నా అక్షరాలు దళిత ఔన్నత్య పతాకలు!

నా అక్షరాలు దళిత ఔన్నత్య పతాకలు!


సంభాషణ

 

తెలుగు సాహిత్యంలో దళితవాదానికి శ్రీకారం చుట్టిన కవి సతీష్‌చందర్. ఆయన కవితా సంపుటి  ‘పంచమవేదం’ వివిధ భాషల్లోకి అనువాదమవడమేగాక వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథం కూడా. కవిత్వంతో పాటు కథలలో కూడా సుదీర్ఘకాలంగా దళిత జీవితాన్ని చూపుతున్న ఆయన తాను రచించిన 16 కథలతో ఇటీవల ‘సిగ్గు’ కథాసంపుటి విడుదల చేశారు! ఈ నేపథ్యంలో ఒక సంభాషణ:

 

ఆ సూసైడ్ నోట్ నుంచే...


 

1970లలో విప్లవ సాహిత్య ప్రభావంతో అందరూ కలం పట్టినట్టే నేనూ కలం పట్టాను. అయితే ‘కారంచేడు’ ఘటన కులస్పృహను కలిగించింది. అంతకు క్రితం వరకూ గ్రామాల్లో సంఘర్షణలను ‘భూస్వాములు-కూలీల’ సంఘర్షణగా మాత్రమే ఉదహరించేవారు. ఇప్పుడు ‘భూస్వామ్యకులాలు-దళిత కులాలు’ అని ప్రస్తావనకు వచ్చాయి. అంటే వర్గం పక్కన కులం చేరింది. కుల అధ్యయనంలో దళితుడు ధనికుడైనా అస్పృశ్యత ఉంటుందని తెలుసుకున్నాను. దళితుడు తన ప్రమేయంలేని పుట్టుకతోనే వెలికి గురయ్యే సమాజం ఇదనే అర్థమయ్యాక ఆ ఉద్వేగం లోంచి కవిత్వం పుట్టింది. అప్పుడే విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో బాలాజీ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటనను ఒక జర్నలిస్ట్‌గా కవర్ చేస్తున్నప్పుడు అతడి ‘సూయిసైడ్ నోట్’ నన్ను గాయపరచింది. ‘చుండూరు’ సంఘటన పెనుమార్పు తెచ్చింది. ఇక ఏం రాయాలో తెలిసొచ్చింది.

 

ముఖాసా ‘దారి’



విశాఖ ఏజెన్సీలో న్యెల్లిపూడి ప్రాంతం తొలికథకు ‘దారి’ చూపింది. ఏజెన్సీలో బ్రిటిష్ (దేశీయ) సైన్యపు అకృత్యాలపై అల్లూరి సీతారామరాజు కంటే ముందు పోరాడిన వ్యక్తి ఒకడున్నాడు. అతడి పేరు ద్వారబందాల చంద్రయ్య. చంద్రయ్య ఆరణాల కూలీ. అతడి గురించి రీసెర్చ్ చేయడానికి రిపోర్టర్‌గా వెళ్లినప్పుడు చాలా సంగతులు తెలిశాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన సైనికులను చంద్రయ్య గొడ్డలితో నరికేసేవాడట. బ్రిటిష్‌వారికి దొరక్కుండా అడవిలో దాక్కునేవాడట. అయితే చివరకు దొరికిపోయాడు. చంద్రయ్యను పట్టిచ్చిన వ్యక్తికి బ్రిటిష్ ప్రభుత్వం వేల ఎకరాల భూమిని ‘మఖాసా’గా ఇచ్చింది తరతరాలుగా శిస్తు వసూలు చేసుకుని జీవించమని. చాలా ఏళ్ల తర్వాత ఆ భూమిని ఆక్రమించుకుని రైతుకూలీలు సేద్యం చేస్తున్నారు. ఇదంతా తెలుసుకుంటూ ఎనభై ఏళ్ల కూలీని ప్రశ్నించాను- నీవేం చేస్తుంటావు అని? ‘దారి తీస్తుండేవాడినయ్యా’ అన్నాడు. చంద్రయ్యను పట్టి ఇచ్చిన వ్యక్తి వారసులైన మఖాసా ఆసాములు బండ్లపై వెళ్తోంటే కాళ్లకు గోనె సంచులు కట్టుకుని గోచిపేలికతో పరుగెడుతూ దారి తీసేవాడన్నమాట. కులం-వర్గం మిళితమైన ఈ వైనం తొలి కథకు బీజం వేసింది. అదే ‘దారి’గా మారి  చైతన్యవే దిక ప్రచురణ ‘రచన’లో అచ్చయ్యింది. ఒకసారి పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన డిగ్రీ చదివే దళిత యువతి సెలవుల్లో పొలానికి వెళ్లింది. ఆరేడు తరగతులతో డిమ్కీకొట్టిన రాజులబ్బాయి అత్యాచారం చేయబోయాడు. పెద్దలందరూ రాజులపెద్దలకు ఫిర్యాదు చేస్తే ‘రాచోడు అడగడమే గౌరవం. కాదంటుందా ఆ పిల్ల’ అని ప్రతీకారానికి పూనుకున్నారు. ఇలాంటి ఉదంతాలే నా కథలకు బీజాలు.

