నడిచే నగల కొండ

నడిచే నగల కొండ - Sakshi


అతను నడిచి వస్తుంటే ఓ నగల కొండ కదలివస్తున్నట్టే అనిపిస్తుంది. కళ్లు బైర్లు కమ్మే చైన్లు, వేళ్లకు వజ్రాల మెరుపులు, కళ్లకు సన్‌గ్లాసెస్.. అతని ట్రేడ్ మార్క్. ఆయనే సంగీత దర్శకుడు బప్పీలహరి. ఏళ్ల తరబడి ఈ విలక్షణమైన అలంకరణతో ఆకట్టుకుంటున్న ఈ నగల కొండ బర్త్ డే నేడు.

 

1980-90లలోని యువతరం బప్పీలహరి పేరు చెబితే ఇప్పటికీ చిందులేస్తుంది. ఆయన అందించిన బాణీలు అటు బాలీవుడ్‌లోనే కాదు ఇటు టాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ అయ్యాయి. హాలీవుడ్ దాకా పాకిన ఈ సంగీత దిగ్గజం ‘ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్..’ అంటూ హుషారెత్తించే పాటలతో ఎంత ప్రాముఖ్యం పొందారో తను ధరించే ఆభరణాలతో కూడా అంతే ప్రచారం పొందారు. డిస్కో కింగ్‌గా పేరున్న ఈ సంగీత దర్శకుడిని ‘గోల్డెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా అభిమానులు కీర్తిస్తారు. ఆరు పదుల వయసు దాటిన ఈ సంగీత దర్శకుడు దాదాపు 500 సినిమాలకు పైగా సంగీత సారథ్యం వహించాడు. తన స్టైల్ స్టేటస్ గురించి అడిగితే బప్పీలహరి ఏమంటున్నారంటే...

 

అమ్మానాన్నల వారసత్వం



పశ్చిమబెంగాల్‌లోని కలకత్తా! నాన్న అపరేష్ లహరి, అమ్మ బన్సారీ లహరి. ఇద్దరూ శాస్త్రీయ సంగీత దిగ్గజాలే! వారసత్వంగా నాకు ఆ కళ వంటపట్టింది. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ సంగీతంలో ఎదగాలన్నది నా కల. మూడేళ్ల వయసులోనే తబలా వాద్యంతో సంగీత విద్యను మొదలు పెట్టాను. 19 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాను. నా భార్య చిత్రాణి కూడా గాయనే! మాకు ఇద్దరు పిల్లలు. కూతురు రేమ కూడా గాయనిగా మంచి పేరుతెచ్చుకుంది. కుమారుడు బప్పా లహరి హిందీ సినిమా పరిశ్రమకు సంగీత దర్శకుడుగా పరిచమయ్యాడు. తెలుగులోనూ త్రీడీ చిత్రానికి బాణీలు కట్టాడు.



నచ్చేవి.. అందరూ పొగిడేవి..



నా పెదవులు. చాలా మంది నా పెదవులు బాగుంటాయని చెబుతారు. బహుశా నా గొంతులో నుంచి నా పెదవుల ద్వారా పాట బయటకు వస్తుందని కాబోలు! నేను పాడుతుంటే చాలా మంది నా పెదవుల వైపే చూస్తారు. ఆ విధంగా నా పెదవులంటే నాకు చాలా ఇష్టం.

 

అదృష్టాన్ని తెచ్చే అద్దాలు!



అవి కేవలం సన్ గ్లాసెస్ మాత్రమే కాదు. నా స్టైల్‌ను తెలియజేసేవి. కళ్ల మీద నేరుగా బాగా కాంతి పడకుండా నల్ల కళ్లద్దాలు ధరిస్తాను. ఇది మైఖేల్ జాక్సన్ సొంత స్టైల్ కూడా! అంతేకాదు, ఇది అంతర్జాతీయ స్టైల్. బప్పీలహరి వీటికి ఒక గుర్తింపు మాత్రమే. ధరించే ఆభరణాలు, సన్‌గ్లాసెస్, బ్రేస్‌లెట్స్, గడియారాలతో ఇలా నాకు నేను అందరిలో భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. నా దగ్గర 51 సన్‌గ్లాసెస్ ఉన్నాయి. అందులో నాలుగైదు నాకు అదృష్టాన్ని తెచ్చినవి కూడా ఉన్నాయి. అయితే ఇంట్లో మాత్రం ఆభరణాలు, సన్‌గ్లాసెస్ ధరించను.

 

పాటంత వేగంగా కొనుగోలు...  దుస్తుల ఎంపిక..!



నేనెప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాను. అందుకు ప్రధానంగా దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాను. విభిన్నమైన డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. ఎంత ఫాస్ట్‌గా అంటే.. నా పాట అంత వేగంగానే డ్రెస్‌ల కొనుగోలు కూడా ఉంటుంది. ఉదాహరణకు.. రేపు ఓ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకోండి. నేను ఇవ్వాళే ధరించాల్సిన దస్తులు, ఆభరణాలు, సన్‌గ్లాస్‌లు.. అన్నీ ముందే సిద్ధం చేసుకుంటాను. హడావిడి పడను. టైమ్, వేషధారణ, ఆహారం - ఇలా ఏదైనా చాలా నియమబద్ధంగా ఉండాలనుకుంటాను. నా భార్య కూడా నా వస్త్రధారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. నా వేషధారణను చాలా మంది ఇష్టపడతారు.



స్టైల్‌కి ఇప్పటి వరకు వచ్చిన అతి గొప్ప ప్రశంస...



