అమ్మదొంగా? ఏకశిలానగరం క్రీ,శ 1300 ( వరంగల్)

అమ్మదొంగా? ఏకశిలానగరం క్రీ,శ 1300 ( వరంగల్)


పదం నుంచి పథంలోకి 16

 

గజదొంగ కన్నప్ప రాజమహేంద్రి నుంచి ఓరుగల్లుకు ఆ పూటే వచ్చి దిగబడ్డాడు. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. దొంగతనం చేస్తే ఓరుగల్లు పడమటి వీధుల్లోనే చేయాలి’ అని తన గురువు మాటవరసకన్న మాటను పట్టుకొని బయలుదేరి

 అక్కలవీధిలో  పూటకూళ్ల సీతక్క ఇంట్లో బసచేసాడు. పొద్దుపోయే

 వేళకి నిద్రలేచి మండువాలో అడుగుపెట్టాడు.

 ‘ఏమయ్యా! ఉదయం వచ్చిన కాడ్నించీ పండుకొనే ఉన్నావ్?  ఏ ఊరేంటి మనదీ?’ అడిగింది సీతక్క.  

 ‘రాజమహేంద్రి! కంసాలి బిడ్డని’ అంటూ ఒళ్లు విరుచుకొని

 ‘పక్షంరోజులు బండి ప్రయాణం. అడివిదారి. దేహం పులుసై పోయింది’ అని జవాబిచ్చాడు కన్నప్ప.

 ‘ఇంకేం మా మంగలి భీముడు ఒక్కసారి

 వీపు తోమితే చాలు అన్నీ సర్దుకుంటాయి. వేడి పాలిస్తాను తాగి స్నానం చేసిరా అన్నం పెడతాను’ అని కంచు చెంబులో పాలు తెప్పించింది.

 సీతక్కది ఓరుగల్లు అక్కలవీధిలో అతిపెద్ద పూటకూళ్లిల్లు. రెండంతస్తుల మేడ. లోగిలి చుట్టూ మామిడితోట. రోజూ మార్చే

 చలువ దుప్పట్లతో నలబై పడకగదులు, ఇక

 భోజనాల సమయంలో అయితే ఆ ఘుమఘుమలే వేరు. ఒక రూకకి నెల్లూరి సన్న బియ్యం, పెసరపప్పు, నాలుగు  కాయగూరలూ, లప్పల కొద్ది పెరుగుతో

 రుచికరమైన భోజనం. పాండ్యదేశపు నల్ల మిరియాలతో  సీతక్క చేసే ధప్పళం కోసం రూక వెచ్చించి

 విస్తరి కోసం జనం పడిగాపులు పడుతారు.

 అలాంటి సీతక్క ఇంట దిగి, వేడి పాలు తాగి తోటలోని స్నానమంటపం

 చేరాడు కన్నప్ప. మామిడితోటలో అరుగులపై చాలామంది కనిపించారు. తాంబూలం సేవిస్తూ భుక్తాయాసంతో అవస్త పడుతూ సాటి వర్తకులతో వ్యాపారం సాగించే కోమట్లు... వెనుకమూలలో చలువపందిరి కింద గొల్లభామలు కాల్చిన వేడివేడి చీకులు,

 కొబ్బరిపాలలో నాన్చిన చేపముక్కల నంజుడుతో గౌడు కాసిన

 ఆసవాలు సేవిస్తూ వాగ్యుద్ధాలు చేసే తెలగ ఎక్కట్లు, రెడ్డివీరులు,

 వెలమనాయకులు.... మండువా అరుగుపై ఆంధ్రదేశం నలుమూలల నుంచి వచ్చి తమ పాండిత్యంతో, కవిత్వంతో రాజాస్థానంలో ప్రవేశం కోసం గాలం వేసే పండిత ప్రకాండులు...

 స్నానశాల పక్కనే చలువరాతి అరుగుపైన బోర్లా పడుకొని ఒళ్లు పట్టించుకుంటున్నాడు కన్నప్ప. పూటకూళ్లక్క చెప్పినట్లు భీముడి

 చేతిలో ఏదో మంత్రముంది. సంపెంగ, బాదం నూనెలతో వాడు ఒళ్లు

 పడుతుంటే బడలిక ఇట్టే మాయమయిది.

 ‘తమరు ఓరుగల్లుకి కొత్తనుకుంటాను బాబయ్యా. ఎన్నాళ్లుంటారో?’ బొటనవేళ్లతో వెన్నుపూసలని కొలుస్తూ మాట కలిపాడు భీముడు.

 ‘పనయ్యేదాకా! ఎన్నాళ్ళయితే అన్నాళ్లు!’ మూలిగాడు కన్నప్ప.

 ‘ఏం పనో’

 ‘నగల వ్యాపారం! నీకు తెలిసినంతలో మంచి నగల బేరానికి బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేంట్రా?’ అని అడిగాడు కన్నప్ప.

 ‘ఎందుకు లేరూ. అడిగో అనుమయ్య. జొన్నల వ్యాపారి. కోటలో ధాన్యం కోష్టం, మైలసంతలో వీధిబారునా అంగళ్ళు. ధనం బాగా మూలుగుతోంది. అందునా వచ్చేనెల బిడ్డ పెళ్ళి’ అంటూ చెట్టు కింద కూర్చొని నెరిసిన బుంగమీసాలు, తలపై సరిగ రుమాలు, చెవులకి బోలుకమ్మలతో, తోటి కోమట్లతో ముచ్చట్లాడుతున్న శెట్టిని చూపాడు.

 ‘సీతక్కతో కబురుచెయ్యి బాబయ్యా. ఇంట్లో ఆడాళ్లకి నీ నగలు నచ్చితే కొనకచస్తాడా!’ అంటూ నవ్వాడు భీముడు.



