కూతురమ్మ!

కూతురమ్మ!


అమ్మ తెలుసు... అమ్మమ్మ తెలుసు...

నానమ్మ తెలుసు... వదినమ్మ తెలుసు...

అత్తమ్మ తెలుసు... చెల్లెమ్మ తెలుసు...

చిన్నమ్మ కూడా తెలుసు!

వీళ్లందరి ప్రేమ కలిపితే కూతురమ్మ.

అంధురాలైన తల్లికి బొట్టు పెట్టుకునే అద్దం తను.

కుప్పకూలిన తండ్రికి అన్నం పెట్టే కంచం తను.

ఈ కూతురమ్మను చూస్తే ఎంతో ధైర్యం వస్తుంది.

ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.

మరి... ఇంత ఇస్తున్న కూతురమ్మకు మనం ఏమివ్వగలం?




నవమాసాలు మోసి కంటుంది అమ్మ... చిట్టి పాదాలను తన అరచేతులమీద పెట్టుకుని నడిపిస్తాడు నాన్న. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు. ప్రాణమున్నన్ని రోజులు తమ బిడ్డకు సాయపడాలని ఆశిస్తారు  అమ్మానాన్నలు. కానీ... ఇక్కడ విధి ఆ అమ్మానాన్నలతో ఆడుకుంది. వాళ్లు కన్న... ఆ బిడ్డ ఒడిలో... వాళ్లనే చిన్నపిల్లల్లా మార్చేసింది. కన్నవాళ్లను కొట్టి తరిమేస్తున్న ఈ రోజుల్లో... తన రెక్కలను ముక్కలు చేసుకుంటూ... ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ... జన్మనిచ్చిన వాళ్లకోసం జీవితాన్ని ధారబోస్తోంది. పేదరికంతో బతుకు పోరాటం చేస్తోంది అర్చన.



ఆనందంగా మొదలైన జీవితం..

పచ్చని అడవులు... ప్రశాంతమైన వాతావరణం ఉన్న పల్లె నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి. అలాంటి గ్రామంలో హెల్పర్‌గా కరెంటు పనులు చేసేవాడు చెరుకు దుర్గారెడ్డి. ఆయనతో జీవితాన్ని పంచుకుంది పద్మ. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి దేవుడిచ్చిన వరమే అర్చన. ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా గడిపింది. అర్చన చదువుకూ ఎలాంటి ఇబ్బంది రాలేదు. ప్రభుత్వం నుంచి కొత్త నిబంధన వచ్చింది. హెల్పర్‌గా ఉండాలంటే కరెంటు స్తంభాలను ఎక్కి తీరాల్సిందేనని సర్కారు ఆదేశించింది. గ్రామంలో చేసేందుకు పని లేదు. కూతురిని ఊళ్లోనే ఆమె నానమ్మ దగ్గర ఉంచి దుర్గారెడ్డి... భార్యతోపాటు హైదరాబాద్‌ బాట పట్టాడు.



కష్టాల పయనం ప్రారంభం...

పైసల కోసం పట్నంలో కూలీగా మారాడు. పెళ్లాం బిడ్డలను పోషించడం కోసం పగలనక, రాత్రనక పనిచేశాడు. వచ్చిన డబ్బులో కొంత బిడ్డకు పంపేవాడు. బతుకుబండి గాడిన పడిందనుకున్నాడు. అప్పుడే మరో పెద్ద దెబ్బ... అతడికి పక్షవాతం వచ్చింది. చేతులు, కాళ్లు, నోరు పనిచేయక ఆయన్ను మంచానికి పరిమితం చేసింది.  దాంతో భార్య పద్మ తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో ఆమెకు హైబీపీ, షుగర్‌ వచ్చేశాయి.



ముసురుకున్న చీకట్లు...

అప్పటికి అర్చన ఇంటర్‌ సెకండియర్‌కొచ్చింది. నాన్నకు పక్షవాతం, అమ్మకు హైబీపీ, షుగర్‌. సంపాదన లే కుండా హైదరాబాద్‌ వంటి నగరంలో ఉండటం అసాధ్యమని తెలిసింది అర్చనకు. అమ్మానాన్నలను దిమ్మదుర్తికి తీసుకువచ్చింది. ఇక చదువు సాగే దారిలేదని అర్థమైపోయింది. తానే సంపాదించాలి. అందుకు సిద్ధమైంది. తండ్రి కోలుకోకపోగా... తల్లికి హైబీపీ, షుగర్‌ మరింత పెరిగి చూపు పోయింది. దెబ్బమీద దెబ్బ... కుటుంబ భారమంతా ఆ అమ్మాయి మీదనే పడింది.  



గుండె నిండా బాధే...

తన వేలు పట్టి నడిపించిన నాన్న... కనీసం వేలు కూడా కదపలేని స్థితిలో ఉన్నాడు. ఏది మంచో... ఏది చెడో... దారి చూపించాల్సిన అమ్మ కనుచూపు కోల్పోయి... కన్నీటికే పరిమితమైంది. కనీసం తోబుట్టువులు, బంధుమిత్రులు ఉండి ఉంటే ఆమెకు కొంతైనా అండ ఉండేది. ఆ పరిస్థితీ లేదు.



