మందు పోయి మొగుడు వచ్చె... ఢాం ఢాం ఢాం

మందు పోయి మొగుడు వచ్చె... ఢాం ఢాం ఢాం


బిహార్‌లో సంపూర్ణ  మద్యనిషేధం తర్వాత మందు మానేసిన మొగుళ్లు గుడ్‌బాయ్స్‌లాగా ఇంటిదారి పట్టారట. సశారామ్ జిల్లా మొహ్దిగంజ్ గ్రామంలో పదహారేళ్ల క్రితం తాగుబోతు మొగుడు జయగోవింద్ ఇల్లొదిలి పోయాడు. మందు మానేసి మంచోడైన భర్తను... భార్య వైజయంతి దేవి మళ్లీ పెళ్లి చేసుకుంది. కూతురు గుడ్డీ పెళ్లి పెద్దగా అన్ని ఏర్పాట్లు చేసింది.

 

బిహార్ వెనుకబడిన రాష్ట్రమనీ, అథోగమనంలో ఉందనీ ఎన్నోసార్లు రాజకీయాల్లో, సినిమాల్లో, సాహిత్యంలో.. చెప్పుకోవడం, చూడడం, చదవడం జరిగింది. ఒకప్పుడు లాలూగారి మీద సెటైర్‌లు కూడా ఉండేవి! జపాన్ వాళ్లు లాలూను కలిసి.. ‘బిహార్‌ని మాకివ్వండి, ఏడాదిలో జపాన్‌గా మార్చేస్తాం’ అన్నారట. అందుకు లాలూజీ.. ‘జపాన్‌ని మాకివ్వండి... నెల రోజుల్లో బిహార్‌ని చేసేస్తాను’ అన్నారట. బిహార్‌ని అలా తూలనాడినా ఇవాళ బిహార్... మన రెండు తెలుగు రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.



సంపూర్ణ మద్య నిషేధం తర్వాత అక్కడి తాగుబోతు  మొగుళ్లు... మళ్లీ కుటుంబాలకు  చేరువవుతున్నారు. అర అనాథలుగా బతుకుతున్న పిల్లలకు మళ్లీ తండ్రి దొరికాడు. కుటుంబమే కాదు,  బిహార్ అన్న పెద్ద కుటుంబం కూడా ఉత్పాదకతను పెంచుకుని దేశంలోని రాష్ట్రాలలో... రేసుగుర్రంలా దౌడు తీస్తోంది.

 

‘పిన్నీ...  ఎల్లుండి మా అమ్మానాన్నల పెళ్లి... తప్పకుండా రావాలి’ పక్కింటి పిన్నికి శుభలేఖ ఇచ్చి గుమ్మం దాటుతూ ‘మరిచిపోవద్దు’ అంటూ కేకేసి చెప్పింది పద్దెనిమిదేళ్ల గుడ్డ్డీకుమారి.

 ‘ఓ పిల్లా...  మరిచిపోవద్దు అంటూ అరుస్తున్నావ్ ఏంటీ సంగతి’ అన్నాడు యాభై ఏళ్ల వ్యక్తి.

 ‘ఏంలేదు ఛాఛా, ఎల్లుండి మా అమ్మానాన్న పెళ్లి. మీరూ రండి’ అతనికీ శుభలేక ఇచ్చింది గుడ్డీ.

 ‘మీ నాన్న ఏంటి? మీ అమ్మతో పెళ్లి ఏంటి?’ శుభలేఖ తీసి చూస్తూ ఆశ్చర్యపోయాడా వ్యక్తి.

 

‘ఆ సస్పెన్స్ తెలుసుకోవాలనుకుంటే పెళ్లికి రా మామయ్యా. అదంతా చెప్పే టైమ్ లేదు. ఇవన్నీ పంచాలి’ అంటూ చేతిలోని శుభలేఖలు చూపిస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలింది గుడ్డ్డీకుమారి!

 ఈ వేడుక జరిగిన చోటు బిహార్. సశారామ్ జిల్లాలోని మొహ్దిగంజ్ గ్రామం. ఆ సంబరానికి కారణం బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్.



