పిల్లలలో అలర్జీలు!

పిల్లలలో అలర్జీలు! - Sakshi


ఏదైనా సరిపడని వస్తువు పిల్లలకు తాకినా, పిల్లల శ్వాసమార్గంలోకి వెళ్లినా, పొరపాటుగా నోటిద్వారా తీసుకున్నా వెంటనే ఆ సరిపడని వస్తువు దుష్ర్పభావాలు అనేక లక్షణాల రూపంలో కనిపిస్తాయి. పిల్లల్లో దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఒంటినిండా దద్దుర్లు, కడుపునొప్పి... ఇలా అనేక రూపాల్లో ఆ సరిపడని తత్వం వ్యక్తమవుతుంది. ఇలా ఏదైనా వస్తువు సరిపడని తత్వాన్ని అలర్జీ అంటారు. ఈ అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. పిల్లల్లో వచ్చే అనేక అలర్జీలు, వాటికి కారణాలు, వాటి నివారణ వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.

 

పిల్లల్లో అలర్జీ రావడానికి కారణం ఉంటుంది. వారు ఏదైనా తమకు సరిపడని పదార్ధాన్ని ముట్టుకున్నా లేదా శ్వాసించినా, లేదా పొరబాటున తిన్నా... వెంటనే ఆ సరిపడని వస్తువును మన శరీరం ఒక శత్రువుగా భావిస్తుంది. దానితో పోరాడి బయటకు తరలించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో భాగంగా శరీరంలో కొన్ని రసాయనాలు, హిస్టమైన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఇవి  వెలువడినందువల్ల పిల్లల్లో తుమ్ములు, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.



 పిల్లలకు అలర్జీ కలిగించే సాధారణ పదార్థాలుచెట్లు, మొక్కల నుంచి వెలువడే పుప్పొడి, గడ్డిపరకలు, కలుపుమొక్కల వంటివి.కార్పెట్లు, పరదాల మాటున ఉండే దుమ్ము (నిజానికి ఈ దుమ్ములో ఉండే డస్ట్‌మైట్స్ అనే క్రిముల వల్ల అలర్జీ వస్తుంటుంది).పిల్లి, కుక్క, గుర్రాలు, చెవులపిల్లులు వంటి వాటి వెంట్రుకలు, చర్మం నుంచి వెలువడే పొట్టులాంటి పదార్థాలుకీటకాలు కుట్టడం వల్ల వెలువడే రసాయనాలు, విషాలుసిగరెట్ పొగ, పెర్‌ఫ్యూమ్స్/సెంట్స్ వంటి వాటి ఘాటైన వాసనలు, కారు నుంచి వెలువడే పొగవాసనలుఇక కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు అవి కూడా అలర్జెన్స్‌లా పనిచేస్తాయి. ఉదాహరణకు వేరుశెనగపల్లీలు, గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు.

 

పిల్లల్లో అలర్జీ లక్షణాలు



 చర్మంపై దద్దుర్లు / పగుళ్ల వంటివి రావడం  శ్వాసతీసుకోవడం కష్టం కావడం (ఆస్తమా)  తుమ్ములు, దగ్గులు, ముక్కు నుంచి నీళ్లు కారడం  కడుపులో ఇబ్బంది  వికారంగా వాంతి వస్తున్నట్లుగా అనిపించడం  అలర్జిక్ రైనైటిస్ (ఇందులో ముక్కు దురదగా ఉండి తుమ్ములు వస్తూ, ముక్కుకారుతుంటుంది. కళ్లలోంచి కూడా నీళ్లు వస్తుంటాయి)  ముక్కు దిబ్బడ వేయడం (దీని వల్ల ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టమై, రాత్రివేళల్లో నోటి ద్వారా శ్వాసతీసుకుంటూ ఉంటారు)  చెవిలో ఇన్ఫెక్షన్ (అలర్జీల వల్ల చెవిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి, చెవి నొప్పి రావచ్చు)



అలర్జీలు తెచ్చి పెట్టే ఆహారాలు...



పిల్లలు తీసుకునే ఆహారంతో వచ్చే అలర్జీలలో ముఖ్యమైనవి వేరుశెనగపప్పు లతో వస్తుంటాయి. ఇక పాల వల్ల కూడా కొందరిలో అలర్జీ వస్తుంటుంది. కొందరిలో గుడ్లు, చేపలు, పీతలు, లాబ్‌స్టర్స్, రొయ్యల వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. ఇక మరికొందరిలో సోయా ఉత్పాదనలు, జీడిపప్పు వంటి నట్స్ వల్ల కూడా అలర్జీలు రావచ్చు.



తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక...



పిల్లలు తింటున్న పదార్థాల వల్లగానీ అలర్జీలు కలుగుతుంటే దాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. లేదా పిల్లలకు ఏ అంశం సరిపడటంలేదో గుర్తించడం తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే సాధారణ అలర్జీలైన దద్దుర్లు, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడాలు, ఒంటి మీద దురద పెట్టడాల వంటి లక్షణాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ... ఒక్కోసారి పిల్లలకు ఊపిరి అందనంతగా శ్వాసతీసుకోవడం కష్టం కావడం, ఆయాసం రావడం, అకస్మాత్తుగా రక్తపోటు పూర్తిగా పడిపోవడం, వారి శరీరం షాక్‌కు గురికావడం వంటివి జరిగితే అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పిల్లలకు ఏ పదార్థాలు / అంశాలు / వస్తువులు సరిపడటం లేదన్న విషయాన్ని తల్లిదండ్రులు నిశితంగా గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

 

అలర్జీ ఉన్న పిల్లలు...స్కూలు విషయంలో  తల్లిదండ్రుల బాధ్యత...



తమ పిల్లలకు ఏయే అంశాలు అలర్జీని కలిగిస్తాయన్న విషయాన్ని స్కూలు యాజమాన్యానికి తెలియజేయాలి. పిల్లల్లో అలర్జీలు కనిపించినప్పుడు స్కూలు యాజమాన్యం తక్షణం చేపట్టాల్సిన ముందుజాగ్రత్తలనూ వారికి తెలియజేయాలి. పిల్లలను నెబ్యులైజేషన్ (పీల్చే మందును మాస్క్‌లా పెట్టగలిగే వసతి) ఇచ్చే ఆసుపత్రికి లేదా ఆరోగ్యకేంద్రానికి తరలించాలని చెప్పడంతో పాటు... చిన్నారికి అలర్జీ వచ్చినప్పుడు తాము సంప్రదించే డాక్టర్ ఫోన్ నెంబరు, ఆసుపత్రి చిరునామా తెలిపాలి. స్కూలు యాజమాన్యం కూడా పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించగానే  తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలిపాలి.



నివారణ...



పిల్లలకు వచ్చే అలర్జీల విషయంలో నివారణ చాలా తేలిక. ఉదాహరణకు వారికి సరిపడని వస్తువు, అంశం, ఆహారం... ఇలా అదేమిటో గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అదే అన్నిటికంటే మంచి నివారణ.  పిల్లలను దుమ్మూ ధూళి నుంచి దూరంగా ఉంచాలి. వారి దుస్తులు, పక్కబట్టలు (బెడ్‌షీట్స్), టవల్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

  పెంపుడు జంతువుల జుట్టు / చర్మపు పొట్టు వంటి వాటి వల్ల వారికి అలర్జీ ఉందని తేలితే... పిల్లలను పెంపుడు జంతువుల వద్దకు అనుమతించకూడదు. ఇంట్లోని వాతావరణంలో ఆకస్మికంగా మార్పు రాకుండా చూసుకోవాలి. దాదాపు ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇక దుమ్ము, ధూళి వంటి వాటిని శుభ్రం చేసే సమయంలోనూ, బూజులు దులిపే సమయంలోనూ పిల్లలను ఇంట్లో ఉంచకూడదు.

 

చికిత్స



పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే వాటికి విరుగుడు మందులైన యాంటీ హిస్టమైన్స్ ఇస్తుంటారు. ఒకవేళ పిల్లల్లో అలర్జీ వల్ల కలిగిన తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి ఎపీనెఫ్రిన్ (ఎడ్రినాలిన్) వంటి మందులు వాడుతుంటారు. ఇక అలర్జీ కారణంగా శ్వాస అందని సందర్భాల్లో , శ్వాస తేలిగ్గా తీసుకునేందుకు వీలుగా  పీల్చేమందులు (ఇన్‌హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా వాడుతుంటారు. ఒకవేళ అలర్జీ వల్ల పిల్లల్లో ఆస్తమా ప్రేరేపితమైతే... దాన్ని తగ్గించేందుకు కూడా ఇప్పుడు అత్యంత ఆధునికమైన పీల్చే మందులు అందుబాటులో ఉన్నాయి.

 

 డాక్టర్ టి.పి. కార్తీక్

 పీడియాట్రీషియన్, నియోనేటాలజిస్ట్,

 యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top