పిన్న వయసు... భిన్న స్వరం...

పిన్న వయసు... భిన్న స్వరం... - Sakshi


అదితీ అయ్యర్ 2004 ఆగస్టు 5న ఢిల్లీలో పుట్టింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు 18 నెలల పాపగా ఉన్నప్పుడే అదితి రాగాలు ఆలపించడం మొదలు పెట్టింది. నాలుగేళ్ళ వయసులోనే సెలిన్ డియోన్, ఎంజె డబ్ల్యూ హౌస్టన్ మొదలైన పాశ్చాత్య గాయకుల పాటలు విన్న అదితి వారి పాటలు నేర్చుకోవడంలో అత్యంత ఆసక్తిని చూపింది. వారినే ప్రేరణగా తీసుకుంది.  ఆరేళ్ల వయసులోనే సంప్రదాయ, సమకాలీన పాశ్చాత్య సంగీతం తనకు తానే నేర్చుకోవడం ప్రారంభించి, అద్భుతమైన గాయనిగా ఎదిగింది.



గుర్గావ్‌లోని ఎక్సెల్షియర్ అమెరికన్ స్కూల్ విద్యార్థిని అయిన అదితి ప్రతిభను ప్రముఖ గాయకుడు జ్యోత్స్నా రాణా గుర్తించారు. గుర్గావ్ ఆర్టెమిస్ ఆడిటోరియం వద్ద మహిళా దినోత్సవం రోజు జరిగిన సమావేశానికి అదితిని ఆహ్వానించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రఖ్యాత శాంతి హరినంద్‌ను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ‘పవర్ ఆఫ్ లవ్’ అనే పాటను అదితి పాడింది. మరొకసారి అక్కడే రిషి నిత్యప్రజ్ఞ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ శిష్యుడు) కోసం స్వాగత గీతాన్ని ఆలపించింది.



అదితి గౌరవనీయమైన, ప్రఖ్యాత వాయిస్ శిక్షకులు సీతూ సింగ్ బ్యూహ్లర్ దగ్గర ఒపేరా నేర్చుకుంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారందరిలోకీ చిన్న వయసు విద్యార్థిని అదితి మాత్రమే. ఆమెకు ఒక అధికారిక యూ ట్యూబ్ ఛానల్ ఉంది. దాని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సంగీత నిపుణులు, గాయకుల నుండి అధిక ప్రశంసలు, సానుకూల వ్యాఖ్యలు, స్పందనలు అందాయి. ఆమె కేవలం 5 నెలల కాలంలో సుమారు 700 చందాదారులను, 1,20,000 వీక్షణలను పొందింది.



ఎనిమిది సంవత్సరాల వయసులోనే మధురమైన, శక్తిమంతమైన గళాన్ని, అందులోనూ గొప్ప శ్వాస నియంత్రణ కలిగిన ఒక ఒపేరా గళాన్ని కలిగిన గాయకురాలిగా అదితి పేరు తెచ్చుకున్న తీరు నిజంగా ప్రశంసనీయమే. చిన్న వయసు వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకమే.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top