పదహారేళ్ల క్రితం

మొహ్దిగంజ్... తాగుబోతుల కేంద్రంగా ఉండేది. ఆ ఊళ్లోని మగాళ్లు, మొగుళ్లు వేరే పనిలేకుండా తాగుడే వ్యసనంగా జీవితాన్ని గడుపుతుండేవారు. వాళ్లలో గుడ్డీవాళ్ల నాన్న గోవింద్‌సింగ్ ఒకడు. అప్పటికి గుడ్డీ రెండేళ్ల పసిపిల్ల. తల్లి వైజయంతే కూలీనాలీ చేసుకుంటూ ఇంటిని, బిడ్డ బాగోగులనూ చూసుకునేది. పెపైచ్చు భర్తకు తాగడానికి డబ్బులివ్వాల్సి వచ్చేది. కుటుంబ బాధ్యత మరిచిన భర్త వల్ల అప్పుల మోత తప్ప ఆవగింజంత సుఖం దొరకలేదు ఆమెకు. భర్తతో తాగుడు మాన్పించలేక విసిగి వేసారింది వైజయంతి.



గోవింద్ సింగ్ తాగుడు మత్తులో ఓ రోజు ఇల్లే కాదు... ఏకంగా ఊరే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. భర్త కోసం చుట్టుపక్కల ఊళ్లు, చివరకు జిల్లా అంతా గాలించింది. ఎక్కడా ఆయన అడ్రస్ లేదు. చేసేదేంలేక గాలింపు ప్రయత్నాలు మానుకుంది వైజయంతి. ఆశంతా కూతురి మీదే పెట్టుకొని బతకసాగింది.

 

పదహారేళ్ల తర్వాత

అలా వెళ్లిన వైజయంతి భర్త గోవింద్ సింగ్ పదహారేళ్ల తర్వాత ఈ మధ్యనే భార్య, బిడ్డను వెదుక్కుంటూ ఇంటికి తిరిగొచ్చాడు. భార్యను, ఎదిగిన కూతుర్ని చూసుకొని ఆనందబాష్పాలు రాల్చాడు. భర్త తిరిగొచ్చినందుకు వైజయంతికి ఆనందంగానే ఉన్నా అతనితో ఉన్న పాత అనుభవాలు ఆమెను భయపెట్టాయి. తాగుతూ ఇంటిని మళ్లీ నరకం చేస్తాడేమోనని కలవరపడ్డది. కూతురు పెరిగింది. విషయాలన్నీ తెలుస్తాయి. తాగే తండ్రిని బిడ్డ ఎంత చీదరించుకుంటుందో, ఎంత తేలికగ్గా తీసిపారేస్తుందోనని ఆందోళన చెందింది.



అయితే భార్య భయం, కలవరం, ఆందోళనలన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టాడు గోవింద్‌సింగ్. ఈసారి ఆమె కాలు నేలమీద నిలవలేదు. ఆ సంతోషాన్ని ఇంటింటికీ వెళ్లి పంచుకుంది. ‘పిచ్చిదానా... నీ మొగుడే కాదు... మా మగాళ్లూ తాగుడు మానేశారు’అని చెప్పారు వాళ్లు. ఇరుగుపొరుగులోనే కాదు ఊళ్లోని మగాళ్లంతా తాగుడు మానేశారని తెలిసింది.

 

ఆ శుభ సందర్భంగానే తిరిగొచ్చిన తన వసంతంతో మళ్లీ మనువాడాలనుకుంది వైజయంతి. ఆ విషయాన్ని కూతురితో చెప్పింది. కూతురూ సంబరంగా అమ్మానాన్న పెళ్లిబాధ్యతను భుజాన వేసుకొని బాజాభజంత్రీలు మోగించే పనిలో పడింది. ‘నిజానికి మా ఆయన మంచోడే... కానీ ఆ దిక్కుమాలిన తాగుడే మా ఇద్దర్నీ విడదీసింది.



