పుల్ల ఐస్‌... కలర్‌ సోడా

పుల్ల ఐస్‌... కలర్‌ సోడా


హ్యూమర్‌ ప్లస్‌

చిన్నప్పుడు ఎండాకాలమొస్తే మహా సంబరం. చెప్పులు లేవనే విషయం కూడా గుర్తుండేది కాదు. మా వూరికి రెండు ఐస్‌బళ్లు అతిథులుగా వచ్చేవి. ఎక్కడో గోదావరి జిల్లాల నుంచి కర్ణాటక సరిహద్దుల్లోని రాయదుర్గానికి ఇద్దరు అన్నదమ్ములు బతకడం కోసం వచ్చి మూడు నెలలుండేవాళ్లు.



మూడు చక్రాల బండి తోసుకుంటూ, గంట మోగిస్తూ వాళ్లు వస్తే ఇళ్లలోని చిల్లర డబ్బులన్నీ మాయమయ్యేవి. బండిలో రంగురంగుల ద్రవాలుండేవి. అవన్నీ శాకరీన్‌ నీళ్లని తెలియదు మాకు. ఐస్‌ గడ్డని తురిమి, రంగు నీళ్లు చల్లి ఇస్తే ఐదు పైసలు. షర్బత్‌ పది పైసలు. అరిచి గీపెట్టినా పైసా పుట్టని కాలమది. కాకపోతే దేవుడనేవాడు వుండేవాడు. వాడి ముందు ఒక మట్టి హుండీ వుండేది. హెయిర్‌ పిన్‌తో డబ్బుల్ని ఎలా బయటికి తీయాలో తెలిసిన విద్య కావడంతో నాకు కాస్త జరుగుబాటు వుండేది. దేవుడి గది, హుండీలు లేనివాళ్ల పరిస్థితి ఘోరంగా వుండేది.



ఇవికాకుండా పుల్ల ఐస్‌క్రీమ్‌ వుండేది. అరగంట చప్పరించినా కరిగేది కాదు. చివరికి కటకటమని సౌండ్‌ చేస్తూ కొరకాల్సిందే. మీగడలాంటి ఐస్‌క్రీం ఒకటి ప్రపంచంలో వుంటుందని తెలియనంత అజ్ఞానం మాది.



నిమ్మకాయ సోడా, నన్నారి, కలర్‌ సోడా దొరికేవి. సోడా కొడితే కుయ్యోమని సౌండొచ్చేది. తాగిన తరువాత అంతకుమించి సౌండ్‌. గ్యాస్‌ పవర్‌ మరి. «థియేటర్లలోకి సోడాల వాళ్లు వచ్చి ‘సోడాసోడా’ అని అరిచి అమ్మేవాళ్లు. సినిమా మ్యూజిక్‌కి సోడా సౌండ్‌ అదనం. సినిమాల్లో తప్ప వూళ్లలో ఇంకా కూల్‌డ్రింక్‌లు కనపడని కాలం.



సమ్మర్‌లో కర్బూజ, పుచ్చకాయలొచ్చేవి. జుమ్మని ముసిరే ఈగల్ని తోలుకుంటూ తినేవాళ్లం. అప్పటి పుచ్చకాయ రుచి ఇంకా నోట్లో నానుతూనే వుంది. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా పుచ్చకాయలు దొరుకుతాయి. రంగుంటుంది, విత్తనాలు అడ్డుతగలవు, కానీ రుచి ఎక్కడికి మాయమయ్యిందో తెలియదు.



ఎండల్లో అన్నింటికంటే ఇష్టమైంది ఈత. రాకపోయినా దూకేసి తొందరగా పరలోకానికి వెళ్లిపోతానని భయపడి, ఇంట్లోవాళ్లు ఈత నేర్పించారు. మునగబెండ్లు వీపుకి కట్టి వదిలారు. ఈత రాలేదు. మోకుని నడుముకి కట్టి వదిలారు, రాలేదు. చివరికి ఏమీ లేకుండా బావిలోకి తోశారు, వచ్చేసింది. ఈతంటే ధైర్యమే!



ఇక ఉగాదికల్లా మామిడికాయలు వచ్చేసేవి. మెల్లిగా కాయలు పళ్లయ్యేవి. ఇప్పటిలాగా కార్బయిడ్‌ లేదు కాబట్టి ప్రతి పండూ రుచే. టెంకని తినడానికి వీల్లేదు కాబట్టి వదిలేసేవాళ్లం.



ఎండాకాలంలో అదృష్టం ఏమంటే స్కూలుండదు. కానీ నాలాంటి దురదృష్టవంతులకి ట్యూషనుండేది. అందువల్ల తరచూ కడుపు నొప్పి, జ్వరం వచ్చేవి. ట్యూషన్‌ టైం దాటిపోగానే అవి నిమ్మళించేవి.



సమ్మర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఏమంటే జాతర్లు. రంగురంగుల కళ్లద్దాలతో లోకాన్ని చూస్తే కలర్‌ఫుల్‌గా వుండేది. గోపికలు లేకపోయినా పిల్లంగోవుల మోత వినిపించేది. చిన్న రంగులరాట్నాలు చేత్తో తిప్పితే తిరిగేవి. చిల్లర డబ్బులు కాజేయడానికి పులి మేక జూదముండేది. కాశీపట్నం చూడరబాబూ అని ఒక ముసలాయన భూతద్దంలోంచి ప్రపంచాన్ని చూపించేవాడు. జాతర నుంచి ఇంటికొస్తున్నప్పుడు ఒక ఆప్తుణ్ని వదిలేసి వస్తున్నట్టు అనిపించేది.



జీవితంలో బాల్యం ఒక మంచికాలం. అది పోయిన తరువాత అన్ని కాలాలు ఒక్కలాగే వుంటాయి. ఏసీలో వున్నా కానుగచెట్టు నీడ గురించే కలలు కంటూ వుంటాం. – జి.ఆర్‌.మహర్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top