నరకం చూపించారు...

నరకం చూపించారు...


 షీ అలర్ట్ !

 

 మహిళలూ జాగ్రత్త!

 

 సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... సమయం రాత్రి పన్నెండు దాటి ఇరవై నిమిషాలు అయ్యింది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. ఊరు ఎప్పుడో నిద్రపోయింది. మేమొక్కళ్లమే మెలకువగానే ఉన్నాం అన్నట్టుగా ఎక్కడి నుంచో కీచురాళ్ల రొద మాత్రం వినిపిస్తోంది. ఎటు చూసినా చిక్కటి చీకటి. నా మనసు నిండా కూడా చీకటే ఉన్నందుకో ఏమో... ఈ చీకటి నన్ను అంతగా భయపెట్టడం లేదు. అందుకే వడివడిగా అడుగులు వేస్తున్నాను. గమ్యాన్ని చేరాలని త్వరపడుతున్నాను. కానీ ఒక్కసారిగా నా అడుగులు ఆగిపోయాయి. దూరంగా ఏదో వెలుతురు కనిపిస్తోంది. మెల్లగా నావైపే వస్తోంది. అది నా జాడనే వెతుకుతోందా అనిపించి ఒళ్లు ఝల్లుమంది. ఏం చేయాలి? ఎక్కడ దాక్కోవాలి? కంగారుగా అటూ ఇటూ చూశాను. ఓ ఇంటి ముందు ఇటుకలు కుప్పపోసి ఉన్నాయి.



గబగబా వెళ్లి ఆ కుప్ప మాటున దాక్కున్నాను. వెలుతురు దగ్గర పడేకొద్దీ ఏదో శబ్దం చిన్నగా నా చెవులను సోకుతోంది. బైక్ అనుకుంటా. ఎవరో ఏమిటో. నా కోసమైతే రావడం లేదు కదా! భయంతో ఒళ్లంతా చెమట పోస్తోంది. కాసేపటి ఆ బైక్ నాకు దగ్గర పడింది. కానీ నన్ను పట్టించుకోకుండా తన దారిన తాను పోయింది. హమ్మయ్య అనుకుని పైకి లేవబోయాను. ఒక్కసారిగా శరీరం వశం తప్పింది. కాళ్లు తూలాయి. కళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న అరుగుమీద కూలబడ్డాను. కళ్లు మసకబారుతున్నాయి. ఏమీ కనిపించడం లేదు. కొద్ది క్షణాల్లో... మైకం కమ్మింది. నాకు తెలీకుండానే నా స్పృహ తప్పింది.





‘‘అమ్మాయ్... లేమ్మా... లే’’... ఎవరివో మాటలు. అస్పష్టంగా వినిపిస్తున్నాయి. నన్ను ఉద్దేశించే అని అర్థమై, బలవంతంగా కళ్లు తెరిచాను. ఎదురుగా ఓ మహిళ. పొద్దున్నే కళ్లాపి చల్లడానికి వచ్చి, నేను అరుగుమీద పడివుండటం చూసి లేపింది. నేను కళ్లు తెరవగానే ‘‘ఎవరమ్మా నువ్వు?’’ అంది. ‘‘రాత్రి ఇలా వెళ్తున్నపుడు కళ్లు తిరిగి నట్టనిపిస్తే, ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు స్పృహ తప్పిందో తెలియదు’’ అనేసి లేచాను. ఆమె ఇంకా ఏదో అడగబోయింది. నేను విననట్టే గబగబా అక్కడ్నుంచి కదిలాను. నాకు తెలుసు ఆమె ఏం అడుగు తుందో. అంత రాత్రిపూట రోడ్డుమీదికి ఎందుకొచ్చావ్, ఎందుకంత నీరసంగా ఉన్నావ్, ఒంటినిండా ఆ దెబ్బలేంటి... ఇలా చాలా ప్రశ్నలు సంధిస్తుందామె. వాటన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నా... ఆమెకు చెప్పలేను. చెప్పాల్సినవాళ్లు వేరే ఉన్నారు. అక్కడికే బయలుదేరాను.



పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటే కాళ్లు వణికాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటే పరువు నష్టంగా ఫీలయ్యే మధ్య తరగతి కుటుంబంలో పుట్టినదాన్ని కదా! అలాగే ఉంటుంది మరి. కానీ ఏం చేయను! నా తలరాత నన్ను అక్కడికి లాక్కెళ్లింది. నా గుండెకోత నన్ను ఖాకీల సాయం కోరేలా చేసింది. ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఆరు నెలల క్రితం నేను ఊహించనైనా లేదు.కోరింది క్షణాల్లో పొందేంత సంపన్నురాలిని కాకపోయినా, కోరుకున్నదాన్ని నాకు ఇచ్చేవరకూ విశ్రమించని గొప్ప తల్లిదండ్రులున్న అదృష్టవంతురాలిని నేను. ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో నేనే లోకం అమ్మానాన్నలకి. నన్ను సంతోషంగా ఉంచడమే తమ ధ్యేయం అన్నట్లు బతికేవారు ఇద్దరూ. తానూ అలా చూస్తానని మాట ఇచ్చాకే నన్ను ఆనంద్ చేతిలో పెట్టారు. ఉన్నదంతా ఊడ్చి కట్నంగా ధారపోశారు. కానీ వాళ్లకేం తెలుసు... ఆనందం అతడి పేరులోనే కానీ, అతడితో ఉన్నవారికి ఉండదని! కట్నం చాల్లేదని వాళ్ల అమ్మ అంటుంది. కానుకలు సరిపోలేదని వాళ్ల అక్క అంటుంది. పైకి అనకపోయినా అతడిదీ అదే అభిప్రాయమని నాకు తర్వాత తెలిసింది.



నాతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. నాలుగు కబుర్లు చెబుతా డేమోనని చూసి చూసి విసిగి నేనే మూగదాన్నయిపోయాను. తిట్టడానికి మాత్రమే నోరు తెరిచేవాడు. అప్పటికీ తృప్తి లేకపోతే చేయి లేపేవాడు. ఉండేకొద్దీ వంటింట్లో ఉండాల్సిన అట్లకాడ నా ఒంటిమీద తన గుర్తుల్ని మిగల్చడం మొదలు పెట్టింది. ఏమిటీ అన్యాయమని అడిగినందుకు నాలుగ్గోడల మధ్య నాకోసం జైలు తయారైంది. అమ్మానాన్నల్ని డబ్బు అడగనన్నందుకు నా బతుకు నరకమైంది. వాళ్ల కోరికలు నా ఒంటి మీద గాయాలుగా తేలాయి. వారి కఠిన హృదయాలు నా తనువుపై రక్తపు చారికల్ని ముద్రించాయి. ఇంతటి బాధనూ కడుపులో దాచుకున్నాను కాబట్టి నా కడుపు నిండుగా ఉంటుందనుకున్నారో ఏమో... తిండి పెట్టడం కూడా మానేశారు. ఒకపక్క ఆకలి బాధ, మరోపక్క గుండెల్ని నలిపేసే వ్యథ. నిస్సహాయంగా రోదించాను. అసహాయంగా అలమటించాను. ఏ క్షణాన గ్యాస్ సిలెండర్ పేలుతుందో, ఎక్కడ కిరోసిన్ నా ఒంటిని తడిపేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతికాను. చివరికి తెగించాను.



ఎప్పటిలాగే ఆరోజు రాత్రి నామీద తన ప్రతాపాన్ని చూపించి వెళ్తూ, గది తలుపులు మూయడం మర్చిపోయాడు తను. అదే నా పాలిట వరమయ్యింది. మెల్లగా బయటపడ్డాను. ఎలాగో పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాను. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. అయినా వాళ్లు బెదరలేదు. నేనే మంచిదాన్ని కాదన్నారు. నన్ను చెడ్డగా చిత్రించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల రాక్షసత్వానికి సాక్ష్యంగా నలిగిన నా దేహం ఉంది కదా! అందుకే పోలీసులు వాళ్ల మాటలు నమ్మలేదు. వాళ్లను లోపలేసి, నన్ను అమ్మానాన్నల దగ్గరకు పంపించారు. సంతోషంగా బతుకుతుందనుకున్న తమ కూతురు అనుభవించిన నరకాన్ని తలచుకుని అమ్మానాన్నా నేటికీ కుమిలిపోతూనే ఉన్నారు. నాకు జరిగిన అన్యాయం కంటే, వాళ్లు పడుతోన్న బాధే నన్ను కుంగదీస్తోంది. జీవితాంతం కాపాడతాడనుకుని కూతుర్ని అల్లుడికి అప్పగిస్తారు తల్లిదండ్రులు. తమకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడన్న నమ్మకంతో భర్తకి తమ జీవితాన్నే ఇచ్చేస్తారు ఆడపిల్లలు. కాపాడాల్సింది పోయి కాటేస్తాడని ఎవరు మాత్రం ఊహిస్తారు? సుఖపెట్టడం మాని కష్టాల కొలిమిలో కాల్చేస్తాడని ఎవరు మాత్రం అనుకుంటారు? నా భర్తలాంటి స్వార్థపరులు, క్రూర మనస్కులు ఉన్నంత కాలం నాలాంటి ఆడపిల్లలు బలైపోతుంటారు. అభాగ్యులుగా మిగిలిపోతూనే ఉంటారు!!

 

- సరోజ (గోప్యత కోసం పేర్లు మార్చాం)  ప్రెజెంటేషన్: సమీర నేలపూడి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top