పాండవ పూనకం

పాండవ  పూనకం - Sakshi


పాండవులు పాండవులు తుమ్మెద తండాకొచ్చారు తుమ్మెద పాండవుల తండ్రి పాండురాజైతే  ఈ పూనకాలకు తండ్రి బూరయ్య లాంటి వాళ్లు ఏంటీ కుప్పిగంతులు... అని చదువుకున్నోళ్లు ప్రశ్నిస్తే  దేవుళ్లే ఒంటి మీదకొస్తే ఎదురుపడతారా అంటూ శపిస్తారు కూడా  వంద మంది కౌరవులను చంపిన పాండవులు  ఒక అంధవిశ్వాసాన్ని చంపలేకపోయారు




‘‘అరే! బూరయ్య ఇంటికి తొలి బస్తా ధాన్యం పంపాలె’’ అని బండి మీదున్న ధాన్యం బస్తాలకు భక్తిగా దణ్ణం పెట్టుకుంది లచ్చి.  బండి మీద నుంచి దించిన తొలి బస్తాను ఇంటి వసారాలో ఓ పక్కగా దించాడు పోలయ్య. ‘‘ఓ లచ్చక్కా! నువ్వెప్పుడెల్తున్నవే చెప్పు, నేనూ వత్తా. కాయగూరలు తొలి దింపు వచ్చింది’’ అని కేకేసింది దడి అవతల పక్క నుంచి ముత్తి.




‘‘ఇదిగో అన్నం వొండి పొద్దు కూకేలోగా పోదాం. అట్నుంచే జాతరక్కూడా పోదామే ముత్తే. నువ్వు బేగి పని కానిచ్చు’’ అంటూ వంటపనిలో మునిగిపోయింది లచ్చి. ‘‘ఓ గొంతెమ్మా! నెత్తి మీద బస్తా దింపుతావే’’ అంటూ బూరయ్య భార్యను పిలిచింది లచ్చి. గొంతెమ్మ వచ్చి లచ్చి తల మీదున్న ధాన్యం బస్తా, ముత్తి తల మీదున్న కూరగాయల బుట్ట దించింది. ఇంటి వసారాలో కూర్చున్నారిద్దరూ. ఓ వంద గజాల దూరంలో ఉన్న గుడి కనిపిస్తూనే ఉంది. వెదురు గడలతో వలయాకారంగా పర్ణశాలను తలపిస్తోంది గుడి. పంటలు చేతికొచ్చాయి. ఏడాదికోసారి జరిగే జాతర మొదలైంది. మూడు వందల మంది నివసించే ఊరంతా అక్కడే ఉన్నట్లుంది వాతావరణం.




‘‘అందరూ వచ్చేశారే లచ్చక్కా! బేగి నడువు’’ తొందర పెట్టింది ముత్తి. ఇద్దరూ అటుగా నడిచారు. గుడిలోపల కొయ్య బొమ్మలు. ధర్మరాజు నుంచి సహదేవుని వరకు ఐదుగురి బొమ్మలతోపాటు పక్కనే ద్రౌపది బొమ్మ కూడా ఉంది. గుడి బయట పదిహేనేళ్ల పిల్లలు ఏడెనిమిది మంది ఉన్నారు. వారి ఎదురుగా బూరయ్య కూర్చుని ఉన్నాడు. బూరయ్య లయబద్దంగా ఊగుతూ ‘‘తమ్ముడూ భీమా’’ అనగానే ఓ కుర్రాడు అప్రమత్తం అయ్యాడు. అచ్చం మనం సినిమాల్లో చూసే భీముడిలాగానే అభినయించడం మొదలుపెట్టాడు. మరో ఇద్దరు కుర్రాళ్లు నకులుడు, సహదేవుడి పాత్రల్లో ఇమిడిపోయారు. ‘‘పాంచాలీ!’’ అంటూ కేకపెట్టగానే గొంతెమ్మ ఇంట్లో ఉన్నదల్లా ‘‘కూ’’ అంటూ కూత పెడుతూ ఇంట్లో నుంచి పరుగెత్తుకొచ్చింది. మరికొన్ని డైలాగుల తర్వాత బూరయ్య పెదవులను సున్నాలా చుట్టి, నోటి దగ్గర చెయ్యి పెట్టి ‘‘కూ... అర్జున్డు పిలుత్తునాడే సూరే’’ అనగానే ఓ కుర్రాడు వంద అడుగుల దూరంలో ఇంట్లో ఉన్న కుర్రాడు పరుగున వచ్చి గిరిలో దూకాడు. చక్కటి కథ, స్క్రీన్ ప్లేతో నడుస్తున్న నాటకాన్ని తలపిస్తోందా సన్నివేశం.


