మైండ్ చిక్కితే బాడీ మెక్కుతుంది

మైండ్ చిక్కితే  బాడీ మెక్కుతుంది


చిక్కడమంటే సన్నబడడమే కాదు, చిక్కుల్లో పడడం కూడా!

మనిషికి రకరకాల కష్టాలు. కాదనుకుంటే ఒకటీ ఉండదు.

అంతా మైండ్ గేమ్!

ఊబకాయం కూడా బాడీ ప్రాబ్లమ్ కాదట. దొంగది... మైండే!

నిశాహారం?! ఈ మాట వింటే... ఎవరికైనా మైండు తిరుగుద్ది.

అది కూడా రాత్రి పూట!

చీకటిలో ఏం తిన్నా ఎవరికీ కనబడదనుకుంటాం కదూ...

కానీ రీసెర్చి వాళ్లు మనల్ని పట్టేశారు...

నిశాహారం అంటే... రాత్రి పూట బొక్కే జబ్బని!

బిఈడి?! డిగ్రీ కాదండోయ్... ఇది కూడా బొక్కుడు జబ్బే.  

ఎక్కువ తింటే వచ్చే మా‘లావు’ డిగ్రీ.  

మమ్మీ డాడీ దగ్గర లేకపోతే తిండిలో పేరెంట్స్‌ను చూసుకుంటున్నారట.

పిల్లలు దగ్గర లేకపోతే ఫుడ్డులో బిడ్డల్ని చూసుకుంటున్నారట.

చెప్పాను కదా... అంతా మైండ్ గేమ్.,

ఇప్పటి దాకా తిండి ఎక్కువ తినడం వల్లో... పని తక్కువ చేయడం వల్లో

లావవుతున్నాం అనుకున్నాం కాదా!

వెరీ సిల్లీ... అంతా మైండ్ ఎంగిలి.


 

బరువు పెరగడానికి కారణం... జీవక్రియలు తగ్గడమో, జన్యుసమస్యలు పెరగడమో కాదు. మానసిక సమస్యలే. హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక రుగ్మతలు బరువును పెంచేస్తాయని తెలిసిందే. కానీ మానసిక సమస్యలతోనూ బరువు పెరిగిపోతారా? ఇలా మంచం పట్టడానికి కారణం మానసిక కారణాల వల్ల కంచం పట్టడమే అంటున్నారు నిపుణులు. దాంతోపాటు నిశాహారం కూడా. ఇదేదో నిషా కలిగించే ఆహారం కాదు. నిశిరాత్రివేళ నిద్రపట్టక అదేపనిగా తినడం. దీనికీ మానసిక సమస్యలే కారణమని చెబుతున్నారు. ఊరకే ఉంటే ఊరిపోయి ఊబకాయం రావడం మామూలే. కానీ మనసులో అలజడి రేకెత్తించే సమస్యలతోనూ స్థూలకాయం వస్తుందంటున్న నిపుణుల మాటలను మనసుపెట్టి వినండి...



 మనోభారంతో  శరీరమూ భారం!

 దిగులుగా ఉన్నప్పుడు కొందరు ఊరట కోసం అతిగా తినేస్తుంటారు. ఆగ్రహంతో పళ్లు కొరకడానికి బదులు పంటికింద పటపటలాడించడానికి ఏదో ఒకటి నమిలేస్తుంటారు మరికొందరు. ఆందోళనతో అవసరానికి మించి కంచాల కొద్దీ లాగిస్తుంటారు ఇంకొందరు.  ఇలాంటి వాళ్లు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో గమనించకుండా తినేస్తుంటారు. ఇలాంటివారు ఒళ్లు కదపడానికి పెద్దగా ఇష్టపడరు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు గానీ, కూర్చుని తింటే శరీరం కొండలా పెరుగుతుంది. కొండలా పెరుగుతున్న శరీరాన్ని చూసుకుంటే, మరింత దిగులు కమ్ముకుంటుంది. నలుగురిలోనూ మెలగడానికి సంకోచం కలుగుతుంది. మళ్లీ ఆ దిగులు నుంచి ఊరట పొందడానికి మళ్లీ మళ్లీ తిండినే ఆశ్రయిస్తారు. ఇదంతా ఒక విషవలయంలా ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

 బీఈడీ...



 డిగ్రీ కాదు, డిజార్డర్!

