పిల్లల అంగీకారంతోనే... కరీనాను చేసుకున్నా!

పిల్లల అంగీకారంతోనే...  కరీనాను చేసుకున్నా!


గ్రాండ్ ఫాదర్ క్రికెటర్‌గా ఫేమస్....

 ఫాదర్ కూడా క్రికెటర్‌గా ఫేమస్...

మద రేమో హీరోయిన్‌గా ఫేమస్...

ఇన్ని ఫేమస్‌లు కలగలిశాక

సైఫ్ అలీఖాన్ ఫేమస్ కాకుండా ఎలా ఉంటారు!

అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో కాకుండా

సొంత టాలెంట్‌తో పైకొచ్చారు సైఫ్.

‘పరంపర’ (1992) నుంచి ‘హ్యాపీ ఎండింగ్’ (2014) వరకూ సైఫ్ కెరీర్ చూస్తే..

ఎన్నో హిట్లు... ఎన్నో ఫ్లాపులు... జాతీయ ఉత్తమ నటుడు మొదలు ఎన్నెన్నో అవార్డులు... ‘పద్మశ్రీ’ పురస్కారం..

ఇక లైఫ్‌లోకొస్తే - అమృతాసింగ్‌తో పెళ్లి.. విడాకులు...

కరీనా కపూర్‌తో రెండో పెళ్లి... హ్యాపీ లైఫ్...

జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అన్నింటినీ

పాజిటివ్ యాంగిల్‌లోనే చూస్తానంటున్న సైఫ్‌తో

‘సాక్షి ఫ్యామిలీ’ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ...


 


మా ఇంట్లో నా లైబ్రరీలో విజ్ఞాన శాస్త్రం,  ఆధ్యాత్మిక అంశాల గురించి బోల్డన్ని  పుస్తకాలున్నాయి.  దేవుణ్ణి నమ్ముతాను.  ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాను.  అది కొన్ని సమస్యలను  అధిగమించేలా చేస్తుంది.

 

హాయ్ సైఫ్‌జీ! మీ ఇంటర్వ్యూ కారణంగా ముంబయ్ చూసే అవకాశం దక్కింది.


 

ఫస్ట్ టైమ్ వచ్చారా? ముంబయ్ ఎలా ఉంది?

     

బాగుందండి.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ బిజీగా.. రోడ్లన్నీ సందడి సందడిగా ఉన్నాయి. ఇంతకీ మా హైదరాబాద్ గురించి మీరేం చెబుతారు?

 

హైదరాబాద్ సో నైస్. గతంలో మా నాన్నగారు (క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ) అక్కడ క్రికెట్ ఆడినప్పుడు వచ్చాను. ఇక, ఇప్పుడైతే లెక్కలేనన్నిసార్లు... షూటింగ్స్ కోసం, సినిమా ప్రచారాల కోసం వస్తుంటాను కదా!

     

ఓకే.. ఇటీవల విడుదలైన మీ సినిమా ‘హ్యాపీ ఎండింగ్’కి వద్దాం. అందులో బాధ్యతారహితంగా, స్థిరమైన మనస్తత్వం లేని వ్యక్తి పాత్రను పోషించారు. తరువాత ఆ పాత్ర స్వభావం మారుతుంది. ఇంతకీ, నిజజీవితంలో మీరెలా ఉంటారు?

 

ఇప్పుడు నేను బాధ్యతల గల వ్యక్తినే! బంధాల విలువ తెలుసు. ‘హ్యాపీ ఎండింగ్’లోలాగా స్థిరమైన మనసు లేనివాణ్ణి కాదు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు క్రమశిక్షణతోనే ఉంటాను.



టీనేజ్‌లో, ముప్ఫై ఏళ్లలోపు వయసులోనూ ఇలానే ఉండేవారా?

 

ఊహూ! టీనేజ్‌లో ఉండే నిర్లక్ష్యం, కొంటెతనం... అన్నీ ఉండేవి. ఆ తర్వాతా జీవితం మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఎంజాయ్‌మెంట్ తప్ప దేనికీ ప్రాధాన్యం ఇచ్చేవాణ్ణి కాదు. ఎలా పడితే అలా ఉండేవాణ్ణి.



మరి.. మీ అమ్మా, నాన్న మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్లు కాదా?

 

ప్రయత్నించేవాళ్లు. కానీ, నేను వింటేగా! మా నాన్నగారు మాత్రం స్ట్రిక్ట్. కాబట్టే, నేను పెద్దగా స్పాయిల్ కాలేదు. లేకపోతే స్టోరీ వేరేలా ఉండేదేమో!



