దీపావళి నూలు వెలుగులు

దీపావళి నూలు వెలుగులు


దివ్వెల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోవాలి...

 బాణాసంచా మెరుపులలో తారల్లా తళుక్కుమనాలి...

 అమావాస్య చీకటిలో

 నిండు పున్నమిని తలపించాలి...

 మేని ముస్తాబు విషయంలో

 అతివల ఆలోచన పండగ వేళ ఇలాగే ఉంటుంది.  

 పండగకు కొత్త వెలుగులు నింపడానికి సాధారణంగా రంగు రంగుల దుస్తుల ఎంపికకు పోటీపడుతుంటారు. నెటెడ్, జార్జెట్, బెనారస్, పట్టు, సిల్క్.. ఇలా అన్నీ మెరిసిపోయే వస్త్రాలతో మేనికి వన్నెలద్దుతుంటారు. ఇందుకు మగవారూ మినహాయింపు కాదు. పట్టు షేర్వాణి లేదా లాల్చీ ధోవతితో కొత్తగా కనిపించాలనుకుంటారు. అయితే, దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చే ఈ పండగ వేళ రెట్టింపు ఆనందాన్ని నట్టింటికి తేవాలంటే మగువలకైనా, మగవారికైనా

 రక్షణ చర్యలు తప్పనిసరి.

 అందమైన దుస్తులు అనుకోకుండా దీపాలకు తగిలినా... వెలుగులు విరబూసే చిచ్చుబుడ్లు, మిరుమిట్లు గొలిపే భూచక్రాలు పొరపాటున చీర అంచులకో, పరికిణీ, ఓణీలకో అంటుకున్నా ప్రమాదమే! అందుకే, సురక్షితంగా దీపావళి జరుపుకోవడానికి డ్రెస్ డిజైనర్లు అందిస్తున్న ప్రధాన సూచనలు ఇవి.

 వీటిని పాటిస్తే పండగ సంబరం రెట్టింపు కాదా మరి!


 

నూరు శాతం కాంతి...



ఈ పండగ వేళ నూలు వస్త్రాలు ధరించడం వల్ల రెండు విధాల మేలు కలుగుతుంది. మనదైన చేనేత దుస్తుల వల్ల హుందాతనపు నిండుతనం కలుగుతుంది. ప్రమాద భయమూ దరిచేరదు. అందుకే, కాటన్ దుస్తులకే ఓటేద్దాం!

 

 పిల్లలకు ప్రత్యేకం...

 

 పిల్లలకు బాణాసంచా అంటే అమితమైన ఇష్టం. ముద్దుగా ఉండే వారిని మరింత అందంగా తయారుచేయడానికి రకరకాల వస్త్రాలంకరణ చేస్తుంటారు పెద్దవారు. అయితే పిల్లలను పండగ వేళ నూటికి నూరు శాతం కాటన్ వస్త్రాలతో అలంకరించడం మేలు. కాటన్‌లోనూ బాందినీ ప్రింట్లు గలవి, రంగు రంగులున్నవి, అద్దాలు, చమ్కీలు, కుందన్స్‌తో కలిపి డిజైన్ చేసినవి లభిస్తున్నాయి. ఈ తరహా దుస్తులను పిల్లల ముస్తాబుకు కేటాయించాలి. అనువైన వస్త్రాలను ధరించి అత్యంత సురక్షితంగా.. దివ్వెల దీపావళిని అంతా ఆనందంగా జరుపుకోవాలి.

 

 ఎక్కువ కుచ్చులున్నవి వద్దు!


 

 అమ్మాయిల నుంచి అమ్మల దాకా ఇటీవల కాలంలో అతివలంతా డిజైనర్ లంగా ఓణీలు ధరిస్తున్నారు. ఇవి నెటెడ్‌వి కావడం, పెద్ద కుచ్చులతో విప్పార్చుకున్నట్టు ఉంటాయి. చూడటానికి ఇవి అందంగా, ఆకర్షణీయంగా కనిపించినా త్వరగా నిప్పు రవ్వలకు అంటుకునే అవకాశం ఉంటుంది. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలంటే ఈ తరహా మెటీరియల్ వస్త్రాలంకరణకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

 

ధోతీ... ఆల్ ఇన్ వన్...


నూలు వస్త్రాలతో పండగ కాంతి ఎలా.. అని ఆలోచించేవారికి ఎన్నో నూతన మార్గాలున్నాయి. అందులో ధోతీ స్టైల్ ప్యాంట్స్ ముఖ్యమైనవి. ఇవి పిల్లలకు, ఆడ, మగ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏ వయసు వారైనా వీటిని ధరించవచ్చు. స్త్రీలు ధోతీ ప్యాంట్ లేదా హారెమ్ ప్యాంట్ ధరించి పైన షార్ట్ కలర్‌ఫుల్ కుర్తీ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. పటియాల మాదిరి ఉండే ఈ ధోతీ ప్యాంట్స్ విభిన్న మోడల్స్‌లో లభిస్తున్నాయి. టపాసులు కాల్చేటప్పుడు వాటి వల్ల ప్రమాదం కలుగుతుందేమో అనే భయమూ ఎక్కువ ఉండదు. మగవారు ధోతీ ప్యాంట్ ధరించడం వల్ల సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, స్టైల్‌గా ఉండవచ్చు. పైన పొడవాటి లాల్చీ ధరించవచ్చు. పిల్లలకూ ఈ తరహా దుస్తులు లభిస్తున్నాయి.

 

- నిర్మలారెడ్డి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top