**************


 పడమటివీధి మొదట్లో శివాలయం ముందు దారికి అడ్డంగా భైరవుడి విగ్రహం. వెళ్ళేపని సరిగ్గా సాగితే బూరెల దండ వేయిస్తానని మొక్కుకొని లెంపలు వేసుకుంటూ ముందుకి సాగాడు కన్నప్ప.

 అనుమయ్య శెట్టిది పడమటి వీధిలో పదడుగుల ప్రహరీ మధ్యలో రెండంతస్తుల మేడ. ఇంటి గోడలు దిట్టంగా కోటగోడల్లా ఉన్నాయి. వీధిలోంచి ప్రహరీగోడ మీదకి వాలిన పొగడచెట్టు కొమ్మని గమనిస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు కన్నప్ప.

 సేవకునికి ఒక కాసు లంచం పడేస్తే శెట్టిసాని దర్శనం సులువుగానే అయ్యింది.

 ‘నమస్కారం శెట్టిసాని’ అని నమస్కారం పెట్టాడు కన్నప్ప.

 ఆమె ఎగాదిగా చూసింది.

 కన్నప్ప తన దగ్గరున్న దంతపు పెట్టెను తెరిచాడు. రత్నాల హారం. ఛక్కున మెరిసింది. దానికి అతడు చెప్పిన వెలకి నిర్ఘాంతపోయింది శెట్టిసాని. అణుచుకోలేని ఆనందంతో అతడిని అక్కడే ఉండమని సంజ్ఞచేస్తూ గబగబా పడమటి గదిలోని పెనిమిటి వద్దకి వెళ్లి- ‘వ్యాపారానికి కొత్తనుకుంటాను. లేకుంటే కనీసం నూరు గద్యాణాలు చేసే హారానికి నూరు మాడలేనా? సగానికి సగం! బంగారం బరువే సరిపోతుంది’ అని మొగుడి చెవిలో గుసగుసలాడింది.

  ‘ఏమో. కొత్తవాడంటున్నావ్. కాకిబంగారం కాదుకదా?’ అడిగాడు, అనుమయ్య.

 ‘ఆహా. మన కంసాలికి చూపెట్టాను. మేలిమి బంగారం. రాళ్ళు కూడా జాతి రాత్నాలే. ఏమైనా మన అమ్మాయి అదృష్టవంతురాలు’

 ‘అయితే తీసుకో. నూరు మాడలేగా? అతడ్ని పిలువు’ అంటూ పడమటి గది గోడలో అమర్చిన ఇనుపపెట్టె తెరిచాడు. దూరం నుండే ఉత్కంఠతో అంతా గమనిస్తున్న కన్నప్ప తృప్తిగా ఊపిరిపీల్చాడు.



      *********



 అర్ధరాత్రి దాటింది! మరునాటి రాత్రి గడిస్తే మైలసంత. అనుమయ్య శెట్టి పనివాళ్ళంతా కోట బయట దుకాణాలకి కాపలాకి పోయారు. దొంగతనానికి అదే మంచి అదను. నూనె ఖర్చుకి వెరచి చావిట్లో దీపాలు కూడా పెట్టలేదు పిసినిగొట్టు! అందుకే చేసేది జొన్నల వ్యాపారమే అయినా బాగానే కూడబెట్టాడు. నీలిబట్టలలో పొగడ కొమ్మపైన పిల్లిలా పాకుతూ ప్రహరీ దాటాడు. అంతెత్తు నుంచి దూకినా అట్టచెప్పులు ఏమాత్రమూ శబ్దం చేయలేదు. వీపుకి వేలాడుతున్న సంచిలో ముళ్ళబంతి, కొండె, గద్దగోరు, కన్నపుకత్తి తడిమి చూసుకొని మెల్లగా పడమటి గది సమీపించారు. గదిలో దీపాలు వెలుగుతున్నాయి, లోపల్నుంచి సన్నగా ఏవో మాటలు వినవస్తున్నాయి. వాళ్ళు గది వదిలేవరకూ ఇలాగే వేచి ఉండాలా, లేక మరోరోజు పని కానివ్వాలా?

 పడమటి గది గోడలు పటిష్టంగా పకడ్బందీగా ఉన్నాయి. పది అడుగుల ఎత్తులో గవాక్షం (వెంటిలేటర్) తప్ప గాలి కూడా జొరలేదు. కొండెకి పట్టుగుడ్డ చుట్టి కప్పుమీద విసిరాడు. ఏదో పట్టింది. లాగి బలం చూసుకొని పైకి ఎగబాకాడు. గదిలో అనుమయ్య, ఎవరో శెట్టితో వాదులాడుతున్నాడు! అర్ధరాత్రి. ఏం వ్యాపారమో? చెవిని గోడకి ఆన్చి సంభాషణ వినసాగాడు.

 అమ్మదొంగా!

 ఇదా అసలు రహస్యం? నేటితో నా పంట పండింది!

 శెట్టి ఆయువుపట్టు దొరికింది. ఇక కన్నం దేనికి? రేపు దొరలాగే వచ్చి ఈ శెట్టి చేస్తున్న మోసాన్ని బయటపెడతానని భయపెట్టి కావలసినది పట్టుకెళ్ళవచ్చు, అనుకుంటూ మెల్లగా కిందకి జారి అక్కలవీధి దారి పట్టాడు దొంగకన్నప్ప.

 

 ఆ శెట్టి చేస్తున్న నేరం ఏమిటి?

 సమాధానం తరువాయి భాగం

 ‘మైలసంత’ కథలో...

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top