9వ తరగతి, 6వ నెల

9వ తరగతి.. 6వ నెల


పసుపు శుభానికి చిహ్నం.

ఒక ఆడపిల్ల పుట్టి, ఎదిగి, విద్యాబుద్ధులతో ప్రయోజకురాలయ్యి,

వివాహం చేసుకొని కళకళలాడుతుంటే అది శుభం. శుభప్రదం.

కాని- ఈ చిన్నారికి జరిగింది శుభం కాదు. తీవ్ర అన్యాయం.

అందుకే ఇవాళ పేజీకి పసుపుపూత పూయలేకపోయాము.

నిరసనగా నలుపునే వదిలేశాము.

ఈ నిరసన సమాజం నుంచి కూడా రావాలి.

ఒక అక్షరానికి వేయి కాగడాలు తోడైనప్పుడే చీకటి నలుపు పోతుంది.

పసుపు విరబూస్తుంది.


 

పిల్లలను రంగులు ఆకర్షిస్తాయి.

కాని- ఊసరవెల్లి ఒంటి మీద కూడా రంగులుంటాయి.

భద్రం... జర భద్రం!!


 

అది నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఊరి చివర రచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. అంతలో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారి ముందు నిలబడిందో అమ్మాయి. ఆమె ముఖంలో ఏదో భయం. కళ్ల నిండా దైన్యం. ఆ అమ్మాయిని చూస్తూనే కొన్ని కనుబొమలు పైకి లేచాయి. కొన్ని నోళ్లు పక్కవారి చెవుల్లో గుసగుసలాడటం మొదలుపెట్టాయి. అది చూసి ఆ పిల్ల మరింత ముడుచుకుపోయింది. పొంగుకొస్తోన్న దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపెట్టి... పొట్ట తడుముకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న తన కడుపులో ఆరు నెలల బిడ్డ.  తప్పు చేశానన్న భావన ఓపక్క, ఆ తప్పు వల్ల ఈరోజు తను, తన తల్లిదండ్రులు ఇంతమంది ముందు తలవంచుకోవాల్సి వచ్చిందన్న బాధ మరోపక్క చిత్రవధ చేస్తుంటే... నీళ్లు నిండిన కళ్లతో నిస్సహాయంగా చూస్తూ నిలబడింది.

 వాదనలు మొదలయ్యాయి. వాదోపవాదాలు పూర్తయ్యాయి. చివరికి ఒక పెద్దాయన గొంతు సవరించుకున్నాడు. ‘చిన్న వయసులో చేయకూడని తప్పు చేసింది సరిత (పేరు మార్చాం). కానీ ఆ తప్పులో తనకు భాగం లేదంటున్నాడు సుభాష్ (అసలు పేరు కాదు). కాబట్టి ఇక చేసేదేమీ లేదు. సరితకు అబార్షన్ చేయించి, ఇక మీదటైనా ఆమెని అదుపులో పెట్టుకోవాలని పంచాయతీ తల్లిదండ్రుల్ని ఆదేశిస్తోంది’ అంటూ తీర్పు వెల్లడించాడు.



 ఉలిక్కిపడింది సరిత. ఎదురుగా నుంచుని ఉన్న ఇరవై రెండేళ్ల అబ్బాయి వైపు దీనంగా చూసింది. అతడు అప్పటికైనా తనను అంగీకరిస్తే బాగుణ్ను అన్న చిన్న ఆశ కొడిగడుతూ కనిపించింది ఆమె కళ్లల్లో. కానీ అతడికి ఆమె చూపుల్లోని భావం అర్థం కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. తను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ, తనను నమ్మిన అమ్మాయికి అన్యాయం చేస్తున్నానన్న బాధ కానీ అతడిలో కాస్తయినా లేవు. అతనినా తను నమ్మింది? ఏం చేయాలో తోచక, ఎలా స్పందించాలో అర్థం కాక, ఇది అన్యాయం అంటూ అరిచే ధైర్యం లేక అక్కడే కూలబడిపోయింది.



సరితే కాదు. ఇవాళ మన దేశంలోని చాలామంది ఆడపిల్లల పరిస్థితి ఇదే. సుభాష్‌లాంటి మాయగాళ్లు విసిరిన ప్రేమ వలలో అమాయకంగా చిక్కుకున్న చిట్టితల్లులెందరో. ఛిద్రమైన కలలను, చితికిపోయిన జీవితాలను చూసుకుని కన్నీళ్లతో బతకలేక, ధైర్యం చేసి చావలేక... ప్రతిక్షణం చస్తూ బతుకుతోన్న బంగారుతల్లులెంతమందో.

 

లోపం ఎక్కడుంది?!



మైనర్ ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోతున్న కేసులు గత పదేళ్లలో బాగా పెరిగిపోయాయని నేషనల్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఆడపిల్లల కోసం ఇప్పటివరకూ ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఏ చట్టమూ వారిని ఎందుకు సంరక్షించలేకపోతోంది? అమ్మాయిలను కాపాడేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు కృషి చేస్తున్నాయి. అయినా మన ఆడపిల్ల ఇప్పటికీ ఎందుకు మోసానికి గురవుతోంది? ఎక్కడ ఉంది లోపం?