మీ నవాబులకు చెందిన పటౌడీ ప్యాలెస్ తీపి గుర్తులు పంచుకుంటారా?

 

అది చాలా అద్భుతమైన ప్యాలెస్. మా నాన్నమ్మ, మా నాన్నగారి భౌతికకాయాలను ఖననం చేసింది అక్కడే. నేనెప్పుడు మా ప్యాలెస్‌కు వెళ్లినా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నచ్చిన పుస్తకాలు చదువుతాను. గతాన్ని నెమరువేసుకుంటాను. అక్కణ్ణుంచి ముంబయ్ వచ్చేటప్పుడు మనసు తేలికపడిన భావన కలుగుతుంటుంది. ఏదో బలం వచ్చినట్లు అనిపిస్తుంటుంది.

     

మీరు పటౌడీ ప్యాలెస్‌లో పెరిగారా?



లేదు. నేను పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. కొన్నాళ్ల తర్వాత ముంబయ్ వచ్చేశాం. ఆ తర్వాత చదువంతా ఇంగ్లాండ్‌లోనే సాగింది. చుట్టపు చూపుగా ప్యాలెస్ వెళ్లొచ్చినప్పటికీ దాని తాలూకు తీపి గుర్తులు ఎక్కువే ఉన్నాయి.



మీ తాత గారు ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడీ క్రికెటర్. మీ నాన్నగారు కూడా క్రికెటర్‌గా తన సత్తా చాటారు. మరి.. మీ అమ్మ (షర్మిలా ఠాగూర్)గారి బాటలో     సినీరంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?



మా తాతగారు, నాన్నగారిలా క్రికెట్ ప్లేయర్ అయ్యుంటే ఈపాటికి రిటైర్ అయ్యుండేవాణ్ణి. రిటైర్‌మెంట్ లేని ఉద్యోగం చేయాలనుకున్నా. పైగా సినిమా మంచి వినోద సాధనం. వివిధ మనస్తత్వాలున్న వ్యక్తులతో పని చేస్తాం. ప్రతి సినిమాకీ కొత్త బృందంతో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. అమ్మా, నాన్న కూడా నా ఇష్టాన్ని కాదనలేదు.

     

సెలబ్రిటీ జీవితం అంటే.. చిన్న విషయం కాదు.. వివాదాలు ఉంటాయి.. విమర్శలూ ఎదుర్కొనాల్సి ఉంటుంది కదా?



ఈ రెండూ లేని సెలబ్రిటీల జీవితం దాదాపు ఉండదు. విమర్శలను స్వీకరించే ధైర్యం నాకుంది. ఎందుకంటే.. విమర్శల్లోనూ మంచి విషయాలుంటాయి. అవి తీసుకోవాలి. వివాదాలంటారా..! అది మన చేతుల్లోనే ఉంటుంది. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎవరూ విమర్శించరు. ఒక్కోసారి సరిగ్గా ప్రవర్తించినా వివాదాల్లో ఇరుక్కుంటాం. అన్నింటినీ డీల్ చేయడం నేర్చుకోవాలి.



మరి మీ ప్రవర్తనకు మీరెన్ని మార్కులేసుకుంటారు?

 

నిజం చెబుతాను. పదికి తొమ్మిది మార్కులు వేసుకుంటాను.

     

ఒకసారి మీ వ్యక్తిగత జీవితానికి వద్దాం... అమృతాసింగ్‌తో దాదాపు పుష్కర కాలం కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలు (కుమార్తె సారా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీమ్ అలీఖాన్) పుట్టాక ఆమె నుంచి విడిపోయారు.. కారణం ఏంటి?

 

హ్యాపీగా ఉండాలనుకున్నాను. బ్రేకప్ అయ్యాను. తనతో పాటే ఉంటూ... చిరాకులూ పరాకులతో జీవితం గడపడం అనవసరం అనుకున్నాను.



{బేకప్ అనే మూడక్షరాల పదం చెప్పడానికి సులువు కానీ,     పన్నెండేళ్లు కలిసి ఉన్న వ్యక్తి నుంచి విడిపోవడం అంత సులువా?

 

అస్సలు సులువు కాదు. చాలా బాధాకరమైన విషయమే. ఆ బాధ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. కానీ, తనతో పాటే ఉంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అందుకే విడిపోయా!



అంటే.. అమృతాసింగ్ తీరు మీకు నచ్చలేదా? ఆమెలో ఉన్న మైనస్‌లేంటి?



