దృక్పథం మారాలి.. విస్తృతంగా ఆలోచించాలి..

దృక్పథం మారాలి.. విస్తృతంగా ఆలోచించాలి.. - Sakshi


‘దేశంలో మేనేజ్‌మెంట్ ఔత్సాహికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులు కెరీర్ క్రేజ్ కోణంలోనే కాకుండా.. వాస్తవ నైపుణ్యాలు పొందే లక్ష్యంతో అడుగుపెడితేనే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది’ అని అంటున్నారు ఐఐటీ-మద్రాస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్. 1977లో బిట్స్ పిలానీలో బీటెక్, 1986లో ఐఐటీ - మద్రాస్‌లో పీహెచ్‌డీ చేసి..



ఐఐఎం-బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత ఐఐటీ-మద్రాస్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ సెంటర్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. మేనేజ్‌మెంట్ విద్య ఔత్సాహికులు అకడమిక్స్‌తోపాటు మరెన్నో అంశాలపై అవగాహన పొందాలని సూచిస్తున్నప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్‌తో ఇంటర్వ్యూ..


 

ముందుగా.. 4ఉట ఎంతో ముఖ్యం

మేనేజ్‌మెంట్ విద్య ఔత్సాహికులు ఆ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీవ్ర పోటీని తట్టుకుని ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగుపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆ తర్వాతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటివరకు కేవలం పరీక్ష-ఉత్తీర్ణత కోణంలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఇక్కడి ప్రాక్టికల్ ఎన్విరాన్‌మెంట్‌ను త్వరగా ఆకళింపు చేసుకోలేకపోతున్నారు.



అందుకే ఎలాంటి ఇన్‌స్టిట్యూట్ అయినా.. మేనేజ్‌మెంట్ విద్యార్థులకు వ్యక్తిగత అభిరుచి, ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో అడుగుపెట్టాలి. బిజినెస్ మార్కెటింగ్‌లో 4Ps (Product, Price, Promotion, Place)కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. మేనేజ్‌మెంట్ విద్యార్థులు తాము అకడమిక్‌గా రాణించే విషయంలో 4Es (Effectiveness, Efficiency, Excellence, Ethics)కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రకాల నైపుణ్యాలు లభిస్తాయి.

 

ఐఐటీల్లో ఎంబీఏ.. అదనపు ప్రయోజనం

సాంకేతిక విద్యలో పేరు గడించిన ఐఐటీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశ పెట్టడం వల్ల వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేరనే అభిప్రాయాలు సరికాదు. వాస్తవ పరిస్థితుల్లో విశ్లేషిస్తే టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో మేనేజ్‌మెంట్ కోర్సులు చేయడం విద్యార్థులకు అదనపు ప్రయోజనంగా ఉపకరిస్తుంది.



సదరు మేనేజ్‌మెంట్ విద్యార్థులు పలు సందర్భాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి కూడా కొన్ని ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్స్ చేసే విధంగా ఐఐటీల్లో బోధన ఉంటోంది. దీంతో రెండు విభాగాల వారికీ ఇంటర్ డిసిప్లినరీ నైపుణ్యాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహణపరమైన నైపుణ్యాలు, అదేవిధంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఇమిడి ఉండే సాంకేతిక అంశాలపై అవగాహన లభిస్తుంది.

 

ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ పెంచుకోవాలంటే

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్కిల్స్ పెంచుకోవాలంటే.. విద్యార్థులు కోర్సులో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే ఆ దిశగా ఆలోచించాలి. ఈ క్రమంలో మన సామాజిక పరిస్థితులపై, అవసరాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తాజా మార్పులను గుర్తించాలి. ఏ రంగంలో పరిధి ఎక్కువ ఉందో గమనించాలి. అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అనేవి కేవలం ఒక్క పుస్తకాల అభ్యసనంతోనే అలవడవు. వీటిని పెంచుకోవడానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి.



ఉదాహరణకు ఐఐటీ-చెన్నైలో సి-టైడ్స్, ఈ-సెల్ వంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి సదుపాయాలు అన్ని ఐఐటీలు, ఐఐఎంలలో అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తమ ఆలోచనలు వాస్తవరూపం దాల్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను గుర్తించాలి. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ ఔత్సాహికులు సామాజిక అవసరాలు తీర్చే స్టార్టప్స్ ఏర్పాటు దిశగా దృష్టి సారించాలి. దీనివల్ల సమాజానికి మేలు కలగడంతోపాటు, వ్యక్తిగత సంతృప్తి కూడా లభిస్తుంది.