 

సరిత చిన్నపిల్ల. అంత చిన్నపిల్లని తల్లిని చేశాడు సుభాష్. అది నేరమని తెలియకే అతడలా చేశాడనుకోవాలా? పైగా ఆ అమ్మాయి ఎవరో తెలీదని పంచాయతీ ముందు చెప్పాడు. అంత దారుణంగా మోసం చేసినందుకు అతడిని తప్పుబట్టాలా లేక ఇలాంటి ఎన్నో కేసుల్లో నేరస్థుడి తరఫువాళ్లు చెప్పినట్టు తెలీక చేశాడనో, పరిస్థితులలా వచ్చాయనో నమ్మాలా? కూతురికి అన్యాయం జరిగిందని తెలియగానే సరిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. పంచాయతీకి వెళ్లారు. ఆ తర్వాతే పోలీసులను ఆశ్రయించారు. అంటే వారికి చట్టాల గురించి తెలీదనుకోవాలా లేక వాటిపై నమ్మకం లేదనుకోవాలా?



 ఓ ఆడపిల్ల బతుకు అన్యాయమైపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించకుండా, ఆరోనెలలో అబార్షన్ చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని కూడా ఆలోచించకుండా తీర్పు ఇచ్చిన పంచాయతీ పెద్దలది అమాయకత్వమనుకోవాలా? చట్టాల గురించిన అవగాహనా రాహిత్యమనుకోవాలా? తమ కొడుకు ఓ ఆడపిల్లని మోసం చేశాడని తెలిసి కూడా సుభాష్ తల్లిదండ్రులు అతణ్ని మందలించలేదు. పైగా పంచాయతీ పెద్దలను, పోలీసులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులకు దొరక్కుండా కొడుకు తప్పించుకుపోవ డానికి సాయపడ్డారు. దీన్ని కొడుకు మీద ప్రేమ అనుకని వదిలేయాలా లేక నేరమని శిక్షించాలా?



ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారు! సరితకు న్యాయం ఎవరు చేస్తారు! విలువలు తెలిసినవాళ్లమని విర్రవీగుతాం. ఆడవాళ్లను దేవతలుగా కొలిచే దేశం మనదని విదేశాలకు వెళ్లి మరీ గొప్పలు చెప్పుకుంటాం. ఎక్కడి నుంచో ఓ రాబందు వచ్చి, మన గడపలో పూసిన పసిమొగ్గను తన పాదాల కింద నలిపేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. ఆడుకునే వయసులో తమ కడుపున బిడ్డను మోస్తుంటే... జరిగిన అన్యాయాన్ని తుడిచేయలేక, జరగాల్సిన న్యాయాన్ని సాధించుకోలేక మౌనంగా ఏడుస్తున్నాం. ప్రేమ అనే పవిత్రమైన పదానికి మోసం అనే కొత్త అర్థాన్ని కల్పిస్తున్న కామాంధులని చట్టపరంగా శిక్షించలేక నిస్సహాయంగా నిలబడిపోతున్నాం. ఎవరు తీరుస్తారు మన ఆడపిల్లల కష్టాన్ని! ఎవరు తుడుస్తారు మన ఆడపడుచుల కన్నీళ్లని! ఎవరు సృష్టిస్తారు నిర్భయ భారతాన్ని!!

 - సమీర నేలపూడి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

 

 ఇది ముమ్మాటికీ నేరం!




ఐపీసీ సెక్షన్ 376, నిర్భయ చట్టాల దృష్ట్యా ఇది తీవ్రవైన నేరం. ఆ అమ్మాయి తన ఇష్ట ప్రకారమే దగ్గరైనా, ఆమె మైనర్ కాబట్టి దీన్ని రేప్‌గానే పరిగణిస్తుంది చట్టం. ఇలాంటి కేసుల్లో నేరస్థులు చార్జిషీటును బలహీనపర్చి తప్పించుకుంటున్నారు. అలా జరక్కుండా ఉండాలంటే విచారణ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో జరగాలి. - ఎస్.ప్రదీప్‌కుమార్, న్యాయవాది

 

ఇది వారి వైఫల్యమే!



 పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు గమనించాలి. సరిత ఒక అబ్బాయిని చాటుగా కలిసింది. దగ్గరైంది. ఆ నిజాలు దాచిపెట్టింది. భయంతోనో, అపరాధభావంతోనో ఆమె ప్రవర్తనలో తప్పక తేడా వచ్చి ఉంటుంది. అది గమనించకపోవడం ఆమె తల్లిదండ్రులు, టీచర్ల వైఫల్యమే.                                  - ప్రజ్ఞారష్మి, సైకాలజిస్టు

 

భరోసా కల్పించాలి!



సరితకి తల్లిదండ్రులు, టీచర్లు, చుట్టూ ఉండేవారి సపోర్ట్ చాలా అవసరం. జరిగినదానికి నిందించకుండా, మరోసారి అలా జరక్కుండా చూసుకొమ్మని లాలనగా చెప్పాలి. భవిష్యత్తు మీద ఆశ, భరోసా కల్పించాలి. లేదంటే తను మానసికంగా కుంగిపోతుంది.

 - శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక వైద్యాలయం, ఎర్రగడ్డ

 

పోలీసులు సెన్సిటివ్‌గా ఉండాలి!

 

ఇలాంటి సమస్యల పరిష్కారానికి పంచాయతీకి వెళ్లడమే తప్పు. ఇదేమీ ప్రేమ వ్యవహారం కాదు. లైంగిక నేరం. పోలీస్ కంప్లయింట్ ఇవ్వడమే సరైన పద్ధతి. పోలీసులు కూడా ఇలాంటి కేసుల విషయంలో సెన్సిటివ్‌గా ఆలోచించాలి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయాలి. - పద్మావతి, సామాజిక కార్యకర్త, కస్తూర్బా ఆశ్రమ నిర్వాహకులు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top