నా మాజీ భార్య చాలా అద్భుతమైన వ్యక్తి. తనలో వంకపెట్టడానికి ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు నేను చిన్నవాణ్ణి. కొంచెం పరిణతి వచ్చిన తర్వాత జీవితాన్ని వేరే కోణంలో జీవించాలనుకున్నా. నా ఇష్టప్రకారం బతకాలంటే... తనతో ఉండలేను. ఉన్నా ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది. ఒకానొక పరిస్థితిలో టెన్షన్ తట్టుకోలేక తల పగలగొట్టుకుంటానేమో అనిపించేది. విడిపోయినప్పుడు కొన్నాళ్లు బాధపడ్డా. కానీ, ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆ తర్వాత ఆనందపడ్డాను.



వేరే కోణంలో జీవించాలనుకోవడం అంటే ఏంటి?



మన వయసు పెరుగుతున్నకొద్దీ ఆలోచనలు మారతాయి. పదేళ్ల క్రితం ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలూ, నమ్మకాలు ఇప్పుడు ఉండవు. అలా ఓ పదేళ్లు కలిసి ఉన్న తర్వాత నా ఆలోచనల్లో మార్పొచ్చింది. నా లైఫ్ స్టయిల్ మారింది. అందుకే విడిపోయాను. అందులో తప్పు లేదనే అనుకుంటున్నా.



తప్పు లేదని మీరు సర్దిచెప్పుకోవచ్చు. కానీ, పిల్లల సంగతేంటి?



పిల్లల పరంగా అన్యాయం జరిగినట్లే! అందుకే ఇప్పటికీ బాధపడుతుంటాను. పెళ్లి గురించి పూర్తి అవగాహన లేని వయసులో పెళ్లి చేసేసుకుని, వెంటనే పిల్లలు కూడా కావాలనుకుని తల్లిదండ్రులైపోతుంటాం. ఆ తర్వాత ఇలా జరిగినందుకు బాధపడుతుంటాం. నా జీవితంలో అదే జరిగింది.



మీ పిల్లలెప్పుడూ దీని గురించి మిమ్మల్ని అడగలేదా?



అడగలేదు. కానీ, జరిగిన విషయాలను వాళ్లకి వివరంగా చెప్పాను.



మరి.. కరీనా కపూర్‌ని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ పిల్లలకు ఆ విషయం స్పష్టంగా చెప్పారా?



ఇద్దరితోనూ చెప్పాను. నేను సంతోషంగా ఉండడం ముఖ్యం అనుకున్నారు. అందుకే, ఆనందంగా అంగీకరించారు.

     

అప్పట్లో పరిణతి లేని వయసులో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పరిణతి చెందిన తర్వాత కరీనాతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. కరీనాలో ఏంటి ప్రత్యేకత?




కరీనా ఆలోచనా విధానం బాగుంటుంది. ఎదుటి వ్యక్తిని గౌరవించి, స్వేచ్ఛ ఇచ్చే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఏ బంధమైనా పటిష్ఠంగా ఉండాలంటే ఒకరి అభిప్రాయాల మీద మరొకరికి గౌరవం, నమ్మకం ఉండాలి. మా ఇద్దరి మధ్య అది ఉంది.



సెలబ్రిటీలను వారి అభిమానులు, కొంతమంది ప్రేక్షకులు ఆదర్శంగా తీసుకుంటారు. కానీ, ఇలా రెండేసి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ‘మన హీరోనే చేశాడు. మనం ఎందుకు చేయకూడదు’ అనుకునే అవకాశం ఉంది కదా?

 

అంతగా ప్రభావితం చెందుతారని నేనుకోను. ఎందుకంటే, ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటారు. అంతేకానీ, ఆ హీరో అలా చేశాడు కాబట్టి, మనం అలానే చేద్దాం అనుకుంటారనుకోను. పైగా, నా జీవితం ఆనందంగా ఉండటం కోసం నేనో నిర్ణయం తీసుకున్నప్పుడు.. అందరి గురించీ ఆలోచించలేను కదా. అయినా నా ఆనందాన్ని నా అభిమానులు కాదనరు. అలాగే, తమ అభిమాన హీరో ఎలా ఉంటే.. అలా అంగీకరించాలి. అదే నిజమైన అభిమానం.



మీ పిల్లలతో కాస్త సమయం గడుపుతుంటారా?   ఓ తండ్రిగా సలహాలివ్వడంతో పాటు, మంచీ చెడూ చెబుతుంటారా?

