ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు!

ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు! - Sakshi


ప్రతిభా కిరణం

 

ఇది పోటీ ప్రపంచం. ఈ యుగంలో పోటీ పడనిదే పనిజరగదు. అని తన్మయి గ్రహించింది కాబోలు, పోటీలలో పాల్గొనడమే ధ్యేయంగా పెట్టుకుంది. పాల్గొన్న ప్రతిదానిలోనూ గెలిచి శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 18, 1998న పుట్టిన తన్మయి అంబటి అత్యధిక పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తన్మయి వివిధ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పరీక్షలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్లే మాడలింగ్, చేతి రాత, పర్యావరణ అవగాహన, సామాజిక సేవ మొదలైన అంశాలలో 151కి పైగా అవార్డులను అందుకుంది.

 

అంతర్జాతీయ మేథమెటిక్స్ ఒలంపియాడ్, జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా స్పాట్ కేమెల్ కలర్ కాంటెస్ట్, ఇంట్రా స్కూల్ లెవెల్ సైన్స్ క్విజ్ కాంటెస్ట్‌లతో పాటు ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన మేథమెటిక్స్, కంప్యూటర్ పరీక్షలలో బంగారు పతకాలు సాధించింది.

 

ఆమె తొమ్మిది ఏళ్ల వయసులో కళారత్న, బాలమేధావి అనే బిరుదులను సంపాదించింది. 10 జూన్, 2010లో ‘మహా స్టార్’ గా ఎన్నికైనందుకు ప్రముఖ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఇంకా ఆంధ్రబాలరత్న, స్టేట్ బెస్ట్ చైల్డ్, జూనియర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు పొందింది. అంతేకాదు, మన దేశ మాజీ రాష్ర్టపతి శ్రీమతి ప్రతిభాపాటిల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయల అభినందనలు కూడా అందుకుంది తన్మయి. ఈ బాలికని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పోటీలలో పాల్గొనండి, పతకాల పంట పండించండి!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top