క్యాన్సర్ కౌన్సెలింగ్


సర్వైకల్ క్యాన్సర్ సర్జరీ తప్పదా!



 నా వయసు 30. నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. దీనికి సర్జరీయే మంచిదని అంటున్నారు. ఇది నిజమేనా?  నా వైవాహిక జీవితంపై దీని ప్రభావం ఏదైనా పడుతుందా?   - ఒక సోదరి, గరుడాపురం



సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఇది మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందుకే అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీకు ఏరకం సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందన్న విషయం చెప్పలేదు. సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలున్నాయి. ఈ రెండింటికి అవలంబించాల్సిన చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీకు వచ్చింది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, అప్పుడు సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించడమే ఏకైక మార్గం.



ఇక ఇందులో రెండోది ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. ఇది కాస్త ముదిరినప్పటికీ చికిత్స చేసేందుకు చాలా మంచి  ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. మీకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చెప్పారంటున్నదాన్ని బట్టి చూస్తే, బహుశా మీ విషయంలో మొదటి లేదా రెండో దశలోనే క్యాన్సర్‌ను కనుగొని ఉండవచ్చు. ఈ దశలో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ అయినా రెండూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ రెండింటికీ వాటివాటి ప్రయోజనాలూ, దుష్ర్పభావాలూ రెండూ ఉంటాయి. ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇక మీ విషయంలో మీ వయసు చాలా చిన్నది కావడం, ఇంకా చాలా సెక్స్ జీవితాన్ని అనుభవించాల్సి ఉండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే శస్త్రచికిత్స మేలు. పైగా సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే  కోలుకోగలరు. సర్జరీతో వచ్చే దుష్ర్పభావాలు అతి స్వల్పం. ఇది ప్రాణాంతకం కాదు. చాలా కొద్దిమందిలోనే సర్జరీ అనంతర కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారితో పాటు, సర్జరీ అంటే భయపడేవారికి ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తాం.



అయితే ఈ రేడియోథెరపీ తీసుకున్నవారిలో తర్వాత అడ్హెషన్స్ వంటివి రావడం వల్ల, యోని పొడిబారడం వల్ల సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉండకపోగా, చాలా బాధాకరంగా కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడకుండా విజయావకాశాలు 75%నుంచి 90%వరకు ఉండే శస్త్రచికిత్సే చేయించుకోవడం మంచిది. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’తో వస్తుంది. దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్స ర్‌ను ముందుగానే నివారించవచ్చు అనే విషయాన్ని మహిళలందరూ తెలుసుకొని 12-20 ఏళ్ల మధ్యలో దాన్ని తీసుకోవడం మంచిది.

 

 డాక్టర్ కె.శ్రీకాంత్

 సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్

 యశోద హాస్పిటల్స్,

 సోమాజిగూడ, హైదరాబాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top