బెంగాలి కోడిపెట్ట...

బెంగాలి  కోడిపెట్ట...


వారాంతం వస్తే కొత్త రుచి జిహ్వకు తగలాలి...

అది కాస్తా మాంసాహారమైతే ఆ మజాయే వేరు...

అందులోనూ చికెన్ అయితే చెప్పనవసరమే లేదు...

ఎప్పుడూ తినే చికెన్‌కు....

కొత్త రుచిని జోడిస్తే ఇక తిరుగే లేదు...

ఎంతసేపూ మన కోడికూరనే ఏం తింటాం!

ఈసారి బెంగాలీ కోడిని...

మన కిచెన్‌లోకి తెచ్చుకుందాం...

చికెన్ రోల్స్, బర్తా, జాల్‌ఫ్రెజీ, రెజాలా...

రుచిని ఆస్వానిద్దాం!


 

కోల్‌కతా   చికెన్‌రోల్స్

 

కావలసినవి:  రోల్ కోసం: మైదా - 300 గ్రా, నీళ్లు - అరకప్పు, నూనె - 1 చెంచా, ఉప్పు - 1 చెంచా, చక్కెర - 1 చెంచా

 ఫిల్లింగ్ కోసం: బోన్‌లెస్ చికెన్ - అరకిలో, పెరుగు - 200గ్రా., ఉల్లిపాయ - 1, క్యాప్సికమ్ - 1, పచ్చిమిర్చి - 2, చికెన్ మసాలా - 3 చెంచాలు, కారం - 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, టొమాటో కెచప్ - 2 చెంచాలు, నెయ్యి - 2 చెంచాలు, మిరియాల పొడి - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా

 

తయారీ : ముందుగా చికెన్‌కు పెరుగు, చికెన్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, టొమాటో కెచప్ కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి; మైదాలో నీళ్లు, నూనె, ఉప్పు, చక్కెర కలిపి చపాతీ పిండిలా చేసుకుని ఉంచుకోవాలి; ఓ గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసి... చికెన్‌ను వేయాలి; కాసేపు వేయించి, కొద్దిగా నీరు పోసి మూతపెట్టాలి; బాగా ఉడికి మెత్తబడిన తర్వాత దించేసుకోవాలి; మరో చెంచా నేతిని వేడి చేసి... ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి తీసేయాలి; ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పరాటాలు ఒత్తుకోవాలి; వీటి మధ్యలో చికెన్ వేసి, ఆ పైన ఉల్లి+క్యాప్సికమ్+మిర్చి ముక్కల మిశ్రమాన్ని వేసి రోల్స్‌లా చుట్టాలి.

 

బెంగాలీ  చికెన్ బర్తా

 

కావలసినవి: బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ - అర కిలో, ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు, వెల్లుల్లి రేకులు - 2, మిరియపు గింజులు - 6, పులావ్ ఆకు - 1, ఉప్పు - తగినంత  గ్రేవీ కోసం: ఉల్లిపాయలు - 2, టొమాటోలు - 2, ఉడికించిన కోడిగుడ్డు - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర చెంచా, జీడిపప్పు పేస్ట్ - 3 చెంచాలు, పెరుగు - 2 చెంచాలు, క్రీమ్ - 2 చెంచాలు, యాలకులు - 4, లవంగాలు - 6, పులావ్ ఆకులు - 2, కారం - 2 చెంచాలు, పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి - అరచెంచా చొప్పున, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత

 తయారీ :  త ఓ బౌల్‌లో చికెన్, వెల్లుల్లి రేకులు, ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, మిరియాలు, పులావ్ ఆకు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. దీనిని చల్లారబెట్టి... ఫోర్క్ సాయంతో పొడవైన స్ట్రిప్స్‌లాగా చేసుకోవాలి  ఉడికించిన కోడిగుడ్డును చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి  స్టౌ మీద కడాయి పెట్టి, మూడు చెంచాల నూనె వేయాలి. వేడయిన తర్వాత పులావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉడికించాలి  ఓ బౌల్‌లో పసుపు, కారం, ధనియాల పొడి వేసి, కొద్దిగా నీరు చేర్చి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని కూడా పైన మిశ్రమంలో కలిపి ఇంకాసేపు ఉడికించాలి. తర్వాత పెరుగు, జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి, ఓ కప్పు నీళ్లు పోయాలి  నీళ్లు మరుగుతున్నప్పుడు క్రీమ్, మెంతిపొడి వేసి కలిపి... ఆపైన చికెన్‌ని కూడా వేసి మూత పెట్టాలి  గ్రేవీ దగ్గరగా అయ్యాక కోడిగుడ్డు ముక్కలు, కొత్తిమీద కూడా వేసి బాగా కలిపి దించేసుకోవాలి.

 

చికెన్  రెజాలా

 

కావలసినవి: చికెన్ - అరకిలో, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, జీడిపప్పు+గసగసాల పేస్ట్ - 1 చెంచా, మిరియాల పొడి - 1 చెంచా, చక్కెర - అరచెంచా, రోజ్‌వాటర్ - అర చెంచా, మీఠా అత్తర్ - అర చెంచా (షాపుల్లో దొరకుతుంది), నూనె - తగినంత, ఉప్పు - తగినంత మసాలా కోసం:     ఎండుమిర్చి - 4, యాలకులు - 5, లవంగాలు - 4, దాల్చిన చెక్క - చిన్నముక్క, జాపత్రి - కొద్దిగా, మిరియాలు - అర చెంచా (వీటన్నిటినీ నేతిలో వేయించి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి)

 

తయారీ :  చికెన్‌ను శుభ్రంగా కడిగి, నీళ్లు పిండేసుకోవాలి; ఉల్లిపాయల్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి; చికెన్‌కు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, జీడిపప్పు+గసగసాల పేస్ట్ పట్టించి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; నూనె వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి; తర్వాత చికెన్‌ను వేసి, మూత పెట్టి, తక్కువ మంటమీద మగ్గనివ్వాలి; చికెన్ మెత్తబడిన తర్వాత కాసింత నీరు పోసి, మిరియాల పొడి చల్లి, ఓ పది నిమిషాల పాటు ఉడికించాలి; గ్రేవీ చిక్కబడిన తర్వాత చక్కెర, రోజ్ వాజర్, మీఠా అత్తరు చల్లి దించేసుకోవాలి; వేయించిన ఎండుమిర్చి, జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించి వడ్డించాలి.

 

చికెన్ జాల్‌ఫ్రెజీ


 

కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - ముప్పావు కిలో, ఉల్లిపాయ - 1, టొమాటోలు - పావుకిలో, నెయ్యి - 30 గ్రా., పసుపు - 3 చెంచాలు, లవంగాల పొడి - 1 చెంచా, కారం - 1 చెంచా, జీలకర్ర పొడి - 3 చెంచాలు, ధనియాల పొడి - 2 చెంచాలు, సన్నగా తరిగిన అల్లం - 2 చెంచాలు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత  తయారీ :  స్టౌమీద గిన్నె పెట్టి, రెండు చెంచాల నూనె వేయాలి; నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి; తర్వాత చికెన్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి; చికెన్ మెత్తబడ్డాక టొమాటో ముక్కలు వేసి మూత పెట్టాలి; టొమాటో ముక్కలు మెత్తబడి, గుజ్జులాగా తయారైన తర్వాత నెయ్యి, ధనియాల పొడి, లవంగాల పొడి చల్లి, జిలకర్ర పొడి బాగా కలపాలి; మొత్తం గ్రేవీ అంతా ముక్కలకు బాగా పట్టి, గ్రేవీ దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించేసుకోవాలి.

 

 సేకరణ:  సమీర నేలపూడి

 

 కర్టెసీ: షర్మిలా దాస్

చెఫ్, షర్మిలాస్ కిచెన్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top