అమ్మకు కూరలు కూడా తరిగిపెట్టేవారు


సెప్టెంబరు 20...

 తెలుగువారికి ప్రత్యేకమైన రోజు...

 ఆంధ్రుల అందాల రాముడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు... ఆ రోజు ఉదయాన్నే ఆయన ఇంటి ముందర రంగవల్లులు - తన కోసం వచ్చే అభిమానులకు స్వాగతం పలికేవి. వారి కోసమే ప్రత్యేకంగా బెల్లంతో తయారైన పరమాన్నం, పెసరట్టు, జిలేబీల ఘుమఘుమలు...

 ఆప్యాయంగా పలకరించేవి. ఈ సంవత్సరం అక్కినేని పరోక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు

 అంత ఘనంగానూ జరుగుతున్నాయి...

 ఈ సందర్భంగా అక్కినేని కుమార్తె నాగసుశీల తన తండ్రి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు...


నాన్నగారి లేని మొదటి పుట్టినరోజు... ఎలా అనిపిస్తోంది?

నాగసుశీల: (కళ్లనీళ్లు పెట్టుకుని) నాన్నగారు లేరనే భావన చాలా ఇబ్బందిగా ఉంది. రోజూ ఫ్యాన్స్ ఫోన్ చేసి తామంతా బాధపడుతున్నామని చెబుతుంటే, మేమే వాళ్లని సముదాయించవలసి వస్తోంది. (అంటూ అంతలోనే సర్దుకుని) మీరు పలకరించేసరికి ఒక్కసారి ఎమోషనల్ అయ్యాను. అంతే!



నాన్నగారితో పెనవేసుకున్న అనుబంధం...

నాన్న మా దగ్గరకు వచ్చినా, మేం అక్కడకు వెళ్లినా, పొద్దున్నే అందరికీ టీ కాఫీలు ఆయనే అందించేవారు. పిల్లలకు వండి పెట్టడమంటే ఆయనకు చాలా ఇష్టం. నా 22వ ఏట పెళ్లయ్యి, అమెరికా వెళ్లాను. నన్ను చూడటం కోసం అమ్మనాన్నలు ప్రతి సంవత్సరం వచ్చి, నెలరోజులు నా దగ్గరే ఉండేవారు. నాకు అప్పటికి ఇంకా వంట చేతకాదు. అందువల్ల తెలుగు వంటల పుస్తకం చూసి, ప్రయోగాలు చేస్తుంటే, నా పాట్లు చూసి, స్వయంగా దగ్గరుండి నేర్పించేవారు.



నాన్నగారి కోసం ప్రత్యేకంగా ఏమేం తయారు చేసేవారు?

నాన్న కోసం ప్రత్యేకంగా ఆపిల్ క్రంబుల్స్ తయారుచేసేదాన్ని. అయితే అందులో కొన్ని మార్పులు చేసేదాన్ని. బటర్ బదులుగా నూనె, నట్స్ బదులుగా ఓట్లు, పంచదార బదులు బెల్లం వేసి నాన్నకి ఆరోగ్యకరంగా తయారు చేసి ఇచ్చేదాన్ని. నాన్న చాలా ఇష్టంగా తినేవారు. ఇంకా క్యారట్ కేక్ కూడా తయారు చేసేదాన్ని. కోడిగుడ్డు పచ్చసొన నాన్న తినరు. అందువల్ల కేవలం తెల్ల సొన మాత్రం వేసి చేసేదాన్ని. నట్స్ బదులు ముసిలీ వేసేదాన్ని. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేయడం వల్ల, నేను ఎలా చేసినా మాట్లాడకుండా తినేసేవారు.



మోటార్ హోమ్‌లో ఎంజాయ్ చేశారని విన్నాం...

అవును. నాన్న అమెరికా వచ్చినప్పుడు ఒకసారి ఎనిమిది వేల కిలోమీటర్లు మోటార్ హోమ్‌లో తిరిగాం. అందులోనే అవెన్, స్టవ్ అన్నీ ఉంటాయి. ఆ ప్రయాణంలో నాన్న రకరకాల రుచులు తయారుచేసి పెట్టేవారు.



అక్కినేనిగారికి ఆరోగ్యం మీద శ్రద్ధ కదా! బ్రేక్ ఫాస్ట్‌లో ఏవేవి తినేవారు?

నిజమే! నాన్నకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. ఉదయం బొప్పాయి ముక్కలు, మజ్జిగ మాత్రమే తీసుకునేవారు. ఎప్పుడైనా ఉప్మా చేసినా, అది గోధుమరవ్వతోనే చేయాలి. భోజనంలో కూడా దంపుడు బియ్యంతో వండిన అన్నం వంటి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి నాన్న మా నాయనమ్మకి సహాయం చేసేవారట. అందువల్ల నాన్నకి వంట పని, ఇంటి పని అన్నీ తెలుసు. అందుకే అమ్మకి ఎన్నో సందర్భాలలో సహాయం చేసేవారు. అమ్మకి కూరలు సైతం తరిగిపెట్టేవారు. ఇంకా... వంటలో కొత్తకొత్త ప్రయోగాలు చేయడమంటే నాన్నకు భలే ఇష్టం. ఒకసారి ఇంట్లో ఉన్న గడ్డి కోయించి, దానితో పచ్చడి చేయించి, అన్నంలో మా అందరికీ వడ్డించారు. మేమందరం చాలా ఇష్టంగా తిన్నాం. అంతా అయ్యాక అది గడ్డితో తయారైన వంటకం అని చెప్పారు. ఒక్కసారిగా అందరం నవ్వుకున్నాం.



