అరెస్టింగ్ సినిమా...

అరెస్టింగ్ సినిమా...


తెర పై కట్టిపడేసే.. రియల్ లైఫ్ క్రైమ్



రియల్ రీల్


ఆట, మాట, పాట, కట్టుబొట్టు విషయంలో జీవితం సినిమాను అనుకరించే సందర్భాలు తరచూ చూస్తుం టాం. కానీ, సినిమాయే జీవితాన్ని అనుకరించడం ఇప్పుడెక్కువవుతోంది. కావాలంటే, వెండితెరపైకి వస్తున్న తాజా హిందీ సినిమాల జాబితా చూడండి. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన, నోయిడాలో తల్లితండ్రులే కన్న కూతురిని హత్యచేసిన ఆరుషీ తల్వార్ కేసు మొదలు తాజాగా కూతుర్ని కడతేర్చిన తల్లి ఇంద్రాణీ ముఖర్జీ వ్యవ హారం దాకా ఇప్పుడు కాదేదీ సినిమా స్క్రిప్ట్‌కు అనర్హం. ‘మాంఛి’ బాక్సాఫీస్ క్రైవ్‌ు సినిమా అంటే... ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీలే. అలా తెర కెక్కిన, ఎక్కుతున్న నిజ జీవిత కథల్లో కొన్ని...

 

అచ్చం... అలాంటి స్టోరీయే

స్టార్ టీవీతో ఒకప్పుడు అనుబంధమున్న ఇంద్రాణీ ముఖర్జీ చెల్లెలని చెబుతూ కన్నకూతురినే కనబడకుండా చేసిన ఘటన కొద్ది రోజులుగా నేషనల్ మీడియాలో ఫస్ట్‌పేజ్ స్టోరీ. చిత్రం ఏమిటంటే, దర్శకుడు మహేశ్‌భట్ కొన్నాళ్ళ క్రితం రాసిన ‘అబ్ రాత్ గుజర్‌నే వాలీ హై’ స్క్రిప్ట్ కూడా దాదాపు ఇలానే ఉంటుందట. ఒకటికి నాలుగు పెళ్ళిళ్ళు, ప్రేమ, నేరస్వభావం లాంటివన్నీ నిండిన ఈ స్క్రిప్ట్‌ను మహేశ్ శిష్యుడు గురుదేవ్ భల్లా ఈ డిసెంబర్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

 

పొట్టనపెట్టుకున్న పేగుపాశం

 పధ్నాలుగేళ్ళ ఆరుషీ తల్వార్ ఇంట్లో పనివాడితో చనువుగా ఉండడం చూసి, వారిద్దరినీ ఇంట్లోనే కడతేర్చారు. డాక్టర్ తల్లితండ్రులే ఆ పని చేశారని ఆరోపణ. 2008లో నోయిడాలో జరిగిన ఈ సెన్సేషనల్ ఇన్సిడెంట్ ఇప్పుడు ‘తల్వార్’గా తెరకెక్కుతోంది. విశాల్ భరద్వాజ్ రచన చేశారు. ఇర్ఫాన్ ఖాన్, తబు, కొంకణా సేన్ శర్మ తారాగణం. నిజానికి, ఇదే ఘటనపై ఇప్పటికే మనీశ్ గుప్తా ‘రహస్య’ పేరిట ఒక సినిమా తీశారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఆ సినిమాలో కేకే మీనన్, టిస్కా చోప్రా నటించారు.

 

వర్మ తీసిన కథ కాని కథ

ముంబయ్‌కి చెందిన వర్ధమాన నటి మరియా సుసై రాజ్ పైకి రావడానికి టీవీ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ సాయపడ్డాడు. తీరా మరొకరితో అనుబంధం పెంచు కున్న ఆ అమ్మాయి నీరజ్‌ను అడ్డుతొలగించుకుంది. 2008 మేలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ‘నీరజ్ గ్రోవర్ హత్య కేసు’ను రావ్‌ుగోపాల్‌వర్మ ‘నాట్ ఎ లవ్‌స్టోరీ’ పేరిట 2011లో తీశారు. మాహీ గిల్ నటించిన ఈ సినిమా ‘నిజజీవిత కథ’ కాదని వర్మ అన్నప్పటికీ, సినిమా నిండా ఆ పోలికలే కనిపించాయి.

 

తెరపైకి వచ్చిన మోడల్ హత్య...

 మోడల్ జెస్సికాలాల్ పేరు గుర్తుందా? టైవ్‌ు అయిపో యిందని డ్రింక్స్ ఇవ్వనందుకు 1999లో ఢిల్లీలోని ఒక బార్‌లో డబ్బున్న కుర్రాడు మనూశర్మ తూటాలకు బలైన యువతి. పలుకుబడి పని చేయక, చివరకు జైలు పాలయ్యాడు మనూశర్మ. ఈ రియల్‌లైఫ్ స్టోరీని రాణీ ముఖర్జీ, విద్యా బాలన్‌లతో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాగా తీశారు రాజ్‌కుమార్ గుప్తా.

 

సెక్స్... పాలిటిక్స్... అండ్ మర్డర్

 2011లో రాజస్థాన్‌లో సెన్సేషన్... 36 ఏళ్ళ నర్సు భన్వారీదేవి హత్య. జీవితంలో పైపైకి రావా లన్న ఆమె బలహీనత ఆసరాగా, ఆ రాష్ర్ట మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఆమెను అపహరించి, వాడుకొని, హతమార్చినట్లు ఆరోపణ. ఈ కథనే కె.సి. బొకాడియా తాజాగా ‘డర్టీ పాలిటిక్స్’గా తీశారు. మల్లికా షెరావత్ నటించిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల నుంచి ఇటీవలే బయటపడింది.

 

ఒక నిర్భయ... అనేక వెండితెర కన్నీళ్ళు

 ఢిల్లీలోని ఒక పారా మెడికల్ విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి సినిమా చూసి, ఇంటికి వెళుతుంటే... బస్సులో గ్యాంగ్‌రేప్‌కు గురైన ‘నిర్భయ’ ఘటన ఇప్పటికీ ఒక కన్నీటి జ్ఞాపకం. 2012 డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన ఆధారంగా ‘ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్’, ‘దామిని... ది విక్టివ్‌ు’, ‘ఆజ్ కీ ఫ్రీడవ్‌ు’ లాంటి సినిమాలు వచ్చాయి. లెస్లీ ఉడ్విన్ తీసిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షిం చింది. నేరం చేసిన ముఖేశ్ సింగ్‌తో ఇంటర్వ్యూ ఉన్న ఆ డాక్యుమెంటరీ మన దేశంలో నిషేధానికి గురైంది.

 గోవా బీచ్‌లో జరిగిన హత్యపై ‘అన్ జునా బీచ్’, కోల్‌కతాలో పార్‌‌కస్ట్రీట్‌లో నడుస్తున్న కారులో జరిగిన గ్యాంగ్‌రేప్‌పై ‘3 కన్య’, ‘పార్‌‌క స్ట్రీట్’ లాంటి సినిమాలు వచ్చాయి. వరుస చూస్తుంటే, ఈ నిజజీవిత ఘటనలు తెరకెక్కడం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top