 

లేనివారిని కోల్పోమంటే ఎలా?



వామపక్ష రాజకీయాలు డీ-క్లాసిఫై కమ్మంటాయి. ఉన్నది కోల్పోవాలంటాయి. ఎవరు కోల్పోవాలి? ఉన్నవారు కదా? కులం ఉన్నవారు, ధనం ఉన్నవారు, డాబూ దర్పం ఉన్న వారు కోల్పోవాలి. ఏమీ లేనివారితో మమేకం కావాలి. ఏమీ లేనివారు ఏమి కోల్పోతారు? కోల్పోయినవి పొందాలి కదా. అంబేద్కర్ సూటూబూటుకు గాంధీ గోచీకి సాంస్కృతిక కారణాలున్నాయి. ‘స్తంభానికి జెండా ఎగరడం కాదు. అంటరాని మనిషి ఒంటి మీద వస్త్రం రెపరెపలాడడమే తిరుగుబాటు’ అని ‘సిగ్గు’ కథ ద్వారా చెప్పాను. నా రచనలు దళితులను లేదా మహిళలను కించపరచవు. వారి ఔన్నత్యాలను చాటుతాయి! ‘కథాసాహితి’ తన 20 ఏళ్ల వార్షిక సంకలనాల్లోంచి ఎంపిక చేసి ప్రచురించిన కథాసంకలనంలో ‘సిగ్గు’ చోటు చేసుకుంది. దళిత సౌందర్యానికి ఈ కథ నిర్వచనంగా సంపాదకులు అభివర్ణించారు. దళితులు ఊరికి వెలి అయితే మహిళ కుటుంబంలో బందీ. వాస్తవానికి ‘గాయమే హృదయం’ అని స్వాంతన పరచే వెలిగారాలను స్వాగతిస్తూ ‘డాగ్ ఫాదర్’ కథ రాశాను. పతంజలి వీరబొబ్బిలిలో ఆర్థిక కోణం ఉంటే ‘డాగ్ ఫాదర్’లో మానవీయకోణం ఉందన్నారు విమర్శకులు.

 

దళిత జీవితం వేయి కోణాల వజ్రం



నేను పూర్ణుడను. నీవు అపరిపూర్ణుడవు. పుట్టుక చేత, కులం చేత, మతం చేత, జెండర్ చేత నీలో వెలితి ఉంది అని మనుషులను అమానవీయంగా వెలివేసిన సమాజం నా ప్రత్యర్ధి.  దళితులను వాడకు, మహిళలను దేహానికి ఆవల ‘వెలి’ వేసిన సమాజమా వెలితి నీలో ఉంది, వెలి వేయబడిన జీవితాలు నీలా పరాధీనాలు కావు. బహుముఖాలు. సమస్తవృత్తులతో సౌందర్యాలతో వేయి కోణాలతో వికసించే వజ్రాలు  అని గుర్తింపజేయడం, ఆ కాంతులను ప్రతిఫలింపజేయడం నా రచనల ఉద్దేశ్యం. బ్లాక్స్ వలె- మరాఠీ, కన్నడ, తమిళ సోదరుల వలె- స్వీయచరిత్రాత్మక కథనాలతో నవీన నవలలు దళితుల నుంచి తెలుగులో రావాల్సి ఉంది. ప్రస్తుతం నాలో రూపొందుతోన్న నవలను దర్శిస్తున్నాను!

 

- పున్నా కృష్ణమూర్తి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top