ఆయనకు ఏయే వంటకాలంటే ఇష్టం?

పల్లెటూరి వంటకాలు, ముఖ్యంగా ఆంధ్ర వంటలంటే నాన్నకు ప్రత్యేకమైన అభిమానం. బీరకాయ - సెనగపప్పు కూర, దోసకాయ - మెత్తళ్ల కూర ఇష్టంగా తినేవారు. వంట నచ్చకపోతే వెంటనే మూతి ముడుచుకునేవారు. బాగుంటే మెచ్చుకునేవారు. బెల్లంతో తయారైన జున్ను. గవ్వలు, పూతరేకుల వంటి స్వీట్స్ బాగా ఇష్టపడతారు. పండూరి మామిడికాయలు, హిమాయత్ మామిడిపండ్లు తినేవారు. కొత్త ఆవకాయ కలపగానే, వేడి వేడి అన్నంతో కలిపి తినేవారు. వంద కిలోల ఆవకాయ పెట్టించి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలన్నది ఒక లిస్ట్ తయారుచేసి, ఆ ప్రకారం అందరికీ పంపేవారు. నాన్నకి పండగల కంటె పుట్టినరోజులు సెలబ్రేట్ చేయడమంటే చాలా ఇష్టం. ఆ రోజున బెల్లం పాయసం తప్పనిసరిగా చేయించేవారు.



అక్కినేనిగారికి కారం బాగా ఇష్టమని విన్నాం...

నాగసుశీల: నాన్నకి ఏ వంటకం చేసినా అందులో ఇగురు కారం (గొడ్డు కారం) వేస్తే ఇష్టం. అందుకని  ఆయన కోసం ప్రత్యేకంగా ఇగురు కారం వేసేవాళ్లం. ఇంకా బెల్లం వేసిన ఉలవచారు, గుమ్మడికాయ, పచ్చిపులుసు, అప్పటికప్పుడు తయారుచేసే గోంగూర పచ్చడి ఉన్నాయంటే, ఆయనకు పండగే పండుగ.



నాన్‌వెజ్‌లో బాగా ఇష్టంగా యేవేవి తినేవారు?

నాగసుశీల: నాన్ వెజ్ అంటే పెద్ద ఇష్టం లేదు. ఎప్పుడైనా ఫిష్ తినేవారు. దోసకాయ మెత్తళ్ల కూర, నూటికో కోటికో చిన్న నాటు కోడి ముక్క తినేవారు.



సంక్రాంతికి స్టూడియో స్టాఫ్ అందరూ కలుస్తారట! ఆ వివరాలు...

నాగసుశీల: ప్రతి సంక్రాంతికి స్టూడియోలో స్టాఫ్ సుమారు 200 మంది వస్తారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా వంటలు చేయించి, మేమే అందరికీ వడ్డించేవాళ్లం. మొన్న సంక్రాంతికి నాన్నని వీల్ చెయిర్‌లో తీసుకువచ్చాం. వారంతా ఎంత సంబరంగా, నాన్నతో ఫొటో తీయించుకున్నారు.



నాన్నగారి పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ఏవైనా వంటకాలు తయారు చేయించేవారా?

నాగసుశీల: నాన్న తన పుట్టినరోజు నాడు, తన అభిమానుల కోసం ప్రత్యేకంగా బె ల్లం పరమాన్నం, పెసరట్టు, బెల్లం జిలేబీ చేయించేవారు. అందుకే ఈ సంవత్సరం కూడా అవే వంటకాలు చేయిస్తున్నాం.



నాన్నగారి గురించి నాలుగు మాటలు...



మేం కళ్లనీళ్లు పెట్టుకోవడం నాన్నకు ఇష్టం లేదు. ఆయన పరిపూర్ణ జీవితం గడిపారు. చూడవలసిన విజయాలన్నీ కళ్లారా చూశారు. అందుకే ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే నాన్న పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులం అందరం నాన్న ఇంటిదగ్గర కలుస్తున్నాం.  నాన్న జ్ఞాపకంగా ఆయన చేతికున్న ఉంగరాన్ని నేను నా చేతికి పెట్టుకున్నాను. అది చూసినప్పుడల్లా నాన్న నాతోనే ఉన్నారనీ, నన్ను వేలు పట్టుకుని నడిపిస్తున్నారనీ అనిపిస్తుంది

 

- సంభాషణ: డా. వైజయంతి

 

అమ్మపోయిన తర్వాత నాన్నే అమ్మ కూడా అయ్యారు. మా అందరికీ ఏదో ఒకటి పెట్టడమంటే నాన్నకు చాలా ఇష్టం. అందుకే  నాన్న దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఇంట్లో కాసిన జామకాయలు, మామిడికాయలు కోయించి ఇచ్చేవారు.

