క్యాలెండర్ కాదనర్హం.....

క్యాలెండర్ కాదనర్హం.....


తెలుసుకుంటే పాతకాలం సంగతులు కూడా తమాషా. జాక్ లండన్ రోజుకు వెయ్యి పదాలు రాస్తానని పంతం పట్టి, రోజంతా ఎన్ని బేకార్ పనుల్లో ఉన్నా, అర్ధరాత్రయినా సరే అన్ని పదాలూ రాసి నిద్రపోయేవాడట. మార్క్ టై్వన్ సంగతి తెలిసిందే. ప్రతి ముక్కా నిలబడే రాసి తానొస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా లేచి నిలబడేంత పేరు సంపాదించాడు. ఇక హెమింగ్వేకు తెల్లవారుజామున మొదటి సూర్య కిరణం తాకుతుండగా రాయడం అలవాటు. జేమ్స్ జాయిస్ మంచం పై పొట్ట మీద వాలి (బోర్లా పడుకొని) రాయడం అందరికీ తెలుసు. మన కొ.కు కూడా సాయంత్రం చందమామ ఆఫీస్ నుంచి వచ్చీ రాగానే ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ఇంటి హాలులో నేలపై పొట్ట మీద వాలి రాసుకుంటూ ఉండిపోయేవారట. అయితే కొందరు భావుకుల కథ వేరే.



కొబ్బరి మీగడలాంటి కాగితం సుతారంగా నడిచే కలం కనబడటమే తరువాయి రాయడానికి పూనుకునేవారట మల్లాది రామకృష్ణశాస్త్రి. జాతక కథలను నేరుగా పాళీ నుంచి తెలుగులోకి అనువదించిన తల్లావఝల శివశంకరశాస్త్రి తాను ఏ పుస్తకం రాస్తూ ఉన్నా పక్కన పరిమళాలీనే ఒక పువ్వును ఉంచుకునేవారట. ఆచంట జానకీరామ్ కూడా అంతే. రాసేటప్పుడైనా, చదివేటప్పుడైనా తన ఎడమ చేతి గుప్పిట్లో రెండు మూడు గండుమల్లెలని ఉంచుకొని వాటి సువాసన ఆస్వాదిస్తూ  రచనాలోకాల్లో విహరించేవారట. విశ్వనాథకు మధ్య మధ్య ఇంగ్లిష్ సినిమాల సైరు ఉంటే తప్ప కలం కదిలేదు కాదు. చలం మహాశయునికి ఈ గొడవంతా లేదు. ఎండ కావాలని, వాన కావాలని, వరండా కావాలని, వెన్నెల కావాలని అనేవారు కాదట. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది లోపల ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రాసేవారట. తొమ్మిది తర్వాత బంద్. కాకి అరిచినా పిల్లలు గోల చేసినా మూడ్ ఏ మాత్రం డిస్ట్రర్బ్ అయ్యేది కాదట. వాళ్ల గోల వాళ్లదే. ఈయన రాత ఈయనదే.  పతంజలి చేతివేళ్లు చాలా బలంగా దృఢంగా చివర్లు కూసుగా ప్రొక్లయినర్ పళ్లలాగా ఉండేవి. ఆయన ఒక చేత్తో సిగరెట్ వెలిగించి ఒక చేత్తో పెద్ద పెద్ద అక్షరాలతో చకచకమని రాయడం- నల్లకుంటలో- ‘రాజుల లోగిళ్లు’ నవల అనుకుంటాను- చూశాను. మరి నెలలు నిండాయని గ్రహించక, సరంజామా దగ్గర ఉంచుకోక, ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యి లబోదిబోమంటుండగా, రాయడానికి ఏమీ దొరక్క గోడకు తగిలించి ఉన్న పంచాంగం క్యాలెండర్ అందుకొని పేజీల వెనుక వైపంతా గబగబా కథ రాసిన సందర్భాలు పెద్దిభొట్ల సుబ్బరామయ్యకు ఉన్నాయి.



‘ఫినిష్డ్ స్టోరీస్’ అంటారు. అంటే లోలోపలే కథంతా సంపూర్ణంగా తయారయ్యి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆటంకాలు అవరోధాలు లేకుండా బయట పడటం. సింగిల్ డ్రాఫ్ట్. దీనికి లోపల చాలా కసరత్తు జరగాలి. అందుకు చాలా అనుభవం కావాలి. కాని చాలామంది రాస్తూ రాస్తూనే తమకు కావలసిన కథను వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. హెమింగ్వే ఇలాంటి సాధనే చేశానని చెప్పుకున్నాడు. అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా సరే- రాయడం, తిరగ రాయడం తప్పని సరి. ఈ చూసుకోవడం సరి చేసుకోవడమే జీవితాంతం ఈ వెర్రిబాగులకు  సిరి.

 - ఖదీర్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top