మద్య నిషేధం మూలంగా మందు మానేసి మంచి మనిషై ఇల్లు చేరాడు. అందుకే మళ్లీ మా ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నా. తర్వాత ఇద్దరం కలిసి పీటల మీద కూర్చుని మా అమ్మాయి పెళ్లి చేస్తాం’ అంటూ సిగ్గులొలికింది వైజయంతి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా మద్యపానాన్ని ఖజనాకు రాబడిగా భావించకుండా ప్రజల సుఖసంతోషాల దోపిడిగా భావిస్తే మంచిది. ఆ దిశగా నిషేధాన్ని విధిస్తే మరీ మంచిది.            

 

మందు మానితే... పంచామృతాలు!

* డబ్బు ఆదా అవడంతో జీవన స్థితిగతులు మెరుగవుతాయి. పిల్లల చదువు కోసం ఖర్చు చేయవచ్చు.

* భావోద్వేగాలు అదుపులో ఉండడం వల్ల మానవసంబంధాలు బాగుంటాయి. రోజులో నాలుగైదు గంటల సమయం ఖాళీ దొరకడంతో పనుల కోసం, కుటుంబంతో గడపడానికి సమయం పెరుగుతుంది.

* ఉద్యోగవ్యాపారాలను సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. మనిషి పని చేసే సమయం పెరగడంతో ఉత్పత్తి పెరుగుతుంది. ఇది స్థూల జాతీయోత్పత్తిని ఇతోధికంగా పెంచుతుంది.

* గ్రామాల్లో మద్యం దుకాణాలు లేకపోతే మహిళలు, పిల్లలు ఆ దారి వెంట ధైర్యంగా నడవగలుగుతారు.

* మద్యం తాగినప్పుడు మహిళలను లైంగికంగా వేధించడం వంటి నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మద్యం కారణంగా జరిగే అనేక చిల్లర తగాదాలకు తెరపడుతుంది.

 

మన రాష్ట్రాల్లో ఇదా ఉదాహరణ!

పెద్దనాన్న, పెద్దమ్మలకు మమ్మల్ని పోషించడమే భారం. మళ్లీ చదివించాలంటే కష్టమే! ఎవరైనా మమ్మల్ని చదివిస్తే పెద్ద చదువులు చదువుతాం. మేము దణ్ణం పెట్టి చెబుతున్నాం... ‘ఎవ్వరూ మద్యం తాగొద్దండి. ప్లీజ్’

- చాందిని, ఫరీదా


 

బిహార్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయడంతో... అక్కడ విడి పోయిన జంట మళ్లీ కలిసింది. ఏపీలో మాత్రం మద్యం కాటుకు రోజూ ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతూనే ఉన్నాయి.

 

బాబాఫకృద్దీన్ (బాబు) ది అనంతపురంలో రాజీవ్ కాలనీ. ఉన్నంతలో భార్యా, భర్త సంతోషంగా గడిపేవారు. కొంతకాలానికి బాబుకు మద్యం అలవాటైంది. మద్యానికి పూర్తిగా బానిసైన తర్వాత ఆటో నడపడం కూడా మానేశాడు.పెళ్లయిన మూడేళ్లలో ఇద్దరు అమ్మాయిలు. చేసేదేమీ లేక భార్య షరీఫానే కూలిపనికి వెళ్లి జీవనం సాగించేది. తాగుడుకి చేతిలో డబ్బులేకపోతే బాబు ఇంటికొచ్చి డబ్బు కోసం భార్యను వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆరోజు షరీఫా ఒళ్లు గుల్లకావల్సిందే. పిల్లలు పెద్దవారయ్యారు. బాబుకు రెండుకిడ్నీలు పాడయ్యాయి.  అయినా మార్పు రాలేదు.



బతుకు బండిని నడిపే ఓపిక, సహనం నశించాయామెలో. విసిగిపోయి ఓ రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. భార్య కేకలు విని మత్తులో నుంచి లేచాడు బాబు. ఏడుస్తూ భార్యను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ షరీఫా బతకలేదు. తర్వాత కూడా బాబు మద్యం మానలేదు. దీంతో షరీఫా సోదరి ఖాతూన్‌బీ పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లింది. బాబు ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో భార్య చనిపోయిన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. పిల్లలు అనాథలయ్యారు.

 - రవివర్మ మొగిలి, సాక్షిప్రతినిధి

 - వీరేశ్. జి, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top