‘‘లచ్చక్కా! ఆ పోరళ్ల ఒంటి మీదకు పాండవులొచ్చారంటే వాళ్లమ్మానాన్నలు ఎంత పుణ్యం చేసుకున్నారో’’ ముత్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.  ‘‘అంతే కదే మల్లా! బూరయ్య సామికి ధరమరాజే వత్తన్నాడు, గొంతెమ్మకు ద్రౌపదమ్మొత్తాది. గొంతెమ్మ జుట్టిరబోసుకుని ఎట్టా శపథాలు చేసిందో. గిరిలోకి ఒక్కొక్కరు ఎట్టా దూసుకొచ్చారో చూస్తివి గద ముత్తే. ‘‘బూరయ్య నిన్న పొద్దున -‘‘ద్రౌపది నీ కోసం వెతుకుతోందే రత్తాలూ’’ అనగానే బడికి పొయ్యే పిల్ల కాస్తా గిరిలోకి దుంకేసింది’’ అని చూసిన దృశ్యాలను మళ్లీ మళ్లీ తలుచుకుంటోంది లచ్చి.  ‘‘అదెట్టా మర్చిపోతానే లచ్చక్కా! గిరిలోకి పాండవ దేవతలంతా కట్టకట్టుకుని వాలిపోతిరి గదా!  ‘‘ ఆ పాండవ దేవుళ్లే మన మీద ఓ కన్నేసి సల్లంగ చూడాల మరి’’ అంటూ ఇద్దరూ ఇంటిదారి పట్టారు.


  

ఊరి పాఠశాల. క్లాసులో టీచరు ఆందోళనగా ఉన్నారు. ‘‘పదవ తరగతి పరీక్షలు ఎంత ముఖ్యమో ఏమైనా తెలుస్తోందా మీకు? జాతర ఉంటే ఎగ్జామ్‌కు ఆబ్సెంట్ అవుతావా? నీకు ఏడాది వృథా అవుతుందని తెలియాలి కదా. హిందీ పరీక్ష మళ్లీ రాద్దువు కానీ మిగిలిన సబ్జెక్టులు జాగ్రత్తగా ప్రిపేరవ్వు’’ అని మందలిస్తున్నాడు.  ‘‘తమ్ముడూ అర్జునా’’ అంటూ ఓ కుర్రాడు లేచాడు. టీచరుకేమీ అర్థం కాలేదు. మరొక వైపు నుంచి ‘‘అన్నా ఏమి ఆన’’ అంటూ మరో కుర్రాడు నిలబడ్డాడు. స్కూల్లో ఉన్న నలభై మందిలో దాదాపు పదిమంది వరకు లేచారు. ఒకరి అభినయానికి అనుగుణంగా మరొకరు ప్రతిస్పందిస్తున్నారు. పొలానికి అటుగా వెళ్తున్న ఆడవాళ్లు జతయ్యారు. వారూ ఒక్కో పాత్రలో తమను తాము అన్వయించుకున్నారు. పరిస్థితి టీచరు అదుపు దాటిపోయింది. నిలువరించాలా, కొనసాగనివ్వాలా తెలియడం లేదు. దాదాపుగా గంటన్నర తర్వాత పరిస్థితి దానంతట అదే సద్దుమణిగింది. స్కూలు గంట కొట్టేసి దారి పట్టారు టీచరు. పట్టణం వెళ్లే బస్సెక్కి కూర్చున్నాడు.




‘ఇలాగైతే, ఇది ఇలాగే కొనసాగితే ఎలా. పిల్లలు పరీక్షలు రాయకుండా అకడమిక్ ఇయర్ వేస్టవుతోంది. చదువురాని పిల్లలు సరే, చదువు వచ్చే వాళ్లు కూడా దేవతలు, పూనకాలని పరీక్షలకు హాజరు కాకపోతే వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ తరమైనా చైతన్యవంతమై గ్రామాన్ని మూఢవిశ్వాసాల నుంచి బయటకు తెస్తారని ఆశిస్తే వీళ్లు కూడా విశ్వాసాల్లో మునిగిపోతే అంధకారం వీడేదెలా. జాతర్ల వరకు అది వారి సంప్రదాయం, ఉత్సవంలో ఓ భాగం అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ క్లాసులో కూడా వస్తుంటే దీనిని నిలువరించకపోతే ఎలా? ’’ రకరకాలుగా ఆలోచిస్తూ పట్టణం చేరారు టీచర్.


  

‘‘లచ్చక్కా పొలానికి రేప్పోవచ్చు గానీ ఇలా రావే! మనూరికి సదూకున్నోళ్లు వచ్చారు’’ అంటూ అప్పటికే ఇంటి తలుపేసి దారి పట్టింది ముత్తి. ఆమెను అనుసరించింది లచ్చి. ఊరంతా గుమిగూడింది. బూరయ్య కోపంతో ఊగిపోతున్నాడు. ‘‘పిల్లలకు దేవుళ్లు పూనితే జబ్బంటారా’’ అని హుంకరిస్తున్నాడు. నన్నే అనుమానిస్తారా. ఇలాగైతే గూడెంలో ఉండను, వనవాసం పోతాను’ అని లేవబోయాడు. తండా అంతా అయోమయంగా విస్తుపోయి చూస్తోంది. తనకు సానుకూల స్పందన రావడంలేదని గ్రహించాడు బూరయ్య. ‘‘వనాలకెళ్దాం రండహో కూ’’ అని కూత పెట్టి పది మంది పిల్లల పేర్లు పిలిచాడు. ఆ పిల్లలంతా బూరయ్య పక్కన చేరిపోయారు. ఆ పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోయింది. వచ్చిన వారి మీద దాడి జరగడానికి పెద్దగా సమయం అక్కర్లేదనిపిస్తోంది. ఇంతలో... గ్రామ రెవెన్యూ ఉద్యోగి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. రెండు గంటలకు రభస సద్దుమణిగింది. పెద్దవాళ్లు పిల్లలను అక్కున చేర్చుకుని ఇళ్లదారి పట్టారు. నెమ్మదిగా ఒక్కొక్కరూ లేస్తున్నారు.




