గురి ఉంటేనే... గురువు

గురి ఉంటేనే... గురువు - Sakshi


‘ఆయన నాకు గురువు’ అన్న నమ్మకం మీకుంటే ఆయన గురువు. ఆయన చెప్పిన మాటలను శిరసావహించి బతుకుతున్నారనుకోండి. అప్పుడు మీలో మార్పు వస్తుంది. ఈ మార్పుకి కారణం కేవలం శిష్యుని యొక్క గురి. అంతే తప్ప గురువు గారి వైభవం కాదు. గురువు తన వైభవంతో, తన ప్రజ్ఞతో మార్చడు. శిష్యుడు తన గురితో మారతాడు. అందుకే మీ గురికి ‘గురువు’ అని పేరు. గురి లేదనుకోండి. సాయంకాలం ఏ నృత్య కార్యక్రమమో చూడ్డానికి వెళ్ళినట్లు, కచ్చేరీలో పాట వినడానికి వెళ్ళినట్లు ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళి వచ్చేవాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది? వందలమంది వింటున్న ప్రవచనంలో ఎవడో ఒకడు కొన్ని మాటలు పట్టుకుంటాడు.


వాడు జీవితాన్ని మార్చుకుంటాడు. అది గురి. వాడు మారినట్లు ప్రవచనకర్తకు కూడా తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. ఆ గురి ఎవరిలో నుంచి బయల్దేరి ఇవతలివాడిని ప్రభావితం చేస్తుందో ఆయన గురువు అవుతాడు. ఎవరి మాటల వల్ల జీవితం మార్పు చెందుతుందో, ఆ మాటల పట్ల మనకు గురి ఉంటే వారిని మాత్రమే గురువని పిలవాలి. ‘‘మా గురువుగారు ‘ఇలా బతకరా’ అని చెప్పారు. నాకది శరణ్యం. అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు’’ అని విశ్వసించారనుకోండి. అప్పుడు ఆయన గురువవుతారు. కాబట్టి గురువుగారి మాట మీద గురి చేత ప్రభావితమై శిష్యుడు జీవితంలో మార్పు తెచ్చుకుంటాడు. అందుకే మనుష్యజన్మలో వాసనాబలాన్ని పోగొట్టుకోవడం గురువు వాక్కు వల్ల సంభవమవుతుంది.


సదాశివ బ్రహ్మేంద్రులు మహా విద్వాంసులు. కామకోటి పీఠానికి ఎవరు వెళ్ళినా ఆయన దగ్గర వాదనలో ఓడిపోయేవారు. అందరితో ప్రతిదానికీ వాదించేవాడు. ఎవరో వెళ్ళి గురువుగారికి చెప్పారు. గురువుగారు పిలిచి ‘‘ఏరా! నీవు మాట్లాడని రోజుండదా?’’ అన్నారు. అంతే - ‘‘గురువు గారూ! ఈ రోజు నుండి ఈ శరీరం పడిపోయే దాకా మాట్లాడను. గురువుగారి ఆజ్ఞ’’ అన్నాడు. అంతే! సదాశివబ్రహ్మం గారు ఇక మాట్లాడలేదు. అదీ గురుశిష్య సంబంధం. అదీ గురువు గారి పట్ల శిష్యుడికి ఉండవలసిన నమ్మకం. ఆ విశ్వాసం వాసనాబలాన్ని పోగొట్టేస్తుంది. గతజన్మలో ఏ వాసనాబలమైనా ఉండనివ్వండి. ‘తప్పురా’ అని గురువన్న ఒక్కమాటకు వదిలిపెట్టేస్తాడు. అంతే!


సంస్కారాన్ని పొందడం మనుష్య జన్మలో మాత్రమే సాధ్యం. ఇతర జన్మల్లో సాధ్యం కాదు. కానీ మనుష్యజన్మను పొటమరించి ఉండే ప్రమాదం ఒకటుంది. అది శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు.. ఐదూ లౌల్యంతో కలిసి మనిషికి ఉంటాయి. లౌల్యం- అంటే ఎంత అనుభవించినా తనివితీరకుండుట.. అప్పటికి తృప్తి పొందినట్లుంటుంది. మళ్ళీ కాసేపాగి ఇంద్రియాలతో మనసు దాన్ని అనుభవిస్తుంటుంది. అనుభవించేది ఇంద్రియాలు. దాని సుఖానుభూతిని మనసు పుచ్చుకుంటుంది.


 మిగిలినవాటికలా ఉండదు. వాటికి ఏదో ఒక ఇంద్రియంలోనే లౌల్యం ఉంటుంది. అన్ని ఇంద్రియాల్లోనూ ఉండదు. ఉదాహరణకు శబ్దలౌల్యం. వినుట. ఈ లౌల్యం లేళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. వేటగాడు వచ్చి పెద్ద వల వేసి, అక్కడే చెట్టెక్కి కూర్చుని ఒక పాట పాడతాడు. ఆ పాట వినగానే ఎక్కడో గడ్డిపరకలు తింటున్న లేడి తినడం మానేసి, ఆ శబ్దం వచ్చిన వైపు పరుగెడుతుంది. పాట వింటూ వచ్చి, వలలో పడుతుంది. వెంటనే వేటగాడొచ్చి మళ్ళీ పారిపోకుండా దానికాళ్ళు విరగ్గొట్టి తీసికెళ్ళిపోతాడు. కాబట్టి శబ్దలౌల్యం వల్ల లేళ్ళ జాతి నశించిపోతోంది.


అలాగే రస లౌల్యం. చేపకు నోటిపై లౌల్యం. చేపలుపట్టేవాడు ఒక గుండుసూది తీసుకువచ్చి ‘యు’ ఆకారంలో వంచి వానపామును దానికి గుచ్చుతాడు. దీనిని నీటిమీద తేలే బెండుముక్కకు కడతాడు. మరొక కొసను ఒక పొడవుపాటి కర్రకు కట్టి అది పట్టుకుని ఒడ్డున కూర్చుంటాడు. చేపకు కడుపు నిండి ఉన్నాసరే, అలా వెడుతూ వెడుతూ.. ఒక్కసారి కొరికిపోదాం అని కొరికి, గాలానికి చిక్కుకుని గిలాగిలా కొట్టుకుంటుంది. వేటగాడు చేపను పైకి లాగేసుకుని, బుట్టలో వేసేసుకుంటాడు.


నోటికి ఉన్న లౌల్యానికి చేపల జాతి తగ్గిపోతున్నది. వర్షాకాలం రాగానే దీపపు పురుగులు దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకొని ఎగిరివచ్చి, అక్కడ వాలి మరణిస్తుంటాయి. రెక్కలు ఊడి, కింద పెద్దకుప్పగా పడి ఉండడాన్ని చూసి కూడా వేరొక రెక్కల పురుగొచ్చి ఆ దీపం మీద వాలడం మానదు. కంటితో చూసి పొంగిపోయి, లౌల్యం పొందడం వల్ల రెక్కలపురుగు జాతి నశిస్తోంది.


ఇలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఇంద్రియంలో లౌల్యం. కానీ భగవంతుడు ఏం చేశాడంటే... మనిషికి అన్ని ప్రాణులలోని తేజస్సును వాడుకోగల శక్తినిచ్చి, ఐదు ఇంద్రియాల్లోనూ లౌల్యాన్ని పెట్టాడు.


-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top