అమ్మకు అమ్మయ్యాడు!

అమ్మకు అమ్మయ్యాడు! - Sakshi


స్ఫూర్తి

 

ప్రేమను పంచడానికి మనిషితో సంబంధం లేదు. పంచే హృదయముంటే చాలు.

మంచి చేయడానికి వయసుతో సంబంధం లేదు. చేసే మనసుంటే చాలు.

అవి ఉన్నాయి కాబట్టే జాస్పర్ పాల్ తక్షణం స్పందించాడు. ఏ సంబంధమూ లేని ఓ వృద్ధురాలి కోసం ఊరంతా పరుగులు తీశాడు. కనీసం పరిచయమైనా లేని ఆమెను కాపాడేందుకు అంతగా తపనపడ్డాడు. మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచాడు!బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడి స్ఫూర్తిదాయక కథనమిది...


 

రెండు రోజుల క్రితం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర నడచుకుంటూ వెళ్తున్నాడు జాస్పర్ పాల్ (19). చుట్టూ చూసుకుంటూ చురుగ్గా అడుగులు వేస్తున్నాడు. ఉన్నట్టుండి అతడి కాళ్లకు బ్రేక్ పడింది. వెళ్తోన్నవాడల్లా ఆగి చూశాడు. రోడ్డు పక్కన.. ఫుట్‌పాత్ మీద.. ఓ వృద్ధురాలు పడుకుని ఉంది. డెబ్భై యేళ్ల వరకూ ఉంటుంది వయసు. తల నెరిసిపోయింది. చర్మం ముడతలు పడింది. లేచి కూర్చునే సత్తువ కూడా లేదు. అందరూ ఆమెను చూసీ చూడనట్టే వెళ్లిపోతున్నారు తప్ప కనీసం పలకరించట్లేదు. చాలా బాధేసింది జాస్పర్‌కి. తానైనా ఆమెకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దగ్గరికెళ్లి ఏం కావాలని అడిగాడు. అప్పుడు తెలిసిన విషయం అతడి మనసును చలింపజేసింది.

 

ఆమె పేరు పద్మావతి. ముగ్గురు పిల్లలను కని, పెంచింది కానీ వాళ్ల ప్రేమను పంచుకోలేకపోయింది. అనాదరణకు గురై రోడ్డున పడింది. అప్పటికి ఐదు రోజుల క్రితం ఆమెను ఓ వాహనం గుద్దేసింది. ఆ క్షణం నుంచీ... రాత్రనకా పగలనకా... ఎండలోను, వానలోను అలానే పడివుంది.  కుడిచేతికి పెద్ద గాయముంది. సెప్టిక్ అయ్యిందనడానికి గుర్తుగా ఆ గాయం నిండా పురుగులు! చూడగానే అదోలా అయిపోయింది జాస్పర్ మనసు. కానీ అది ఒక్క క్షణమే. మరుక్షణమే అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు... ఆమెను కాపాడి తీరాలని! చుట్టూ చాలామంది మూగారు. కానీ ఎవ్వరిలోనూ చలనం లేదు. కోపం ముంచుకొచ్చింది జాస్పర్‌కి. ‘అయితే సాయం చేయండి, లేదంటే ఇక్కడ్నుంచి వెళ్లిపోండి’ అంటూ అరిచాడు. అప్పుడైనా వాళ్లు ముందుకు రాలేదు... ఒక్క కుర్రాడు తప్ప. అతడి పేరు రాహుల్ పసుపాల. ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ విద్యార్థి. అతడొక్కడే జాస్పర్‌కి తోడుగా నిలిచాడు. ఇద్దరూ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కాఫీ తెచ్చి ఆమెకు తాగించారు. అంతలో అంబులెన్స్ వచ్చింది.

 

అడుగడుగునా నిర్లక్ష్యమే...