ఒకసారి లండన్‌లో షాపింగ్ చేస్తున్నాను. అక్కడ చాలా చల్లగా, అంటే మైనస్ డిగ్రీలలో ఉంది ఉష్ణోగ్రత. చలికి తట్టుకోవడానికి పై నుంచి కోటు వేసుకున్నాను. దీంతో ధరించిన బంగారు ఆభరణాలు కోటు లోపల ఉన్నాయి. అక్కడ కొంతమంది సడెన్‌గా ‘అరె మీరు బప్పీ లహరి కదూ!’ అన్నారు. నేను, ‘కాదు.. కాదు’ అన్నాను. అయినా వారు వినలేదు. ‘మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కానీ, ఒంటి మీద గోల్డ్ లేదు. మీ గోల్డ్ చైన్స్ చూపించండి’ అని పట్టు పట్టి, చూసి, అప్పుడు నిర్ధారించుకొని నవ్వుతూ వెళ్లారు. అది అత్యంత బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తాను.



ఫ్యాషన్‌లో అనుకరణ..



ఒకే ఒకరిని! నన్ను నేను ఇలా తీర్చిదిద్దుకోవడానికి కారణమైన ఎల్విస్ ప్రెస్లీని. అమెరికా గాయకుడైన అత ణ్ణి నా చిన్నప్పుడు ఒకసారి చూశాను. అతను అన్నీ చుంకీ బంగారు ఆభరణాలను ధరించేవాడు. అవి ఆయన్ని ఆడంబరంగానూ, సొగసుగానూ చూపించేవి. వాటితో పాటు నల్ల క ళ్లద్దాలు. ఆ వేషధారణతో అతను భలేగా కనిపించేవాడు. నాకూ అప్పుడే అనిపించింది నేనెందుకు అలా తయారవ్వకూడదని! అప్పటినుంచే ఇలా ఆభరణాలను ధరించడం మొదలుపెట్టాను.



వ్యసనాలకు దూరం...



బరువు గురించి ఆందోళన చెందిన మాట నిజమే! అయితే, అది ఒకానొకప్పుడు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అందుకే నో వర్రీ. నా కోసమే తయారైన ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటాను. మద్యం, సిగరెట్, పాన్.. వంటి వ్యసనాలేవీ లేవు. కేవలం టీ, కాఫీలు సేవిస్తాను. అమితంగా ఇష్టపడేది మంచి ఆహారాన్ని. కలకత్తా వాసులు చాలా మంది తీపిని ఇష్టపడతారు. నేను మాత్రం తీపి పదార్థాలు తినను. డ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ మాత్రం చేస్తాను. చేపలు, రొయ్యల వంటకాలు.. నాకు ఇష్టమైనవాటిలో ప్రధానమైనవి. అయితే, వారంలో మూడు రోజులు పూర్తి శాకాహారం తీసుకుంటాను.



కొసమెరుపు:...



గత ఎన్నికల్లో బప్పీలహరి పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీచేశారు. నామినేషన్ అఫిడవిట్‌లో తన వద్ద కేవలం 754గ్రాములు, తన సతీమణి వద్ద 967 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇద్దరికీ కలిపి 13.5 కిలోల వెండి, కొన్ని విలువైన వజ్రాలున్నట్టు పేర్కొన్నారు. కానీ అనేక సందర్భాలలో సినిమా వేడుకల్లో ఒంటినిండా బంగారు నగలతో కనిపించే బప్పీలహరికి ఉన్న బంగారపు కొండ ఇంత చిన్నదా అని ఈ సందర్భంలో అందరికీ సందేహం కలిగింది. బహుశా ఇన్‌కంటాక్స్‌కు భయపడి ఇంత తక్కువగా చూపించి ఉండవచ్చని అందరూ అనుకున్నారు.

 

మైఖేల్ జాక్సన్  అందుకోసమే కలిశారు!



బంగారం కొనడానికి ధన్ తేరస్, అక్షయ తృతీయ అంటూ ప్రత్యేక రోజులంటూ ఏవీ ఉండవు. డిజైన్ నచ్చితే చాలు ఎలాంటి ఆభరణమైనా కొనేస్తాను. ధన్ తేరస్‌కు మా ఆవిడ ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంది. (మెరుస్తున్న ముంజేతులను చూపిస్తూ)నేనెప్పుడూ ఈ డైమండ్ వాచ్, బంగారు బ్రేస్‌లెట్ తప్పక ధరిస్తాను. చాలా మంది నాతోనే ‘బప్పాద బ్లింగ్ బ్లింగ్’ (నవ్వేస్తూ), ‘గోల్డెన్ మ్యాన్’ అంటుంటారు. ఈ ఆభరణాలు నాకో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. గతంలో ఒకసారి కలకత్తా సాల్ట్ లేక్  స్టేడియమ్‌లో పాట రికార్డింగ్ సందర్భంలో పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌ని చూశాను. ఆ తర్వాత మళ్లెప్పుడూ అతణ్ణి కలవలేదు. మైఖేల్ జాక్సన్ ముంబయ్ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగాకలిశారు. నేను స్టార్ సింగర్ అని కాదు కేవలం నేను ధరించే గణపతి చైన్‌ను ఇష్టపడి ఆయన నన్ను కలిశారు.

 

కేశాలంకరణలో మార్పులు..



నా జుట్టు నా సొంతమే! (నవ్వుతూ) ఎలాంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించలేదు.  బ్యూటీప్యాక్‌లు అసలే ఉండవు. వయసు పై బడినంత మాత్రాన బట్టతల రావాలనేమీ లేదుగా! నూనెలు వాడను. షాంపూ కూడా వాడను. బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యమే అసలైన అందం అనేది నా నమ్మకం. అయితే, నాదైన స్టైల్ ఉండాలి అని మాత్రం కోరుకుంటాను.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top