మామయ్యకు ప్రామిస్‌

మామయ్యకు ప్రామిస్‌ - Sakshi


ఆగస్టు 22 చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూ కోడలు ఉపాసనతో..


చిరంజీవి కోడలు సౌభాగ్యవతి.ఉపాసనకు అన్ని భాగ్యాలూ ఉన్నాయి.గొప్ప తాతయ్యలు... మంచి తల్లిదండ్రులు... బంగారంలాంటి భర్త... అత్తమామలు. ‘ఈ బర్త్‌డేకి చిరంజీవికి కోడలిగా... మీరేమిస్తున్నారు’ అని అడిగితే... చిరంజీవి–చరణ్‌ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ...‘కుటుంబాన్ని సంతోషంగా...ఉంచుతానని మామయ్యకు ప్రామిస్‌ చేస్తాను’ అని ఉపాసన అన్నారు.



ఇప్పటివరకూ చిరంజీవిగారు అందుకున్న ‘బెస్ట్‌ గిఫ్ట్స్‌’లో ‘ఉపాసన’ అనే బహుమతికి ప్రముఖ స్థానమే ఉంటుంది. మరి.. ఆయన బర్త్‌డేకి మీరు ఇవ్వబోతున్న గిఫ్ట్‌?

ఉపాసన: మామయ్య నాకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఆయన కొడుకు రామ్‌చరణ్‌. తండ్రి అంటే తనకి చాలా గౌరవం, ప్రేమ. ప్రతి తండ్రీ ఏ కొడుకు నుంచైనా అలాంటి ప్రేమ, గౌరవాన్ని ఆశిస్తాడు. రామ్‌చరణ్‌ ప్రేమ అతని గుండె లోతుల్లోంచి వస్తుంది. మామయ్య బర్త్‌డే సందర్భంగా తన కొడుకుని, ఫ్యామిలీని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తానని నేను ఆయనకు ప్రామిస్‌ చేస్తున్నాను. ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడమనేది అందమైన బాధ్యతలా భావిస్తున్నా.



చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవిగారు 150వ సినిమా చేశారు... ఆయన గత సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉంటుందా? అంతే కష్టపడి చేయగలుగుతారా? అసలెందుకు చేయాలి వంటి ఫీలింగ్స్‌ ఏమైనా?

ఎంతో గ్యాప్‌ తర్వాత ఆయన్ను స్క్రీన్‌ మీద చూసినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా ఎమోషన్‌ అయ్యారు. వాళ్ల ఆనందం, ఉద్వేగం చూసి, నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య గురించి నేనేం వర్రీ కాలేదు. కానీ, నా భర్త చిన్న వయసులో అంత పెద్ద ప్రాజెక్ట్‌ను హ్యాండిల్‌ చేయడం చాలా రిస్క్, టఫ్‌ అనిపించింది. పైగా, తను హీరోగా ఒక సినిమా చేస్తూ, తండ్రి 150వ సినిమాను నిర్మించడం అనేది ఒత్తిడికి గురి చేసే విషయం. అందుకే ‘ఐయామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ రామ్‌చరణ్‌’. మామయ్య సూపర్‌స్టార్‌. ఆయన కోసం సిల్వర్‌ స్క్రీన్‌ ఆరాటంగా ఎదురు చూసింది. ఏం చేసినా అందులో ఆయన మాస్టర్‌. ఇవాళ ఆడియన్స్‌ పల్స్‌ ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఎంత పల్స్‌ తెలిసినా, ఎంత సూపర్‌ స్టార్‌ అయినా.. చాలా కష్టపడాలని అర్థమైంది. మామయ్య హార్డ్‌వర్క్‌ చేస్తారు. ‘డబుల్‌ ఎఫర్ట్‌’ పెడతారు. ‘ఖైదీ నంబర్‌ 150’ మా అందరికీ ప్రత్యేకమైన సినిమా. ఆనందానికి గురి చేసిన సినిమా. అదే విధంగా ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేసిన మూవీ.



రామ్‌చరణ్‌గారు మీకు ‘ప్రపోజ్‌’ చేసినప్పుడు ‘మీ నాన్నగారు ఒప్పుకుంటారా?’ అని అడిగారా? రెండు కుటుంబాలూ ఎలా రియాక్ట్‌ అవుతాయో అనే ఒత్తిడి ఏదైనా ఉండేదా?

ఇలాంటి విషయాల్లో ఏ అమ్మాయి అయినా ‘నెర్వస్‌’ అవుతుంది. నేనూ అలానే అయ్యాను. మామయ్య నన్ను కోడలిగా కాదు.. కూతురిలా అంగీకరించారు. అత్తమ్మ, మామయ్య నన్ను చాలా సపోర్ట్‌ చేశారు. నన్ను ఇంట్లోకి ఆప్యాయంగా ఆహ్వానించారు. నేను ఆప్యాయంగా పెంచుకుంటున్న నా మూగజీవాలను కూడా ఇంట్లోకి అనుమతించారు (నవ్వుతూ).



నిజం చెప్పండి.. మీ మామయ్య మంచి యాక్టరా? మీ భర్త రామ్‌చరణా?

మా మామయ్య మాస్టర్‌. నా భర్త తన మాస్టర్‌ దగ్గర మెళకువలు నేర్చుకున్న ‘స్టార్‌ స్టూడెంట్‌’.






