డేటా సైంటిస్ట్..నవ యువ కెరీర్..

డేటా సైంటిస్ట్..నవ యువ కెరీర్..


కార్పొరేట్ కెరీర్‌గా ఐదేళ్ల క్రితం ఆవిర్భవించి... ఆకాశమే హద్దుగా అవకాశాలు కల్పిస్తూ.. నేటి యువత.. ‘హాట్ ఫేవరెట్ జాబ్స్’ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉద్యోగం.. డేటా సైంటిస్ట్. అంకెలు, సంఖ్యల పట్ల ఆసక్తి, విశ్లేషణ నైపుణ్యం.. విభిన్న గణాంకాలను క్రోడీకరించే సామర్థ్యం ఉన్నవారికి ఉన్నత శిఖరాలు అధిరోహిం చేందుకు వీలు కల్పించే కెరీర్. ‘డేటా సైంటిస్ట్’..  ఈ పదం వినడానికి, చదవడానికి కొంత గంభీరంగా ఉన్నప్పటికీ సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇంటర్నెట్ యుగంలో ఆన్‌లైన్ వినియోగం విస్తృతమైన ప్రస్తుత పరిస్థితుల్లో.. సంస్థలకు తప్పనిసరిగా మారి, యువతకు పుష్కల అవకాశాలు కల్పిస్తున్న ‘డేటా సైంటిస్ట్’ కెరీర్‌పై ఫోకస్..

 

 డేటా సైంటిస్ట్ అంటే?




 కార్పొరేట్ ప్రపంచంలో వందల సంఖ్యలో సంస్థలు, ఆయా కంపెనీల నుంచి లెక్కకు మించి ఉత్పత్తులు. అన్నిటిలక్ష్యం ఒక్కటే. అదే.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు, సేవలు అందించడం ద్వారా వారి మనసులు గెలుచుకోవడం! ఇందుకోసం విభిన్న వర్గాల వినియోగదారులు, మారుతున్న వారి అవసరాలు, అభిరుచులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి,క్రోడీకరించి, వర్గీకరించడం.. వీటి ఆధారంగా విశ్లేషణలు, సూచనలు, సలహాల తో కూడిన నివేదికలను రూపొందించి సంస్థకు అందించడం.. ఇవి స్థూలంగా డేటా సైంటిస్ట్ ప్రధాన విధులు.

 

ఈ-కామర్స్‌కు కీలకంగా



ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ జోరు కొన సాగుతోంది. వినియోగదారుల్లో అధిక శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సంస్థలకు కస్టమర్ల గురించి నేరుగా తెలుసుకునే అవకాశం ఉండదు. ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వినియోగదారులు స్వయంగా వెల్లడించే వివరాలు మాత్రమే సేవలందించే క్రమంలో కంపెనీలకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే డేటా సైంటిస్ట్ సేవలు ఈ-కామర్స్ సంస్థలకు ఎంతో కీలకంగా మారాయి. డేటా సైంటిస్ట్‌లు వినియోగదారులు నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తూ.. వాటి ఆధారంగా సంస్థకు అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి అందిస్తారు. కస్టమర్స్‌ను కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కస్టమర్‌కు సంబంధించి సానుకూల, ప్రతికూల అంశాలను తెలియజేస్తారు. అంతేకాకుండా ఆన్‌లైన్ షాపింగ్‌లో వారు అనుసరిస్తున్న అన్ని అంశాలను పరిశీలిస్తారు. పేమెంట్ విధానాలు, చెల్లింపుల పరంగా గతంలో చేసిన పొరపాట్లు వంటివి. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తున్న వినియోగదారులు చేస్తున్న తప్పులు, వాటివల్ల సంస్థకు కలిగే పర్యవసానాలను అంచనా వేస్తారు.

 

 లక్షల్లో కొలువులు



 ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ కొలువులు లక్షల్లోనే ఉన్నట్లు అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి బిగ్ డేటా మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. మన దేశంలో వచ్చే పదేళ్లు ప్రస్తుతం కంటే 60 రెట్లు పెరగనుంది. మానవ వనరుల కోణం లోనూ దేశంలో వచ్చే రెండేళ్లలో లక్షల్లో డేటా సైంటిస్ట్‌ల అవసరం ఏర్పడనుంది. మెకిన్సే నివేదిక ప్రకారం- 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.4 మిలియన్ డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంది.

 భారత్‌లో ఆ సంఖ్య రానున్న రెండేళ్లలో రెండు లక్షలకు పైమాటే.  జిగ్వాస్ అకాడమీ రిపోర్ట్ ప్రకారం- భారీ వేతనాలతోపాటు ఎంట్రీ

 లెవల్‌లోనే 12 లక్షల వార్షికాదాయం అందుకోవచ్చు. ఇప్పటికే ఈ విభాగంలో మానవ వనరుల డిమాండ్-సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. మొత్తం అవసరాల్లో 20 శాతం మంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు.

 

 అన్ని రంగాలు.. విభాగాల్లోనూ అవసరం


డేటా సైంటిస్ట్‌ల అవసరం కేవలం టెక్నికల్ విభాగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికే పరిమితం కాదు. ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో (ఉదా:హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్) కూడా డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంటుంది. కంపెనీల్లో ఉద్యోగుల వివరాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమాచార క్రోడీకరణ, విశ్లేషణలో కూడా డేటా సైంటిస్ట్‌లదే కీలక పాత్ర. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలోనూ ఇటీవల కాలంలో డేటా సైంటిస్ట్‌లు ప్రాధాన్యతను పొందుతున్నా రు. అంతేకాకుండా జాతీయస్థాయిలో సాగుతున్న ఆధార్ నమోదులోనూ డేటా సైంటిస్ట్‌లు ప్రధాన పాత్ర పోషించారు. నమోదు చేసుకున్న వ్యక్తుల వివరాలను విభిన్న కేటగిరీలుగా(పాన్ కార్డ్ నెంబర్లు, రేషన్ కార్డ్ నెంబర్లు తదితర) ఒక చోట సంక్షిప్తం చేయడంలో విశేషంగా పనిచేశారు. అంటే.. వినియోగదారుల సంఖ్య అధికంగా ఉండే ప్రతి రంగంలో, విభాగంలో డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉంటోంది.