‘‘లచ్చక్కా! దేవుడు ఒంటి మీదకు రావద్దే. గుడిలో ఉంటే చాలు. మనమే గుడికెల్లి ఆ దేవుడికి దణ్నం పెట్టుకుందాం. పిల్లలను బడికి పంపించి చదివించుకుందామే. సదుకుంటే ఎంత తెలివొస్తుందో. ఆ పట్నం వోల్లు ఎన్నెన్ని సంగతులు చెప్పారో చూస్తివిగా. నా బిడ్డల్ని సదివిత్తానే’’ అన్నది గుండెల మీద చెయ్యేసుకుంటూ.


‘‘నిజమేనే ముత్తీ! అయినా మనం ఆరుగాలం కష్టపడి వాళ్లకు బస్తాలకు బస్తాలు వడ్లు, బుట్టలకు బుట్టలు పండ్లు, కూరగాయలు పట్టుకెళ్లడం ఎందుకే? తండా అంతా కష్టపడి వాళ్లను కూర్చోబెట్టి తినిపిస్తున్నాం. పొలంలో పండినవన్నీ వాళ్లింటికి మోస్తున్నాం’’ అంది లచ్చి సాలోచనగా.


 


పాండవులతో సహవాసం!

నాయక్‌పోడులది ప్రత్యేకమైన జీవనశైలి, ప్రత్యేకమైన భాష. దానికి లిపి లేదు. గ్రామానికి కొంచెం దూరంగా తండాలో నివసిస్తారు. పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో తమ దగ్గరే నివసించారని చెబుతారు. అందుకే పాండవులను దేవుళ్లుగా కొలుస్తారు. వారి ఆలయం పాండవుల గుడి. వారి దేవుళ్లు పాండవులు. వారి ఒంటి మీదకు వచ్చేదీ పాండవులే. ఆ తండాలో చదువుకున్న వాళ్లు నూటికి పదికి మించరు. బూరయ్య వంటి వాళ్లు తండాకొకరు ఉంటారు. వారి జీవనం ఊరి వారి శ్రమ మీదనే సాగిపోతుంటుంది. దాంతో ఆదివాసీలను ఆ విశ్వాసాల నుంచి బయటకు రానివ్వకుండా కాపాడుకుంటూ వస్తుంటారు బూరయ్య వంటి తెలివైన వాళ్లు.


ఈ సంఘటన కరీంనగర్ జిల్లా, మంథని ముత్తారం మండలం, కమ్మంపల్లి గ్రామంలో 2012లో జరిగింది. స్కూలు పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం రావడంతో మేము వెళ్లాం. ఒకరు క్లాసులో లేచి నిలబడి రాగయుక్తంగా పాట మొదలు పెడితే నాలుగైదు నిమిషాల్లోనే ఏడెనిమిది మంది పిల్లలు తోడయ్యేవారు. అది మాస్ హిస్టీరియా అని చెబితే వాళ్లకు అర్థం కాలేదు. పిల్లలకు వైద్యం చేయించాలంటే మమ్మల్ని కొట్టబోయారు. వేడుకల్లో పూనకం వచ్చే వాళ్లకు కూడా ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. దాంతో మానసికంగా ఆయా పాత్రలను ఆవహింపచేసుకోవడానికి సిద్ధమవుతుంటారు. గ్రామ సర్పంచ్, ఇతర పెద్దలను మా వాదనతో సమాధాన పరిచి, వారి చేతనే మిగిలిన వాళ్లకు చెప్పించాం. పిల్లల్ని బడికి పంపిస్తామని, పరీక్షలు రాయిస్తామని అంగీకరించారు.    - సారయ్య, ప్రజానాస్తిక సమాజం


ఒకరు ధర్మరాజులాగ అభినయిస్తే, ఒక కుర్రాడు భీముడిలా అభినయిస్తారు.  అలా పాండవులతోపాటు మహాభారతంలోని  ప్రధానమైన పద్నాలుగు పాత్రలను అనుకరిస్తుంటారు.  ఇది వారి సంప్రదాయ వేడుకల్లో ఇదో భాగం.


- వాకా మంజులారెడ్డి,


సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి


గమనిక: కథనంలో పేర్లు మార్చడమైంది


 


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top