 మానసిక సమస్యల నుంచి బయటపడలేక తినడాన్ని అలవాటుగా చేసుకుంటే, కొన్నాళ్లకు పరిస్థితి మరింత జటిలమవుతుంది. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో పట్టించుకోకుండా అనాలోచితంగా తినేస్తూపోతే, ఈ అలవాటు క్రమంగా ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ (బీఈడీ)గా మారుతుంది. ఈ ‘బెడ్’ బాధితులకు కాసింత తీరిక దొరకడమే తరువాయి... మనసు తిండి మీదకు మళ్లుతుంది. ఎవరికైనా కనీసం వారానికి రెండు రోజులు, వరుసగా ఆరునెలలు అతిగా తినడమే అలవాటుగా కొనసాగితే, అలాంటి వారిని బీఈడీ బాధితులుగానే పరిగణించాలి. మొత్తం జనాభాలో ఇలాంటివారు రెండు శాతం వరకు ఉంటారు. స్థూలకాయుల్లో దాదాపు 25 శాతం మేరకు బీఈడీ బాధితులే. ఇలాంటివారు చురుగ్గా పనులు చేసుకోవడం కంటే, చాలావరకు కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకే ఇష్టపడతారు. బద్ధకంగా గడిపే దినచర్య ఫలితంగా స్థూలకాయులుగా మారుతారు.

 - ఇన్‌పుట్స్: డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్

 

చక్కెరపై తీపి ‘ఎగస్ట్రా’

నిద్రలేమి, దిగులు, ఆందోళనలతో బాధపడే వారికి మెదడులోని సంతృప్తి కేంద్రం సక్రమంగా పనిచేయదు. దీనివల్ల ఏం తిన్నా, ఎంత తిన్నా వారికి తొందరగా సంతృప్తి కలగదు. అలాంటి వారి మెదడులోని ఆకలి కేంద్రం చక్కెరల కోసం ఆరాటపడుతుంది. అందుకే వారు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు లేదా తక్షణమే చక్కెరలుగా రూపాంతరం చెందే చిప్స్, సమోసాలు, మిర్చీ బజ్జీలు వంటివీ, పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తినేస్తూ ఉంటారు. చక్కెరపై అదుపులేని మోహమే వారిని చక్కెరవ్యాధి బారిన పడేలా చేస్తుంది.

 

ఆకలి ఎరుగని తిండి

ఆకలి రుచి ఎరుగదని అంటారు గానీ, ఇలాంటి తిండి తినే మానసిక రుగ్మత ఉన్న వారిలో వారి తిండి ఆకలి ఎరుగదు. భావోద్వేగాలకు విపరీతంగా లోనయ్యేవారిలో కొందరు, అవాంఛిత భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి తిండిని ఆశ్రయిస్తారు. దుఃఖం, సంతోషం, ఉత్సాహం, ఆందోళన... ఇలా ఎలాంటి భావోద్వేగం కలిగినా, దానిని అణచుకోవడానికి ఏదో ఒకటి తినేస్తారు. ఇంకొందరైతే, ఆహారాన్ని పారవేయడం ఇష్టంలేక ఆకలిగా లేకున్నా తింటారు. రకరకాల కారణాల వల్ల అభద్రతాభావంతో బాధపడేవారు సురక్షితంగా ఉన్నామనే భావన కోసం ఆకలి  లేకున్నా తింటారు. ప్లేటులతో తమ చుట్టూ సురక్షితమైన కోటలు కట్టుకుంటున్నామన్న అపోహతో అన్నహితవును పెంచుతారు. ఆరోగ్యహితవు మరుస్తారు.

 

ఎలా అధిగమించవచ్చు?


 

మానసిక సమస్యల వల్ల అతిగా తినే అలవాటును అధిగమించడం కాస్త కష్టమే అయినా, కొంత ప్రయత్నంతో దీనిని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.  ఏం తింటున్నామో శ్రద్ధగా గమనించాలి. అతిగా తినడం అలవాటుగా మారి స్థూలకాయానికి దారితీస్తుంది. తినే పదార్థాలపై, వాటి పరిమాణంపై కాస్త శ్రద్ధపెడితే ఈ పరిస్థితిని తేలికగా అధిగమించవచ్చు.ఏ పరిస్థితుల్లో మనసు తిండి వైపు మళ్లుతుందో జాగ్రత్తగా చూడాలి. వాటిని  అధిగమించేందుకు ప్రయత్నించాలి.