‘హెల్త్‌ కేర్‌’ చూస్తున్న లెజెండ్‌ ప్రతాప్‌. సి. రెడ్డిగారి మనవరాలు మీరు. ‘హ్యాపీ కేర్‌’ (ఎంటర్‌టైన్‌మెంట్‌) చూస్తున్న లెజెండ్‌కి కోడలు. ఇద్దరు లెజెండ్స్‌ మధ్య ఉండటం ఎలా అనిపిస్తోంది?

ఇది నిజంగా గొప్ప విషయం. రామ్‌ (రామ్‌చరణ్‌)కు, నాకు బంధం ఏర్పడానికి ఓ కారణం ఉండి ఉంటుందని నమ్ముతున్నాను. ఇద్దరు లెజెండ్‌ల కల, ఆకాంక్షకు తగ్గట్టుగా మేమిద్దరం మా జీవితాన్ని కొనసాగించాలి. వారసత్వం గురించి పట్టించుకోకుండా మేం జస్ట్‌ అలా జీవితం గడిపేస్తే ఇద్దరికీ గిల్టీగా ఉంటుంది. వారసత్వం తాలూకు బాధ్యతలను మేం నిర్వర్తించాలి. ఆ అధికారాలను తీసుకోవాలి. అదే విధంగా ఆ ఇద్దరినీ ప్రేరణగా తీసుకోవాలి. ఇద్దరు లెజెండ్స్‌ వారసులుగా మేం వినయంగా కూడా ఉండాలి. మేం ఇద్దరం అలానే ఉంటాం.



మీరు మంచి బిజినెస్‌ ఉమన్‌గా దూసుకెళుతున్నారు. ఒకవైపు హెల్త్‌ మ్యాగజైన్, మరోవైపు అపోలో లైఫ్‌ అండ్‌ అపోలో ఫౌండేషన్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. మీ కెరీర్‌ విషయంలో మీ మామయ్యగారి ఎంకరేజ్‌మెంట్‌ ఎలా ఉంటుంది?

మా మామయ్యకు నా మీద అపారమైన నమ్మకం. నేనే పని చేసినా బాగా చేస్తానని నమ్ముతారు. అయినప్పటికీ ఇంకా బెటర్‌గా చేయమని ఎంకరేజ్‌ చేస్తారు. ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే మామయ్యకు గౌరవం, నమ్మకం.



మీ మావయ్య యాక్ట్‌ చేసినవాటిలో మీకు బాగా నచ్చిన సినిమాలు?

ఫస్ట్‌ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ఆ తర్వాత ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’ సినిమాలు చాలా ఇష్టం.



వేరు వేరు ప్రపంచాలకు చెందిన మీ తల్లిదండ్రులు, చరణ్‌గారి తల్లిదండ్రులు కలిసినప్పుడు ఎలా ఉంటుంది? ఏదైనా సరదా సంఘటనలు ఉంటే షేర్‌ చేసుకుంటారా?

నిజమే.. రెండు కుటుంబాల వాళ్లం వేరు వేరు ప్రపంచానికి చెందినవాళ్లం. కానీ, మా ఇద్దరి తల్లిదండ్రులు బాగా కలిసిపోతారు. ఫన్నీ మూమెంట్స్‌ చాలా ఉన్నాయి. అయితే అవన్నీ పర్సనల్‌. రెండు కుటుంబాలూ కలిసినప్పుడు టేస్టీ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తాం. ఒకరి కంపెనీ మరొకరికి నచ్చుతుంది.



మీ మామయ్యగారి, చరణ్‌గారి అనుబంధం ఎలా ఉంటుంది?

అద్భుతంగా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని ఓ తల్లి, భార్య, సోదరి చెప్పలేరు. మాటల్లో చెప్పలేని అనుబంధం వాళ్లది. ఇద్దరికీ ఒకరకంటే మరొకరికి ప్రేమ, గౌరవం. ఆ ప్రేమ, గౌరవాన్ని ఎలా చూపించు కోవాలో ఇద్దరికీ బాగా తెలుసు.





‘మిస్టర్‌ సి’ అలాంటి వ్యక్తే!

మీ అమ్మగారు శోభన కామినేని ‘పంక్టీలియస్‌’. జాతీయ స్థాయి స్క్వాష్‌ ప్లేయర్‌ కూడా. మరి.. తనకు అల్లుడిగా స్పోర్ట్స్‌మేన్‌ రావాలని ఆమె, జమీందారి కుటుంబం నుంచి వచ్చిన మీ నాన్నగారు అనిల్‌కి అలాంటి కుటుంబానికి చెందిన అబ్బాయి అల్లుడవ్వాలని ఉండేదా? చరణ్‌గారి గురించి చెప్పినప్పుడు ఆమె ఎలా రియాక్ట్‌ అయ్యారు?

పెళ్లి విషయంలో నా పేరెంట్స్‌కి అలాంటి పట్టింపులు లేవు. నేను బాగా ఇష్టపడి, గౌరవించే వ్యక్తితో పెళ్లి చేయాలనుకున్నారు.   ఆ వ్యక్తితో నా జీవితం బాగుండాలనుకున్నారు. ‘మిస్టర్‌ సి’ (రామ్‌చరణ్‌) అలాంటి వ్యక్తే.


– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top