అన్‌కామన్‌మ్యాన్

అన్‌కామన్‌మ్యాన్ - Sakshi


కార్టూన్  అంటేనే లక్ష్మణ్... లక్ష్మణ్ అంటే కార్టూన్’ అనే స్థాయికి ఎదిగింది ఆర్.కె.లక్ష్మణ్  కుంచె కీర్తి. ఆ మహా శిఖరాన్ని తలచుకుంటూ రాసిన ఒక స్మృతి వ్యాసాన్ని, తెలుగు మీడియాకు లక్ష్మణ్ గతంలో ఇచ్చిన ఏకైక ప్రత్యేక ఇంటర్వ్యూను ‘సాక్షి’ పాఠకుల కోసం అందిస్తున్నాం...

 

పొలిటికల్ కార్టూనిస్ట్టుగా కొత్తగా పత్రికలో చేరినప్పుడు ‘హౌ టు బికమ్ యాన్ ఆర్కే లక్ష్మణ్’ స్కీమ్ పెట్టుకుని ఆబిడ్స్‌లోని సండే మార్కెట్‌లో  ఆయన కార్టూన్ సిరీస్ ‘యు సెడ్ ఇట్’ డజన్ బుక్స్ కొని చూస్తే... ఒక బుక్ మీద ఏకంగా ఆర్కే లక్ష్మణ్ ఆటోగ్రాఫ్ ఉండటం ఇంకో కిక్. యు సెడ్ ఇట్ కార్టూన్ల బుక్ ముందేసుకుని ఆఫీసులో కాపీ చేస్తుంటే అటుగా వెళ్లే ఓ జర్నలిస్టు మిత్రుడు ‘హి సెడ్ ఇట్... యు కాపీడ్ ఇట్...’ అన్నాడు. ఆయన మాటను  కాంప్లిమెంట్‌గా స్వీకరించాను. మాలాంటి కార్ట్టూనిస్ట్టులకి ఆయన బుక్స్ బైబిల్ లాంటివి. ‘యు సెడ్ ఇట్’ కాలం పేరుతో ఆరు దశాబ్దాల కాలం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన కార్టూన్లు వచ్చాయి. ఆయనే పొలిటికల్ కార్టూన్ పితామహుడు రాశీపురం కృష్ణ్ణస్వామి లక్ష్మణ్ అలియాస్ ఆర్కే లక్ష్మణ్.



 ఆర్కే లక్ష్మణ్ తన ఐదవ ఏట నుంచే ఇంటి గోడల మీద బొమ్మలు వేశారు. గోడల మీద బొమ్మలు టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీ పైకి రావడానికి చాలా ప్రస్థానమే చేశారు. మైసూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే జాబ్‌కోసం ఢిల్లీ వెళ్లి హిందుస్తాన్ టైమ్స్‌లో ‘నో’ అనిపించుకుని ముంబయి వెళ్లారు. అక్కడున్న ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో జాబ్ సంపాదించి అప్పటికే పేరుమోసిన కార్టూనిస్టుగా చలామణిలో ఉన్న బాల్‌థాకరే పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. అక్కడ సరిపడక జాబ్ వదిలేసి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పత్రిక ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పత్రిక మొదటి పేజీలో ఓ మూలన ఉండే తన పాకెట్ కార్ట్టూన్‌తో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వుండే ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టారు. ఓ సింగిల్ కాలంలోనే ముంబాయి స్లమ్‌నీ, రాజకీయ బహిరంగ సభల్నీ, చౌరస్తాల్లో ట్రాఫిక్ జాముల్నీ, మున్సిపాలిటీ వాళ్లు తీసి వదిలేసిన గోతుల్నీ తన గీతల లోతులతో విజువలైజ్ చేసి మనల్ని అబ్బురపరిచారు. తనదైన శైలిలో కార్టూన్లతో ఆరు దశాబ్దాలు కార్టూన్ సూపర్‌స్టార్‌గా వెలిగారు. కామన్ మ్యాన్ పుట్టుక టైమ్స్



ఆఫ్ ఇండియాలోనే! కామన్‌మ్యాన్



బట్టతల, బుర్రమీసాలు, గళ్లచొక్కా, ధోతీ, సాక్స్‌లు లేని బూట్లు, చేతిలో గొడుగుతో కనిపిస్తాడు. స్పేస్‌లో, రాజకీయ రహస్య సమావేశంలో, బజారులో, బహిరంగ సభల్లోనూ ప్రతీ కార్టూన్‌లో ఈ కామన్‌మ్యాన్ క్యారెక్టర్ ఉంటుంది. ఏదో బల్ల పక్కన, బీరువా సందులో, కుర్చీ వెనకాలో, కిటికీ అవతల, ప్రాధాన్యం లేనిచోట గీసినా, తన ప్రాధాన్యతను సంతరించుకుంటాడు ఆర్కే లక్ష్మణ్ కామన్‌మ్యాన్. మిగతా కార్టూనిస్టులకార్టూన్లలో ఉండే కామన్‌మ్యాన్ మాట్లాడినా, ఆర్కే లక్ష్మణ్ కామన్‌మ్యాన్ అస్సలు మాట్లాడడు. కామన్‌మ్యాన్‌తో ఎందుకు మాట్లాడించరు అని అడిగితే ‘తనను అలా చూపించటమే నాకిష్టం’ అంటాడు. తన మనోగతమే కామన్‌మ్యాన్ మనోగతం. బహుశా దేశంలో ఒక కార్టూన్ క్యారెక్టర్‌తో శిల్పాలు ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి అనుకుంటా. మూడుచోట్ల కామన్‌మ్యాన్ శిల్పాలు ఏర్పాటు చేయటం ఆ క్యారెక్టర్ ఖ్యాతికి నిదర్శనం. అందులో ఒక శిల్పాన్ని నాటి రాష్ర్టపతి ఆర్కే నారాయణన్ ఆవిష్కరించటం అరుదైన గౌరవం. కామన్‌మ్యాన్ కీలకపాత్రగా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ‘వాగ్లేకి దునియా’ పేరుతో సెటైరికల్  సీరియల్ 1988 నుంచి రెండేళ్లపాటు దూరదర్శన్‌లో ప్రసారమైంది. దీని సృష్టికర్త కూడా ఆర్కే లక్ష్మణ్.