 

వీలు కుదిరినప్పుడల్లా పిల్లలతో గడుపుతుంటా. నేను, మా అమ్మాయి కలిసి టీవీ చూస్తాం. కబుర్లు చెప్పుకుంటాం. పిల్లల భవిష్యత్తు గురించి ఓ తండ్రికి ఉండే కోరికలు, భయాలూ అన్నీ నాకున్నాయి. అవసరం అనిపించినప్పుడు పిల్లలకు సలహాలిస్తుంటా.

     

మీ టీనేజ్‌లో మీరు బాధ్యతారహితంగా ఉండేవాడినని చెప్పారు.. మరి.. మీ పిల్లల సంగతేంటి?




వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. ఎప్పుడైనా బర్త్‌డే పార్టీలు, ఇతర పార్టీల్లో పాల్గొని తెల్లవారుజామున ఐదు గంటలకు వరకూ మా అమ్మాయి ఎంజాయ్ చేసిందనుకోండి... అయినా సరే, ఉదయం ఏడు గంటలు కాగానే స్కూల్‌కి వెళ్లేది. కాలేజ్‌కీ అంతే ! తమకేం కావాలో, ఎలా ఉండాలో నా పిల్లలకు తెలుసు. అందుకే నేను నిశ్చింతగా ఉండగలుగుతున్నాను.

     

మీ పిల్లలతో కరీనా ఎలా ఉంటారు?

 

వెంటనే కలిసిపోయిందని చెప్పలేను కానీ, మెల్లి మెల్లిగా అలవాటుపడింది. ఇప్పుడు కరీనా, పిల్లలు బాగుంటారు. వాళ్ల మధ్య ఎలాంటి సమస్యా లేదు.

     

ఫైనల్‌గా... మీకు, కరీనాకు పెళ్లయ్యి రెండేళ్లయ్యింది. మరి మీ కుటుంబం పెద్దదవ్వాలని కోరుకోవడం లేదా?

 

అర్థమైంది. పిల్లల గురించి అడుగుతున్నారు కదా! ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించడం లేదు. భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా ఆ దిశగా మా ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే, నాకు తెలిసి ఎవరైనాసరే పెళ్లి చేసుకునేది ఒక తోడు కోసం, పిల్లల కోసం! పిల్లలే వద్దనుకుంటే అసలు ఎవరూ పెళ్లి చేసుకోరేమో (నవ్వుతూ). అయితే ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది. దాన్నే రైట్ టైమ్ అంటారు.

 

అమృతాసింగ్‌ని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె మీకన్నా పెద్ద. ప్రేమ గుడ్డిదనీ, వయసుతో సంబంధం లేనిదని అంటుంటారు కదా! మీ విషయంలోనూ ఆ మాటే నిజం చేసినట్లున్నారు?



ఏమో! అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. పెళ్లి చేసుకోవాలనిపించింది చేసుకున్నాను. అప్పుడు నా వయసు దాదాపు 21 ఏళ్ళు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకునేంత పరిణతి లేని వయసులో ఆ పెళ్లి చేసుకున్నాను.

     

అమృతాసింగ్ గురించి.. ఆమెతో పెళ్లి గురించి ఇప్పుడు తల్చుకుంటే ఏమనిపిస్తుంది?


     

పెళ్లి విలువ తెలిసే వయసులో నేను అమృతను చేసుకోలేదు. అప్పట్లో పెళ్లి చేసుకుంటే మంచిదనిపించి, చేసేసుకున్నాను. అంతకు మించి వేరే ఏమీ ఆలోచించలేదు. అమృత మంచి మనిషి. మంచి తల్లి కూడా. పిల్లలను అద్భుతంగా పెంచింది. ఆమె అంటే నాకు గౌరవం ఉంది.

 

కరీనా ఎలాంటి అమ్మాయి?



బయటి ప్రపంచానికి తెలిసిన కరీనా వేరు. నాకు తెలిసిన కరీనా వేరు. చాలా తెలివిగలది. సరైన నిర్ణయాలు తీసుకునే సమర్థతతనకుంది. అందుకే పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించాలా? లేదా అనే విషయాన్ని ఆమెకే వదిలేశాను. ఎందుకంటే, తన నిర్ణయాలు ఫెయిల్ కావని నా నమ్మకం.



ఉత్తరాదిన ‘కర్వా చౌత్’ పండగప్పుడు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉంటారు కదా.     మీ కోసం కరీనా కపూర్ ఉపవాసం ఉండడం..?

     

అందుకే నేను కూడా తన కోసం ఆ రోజున ఉపవాసం ఉంటాను. జీవితాన్ని పంచుకున్నప్పుడు ఉపవాసాన్ని కూడా పంచుకోవాలి కదా.. (నవ్వుతూ).

 

 

 - డి.జి. భవాని

 

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top