 

నెగోషియేషన్ స్కిల్స్

మేనేజ్‌మెంట్ కోర్సు విద్యార్థులు అకడమిక్‌గా, భవిష్యత్తులో ఉద్యోగ విధుల్లో రాణించేందుకు విస్తృతంగా దోహదపడే అంశం.. నెగోషియేషన్ స్కిల్స్. అప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంబీఏ విద్యార్థులు అకడమిక్‌గా గ్రూప్ డిస్కషన్స్, కేస్ స్టడీస్ అనాలిసిస్ వంటి వాటిలో నిరంతరం పాల్పంచుకోవాలి. అదేవిధంగా సెమినార్లు, కాన్ఫరెన్స్‌లకు హాజరవడం, అక్కడ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడే చొరవ వంటి వ్యక్తిగత నైపుణ్యాలు పెంచు కోవాలి.

 

ఇంటర్న్‌షిప్స్.. ఇంపార్టెంట్

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. విద్యార్థులు అదనంగా ఇంటర్న్‌షిప్స్ చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రాజెక్ట్ వర్క్ అనేది అభ్యర్థి తన అభిరుచి మేరకు ఎంచుకున్న అంశంలో మాత్రమే చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు ఫైనాన్స్ స్పెషలైజేషన్ అభ్యర్థి పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ను ప్రాజెక్ట్ వర్క్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటే.. ఆ అంశంపై మాత్రమే అవగాహన వస్తుంది. కానీ ఇంటర్న్‌షిప్‌తో బహుళ అంశాలపై అవగాహన లభిస్తుంది. ఇటీవల కాలంలో పలు సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ తమ వెబ్‌సైట్స్‌లో ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నాయి. వీటిని సద్విని యోగం చేసుకోవాలి.

 

సర్టిఫికెట్స్.. ఎంట్రీ పాస్‌లు మాత్రమే

ప్రొఫెషనల్ కోర్సుల ఔత్సాహికులు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం.. ఐఐటీలు, ఐఐఎంలైనా.. సాధారణ ఇన్‌స్టిట్యూట్ అయినా ప్రొఫెషనల్ కోర్సుల సర్టిఫికెట్లు సంబంధిత కెరీర్స్‌కు ఎంట్రీ పాస్‌ల వంటివే. అంటే.. భవిష్యత్తులో సమున్నత కెరీర్స్ సొంతం చేసుకునే క్రమంలో అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తాయి. దీనికి అదనంగా విద్యార్థులు వ్యక్తిగతంగా చేయాల్సిన కృషి ఎంతో ఉంటుంది.



ప్రాక్టికల్ అప్రోచ్, క్రిటికల్ థింకింగ్, కంపేరిటివ్ అప్రోచ్, సోషల్ అవేర్‌నెస్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్ వంటి ఎన్నో అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటూనే సదరు అంశానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి. అప్పుడే పోటీలో ఇతరుల కంటే ముందంజలో నిలవగలుగుతారు.

 

వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి ముఖ్యం

విద్యార్థులు, తల్లిదండ్రులకు నా సలహా.. ఇంజనీరింగ్ కోర్సు అంటే కేరాఫ్ ఐఐటీలు, మేనేజ్‌మెంట్ కోర్సులకు చిరునామాగా ఐఐఎంలు నిలుస్తున్నాయి. ఇందులో సందేహం లేదు. కారణం.. ఇక్కడి బోధన, ఇతర మౌలిక సదుపాయాలు. కానీ ఔత్సాహికులందరూ తమ గమ్యం ఇవి మాత్రమే అనే దృక్పథాన్ని వీడాలి. ఐఐటీలు, ఐఐఎంలతోపాటు మరెన్నో ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్నాయి. దానికి అనుగుణంగా తమ ఆలోచన పరిధిని కూడా విస్తృతం చేసుకోవాలి.



ఏ స్థాయి ఇన్‌స్టిట్యూట్ అయినా అధ్యాపకులు, బోధన పాత్ర కొంత మేరకే ఉంటుంది. వ్యక్తిగతంగా ఆసక్తి, అభిరుచి, అవగాహన స్థాయిలపైనే కోర్సులో రాణించడం, తదుపరి కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవడమనే అంశాలు ఆధారపడి ఉంటాయి. దీనికి అనుగుణంగా ముందుకు సాగితే మారుమూల గ్రామంలోని ఇన్‌స్టిట్యూట్‌లో చదివినా, మెట్రో సిటీల్లో చదివినా ఒకే విధంగా రాణించగలరు!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top