మానసికంగా ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తినడం బదులు పెయింటింగ్, సంగీతం వంటి హాబీలకు సమయాన్ని కేటాయించడం మంచిది. ఏమీ తోచకపోతే ఆరుబయట అలా కాసేపు నడక సాగించడం ద్వారా కూడా ఒత్తిడిని జయించవచ్చు.వ్యాయామం చేయడం కాస్త కఠినమైన పరిష్కారం లాగే కనిపిస్తుంది గానీ, స్థూలకాయంతో పాటు ఒత్తిడిని జయించడానికి వ్యాయామానికి మించినది లేదు.

  స్థూలకాయం నుంచి బయటపడాలనుకునే వారు ముందుగా మిర్చీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.



సరైన పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి అనిపించదు. ఫలితంగా తిండి పరిమాణం తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది.

 

పిల్లలతో గడపండి!


పిల్లలు సహజంగా తల్లిదండ్రుల ప్రేమాభిమానాల కోసం ఆరాటపడుతుంటారు. తల్లిదండ్రులు ఎక్కువసేపు వారితో గడపడం అవసరం. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు అసాధారణమైన పనివేళల కారణంగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉండదు. దాంతో పిల్లలు వారిపై బెంగ పెట్టుకుని, క్రమంగా డిప్రెషన్‌లోకి కూరుకుపోతారు. ఇలాంటి పిల్లలు తిండి ద్వారా ఊరట వెదుక్కొనే ప్రయత్నంలో చిన్న వయసులోనే స్థూలకాయులుగా మారుతారు. ఒంటరితనంలో మానసికంగా కూరుకుపోయిన ఇలాంటి పిల్లలు కాస్త ఎదిగాక మద్యానికి, మాదకద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

 

అవీ ఇవీ...

స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా ప్రాచీనకాలంలోనే గుర్తించారు.ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా భావించేవారు. ప్రాచీన భారతీయ వైద్యుడు, శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే స్థూలకాయం వల్ల మధుమేహం, గుండెజబ్బులు వస్తాయని గుర్తించాడు. మధ్యయుగాల వరకు స్థూలకాయాన్ని సంపన్నులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగానే పరిగణించేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇది సామాన్యుల సమస్యగా కూడా మారింది.

  స్థూలకాయం సమస్య మనుషులకు మాత్రమే పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెంపుడు జంతువులకూ ఈ సమస్య ఉంది. అక్కడ 23-41 శాతం శునకాలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఒక అంచనా.

 

వీళ్లు... హుషారు కోసం నిశాచర భోజనం చేస్తారు!

ఎవరైనా విపరీతంగా తినేస్తుంటే వారి తిండిని ‘దెయ్యం తిండి’గా అభివర్ణించడం పరిపాటి. పిశాచాలు మేల్కొనే నిశివేళ ఇలాంటి వారిలో దెయ్యంలా భోజనతాపం మేల్కొందా అనిపిస్తుంది. బీఈడీ బాధితులకు, భోజన నిశాచరులకు పెద్దగా తేడా కనిపించదు. అయితే, భోజన నిశాచరులు రాత్రివేళల్లో అతిగా తింటారు. ఏ రాత్రివేళో మెలకువ వస్తే, వంటింట్లో తిండి కోసం వెదుకులాడతారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉండే ఏ చిరుతిళ్లో తిననిదే వీరికి ప్రశాంతంగా ఉండదు. రాత్రివేళల్లో ఇలా అతిగా తినడాన్ని మానసిక వైద్యులు ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ (ఎన్‌ఈఎస్)గా గుర్తించారు.



రోజువారీ తీసుకునే ఆహారంలో 35 శాతం కంటే ఎక్కువ కేలరీలు గల ఆహారాన్ని రాత్రివేళల్లో తీసుకునే అలవాటు ఉంటే, దానిని నైట్ ఈటింగ్ సిండ్రోమ్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. ఉదయం దాదాపు ఖాళీ కడుపుతో ఉండటం, రాత్రివేళ అతిగా తినడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలన్నీ ఎన్‌ఈఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి వారికి ఉదయం వేళలో ఆకలి తక్కువగా, రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో దాదాపు ఒక శాతం, స్థూలకాయుల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి వారు ఉంటారు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top