ఆమె... అమృతాసింగ్

ఆమె... అమృతాసింగ్ - Sakshi


హీరోయిన్


అమృతాసింగ్ అంటే బాలీవుడ్‌లో కలకలం. 1980లలో ఆమెలా న్యూస్‌లో ఉన్నవాళ్లు తక్కువ. ఆమెలా క్రేజ్ సంపాదించుకున్నవాళ్లు కూడా తక్కువే. ఢిల్లీలో చదువుకుని ముంబై చేరిన అమృతాకు క్రికెట్ అంటే పిచ్చి. నాటి క్రికెటర్‌లు కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలతో ఆమె స్నేహం నడిచేదని పుకార్లు ఉండేవి. రవిశాస్త్రి ఫోర్‌గాని సిక్సర్‌గాని కొట్టి గాలిలో ‘డి’ లెటర్ రాసేవాడు. ‘డి’ అంటే ‘డింగీ’. అమృతా ముద్దు పేరు. అయితే ఆ తర్వాత అమృతా తన కంటే పన్నెండేళ్లు చిన్నవాడైన సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అమృతా నటించిన తొలి సినిమా ‘బేతాబ్’ (1983) చాలా పెద్ద హిట్. అందులోని పాటలు ‘జబ్ తుమ్ జవా హోంగే’... ‘బాదల్ యూ గరజ్ తా హై’... దేశమంతా మోగిపోయాయి. ఆ తర్వాత ‘సాహెబ్’, ‘మర్ద్’, ‘చమెలీకి షాదీ’ వంటి హిట్స్ ఇచ్చింది.



అనిల్ కపూర్, అమితాబ్ వంటి పెద్ద హీరోలు కూడా ఆమె తమ పక్కన నటించాలని కోరుకున్నారు. సైఫ్‌ను పెళ్లి చేసుకున్నాక లోకమంతా దీనిని వింతగా చూసినా వాళ్లు 12 ఏళ్లు కలిసి ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక 2004లో విడిపోయారు. పిల్లలను తనతోనే ఉంచుకుని అమృతా తిరిగి సినిమాల్లోనూ టెలివిజన్‌లోనూ తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఉంది. ఇటీవల ‘2 స్టేట్స్’ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకున్న అమృతా జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా నటిగా తాను ముందుకు పోగలనని నిరూపించుకుంది.



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top