ఫలితం ఇవ్వని కష్టం...

తనను కన్నవాళ్లకోసం కష్టపడటానికి అర్చన సిద్ధమైంది. చిన్ననాటి స్నేహితుల సలహాతో ఖానాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా జాయినైంది. రోజూ 40–50కి.మీ ప్రయాణం చేస్తూ... బడిలో పాఠాలు చెబుతోంది. అయినా ఆమె కష్టం తీరలేదు. అక్కడ వచ్చే  వేతనం మూడు వేల లోపే. అది అమ్మానాన్నల మందులకే సరిపోవడం లేదు. ఆమె పడుతున్న కష్టం మందుల కొనడానికే ఖతమైపోతోంది.



బియ్యం అమ్మి...

బీపీ, షుగర్‌ ఉన్న అమ్మకు ఒక్కరోజు ట్యాబ్లెట్‌ వేయకున్నా కష్టమే. నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం తోడు లేరు. వాళ్లకు జ్వరం వచ్చినా డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లలేని దుస్థితి. రెక్కల కష్టంతో సేవలు చేస్తోంది. ఒక్కోసారి మందులకు డబ్బుల్లేక తమకు వచ్చే రేషన్‌ బియ్యాన్ని అమ్ముకుని మందులు కొంటోంది. వాళ్లు తలదాచుకుంటున్న ఆ ఇల్లూ సొంతమేమీ కాదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వాళ్లకు సంబంధించిన ఓ పాడుబడ్డ క్వార్టర్‌. అది ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు.



మంచిరోజు కోసం ఎదురుచూపు...

అర్చనకు ఇప్పుడు 22 ఏళ్లు. పెళ్లీడుకొచ్చింది. అదే మాట ఆమెనడిగితే ‘నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే... వీళ్లను ఎవరు చూస్తారు. నేను లేకుండా అమ్మానాన్న ఒక్కక్షణం ఉండలేరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇన్నింటిలో సంతోషం కలిగించే సంగతేమిటంటే... ఇంతటి కటిక పేదరికం వెక్కిరిస్తున్నా... ఆమెలో ధైర్యం సడలలేదు. కన్నవాళ్లకోసం జీవితాంతం సేవలు చేస్తానంటోంది. ఈరోజు కాకపోతే రేపు... ఓ మంచిరోజు రాకపోతుందా... అని అర్చన ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు త్వరగా వస్తే బావుండు.



డైలీ రొటీన్‌ ఇది!

ఆకలైనా... దాహమేసినా, మూత్రమొచ్చినా... నోటితో చెప్పుకోలేడు తండ్రి. భర్త కష్టాన్ని కళ్లతో చూసి గ్రహించలేదు తల్లి. అందుకే వాళ్ల అవసరాలను ఓ తల్లిలా చూస్తోంది అర్చన. తండ్రికి తినిపించడం, స్నానం చేయించడం, గడ్డం గీయడం, దుస్తులు మార్చడం, మలమూత్రాలు శుభ్రం చేయడం... ఇలా అన్నీ తానే చేస్తోంది. నాన్నను లేపి కూర్చోబెట్టడం తన ఒక్కదాని వల్ల కాదు. దీంతో అమ్మను సాయంగా కూర్చోబెట్టి... తండ్రిని లేపుతోంది. ఇక కంటిచూపు లేని అమ్మకూ దాదాపు అన్ని పనులు చేసి పెడుతుంది. బడికి వెళ్లే ముందే వాళ్లకు స్నానాలు చేయించి, అన్నాలు పెడుతుంది. తాను సాయంత్రం వచ్చేవరకు వాళ్లకు కావల్సినవన్నీ సర్దిపెట్టి వెళ్తోంది. చిన్నపిల్లాడిలా మంచంలోనే ఒంటికి, రెంటికి వెళ్లే నాన్నను, ఏ చిన్నపనీ చేయలేని స్థితిలో ఉన్న అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇలా ఓ కన్నతల్లి కూడా తన బిడ్డలకు చేయలేదేమో... అన్నంతగా అమ్మానాన్నల కోసం అర్చన జీవితాన్ని ధారబోస్తోంది.



నేను కాకపోతే ఎవరు!

మా కుటుంబం ఇలా అవుతుందని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. ఉన్నదాంట్లో ఆనందంగా బతికాం. అలాంటిది ఇప్పుడు ఇలా... (కన్నీళ్లు పెట్టుకుంటూ) అయిపోయింది. నన్ను కన్నవాళ్ల కష్టాన్ని నేను కాకపోతే ఎవరు తీరుస్తారు. బిడ్డగా... జన్మనిచ్చిన వారి కోసం ఎంత చేసినా తక్కువే. కానీ... ఓ ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లడమే కష్టంగా మారుతోంది. మంచిరోజులు వస్తాయన్న ఆశే నడిపిస్తోంది. అమ్మానాన్న మళ్లీ మామూలుగా అవ్వాలి. మా కుటుంబంలో సంతోషం నిండాలన్నదే నా కోరిక.   – అర్చన

– రాసం శ్రీధర్, ఆర్‌సీ ఇన్‌చార్జి, నిర్మల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top