వయసు 30; బరువు 85 కొత్త క్వీన్

వయసు 30; బరువు 85  కొత్త క్వీన్


‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ యశ్‌రాజ్ ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు యశ్‌చోప్రాకు ఉన్న బిరుదు. ‘క్వీన్స్ ఆఫ్ బాలీవుడ్’, యశ్ రాజ్ ఫిలిమ్స్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యే అమ్మాయిలకు దక్కే బిరుదు! ఒకరా ఇద్దరా... దేశాన్నే ఒక ఊపు ఊపిన ఎంతోమంది అందగత్తెలకు కెరీర్‌పరంగా పుట్టిల్లు... యశ్‌రాజ్ ఫిలిమ్స్. యశ్‌చోప్రా దర్శకత్వంలో, నిర్మాణంలో వచ్చిన ప్రణయ వినోద సినిమాలు ఎంతోమంది హీరోయిన్లకు దేశవ్యాప్త గుర్తింపును సంపాదించిపెట్టాయి. ఆ పరంపరలో కొత్తగా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిచయం అయిన క్వీన్ పేరు భూమి పడ్నీకర్. ఇప్పటివరకు యశ్‌రాజ్ ఫిలిమ్స్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో కెల్లా అత్యంత ప్రత్యేకమైన నటీమణి భూమి. ఈ రోజు విడుదలౌతున్న ‘దమ్ లగాకే హైసా’ సినిమాకు ప్రధాన ఆకర్షణ తనే. ఏమిటా ప్రత్యేకత? ఏమా కథ? చాలానే ఉంది!



హీరో ప్రేమలో పడటానికి తగిన శరీరాకృతితో ఉండాలి.. ఇదే హీరోయిన్‌కు మొదటి అర్హత. ప్రత్యేకించి ప్రేమకథాచిత్రాలను రూపొందించే యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో అయితే హీరోయిన్ల అందం, వారు కనిపించే తీరే ప్రధానం. ఇలాంటి ఫార్ములాను తొలిసారి ఆ సంస్థ పక్కన పెడుతూ ఏకంగా 85 కిలోల బరువు, 30 యేళ్ల వయసున్న భూమి పడ్నీకర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తోంది!



ఇప్పటికే యూట్యూబ్‌లో ‘దమ్ లగాకే హైసా’ సినిమా ట్రైలర్‌కు అదిరిపోయే ఆదరణ దక్కింది. చాలా కొత్తగా ఉంటుంది ఆ ట్రైలర్. మెరుపుతీగలా ఉండే  స్వప్నసుందరిని భార్యగా ఊహించుకొని చివరకు లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకొని న్యూనతకు లోనయ్యే భర్తగా ఆయుష్మాన్ ఖురానా కనిపిస్తుంటే.. కొంచెం లావుగా ఉండి, భర్త అంచనాలకు దూరంగా ఉంటూ అతడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించే భార్యగా భూమి కనిపిస్తోంది.



యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు భూమి. నటీనటులను ఎంపిక చేసే విభాగంలో ఆమె ఒక సహాయకురాలు. అయితే అనుకోకుండా ఈ సినిమాతో దర్శకుడు కాబోతున్న శరత్ కఠారియా కళ్లలో పడి హీరోయిన్ అయిపోయింది. మామూలుగా యశ్‌రాజ్ సంస్థ హీరోయిన్లను మోడలింగ్ ఫీల్డ్ నుంచి తెచ్చుకొంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ తరపున ఇండస్ట్రీకి పరిచయమైన పరిణితీ చోప్రా, అనుష్కా శర్మ, వాణీ కపూర్ వంటి వాళ్లంతా మోడల్సే.


అయితే భూమికి మాత్రం ఆ నేపథ్యం లేదు. అలాగే పదహారేళ్ల వయసులోని తాజా ముఖారవిందాలను ఎంచుకొనే ఈ సంస్థ తరపున అత్యంత ఎక్కువ వయసుతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఘనత కూడా భూమిదే. ఏదో కథకు అవ సరమై ఉంటుంది కాబట్టి ఆమెను హీరోయిన్‌గా ఎంచుకొని ఉండవచ్చని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఈ సినిమా మాత్రమే కాదు, మూడు సినిమాలకు యశ్‌రాజ్ సంస్థ ఈమెతో ఒప్పందం కుదుర్చుకొంది.  ఇవాళ విడుదలవుతున్న సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాల్లో భూమి కనిపించబోతోంది. మరి వాటితో భూమి బాలీవుడ్‌లో తన ప్రత్యేకతను ఎలా చాటుతుందో చూడాలి!



 - జీవన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top