చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు

చెన్నై సెంట్రల్  తెలుగువారి కబుర్లు


చెన్నకేసరి

 

ఆయన ఆయుర్వేద వైద్యులు, భాషావేత్త. ‘కేసరి కుటీరం’ వ్యవస్థాపకులు. లోధ్ర, అర్క, అమృత ఔషధాల సృష్టికర్త. స్త్రీ జనోద్ధరణకై పాటుపడిన సంస్కర్త. ‘గృహలక్ష్మి’ మాస పత్రిక వ్యవస్థాపకులు. ప్రతిభావంతులైన మహిళలను ‘గృహలక్ష్మి స్వర్ణ కంకణం’తో సత్కరించిన మానవతావాది. మద్రాసు మైలాపూర్‌లోని తెలుగువారికోసం పాఠశాలలను స్థాపించిన భాషాభిమాని. నాటి ఒంగోలు జిల్లాలో జన్మించి డా. కె.ఎన్.కేసరిగా సుపరిచితులైన ఈ కోట నరకేసరి అచ్చతెలుగు మహానుభావుడు!



ఆ వీధికి ‘తిరు వి క మూడవ సందు’ అని ప్రభుత్వం నామకరణం చేసింది. స్థానికులు మాత్రం ఆ వీధిని కేసరి హైస్కూల్ రోడ్డుగా పలకడంలో అలవికాని ఆనందం పొందుతారు. ‘కేసరి’ అనే పదం పలుకుతుంటేనే పులకించిపోతారు అక్కడి వారు. అంతటి తెలుగు సువాసనలు వెదజల్లే ఆ వీధిలోకి ప్రవేశించగానే మధురస్మృతులు మదిలో మెదలుతాయి. తుది శ్వాస విడిచే వరకు జీవితమంతా అక్కడే గడిపిన తెలుగు మహనీయుడు డా.కె.ఎన్. కేసరి మన హృదయ తంత్రులను సుతిమెత్తగా మీటుతారు. ఆయన స్థాపించిన కేసరి విద్యాలయం స్థాపన వెనుక పెద్ద కథే ఉంది. వారసత్వ కట్టడాలను తలదన్నేదిగా నిర్మితమైంది ఆ భవనం.



చెన్నైలో చాలాకాలంగా నివసిస్తున్న తెలుగువారికి, మరీ ముఖ్యంగా రాయ్‌పేట్ మైలాపూర్‌లో ఉండే తెలుగు వారికి తెలుగులో విద్యాభ్యాసం అనేది గగన కుసుమమే. చదువు కావాలనుకుంటే తమిళం చదవాలి, లేదంటే చదువు మానుకోవాలి. అటువంటి పరిస్థితుల నుంచి తెలుగు వారికి పరిష్కారం చూపడానికి, 1940లో మద్రాసులోని కొందరు తెలుగు వారు ఒక వ్యవస్థగా మారి, తెలుగు మాధ్యమంలో ఒక ఎలిమెంటరీ పాఠశాలను స్థాపించారు. పామ్ తోటగా ప్రసిద్ధి చెందిన స్థలాన్ని డా.కేసరి 70,000 రూపాయలకు కొనుగోలు చేసి, 1943లోఆ  విశాలమైన ప్రాంగణంలో పెద్ద భవంతి నిర్మిం, ఈ పాఠశాలను నడపడం ప్రారంభించారు. ముందుగా మిడిల్ స్కూల్ వరకు, ఆ తరవాత హైస్కూల్ స్థాయి వరకు పెంచారు. 1947 ఏప్రిల్ మాసంలో, పాఠశాల భవిష్యత్తులో కూడా నిరాఘాటంగా నడవడం కోసం లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. 1948లో ఎస్‌ఎస్‌ఎల్‌సి మొట్టమొదటి  బ్యాచ్ విద్యార్థులు పరీక్షకు కూర్చున్నారు. పాఠశాల భవనం తదితర ఆస్తులను కాపాడుతూ, విద్యాసంస్థలను సక్రమంగా నడపడం కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటుచేశారు. 1951 నాటికి కేసరి ఎడ్యుకేషన్ సొసైటీ రూపొందింది. నేడు కేసరి ఎడ్యుకేషన్ సొసైటీ అనేక పాఠశాలలను నడుపుతోంది. చెన్నపట్టణంలో మైలాపూర్ తరవాత టి.నగర్ ప్రాంతం, తెలుగు మాట్లాడేవారికి స్థావరంగా నిలిచింది. ఆ రోజుల్లో దివాన్ బహదూర్ బి.వి.శ్రీహరిరావు నాయుడు తెలుగువారి కోసం డా. కేసరి సహాయంతో రెండవ పాఠశాలను ప్రారంభించారు.



