బేటీ బచావో టూర్‌

బేటీ బచావో టూర్‌ - Sakshi


బిహార్‌ టు కశ్మీర్‌

కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే  బిడ్డ కళ్లు తెరవకుండానే గర్భ విచ్ఛిత్తి చేస్తున్న మనుషులింకా ఈ సమాజంలో ఉన్నారు. ఇలాంటి ఘోరాలు సమాజంలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌ రాజధాని పట్నా సమీపంలోని సదావే గ్రామానికి చెందిన పోలియో బాధితుడు అరవింద్‌కుమార్‌మిశ్రా మోటార్‌ సైకిల్‌పై దేశవ్యాప్తంగా ‘బేటీ బచావో’ (బాలికలను రక్షించండి) అనే నినాదంతో మోటార్‌ సైకిల్‌ యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత ఆగస్టు 25న ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో యాత్ర ప్రారంభించిన అరవింద్‌కుమార్‌ మిశ్రా ఇటీవలే మదనపల్లెకు చేరుకున్నారు. అంతకు ముందు తొమ్మిదేళ్లపాటు ఆయన రక్తదానం, పోలియోపై జనంలో అవగాహన కోసం బైక్‌ యాత్రలు చేశారు. ‘సాక్షి’తో ఆయన పంచుకొన్న విశేషాలు ఆయన మాటల్లోనే...



సంకల్ప బలమే... చోదకశక్తి

మా నాన్న సాధారణ రైతు. బాల్యంలోనే పోలియో సోకడంతో నా రెండు కాళ్లు వంకరపోయాయి. కష్టంగా నడిచేవాణ్ణి. డిగ్రీ వరకు చదివాను. విశాఖపట్నంలో మంచి వైద్యం అందుతుందంటే 2002లో అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నాను. దురదృష్టవశాత్తూ అది విఫలమైంది. తిరుపతిలోని ‘బర్డ్‌’ ఆస్పత్రి గురించి తెలుసుకుని రెండోసారి అక్కడ చికిత్స చేయించుకున్నా.  అది కూడా విఫలమైంది. గతంలో ఎలాగో నడిచేవాణ్ణి. రెండు శస్త్ర చికిత్సల తర్వాత పూర్తిగా కుర్చీకే పరిమితయ్యా.  దీనికి తగ్గట్టు బరువు కూడా పెరిగిపోయా. దీంతో నాకో ఆలోచన వచ్చింది. నా లాంటి ఎందరో జీవితాంతం ఎన్నో ఇబ్బందులుపడాల్సి వస్తోంది. పోలియో సహా సామాజిక సమస్యలపై దేశవ్యాప్త అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నా.  



బిహార్‌లో చూసి...

బిహార్‌ రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో గర్భంలోనే ఆడబిడ్డను చిదిమి వేస్తున్నారు. ఇలాంటి దౌర్భా గ్యం నేను కళ్లారా చూశాను. ఎంతో బాధపడ్డాను. ఆడబిడ్డల సంఖ్య తగ్గిపోతే సమాజం ఏమైపోతుందని ఆందోళన చెందాను. దీనిపై ఎలాగైనా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. ప్రస్తుతం నా యాత్ర 11 రాష్ట్రాల మీదుగా సాగుతోంది. కశ్మీర్‌ వరకు చేస్తా. ఈ యాత్రకు దాదాపు పదేళ్లు పట్టవచ్చుని భావిస్తున్నా.



ఏ రాష్ట్రంలో... ఆ భాష బ్యానర్‌

నా వాహనం బ్యాటరీతో నడుస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్‌ కావాలంటే 8 గంటలు పడుతుంది. దీనికి ఒక యూనిట్‌ విద్యుత్‌ అవసరం. దీంతో 60–70 కి.మీ ప్రయాణించవచ్చు. నన్నూ, నా వాహనాన్నీ చూసిన వెంటనే అనేకమంది వచ్చి అభినందిస్తున్నారు. భోజనం, రాత్రి బస ఎక్కడికక్కడే దాతలు ఏర్పాటు చేస్తున్నారు. వేలాది కిలోమీటర్లు, సంవత్సరాల పాటు జరిగే నా సుదీర్ఘ గమనానికి ముందస్తు ప్రణాళిక ఉండదు. సా«ధ్యమైనన్ని ఎక్కువ గ్రామాల్లో పర్యటించడమే నా లక్ష్యం. ఓ రాష్ట్రం చేరగానే నా యాత్ర లక్ష్యం ఆ రాష్ట్ర వాసులకు అర్థమయ్యేలా అక్కడి స్థానిక బాషలో బ్యానర్‌ తయారు చేయిస్తా. ఇందుకు అక్కడి దాతల సహకారం తీసుకుంటున్నా. రాత్రయితే జాతీయ రహదారి పక్కన, పెట్రోల్‌ బంకుల వద్ద, పెద్ద చెట్లు కింద పడుకుంటా. ఒక్కోసారి తినడానికి తిండి దొరికేది కాదు. అరటిపండ్లు, బిస్కెట్లతో కడుపు నింపుకొనేవాణ్ణి.



కేరళ మంత్రి ఇచ్చిన కానుక

మొదటిసారి 2007లో రక్తదానంపై అవగాహన కోసం ట్రైసైకిల్‌పై యాత్ర నిర్వహించాను. చెన్నైకి చేరుకోగానే నా ట్రై సైకిల్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో నా యాత్ర మధ్యలో బ్రేక్‌ పడింది. రెండోసారి 2008లో పూరీ నుంచి కన్యాకుమారి వరకు పోలియో యాత్ర ప్రారంభించా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా 2014లో కేరళ చేరుకున్నా. అప్పటి కేరళ మంత్రి మోహన్‌ బ్యాటరీ వాహనం సమకూర్చారు.



11 నెలలు యాత్రలోనే!

ఏ రాష్ట్రంలో ఉన్నా నా యాత్ర ఏడాదికి 11 నెలలే. నెల రోజులు కుటుంబం కోసం బిహార్‌లోని ఇంటికి వెళ్తా. వచ్చాక యాత్రను వదిలిన చోటు నుంచే మళ్లీ ప్రారంభిస్తా. నాకు అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి ఉన్నారు. ఇప్పుడు నా వయస్సు 41 ఏళ్ళు. నా ఆశయం పక్కదారి పడుతుందని పెళ్లి చేసుకోలేదు.   – మాడా చంద్రమోహన్, సాక్షి, మదనపల్లె ఫొటోలు: సాయికళ మాడా



ప్రశ్నించే తత్వం అలవడుతుంది

ఆడపిల్లలు పుట్టడం శాపం కాదు. ఎంతో గర్వకారణం. యాత్ర వల్ల ఈ సామాజిక రుగ్మతను ప్రశ్నించే తత్వం ప్రజలకు అలవడుతుంది. అరవింద్‌ మిశ్రా చేపట్టిన యాత్రకు అందరూ మద్దతునివ్వాలి.

– జోళెపాళెం మంగమ్మ, మొదటి మహిళా రేడియో న్యూస్‌రీడర్, మదనపల్లె



యాత్ర వల్ల మార్పు వస్తుంది

అరవింద్‌కుమార్‌ మిశ్రా చేపట్టిన యాత్ర వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రధానంగా గ్రామాల్లో పర్యటించి ఆడపిల్లల ప్రాముఖ్యాన్ని చెబుతున్నాడు. అపోహలు, భయాలు తొలగిస్తున్నాడు. దీని వల్ల సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది.

– జల్లా లలితమ్మ, ‘బాలల హక్కుల వేదిక’ రాష్ట్ర అధ్యక్షురాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top