పెళ్లయ్యాక ప్రేమలో పడ్డాం...


 ‘‘పెళ్లయ్యాకే నేను ప్రేమలో పడ్డా’’ అంటున్నారు నటుడు అలీ. ఆయనే కాదు, ఆయన భార్య కూడా అదే మాట చెబుతున్నారు. జుబేదా బేగంతో ఆయన పెళ్లయి ఇప్పటికి ఇరవయ్యేళ్లు. ఇన్నేళ్ల సంసార జీవితంలో చిన్ని చిన్ని అలకలు, చిరు కోపాలు సర్వసాధారణమంటున్నారు జుబేదా. అవి ఉంటేనే మజా అని అలీ చెప్పారు. మొత్తానికి ‘మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘మేమిద్దరం.. మాకు ముగ్గురు’’ అంటూ, తమ దాంపత్య జీవితపు ముచ్చట్లను ఈ భార్యాభర్తలు ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా పంచుకున్నారు.

పెళ్లి రోజే ఆమెను చూశా!


అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే మనువాడాలన్నది అలీ ఆశయం. తమ మాట కాదనడనే నమ్మకంతోనే అలీ అమ్మా, నాన్న తమకు నచ్చిన ఓ అమ్మాయిని కోడలిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆ పిల్ల గురించి కొడుక్కి చెప్పారు. ‘‘అప్పట్లో నేను మద్రాసులో బిజీ ఆర్టిస్ట్‌ని. సినిమా తారలుగా మమ్మల్ని ఇష్టపడేవాళ్లు, పెళ్లాడతామనే వాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అమ్మా నాన్న చూసిన అమ్మాయినే పెళ్లాడాలనుకున్నా. అలాగే ఒక అమ్మాయిని వాళ్లు చూశారు. ఆమే జుబేదా బేగం. ‘ఈ అమ్మాయి చాలా బాగుంది. నాకూ, నాన్నకు నచ్చింది’ అని ఫోన్‌లో చెప్పింది అమ్మ. నేను అమ్మాయిని చూడకుండానే, ‘ఓకే’ అన్నా. పెళ్లి నాడే నా భార్యను చూశాను’’ అని భార్య కళ్లల్లోకి కొంటెగా చూస్తూ అలీ ఆ సంగతులు చెప్పుకొచ్చారు.  

 

 అలీతో పెళ్ళికి కారణం ఆయనే!



పెళ్లి నాటి విశేషాలను జుబేదా గుర్తు చేసుకుంటూ, ‘‘నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఎందుకంటే మా పెదనాన్న ఇర్షాద్‌గారు అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలకు కాస్ట్యూమర్‌గా పని చేసేవారు. షూటింగ్‌లు చూడడం కోసం ఆయనతో పాటు అప్పుడప్పుడూ నేను వెళ్లేదాన్ని. అక్కడ ఏ ఆర్టిస్ట్ కనిపించినా ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో పాటు, ఫొటోలు కూడా దిగేదాన్ని. కానీ, ఓ సినిమా ఆర్టిస్ట్‌తో పెళ్లవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సంబంధం రావడానికి కారణం కూడా మా పెదనాన్నగారే. ‘నేనా కుర్రాణ్ణి చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. చాలా మంచోడు’ అని ఆయనే మా అమ్మా నాన్నలతో చెప్పారు. ఆ విధంగా అలీ నా జీవితంలోకొచ్చారు. లెజెండ్ లాంటి ఆర్టిస్ట్ నాకు భర్తగా దొరికేలా చేసిన మా పెదనాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు.

 

 మా పెళ్లైన కొత్తలోనే ఆవిడ ఆ మాట చెప్పింది!



పెళ్లయ్యే నాటికే అలీ ఫుల్ బిజీ. ఎంత బిజీ అంటే కొత్తగా పెళ్లయ్యిందని మర్చిపోయేంత! ఇంటిని పట్టించుకునే తీరిక కూడా ఉండేది కాదు. భార్య సహకారం ఉండబట్టే, వృత్తిపై వంద శాతం దృష్టి పెట్టగలిగానంటారు అలీ. ‘‘జుబేదా అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మా పెళ్లయిన కొత్తలో ‘ఇంటి బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తిస్తా. మీ పని మీరు హాయిగా చేసుకోండి’ అని మా ఆవిడ చెప్పింది. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకూ ఆమె ఉదయం 5 గంటలకు లేచి, ఎవరికి ఏం కావాలో స్వయంగా చూసుకుంటుంది. నా వరకూ నేను షూటింగ్ ఉంటే ఆ పని చూసుకుంటాను. లేదంటే... ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోతాను. ఇంటి పనులేవీ పట్టించుకోను. అంటే... ఆమె ఎంత బాగా చూసుకుంటోందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు అలీ.

 

 ఆ రోజు నుంచే అలీతో ప్రేమలో పడ్డా!