 

దెందులూరు తెల్ల వంకాయ కూరలో పాలు పోసి వండితే నాన్న ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసేవారు. నాన్న మరణించడానికి ముందు కూడా ఆ వంకాయలు తెచ్చారు. అయితే వాటితో కూర ఇంకా చేయకముందే నాన్న మరణించడంతో, తెచ్చిన వంకాయలు ఫ్రిజ్‌లో అలానే ఉండిపోయాయి. మా వంటావిడ యాదమ్మ వాటితో కూర చేసి, ‘ఇది నాన్నగారి కూర’ అంటూ మా అందరికీ తలో ముక్క వచ్చేలా ఎంతో ఆప్యాయంగా వడ్డించింది. ఆ రోజున మిస్ అయినవారి కోసం కొంత కూర పక్కన ఉంచి, మరుసటి రోజు వారికి పెట్టింది. అది మాకు నాన్న మిగిల్చిన తీపి జ్ఞాపకంగా అనుకుంటాం.

 

దెందులూరు వంకాయ కూర


 

కావలసినవి:

నూనె - 2 టేబుల్ స్పూన్లు; తెల్ల వంకాయలు - అర కేజీ; సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర - టీ స్పూను చొప్పున; ఎండు మిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చి మిర్చి + అల్లం ముద్ద - 3 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - చిటికెడు; పాలు - 3 టేబుల్ స్పూన్లు

 

 తయారీ:   

 వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు కట్ చేయాలి   

 

 బాణలిలో నూనె కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి   

 

 ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి   

 

 వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి   

 

 కొద్దిగా ఉడుకు పట్టాక పాలు పోయాలి   

 

 కూర బాగా ఉడికిన తర్వాత అల్లం + పచ్చి మిర్చి ముద్ద వేసి కలపాలి.

 

 క్యారట్ కేక్

 

 కావలసినవి:

 కోడిగుడ్లు - 4; వెజిటబుల్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు; మైదా - 2 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి - 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము - 3 కప్పులు; వాల్నట్ తురుము - కప్పు; నూనె - అర కప్పు; క్రీమ్ చీజ్ - అర కప్పు; కన్ఫెక్షనరీ సుగర్ - 4 కప్పులు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - టీ స్పూను; వాల్నట్ తురుము - కప్పు

 

 తయారీ:  

 అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి  

 

 పెద్ద పాత్రలో కోడిగుడ్లు (తెల్ల సొన మాత్రమే), నూనె, బెల్లం తురుము, 2 టీ స్పూన్ల వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ వేసి గిలకొట్టాక, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి  

 

 క్యారట్ తురుము, వాల్నట్ పొడి జత చేసి మరోమారు కలిపి నూనె రాసి ఉంచుకున్న బేకింగ్ పాన్‌లో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్‌లో సుమారు 50 నిమిషాలు బేక్ చేసి బయటకు తీసి పది నిమిషాలు చల్లారనివ్వాలి  

 

 ఒక పాత్రలో నూనె, బెల్లం తురుము, టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి నురుగులా వచ్చేలా గిలక్కొట్టాలి   

 

 వాల్నట్ తురుము జత చేసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచి తీసేసి, క్యారట్ కేక్ మీద వేసి చల్లగా అందించాలి.

 

 బీరకాయ - సెనగపప్పు కూర

 

కావలసినవి:

బీరకాయలు - అర కేజీ; నూనె - 3 టేబుల్ స్పూన్లు; సెనగపప్పు - అర కప్పు; ఎండు మిర్చి - 8; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు - 4; ఉప్పు, పసుపు - తగినంత

 

 తయారీ:

 బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, ముక్కలు కట్ చేయాలి  

 

 సెనగపప్పును గంట సేపు నానబెట్టాలి  

 

 బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి, ఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి   

 

 కరివేపాకు వేసి వేగాక, బీరకాయ ముక్కలు, సెనగపప్పు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత ఉంచాలి   

 

 మెత్తగా ఉడికాక దించేయాలి.

 

 దోసకాయ-మెత్తళ్ల కూర

 

 కావలసినవి

 దోసకాయ ముక్కలు - కప్పు; కడిగి శుభ్రం చేసిన పచ్చి మెత్తళ్లు - 3 కప్పులు (ఇష్టాన్ని అనుసరించి కొలతలు మార్చుకోవచ్చు); కరివేపాకు - 2 రెమ్మలు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి - 6; ధనియాల పొడి - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; కారం - రెండు టీ స్పూన్లు; నూనె - తగినంత; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను

 

 తయారీ:  

 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి

 

 అల్లం వెల్లుల్లి ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి

 

 పసుపు, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి  

 

తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, కడిగి శుభ్రం చేసుకున్న మెత్తళ్లు వేసి బాగా కలిపి ఉప్పు, కారం వేసి, తగినన్ని నీళ్లు పోసి మూత ఉంచాలి

 

 బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి  

 

 ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top