పురాతనం.. పురుషద్వేషం

పురాతనం.. పురుషద్వేషం


మగోడు

పురుషద్వేషం అనాదిగా ఉన్నదే. పురుషులను స్త్రీలు సహజ శత్రువులుగా భావించేవాళ్లు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఎన్ని వీరోచిత ప్రేమగాథలు ఉన్నా, విమర్శనాత్మక దృష్టితో పరిశీలిస్తే వాటిలోనూ ‘మిసాండ్రీ’ మూలాలు కనిపిస్తాయి.

 

‘మిసాజినిస్ట్’... మగాళ్లలా బతకాలనుకునే మగాళ్లకు ఇంగ్లీషు చదువులు చదువుకున్న ఫెమినిస్టులు కడు ఉదారంగా ప్రదానం చేసే బిరుదు. మగాళ్లలా బతకాలనుకునే మగాళ్లంతా వాళ్ల దృష్టిలో మిసాజినిస్టులు... అనగా స్త్రీద్వేషులు. వాళ్ల దృష్టిలో రాముడూ మిసాజినిస్టే... రావణుడూ మిసాజినిస్టే..! వాళ్ల అభిప్రాయం అది. మనమేమీ చేయలేం. వారికి గల ఇలాంటి అమూల్యాభిప్రాయాల వల్ల మగ బతుకుల మీద నిందల మరకలు పడుతున్నాయి.



చొక్కా మీద పడ్డ మరకలనైతే, అదేదో డిటర్జెంట్ యాడ్‌లో చెప్పినట్లు ‘మరక మంచిదే’ అంటూ వాషింగ్ మెషిన్‌లో పడేయవచ్చు. కానీ బతుకుల్ని ఉతికి ఆరేసే మెషిన్లు ఇంకా అందుబాటులోకి రాలేదే!

 

‘మిసాండ్రిస్ట్’... ఈ పదం ఎందరికి తెలుసు? మనోళ్లకు ఇది బొత్తిగా అపరిచిత పదం. మిసాండ్రిస్టులు... అనగా పురుషద్వేషులు. పురుషద్వేషులందరూ తప్పనిసరిగా మహిళలే కానక్కర్లేదు. పురుషులను ద్వేషించే పురుషపుంగవులూ ప్రపంచంలో లేకపోలేదు. కర్మకాలి ఇలాంటి వాళ్లకే చట్టాలు చేసే మహత్తర అవకాశం దొరుకుతుంది. చట్ట నిర్మాతల మిస్‌గెడైడ్ మిసాండ్రిస్ట్ తెలివితేటల ఫలితంగా అమల్లోకి వచ్చే చట్టాల్లో నిష్పాక్షికతను మనం అన్వేషించరాదు.



మిసాండ్రిస్ట్ చట్టాల్లో నిష్పాక్షికత నిస్సందేహంగా దేవతావస్త్రం. పుణ్యపురుషులకు తప్ప అన్యపురుషులకు అది అగుపించదు. అలాగని పనిలేని పురుషాధముడెవడైనా దాని ఉనికినే ప్రశ్నించాడనుకోండి... అలాంటి దుస్సాహసికి దేశద్రోహం సహా నానా అభియోగాల కింద శాశ్వత శ్రీకృష్ణ జన్మస్థాన నివాస యోగం సంప్రాప్తించగలదు.  

 

పురుషద్వేషం అనాదిగా ఉన్నదే. పురుషులను స్త్రీలు సహజ శత్రువులుగా భావించేవాళ్లు. లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఎన్ని వీరోచిత ప్రేమగాథలు ఉన్నా, విమర్శనాత్మక దృష్టితో పరిశీలిస్తే వాటిలోనూ ‘మిసాండ్రీ’ మూలాలు కనిపిస్తాయి. పంతొమ్మిదో శతాబ్దిలో యూరోపియన్ సమాజంలో మిసాండ్రీ తారస్థాయికి చేరుకుంది. నాటి మిసాండ్రిస్టులను యూరోపియన్ మహిళాలోకం సెలబ్రిటీల్లా ఆరాధించేది. అప్పట్లో ఘనత వహించిన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో మేరీ లెనోయిర్ అనే అరివీర పురుషద్వేషి ఉండేది.



అవసాన దశలో సైతం పురుషులపై ద్వేషం చల్లారని ఆమె తన 15 వేల డాలర్ల యావదాస్తిని ఇద్దరు మహిళలతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించింది. ‘పురుషుల స్వార్థంపై, వారి నియంతృత్వంపై’ సాగించే యుద్ధం కోసం తన ఆస్తిని వినియోగించాలంటూ వీలునామా రాసి కన్నుమూసింది. కొంతకాలానికి కాలం మారింది. మనుగడ కోసం సాటి మగాళ్లను ద్వేషించే ‘మగా’నుభావులు తయారయ్యారు. మహిళల అండ చూసుకుని ఇలాంటి శాల్తీలు శాసనకర్తలుగా అవతరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top