అప్పటివరకూ సామాన్య జీవితం గడిపిన జుబేదా సెలబ్రిటీ భార్యగా మారిన తర్వాత కొత్త జీవితం చూడటం మొదలుపెట్టారు. పెళ్లయిన తర్వాతే విమానం ఎక్కానని ఆమె చెప్పారు. ‘‘పెళ్లయిన మొదటి రోజే మావారితో నేను ప్రేమలో పడ్డాను. ఎలా అంటే... నాకు చిన్నప్పట్నుంచీ విమానం అంటే ఇష్టం. విమానం వెళుతుంటే చూడటం తప్ప, ఎక్కే అవకాశం ఎప్పుడూ రాలేదు. మా పెళ్లయిన మరుసటి రోజే విమానం ఎక్కే అవకాశం దక్కింది. అప్పుడు కె. రాఘవేంద్రరావుగారి ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రాఘవేంద్రరావుగారు మా ఇద్దరికీ ఫ్లైట్ టికెట్‌లు పంపి, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకున్నారు. ‘ముద్దుల ప్రియుడు’ షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులందరి మధ్యలో మాతో కేక్ కట్ చేయించారు. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. నాకెప్పటికీ ఆ రోజు అలా గుర్తుండిపోతుంది’’ అన్నారు జుబేదా.

 

 ఆమెలో నాకు నచ్చిన లక్షణం అది!


కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత అత్తింటిని కూడా పుట్టింటిలా భావిస్తారు. జుబేదా అలాంటి అమ్మాయే అంటారు అలీ. ‘‘నాకు నలుగురు అక్కలు, ఒక తమ్ముడు. అందర్నీ ప్రేమగా చూసుకుంటుంది జుబేదా. ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకుంటుంది. ఒక్కోసారి వాళ్ల కోసం తనే ఆలోచిస్తుంది. ఆమెలో నాకు బాగా నచ్చే లక్షణం అది’’ అని అలీ అన్నారు.

 

ఆయనలో నచ్చిన లక్షణం అది!



వెండితెరపై కామెడీ పండిస్తూ, అందర్నీ నవ్వించే అలీ విడిగా కూడా అలానే ఉంటారట. అలాగే, ఒక విషయాన్ని సరిగ్గా అంచనా వేసే విషయంలో కూడా ఆయన దిట్ట అంటారు జుబేదా. ‘‘ఎలాంటి పరిస్థితులనైనా అలీ కరెక్ట్‌గా జడ్జ్ చేస్తారు. ఎంత కరెక్ట్ అంటే కొన్నేళ్ల తర్వాత కూడా, ‘ఓ... అప్పుడు అలీ చేసింది అందుకా!’ అని అనిపించేంత. ఎలాంటి పరిస్థితిలోనూ టెన్షన్ పడరు. ఎవర్నీ తొందరపడి ఒక్క మాట అనరు. ఆయనలో నచ్చిన లక్షణం అది. చిన్నప్పటి నుంచి అలీ ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించారు. తను పడ్డ కష్టాలు పిల్లలకు రాకూడదని నిరంతరం ఆయన శ్రమిస్తూనే ఉంటారు. వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకుని మంచీ చెడు చెబుతారు. మా పిల్లలకు ఎండ విలువ, కష్టం విలువ తెలుసంటే దానికి కారణం అలీ. పిల్లలకేం కావాలో అది ఇస్తారు కానీ, అతి గారాబం చేయరు. ఆయనలో ఇంకో మంచి గుణం ఏంటంటే... పెళ్లయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టు ఎక్కడా ప్రవర్తించలేదు. ఉదయం లేచి ఆఫీసుకు వెళ్లినట్టు వెళతారు. అలానే వచ్చేస్తారు. ఎవరన్నా పక్కింటి వాళ్లు ఈ రోజు మీ ఆయన ఏ షూటింగ్‌కు వెళ్లారు అన్నప్పుడు మాత్రమే, ఈయన ఆర్టిస్ట్ కదా అని గుర్తొస్తుంది. అలాగే ఆహారపుటలవాట్లు కూడా. ముస్లిమ్ కాబట్టి ఆయనెప్పుడూ నాన్-వెజ్ తింటారనుకుంటే పొరపాటే. ఆయన రోజూ తీసుకెళ్లే లంచ్‌లో నాన్-వెజ్ ఉండదు. వారానికి ఒకసారి మాత్రమే తింటారు’’ అని వివరించారు.

 

చేసే పనికి ఆమె అడ్డుపడడం ఇష్టముండదు!



ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమించినా, వాళ్లలో నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. మరి, ఈ అనురాగ దాంపత్యంలోనూ అలాంటివి ఉన్నాయా? భార్యలో తనకు నచ్చని విషయం గురించి అలీ చెబుతూ - ‘‘నేను చేసే పనికి అడ్డుపడి, ‘ఇది వద్దు, అలా చెయ్యాలి..’ అంటే నాకిష్టం ఉండదు. దాని గురించి వివరంగా చెప్పి, ‘ఇది మంచి, ఇది చెడు’ అంటే అప్పుడు వింటాను. నాకు సంబంధించిన ఏ పనిలోనైనా వేలు పెట్టడం నాకిష్టం ఉండదు. అది మా ఆవిడకు తెలుసు’’ అన్నారు.

 

 ఆయనలో నాకు నచ్చనివి అవే!