 తన అన్న ఆర్కే నారాయణ్ రాసిన ‘మాల్గ్గుడి డేస్’ స్టోరీలకు తను వేసిన ఇలస్ట్రేషన్లలో రైల్వే స్టేషన్లు, పాత భవంతులు, బస్సులు, కరెంటు స్తంభాలు, వాటి పక్కనే ఉండే చెత్త కుండీలు, గాడిదలు, కుక్కలు, తీగలపై వాలిన కాకులు ఈ చిత్రాలన్నీ చూస్తుంటే ఆయన లైఫ్ స్కెచింగ్ పవరేంటో తెలుస్తుంది. లక్ష్మణ్‌కి కాకులంటే చాలా ఇష్టం. వాటిని కరెంటు తీగలపై, మార్కెట్లలో, నల్లాలపై ఉన్నట్లు ఇండియన్ ఇంక్ వాష్‌తో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు గీసి పలుచోట్ల ప్రదర్శించారు కూడా. లోకంలో కాకి తెలివైనదని, అంత అందమైన పక్షి మరొకటి లేదని, చిలుక కూడా దాని ముందు దిగదుడుపే అని పలుచోట్ల స్పీచ్‌లు కూడా దంచారు. ఆర్కే లక్ష్మణ్ 2002లో హైదరాబాద్ వచ్చినపుడు, నోట్లో బ్రష్‌పుల్ల వున్న కాకిలా ఆయన క్యారికేచర్ గీసి నేను చూపిస్తే... సంతోషించి ‘వెరీ నైస్’ అని ఆటోగ్రాఫ్ ఇచ్చారు



 ఆర్కే లక్ష్మణ్ అద్భుతమైన క్యారికేచరిస్టు కూడా. ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం సినిమాస్టార్ల క్యారికేచర్లు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ కవర్‌కోసం అనేక క్యారికేచర్లు గీశారు. వాటి కలెక్షన్ నా దగ్గర భద్రంగా వుంది. నెహ్రూను అందరూ టోపీతో గీస్తే, తను టోపీ లేకుండా గీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. విభిన్నంగా గీయటం, ఆలోచించటం ఆయన విశిష్టత. జస్వంత్ సింగ్, అర్జున్‌సింగ్ లాంటివారు సైతం ఆయన ఒరిజినల్స్ అడిగి తీసుకున్నారు. తన అభిమాన కార్ట్టూనిస్టు ‘డేవిడ్‌లో’తో సహా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, సుబ్బులక్ష్మి, చార్లీచాప్లిన్ లాంటి మహామహుల క్యారికేచర్లతో టెమ్స్ ఆఫ్ ఇండియా ‘ఫేసెస్’ అనే పేరుతో ఒక పుస్తకం తెచ్చింది. ఆయన కార్టూన్లతో మూడు పుస్తకాలు, రచనలతో మూడు పుస్తకాలు వచ్చాయి.



 మీకు నచ్చిన కార్టూన్ ఏదని అడిగితే... ‘ఇంకా గీయలేదం’టారు. కాకుంటే నా ఫేవరేట్ కార్టూన్ ఒకటుంది అని టెలికమ్ స్కామ్‌లో ఇరుక్కున్న సుఖ్‌రామ్ మీద వేసిన కార్టూన్ గుర్తుచేస్తారు. ఆ కార్టూన్‌లో సుఖ్‌రామ్ క్యాబిన్ ఎటుచూసినా నోట్ల కట్టలతో నిండి ఉంటుంది. ‘నా ఇన్నోసెన్స్ గురించి రాష్ర్టపతికి లేఖ రాయాలి, అర్జంటుగా ఒక వైట్ పేపర్ కావాలి’ అని ఫోన్లో సుఖ్‌రామ్ మాట్లాడుతున్నట్లుగా ఉండే కార్ట్టూన్ అది.



 కార్టూన్ అంటేనే లక్ష్మణ్. లక్ష్మణ్ అంటేనే కార్ట్టూన్. ఇప్పటికీ ఎప్పటికీ కార్టూన్ కేరాఫ్ లక్ష్మణే. తన కార్టూన్లతో ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ధైర్యంగా కార్టూన్లు వేసి తన కుంచెకు కంచెలు లేవని నిరూపించారు. ‘మీరు కార్టూనిస్టు కాకుంటే ఏమై ఉండేవారు?’ అని అడిగిన ప్రశ్నకు ‘ఆత్మహత్య చేసుకునే వాడిని’ అని సూటిగా చెప్పే కమిట్‌మెంట్ ఉన్న కార్టూనిస్టు లక్ష్మణ్. అందుకే ఆయనకు దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. గత ఆరు దశాబ్దాలుగా తనవంతుగా కాకుండా మనవంతుగా ప్రజల పక్షాన కార్టూన్లు గీసిన అన్‌కామన్‌మ్యాన్ ఆర్కే లక్ష్మణ్‌కు భారతరత్న కూడా ఇచ్చి గౌరవిస్తే మాలాంటి కార్టూనిస్టులు, ఎడిటర్లు, కాలమిస్టులూ, పాఠకులు సంతోషిస్తారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియాను కూడా గౌరవించినట్లవుతుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top