అతడి వాదానికి ఆలంబన

అతడి వాదానికి ఆలంబన - Sakshi


 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్...

 బడా పారిశ్రామికవేత్తలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒకటి.ఇంద్ర భవనాలను తలదన్నే ఇళ్ళు.. ఇంటి నుంచి కాలు తీసి కారులో పెట్టడమే తప్ప ఎండ పొడ ఎరుగనివారు ఎందరో అక్కడుంటారు. వ్యాపార లావేదేవీలతో బిజీగా ఉండే ఈ మనుషుల మధ్య సమాజం కోసం ఆలోచించేవారు ఉన్నారనడానికి అతడో ఉదాహరణ. ఎప్పుడూ ఈ ప్రాంతంలో తిరిగేవారికి అతడు సుపరిచితుడే. అప్పుడప్పుడూ వచ్చేవారికి మాత్రం ఆయన చేస్తున్న పని ఆశ్చర్యం అనిపిస్తుంటుంది.




 

 విలాసవంతమైన కార్లలో తిరిగే హోదా ఉన్న ఆ యువకుడు రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తుంటాడు. వాహనదారులను సరైన దారిలో పెడుతూ ట్రాఫిక్ పోలీస్ పాత్ర పోషిస్తాడు. స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాడు.. నిత్యం సమాజం గురించి ఆలోచించడమే కాదు..


ఆచరణలో చూపించే నాయకుడు. అతడే సురేష్‌రాజు. ‘వాదా’ ఫౌండేషన్ స్థాపకుడు. (వాదా అంటే ‘ప్రమాణం’ అని అర్థం) తాను సంపాదించే రూపాయి సమాజానికి ఉపయోగపడాలని పరితపించే యువకుడు. ఐదేళ్ల క్రితం ఒక్కడితో ప్రారంభమైన ఈ సామాజిక ఉద్యమం ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించింది. ఇందులో ఉన్నవారంతా యువకులే కావడం గమనార్హం. కేవలం ట్రాఫిక్‌పైనే కాకుండా అనాథలు, అన్నార్తులతో పాటు పేద విద్యార్థుల చదువు కోసం, హోంగార్డుల సంక్షేమం కోసం  పనిచేస్తున్నారు.






 పీఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత నాగరాజు తనయుడు సురేష్‌రాజు లండన్‌లోని లీడ్స్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండే ఈయన ఐదేళ్ల క్రితం ‘వాదా ఫౌండేషన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యకలాపాలు విస్తరించారు.



విద్యాసంస్థల్లో ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు, పాదచారుల హక్కులపై ప్రచారం, ట్రాఫిక్ పోలీసులకు ఆరోగ్య బీమా కల్పించడం వంటి సేవలు చేస్తున్నారు. తన స్నేహితుల సాయంతోను వందల మంది వాలంటీర్లతో తన సేవలను రాష్ట్రమంతా విస్తరించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో ఇరువైపులా ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, ఔటర్ రింగ్‌రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్, స్పీడ్‌గన్స్ ఏర్పాటులోనూ ‘వాదా’ సంస్థ విజయం సాధించింది.



 ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకు శపథం

 ‘ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. టైజం ద్వారా చనిపోయేవారి కంటే ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య దేశంలో వందల రెట్లు ఎక్కువ. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఫుట్‌పాత్ 1.8 మీటర్ల వెడల్పు ఉండాలి. కానీ మన నగరాల్లో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లే లేవు. నగరంలో అన్నిచోట్లా పాదచారులు నడవడానికి వీలుండేలా ఫుట్‌పాత్‌లు నిర్మించేవరకు నా జుట్టు కత్తిరించుకోనని ప్రమాణం చేశాను’ అని చెప్పుకొచ్చారు.



 హోంగార్డుల రక్షణ కోసం...

 హైదరాబాద్‌లో పనిచేస్తున్న శ్రీరాములు అనే హోంగార్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడికి ప్రమాద బీమా లేకపోవడం వల్ల కుటుంబం రోడ్డున పడింది. పోలీసుశాఖ నుంచి నామమాత్రంగానే సాయం అందింది. ఈ ఘటన సురేష్‌రాజును కదిలించింది. వ్యక్తిగతంగా శ్రీరాములు కుటుంబానికి ఆర్థికసాయం చేయడంతోపాటు, అతని భార్యకు మరలా ఉద్యోగం వచ్చేలా చేశారు. హోంగార్డులకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉండాలని తలచి స్నేహితుల సాయం తీసుకుని కొందరు హోంగార్డులకు బీమా చేయించారు. అందుకయ్యే ఖర్చును భరించారు.



 పోలీసుశాఖ కోసం పనిచేస్తున్న రాష్ట్రంలోని ప్రతి హోంగార్డుకు ప్రభుత్వమే బీమా చేయించాలని ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ‘మనదేశంలో మొక్కల రక్షణకు, కుక్కల రక్షణకు సొసైటీలు ఉన్నాయి. చివరికి రాళ్ల రక్షణకు ‘రాక్ సొసైటీ కూడా ఉంది. ఈ రాళ్లు మనం నడిచే దారికి అడ్డుపడ్డప్పుడు తొలగించాల్సిందే. కానీ ఇందుకు ఒప్పుకోరు. మనిషి ప్రాణం, జీవితం కన్నా ప్రపంచంలో మరేదీ ఎక్కువ కాదు. ఇప్పుడు సమాజంలో  జరుగుతున్న అనర్థాలకు కారణం చట్టాలు  లేక కాదు..



వాటిని సక్రమంగా ఆచరించకపోవడమే’ అంటారాయన. తాను రోడ్డు మధ్య నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నప్పుడు చూసినవారు ‘ఇతనికి ఇదేం పని’.. అంటూ తక్కువగా చూసినవారు ఇప్పుడు తనతో కలిసి ఉద్యమంలో భాగమయ్యారని ఆనందంగా చెబుతారు సురేష్. తనతో మొదలైన ‘వాదా’ ఉద్యమంలో రాష్ట్రంలో ఎంతోమంది చేరారని, ప్రతి నగరంలోనూ ‘వాదా’ ఉద్యమకారులు ఉన్నారని, తాము చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాననీ ఆయన చెప్పారు. మెరుగైన సమాజం కోసం సురేష్ లాంటి యువకుడు చేస్తున్న ‘వాదా’ మరింతమందికి స్ఫూర్తినిస్తే అంతకన్నా ఇంకేం కావాలి.

 - దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి,

 నానాజీ అంకంరెడ్డి, న్యూస్‌లైన్,  హైదరాబాద్


 నగరంలో అన్నిచోట్లా నడవడానికి వీలుండేలా ఫుట్‌పాత్‌లు నిర్మించే వరకు జుట్టు కత్తిరించుకోనని సురేష్‌రాజు శపథం పట్టారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top