 

లక్షల్లో వేతనాలు


డేటా సైంటిస్ట్‌లకు వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి.  ఇతర ఐటీ ఉద్యోగాలతో పోల్చితే డేటా సైంటిస్ట్‌లు సగటున 30 నుంచి 40 శాతం మేర అధికంగా జీతాలు అందుకుంటున్నారు. ప్రారంభంలో డేటా సైంటిస్ట్‌గా కనీసం రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం ఖాయం.

 

 అకడమిక్ అర్హతలివే




 డేటా సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి అకడమిక్‌గా మూడు ముఖ్యమైన అర్హతలు అవసరం. అవి.. మ్యాథమెటికల్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్. అంతమాత్రాన ఇవి.. ఆయా విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి డిగ్రీలు చేసినవారికే అనే అభిప్రాయం కూడా అపోహే. ఈ అంశాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నైపుణ్యాలతోనూ డేటా సైంటిస్ట్‌గా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అయితే అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉంటే.. వేతనాలపరంగా కొంత ముందంజలో ఉంటారు. ఈ క్రమంలో పీజీ స్థాయిలో మ్యాథమె టిక్స్, స్టాటిస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు చేయడం ఉపయుక్తం అనేది నిపుణుల అభిప్రాయం. వీటితోపాటు స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్, ఏ్చఛీౌౌఞ వంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందితే మరింత మెరుగైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

 

పెరుగుతున్న అవగాహన




జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని అకడమిక్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు డేటా సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ సంబంధిత కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. అవి..

 

 ఐఐఎం - రాంచీ (http://www.iimranchi.ac.in)

 కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్.

 

 ఐఐఎం- కోల్‌కతా (https://www.iimcal.ac.in)

 కోర్సు: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్.

 

 ఐఎస్‌బీ- హైదరాబాద్ (http://www.isb.edu)

 కోర్సు: బిజినెస్ అనలిటిక్స్.

 

 ఐఐఎస్సీ- బెంగళూరు, (http://www.iisc.ernet.in)

 కోర్సు: బిజినెస్ అనలిటిక్స్‌లో పీజీ.

 

 వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (http://vit.ac.in)

 కోర్సు: విస్టా-డేటా సైంటిస్ట్ (విప్రోతో కలిసి సంయుక్తంగా)                     

 

 మనదేశంలోని కొన్ని డేటా సైన్స్ శిక్షణ సంస్థల వివరాలు..


 జిగ్వాస్ అకాడమీ- బెంగళూరు

 వెబ్‌సైట్: www.jigsawacademy.com

 

 ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ - హైదరాబాద్


 వెబ్‌సైట్: www.insofe.edu.in/

 

 ఎడ్వాన్సర్ ఎడ్వెంచర్స్ - ముంబై

 వెబ్‌సైట్: www.edvancer.in

 

 అనలిటిక్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - బెంగళూరు

 వెబ్‌సైట్: www.analyticstraining.in

 

స్టాటిస్టిక్స్ అనుభవంతో మరిన్ని అవకాశాలు

 

ప్రస్తుత సమాచార విప్లవం నేపథ్యంలో ప్రతి సంస్థలోనూ డేటా సైంటిస్ట్‌ల ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్ దిశగా కదులుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడేళ్లలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రాను న్నాయి. స్టాటిస్టిక్స్‌లో పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు ఉంటే డేటా సైంటిస్ట్‌గా కెరీర్‌లో అద్భుతంగా రాణించొచ్చు. అన్నిటి కంటే ముఖ్యంగా కంప్యూటరైజేషన్ ద్వారా గిగా బైట్లలో ఉండే సమాచారం నుంచి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కచ్చితమైన సమాచారాన్ని అన్వేషించి, క్రోడీకరించే క్రమంలో ఎంతో ఓర్పు అవసరం. ఈ లక్షణాలు ఉంటే డేటా సైంటిస్ట్ కెరీర్ బాగుంటుంది.

 - ప్రొఫెసర్ ఎ. అప్పారావు, డెరైక్టర్,  సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్,  స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్

 

 సేవారంగంలో పుష్కల అవకాశాలు



డేటా సైంటిస్ట్‌లకు బ్యాంకింగ్, ఈ-కామర్స్, టెలికాం, బీపీఓ తదితర కస్టమర్ సర్వీస్ సెక్టార్‌లలో పుష్కల అవకాశాలు లభిస్తున్నాయి. కారణం.. వీటన్నిటి కార్యకలాపాలు వినియోగ దారుల అభిరుచులకు చెందినవి కావడం. ఆ క్రమంలో వారికి సంబంధించిన విస్తృత సమాచారాన్ని వర్గీకరించి, క్లుప్తంగా క్రోడీకరించడం సంస్థ మనుగడకు ఎంతో ముఖ్యమైనది. వాటిపై శిక్షణ పరంగా నైపుణ్యాలు అందించే కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు డేటా సైన్స్‌లో ఉంటాయి. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్‌లు బిజినెస్ అనలిటిక్స్‌లో భాగంగా డేటా సైన్స్‌లో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. కానీ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ విషయంలో డేటా సైన్స్‌ను కోర్ సబ్జెక్ట్‌గా శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది.

 -డాక్టర్ క్రాంతి మిత్ర అడుసుమిల్లి,   సీనియర్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top