భర్తలో తనకు నచ్చని విషయాలూ కొన్ని ఉన్నాయని జుబేదా చెబుతూ - ‘‘అలీ ఎవరినైనా వెంటనే నమ్మేస్తారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు కరిగిపోతారు. వాళ్లు వంద రూపాయలు అడిగితే ఈయన నాలుగు వందలిస్తారు. నాకు అది నచ్చదు. ఎందుకంటే... వాళ్లు చెబుతుంది నిజమో కాదో, వాళ్లు అడిగే డబ్బు మంచికో, కాదో కనుక్కొని సహాయం చేస్తే బావుంటుంది కదా అంటాను. నా మాట వినరు. ఆయన నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో లాంటి కారెక్టర్స్ నచ్చవు. అలాగే, ఆయనకు ఎంత కష్టం వచ్చినా తనలో తానే బాధపడతారు తప్ప, ఇంకొకరికి తెలియనివ్వరు.. అదే నాకు నచ్చదు.

 

 అమ్మ వైపు మాట్లాడను! అలాగని, మా ఆవిణ్ణి వెనకేసుకు రాను!



ఎంత అన్యోన్యమైన కుటుంబం అయినా అత్తా కోడళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. మరి, అలీ ఇంట్లో పరిస్థితి ఏమిటి? ‘‘మా ఇంట్లోనూ వస్తాయి. కాకపోతే, అలాంటివి వచ్చినప్పుడు నేను ఏ ఒక్కరి వైపూ వకాల్తా తీసుకొని మాట్లాడను. ఎందుకంటే అమ్మ వైపు మాట్లాడితే మా ఆవిడ బాధపడొచ్చు. అదే మా ఆవిడను వెనకేసుకొస్తే... చిన్నప్పట్నుంచీ ఎన్నో కష్టాలకోర్చి పెద్ద చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన పెళ్లాం వైపు మాట్లాడుతున్నాడని అమ్మ అనుకోవడం సహజం. అందుకని నేనెవ్వరి వైపూ ఎప్పుడూ మాట్లాడను. రెండ్రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. అత్తాకోడళ్ళు తమకు తామే జోకులేసుకుంటూ మామూలు అయిపోతారు’’ అని వివరించారు అలీ.

 

 మాకు చదువు విలువ తెలుసు!


చిన్నప్పుడే సినిమాల్లోకి రావడంవల్ల అలీకి పెద్దగా చదువుకునే వీలు చిక్కలేదు. జుబేదా కూడా పెద్దగా చదువుకోలేదు. అందుకే, తమ బిడ్డలను బాగా చదివించాలని పెళ్లయిన తొలినాళ్లల్లోనే నిర్ణయించుకున్నారు. దీని గురించి అలీ చెబుతూ -‘‘చిన్నప్పుడే ఆర్టిస్టుగా సెటిలయ్యాను. అలాగే, మా ఆర్థిక పరిస్థితి వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివాను. మాకు చదువు విలువ తెలుసు కాబట్టి పిల్లలను బాగా చదివించాలనుకుంటున్నాను.  మా పెద్దమ్మాయి ఫాతిమాకు ఇప్పుడు 15 ఏళ్లు నిండాయి. కానీ మా అబ్బాయికి 5 ఏళ్లు. చిన్న పాపకు 3 ఏళ్లు. పిల్లల వయస్సులో ఇంత తేడా ఎందుకంటే... కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆ గ్యాప్ కావాలని డాక్టర్ చెప్పారు’’ అన్నారు. తాను పదో తరగతి వరకే చదివానని, ఆ తర్వాత పెళ్లి కావడంతో ఇక చదువు గురించి ఆలోచించలేదనీ జుబేదా చెప్పారు.

 

అల్లా దయ వల్ల అందరం హ్యాపీ...



అలీకి దైవభక్తి మెండు. ‘‘ఒక ముస్లింగా రంజాన్ మాసంలో రోజుకి అయిదు సార్లు ఖురాన్ చదువుతాను. జుబేదా కూడా ఖురాన్ చదవడం పూర్తి చేసింది. మా పెదపాప కూడా కోర్స్ పూర్తి చేస్తోంది. అందరం అల్లాను నమ్ముతాం. వేరే రోజుల్లో ఎలా ఉన్నా, తప్పనిసరిగా శుక్రవారం రోజు మాత్రం షూటింగ్ గ్యాప్‌లోనైనా సరే అయిదుసార్లు నమాజ్ చేస్తాను. అల్లా దయవల్ల మేం హ్యాపీగా ఉన్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు అలీ.

 

అలీ లాంటి భర్త దొరికితే ఆనందమే!



ఏ అమ్మాయికైనా మంచి భర్త దొరికితే అంత కన్నా ఆనందం మరోటి ఉండదని జుబేదా చెబుతూ- ‘‘నేను మాత్రం అల్లా సాక్షిగా చెబుతున్నాను... ప్రతి ఆడపిల్లకూ అలీ లాంటి భర్త దొరకాలి. అప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.     

 

 - సంభాషణ, ఫొటోలు: శివ మల్లాల

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top