ఈ అస్తవ్యస్త వ్యవస్థలో మనుషులు యంత్రాల్లా పని చేస్తారు తప్ప, మనసుతో పని చేయరని తెలుసుకునే సమయం వచ్చింది జాస్పర్‌కి. పద్మావతిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించారు అంబులెన్స్‌వారు. ఆమె ఎవరో తెలియకుండా ఎలా తీసుకెళ్తాం అన్నారు. కష్టాల్లో ఉన్న మనిషికి సాయపడటానికి వివరాలు కావాల్సి వచ్చాయి వారికి. విధిలేక గోపాలపురం పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాడు జాస్పర్. ప్రాణాల కంటే ప్రొటోకాల్ ముఖ్యమన్నట్టు... ముందు జాస్పర్‌ని పోలీస్ స్టేషన్‌కి రమ్మన్నారు వాళ్లు. దాంతో అక్కడికి పరుగు తీశాడు. ఎలాగైతేనేం... కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, రాహుల్‌ల సాయంతో పద్మావతిని గాంధీ ఆసుపత్రికి చేర్చాడు. కానీ ఆమెను లోనికి తీసుకెళ్లడానికి వార్డ్‌బోయ్స్ కూడా లేకపోవడంతో వాళ్లే స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్లారు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు కానీ వైద్యం చేయడానికి ఉపక్రమించలేదు. మాకిలాంటి కేసులు రోజూ వందల్లో వస్తాయి, అందరికీ సేవ చేస్తూ కూర్చునే సమయం లేదన్నారు. గాయాన్ని శుభ్రం చేయమని వాళ్లకే చెప్పారు. దాంతో ఆ ఇద్దరూ అందుకు పూనుకున్నారు. టర్పైంటైన్ ఆయిల్ వేస్తుంటే గాయంలోని పురుగులు పైకి రాసాగాయి. అయినా అసహ్యించుకోలేదు. ఇయర్ బడ్స్‌ను ఉపయోగించి దాదాపు ముప్ఫై పురుగులను తీశారు. అప్పటికి కానీ వైద్యులు చికిత్స చేయలేదు.

 

నీడ కూడా కల్పించి....



పద్మావతి చేతికి కట్టిన కట్టును చూసి ఊపిరి పీల్చుకున్నాడు జాస్పర్. కానీ మరో సమస్య తలెత్తింది. చీకటి పడుతోంది. తిరిగి వెళ్లాలి. కానీ పద్మావతిని ఎక్కడ ఉంచాలి? ఆసుపత్రి యాజమాన్యం దగ్గరకు వెళ్లారు. ఆ ఒక్కరాత్రికీ ఆమెను అక్కడ ఉండనివ్వమన్నారు. కానీ తమ హృదయ కాఠిన్యాన్ని మరోసారి చాటుకున్నారు ఆసుపత్రివారు. ముక్కూముఖం తెలియనివాళ్లకు చోటివ్వలేం, ఆమె తరఫువాళ్లెవరైనా ఉండాలన్నారు. ‘మీరే తీసుకొచ్చారుగా, మీరే చూసుకోవచ్చుగా’ అంటూ ఎగతాళి చేశారు. అంత నిర్దయగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూసి కడుపు మండిపోయింది జాస్పర్‌కి. కానీ తప్పని పరిస్థితి. మూడు గంటల పాటు తంటాలు పడి, చివరకు పోలీసులతో చెప్పించి అనుమతి సంపాదించాడు. ఓ దుప్పటి, కొన్ని మంచినీళ్ల బాటిళ్లు పద్మావతికి ఇచ్చి, రాహుల్‌ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా పద్మావతి గురించే ఆలోచించాడు. అంతలో అతడికి జార్జ్ రాకేష్‌బాబు గురించి తెలిసింది. జీడిమెట్లలో వృద్ధుల కోసం ‘గుడ్ సమారిటన్ హోమ్’ను నడుపుతున్నారు జార్జ్. ఆయ నను కాంటాక్ట్ చేసి, పద్మావతి విషయం చెప్పాడు. జార్జ్ ఆమెకు సాయపడేందుకు ముందుకు రావడంతో పద్మావతిని ఆ సంస్థలో చేర్పించాడు.

 

ఈ అనుభవం గురించి అడిగితే ‘‘నేనేదో గొప్ప పని చేశానని అనుకోవడం లేదు’’ అంటాడు జాస్పర్. ‘‘పద్మావతిగారు కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది. ‘నాకెవ్వరూ వద్దు, నువ్వుంటే చాలు. నన్ను నీతో తీసుకెళ్లిపో, నీ దగ్గరే ఉంటాను’ అని ఆవిడ అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. వయసు చిన్నదే అయినా అతడి మనసు ఎంత గొప్పదో చెప్పడానికి... ఆ కంటిచెమ్మ చాలు!

- సమీర నేలపూడి

 

‘‘పద్మావతిగారి పరిస్థితి చూసి ఎంత బాధ కలిగిందో... ఆవిడ విషయంలో అంబులెన్స్‌వారు, హాస్పిటల్ వాళ్లు ప్రవర్తించిన తీరు అంతకంటే ఎక్కువ బాధ కలిగించింది. వాళ్లు అలా ప్రవర్తిస్తారని అస్సలు ఊహించలేదు. దేవుడి దయవల్ల ఆవిడకు ఏమీ కాలేదు. ఇప్పుడు ఆరోగ్యంగా,  సంతోషంగా ఉన్నారు. నాకు సహకరించిన రాహుల్‌కి, జార్జ్ గారికి థ్యాంక్స్.’’

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top