 స్త్రీలు ధైర్యసాహసాలతో అన్ని రంగాలలో ముందుండాలని కేసరి ఆకాంక్ష. వారు బాగా చదువుకుంటే ఏదైనా సాధించగలరనే ఉద్దేశంతో స్త్రీవిద్యను ప్రోత్సహించారు. డా. కె.ఎన్.కేసరి (1875 - 8 జూన్, 1953)  ఒంగోలు జిల్లాలో జన్మించారు. తండ్రిగారు తన ఐదవ ఏటనే మరణించడంతో, తల్లి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. గుంటూరులో విద్యాభ్యాసం ప్రారంభించినప్పటికీ, కుమారుడి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కేసరికి 11వ ఏడు వచ్చేటప్పటికి చెన్నపట్టణం తీసుకువచ్చేశారు. ‘హిందూ థియలాజికల్ పాఠశాల’లో చేరడానికి స్కాలర్‌షిప్ సంపాదించుకున్నారు కేసరి. 1889లో తల్లి ఆయనను పాఠశాలలో చేర్పించిన కొన్ని రోజులకే అనారోగ్యంతో మరణించింది. అయినా సరే, కేసరి ఎంతో కష్టపడి ఆయుర్వేద విద్యను అభ్యసించారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్యశాలలో పండిట్ గోపాలాచార్యులు గారి దగ్గర కొంతకాలం పనిచేశారు. కేసరి ఆయుర్వేద వైద్యులుగా, సంఘసంస్కర్తగా, లోకోపకారిగా, రచయితగా, పత్రిక సంపాదకులుగా, సంగీత ప్రేమికులుగా అందరికీ తలలో నాలుక అయ్యారు. ఆయన స్థాపించిన కేసరి కుటీరంలో మ్యూజిక్ అకాడమీ వారి కచేరీలు జరుగుతుండేవి.   



 1928లో కేసరి తెలుగు ‘గృహలక్ష్మి’ అని మహిళల కోసం ఒక తెలుగు పత్రికను స్థాపించి, రాజకీయాలలో, రచనలలో వారి ప్రతిభను ప్రదర్శించిన మహిళలను ‘గృహలక్ష్మి స్వర్ణకమలం’ అవార్డుతో సత్కరించారు.  డా. కేసరి పూనమలై హై వే మీద లోధ్ర ప్రింటింగ్‌ప్రెస్ ప్రారంభించారు. అక్కడి నుంచే గృహలక్ష్మి తెలుగు మహిళా పత్రిక  ప్రారంభమయ్యింది. ఎంతోకాలంగా తెలుగు ఇళ్లలో వాడుతున్న మందులు లోధ్ర, అమృత, అర్క వంటివి కేసరి తయారు చేసినవే. వంద సంవత్సరాలుగా అక్కడ మందుల తయారీ జరుగుతూనే ఉంది. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ, లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు స్థాపించిన సేవాసదన్, ముత్తులక్ష్మి రెడ్డి స్థాపించిన అవ్వై హోమ్, యామినీ పూర్ణతిలక స్థాపించిన హిందూ యువ తీ శరణాలయాలకు ఆయన విరాళాలు ఇచ్చారు. స్వయంగా ఎందరో మహిళలకు ఆశ్రయం కల్పించి, వారికి చదువుతో పాటు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. ఆయన రాసుకున్న ‘చిన్ననాటి ముచ్చట్లు’ పుస్తకాన్ని ఆయన కుమార్తె వసంత మీనన్ ఆంగ్లంలోకి అనువదించారు. మనవడు కె.బాలకేసరి మంచి డాక్టరు. ఈయన కేసరి భవనాన్ని అందంగా తిరిగి పునర్నిర్మించారు. కర్ణాటక గాత్ర విద్వాంసుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు అయిన ఉన్నికృష్ణన్ డా. కేసరి ముని మనవడు.



 డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చె న్నై,

 ఫొటోలు: వన్నె శ్రీనివాసులు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top