెబుతున్నప్పుడు చాలా సార్లు ‘విషయం ఏమిటంటే..’ అనేవారు. కెమిస్ట్రీ లెక్చరర్ రావడానికి ముందు  నేను బ్లాక్‌బోర్డ్‌పై- ‘విషయం ఏమిటంటే... రేపు ఆదివారం. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి’ అని రాశాను. ఇది చూసి క్లాసంతా విరగబడి నవ్వింది. వారు నవ్వుతుంటే నేనేదో గొప్ప పని చేసినట్లు గర్వంగా ఫీలయ్యేవాడిని. ఆ రోజు కెమిస్ట్రీ మాస్టారు చిన్నబుచ్చుకున్నారు. ఆయన కళ్లలో బాధ కనిపించింది.

 కాలేజీలో కొత్తగా చేరిన ఒక లెక్చరర్, నా మీద ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.

 ‘‘కాలేజీలో ఇలాంటి చిలిపి పనులు  కామన్. నువ్వు మాత్రం  నీ కాలేజీ రోజుల్లో చేయలేదా ఏమిటి! టేకిట్ ఈజీ’’ అని ప్రిన్సిపాల్ కెమిస్ట్రీ లెక్చరర్‌తో అనడంతో నేను మరింత రెచ్చిపోయాను. ప్రతి సంవత్సరం గురుపూజోత్సవం  సందర్భంగా స్టూడెంట్లే లెక్చరర్‌ల పాత్ర పోషించేవారు. తోటి విద్యార్థులకు క్లాసులు తీసుకునేవారు. బాగా బోధించిన వారికి మంచి బహుమతి ఉండేది. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని నేను మ్యాథ్స్ లెక్చరర్ అయ్యాను. క్లాసులో అడుగుపెడుతున్నప్పుడు గుండెలు దడదడలాడాయి. ‘‘నాకు భయం ఏమిటి?’’ అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని క్లాసులోకి అడుగుపెట్టాను.

 క్లాసులో స్టూడెంట్స్ నా మీద వేసిన జోక్‌లు ఇన్నీ అన్నీ కావు. హడావుడిగా క్లాసు ముగించాను. క్లాసు నుంచి బయటికి రాగానే అవమాన భారంతో ఒళ్లంతా చెమటతో తడిసింది.

 ‘ఒక్కరోజు క్లాసుకే నేను ఇంత ఫీలై పోతే...రోజూ వచ్చే లెక్చరర్‌లు ఎంత ఫీలైపోతున్నారో’ అనే కోణంలో ఆలోచించి నా తప్పును నేను తెలుసుకున్నాను. ఇక, ఆ తరువాత నుంచి క్లాస్‌లో ఎప్పుడూ, ఏ లెక్చరర్ మీదా కామెంట్ చేయలేదు.

 

- జె.కె, కాకినాడ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top