ఆడపిల్ల అక్కడే పుట్టాలి..!

ఆడపిల్ల అక్కడే పుట్టాలి..!


విదేశీయులు సైతం మెచ్చే సంస్కృతీ సంప్రదాయాలే కాదు... ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మూఢాచారాలు కూడా ఉన్న దేశం మనది. వాటిని రూపుమాపడానికి ఏ మహానుభావుడో రావాలంటే కుదరదు. ఎవరికి వారే ముందడుగు వేయాలి. మంచిని పెంచాలి. చెడును తుంచాలి. అలా చేశారు కాబట్టే బీహార్ లోని ధర్హరా గ్రామస్థులు ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ ఊరి స్వరూపాన్నే కాదు... తమ ఆడపిల్లల తలరాతనే మార్చేశారు. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఓ మూఢాచారానికి ముగింపు పలుకుతున్నారు!

 

ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు. కానీ ఆ మహాలక్ష్మిని ఆనందంగా ఆహ్వానించేవాళ్లు ఎంతమంది ఉన్నారు! ఆడపిల్ల వద్దు అనుకునేవాళ్లు, కూతురు పుడితే మోయలేని భారం భుజాల మీద పడిందని బాధపడిపోయేవాళ్లు ఇప్పటికీ కోకొల్లలుగా ఉన్నారు. అలాంటివాళ్లందరినీ బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న ధర్హరా గ్రామానికి తీసుకెళ్లాలి. ఆ గ్రామస్థులు ఆడపిల్ల పుడితే ఆనందంతో మురిసిపోతారు. మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకుంటారు. అందరినీ పిలిచి విందులు ఇస్తారు. ఎందుకంటే వారికి ఆడపిల్ల భారం కాదు... ఆభరణం!

 

ధర్హరాలో అడుగు పెడితే కన్నులు పచ్చరంగు పూసుకుంటాయి. ఎటుచూసినా పచ్చటి మొక్కలు, చల్లగా వీచే గాలి... ప్రకృతి రమణీయతతో, ప్రశాంతతతో అలరారుతూ ఉంటుంది ధర్హరా. నిజానికి ఒకప్పుడు ఆ ఊరు ఇలా ఉండేది కాదు. ఆ రాష్ట్రంలో ఉన్న అనేక వెనుకబడిన గ్రామాల్లాగే ఉండేది. బీడువారి మోడులా కనిపించేది. కానీ ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు కానీ... మెల్లమెల్లగా ధర్హరా తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చింది.

 

ఎలా మొదలైందో తెలీదు కానీ...



ఒకప్పుడు ధర్హరాలో ఆడపిల్లల పరిస్థితి ఎంతో దయ నీయంగా ఉండేది. వారికి పెళ్లి చేసి పంపలేక తల్లిదండ్రులు నానా అగచాట్లూ పడేవారు. కట్నపు బాకీలు సరిగ్గా చెల్లించలేకపోవడంతో అత్తమామలు ఆడపిల్లల ప్రాణాలు తీసేవారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేసేవారు. అలాంటి సమయంలో ఆ ఊరిలో ఒక సంప్రదాయం మొదలైంది. ఎవరు దానికి పునాది వేశారో తెలియదు కానీ... ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ఒక పండ్ల మొక్క నాటాలి అనే నియమం ఏర్పడింది (అప్పట్లో ప్రధాన్‌గా ఉన్న వ్యక్తి దీన్ని అలవాటు చేశాడని అంటారు కానీ సరైన ఆధారాలైతే లభించడం లేదు.



కొన్ని వందల యేళ్లుగా ఈ ఆచారం వస్తోందని చెబుతారు తప్ప ఎప్పుడు మొదలైందో గ్రామస్థులకు కూడా సరిగ్గా తెలియదు). పిల్ల పుట్టినప్పుడే మొక్క నాటితే అది తనతోపాటు పెరుగుతుంది, ఆ చెట్టు మీద వచ్చే ఆదాయంతో బిడ్డను పెంచవచ్చు, పెళ్లి చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని మొదలు పెట్టారు. ఆ ఆలోచన నచ్చడంతో అందరూ దాన్ని పాటించడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఊరు ఒక గ్రీన్ విలేజ్‌లా మారిపోయింది.

 

తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ధర్హరా గ్రామస్తులు. మొదట్లో ఒక మొక్కను నాటేవారు కాస్తా ఇప్పుడు పది నుంచి ఇరవై మొక్కలను నాటుతున్నారు. దాంతో ఊరు ఊరంతా పండ్ల చెట్లతో పచ్చగా అలరారుతోంది. మామిడి, పనస, నేరేడు వంటి పది రకాల చెట్లు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించాయి. ఆడపిల్లలు ఉన్నవారంతా వీటి మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు. ఆ సొమ్మును జాగ్రత్తగా దాచి పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ‘‘పండ్లతో పాటు కలప కూడా బాగా ధర పలుకుతుంది కాబట్టి ఎలాగైనా పిల్లల జీవితాలను చక్కబెట్టేయవచ్చు అన్న భరోసా పెరిగింది అందరిలో’’ అంటారు సుభాష్‌సింగ్. మామిడి చెట్ల మీద వచ్చిన ఆదాయంతోనే తన కూతురికి మంచి సంబంధం చూసి చేశారాయన.          

 

ఇలాంటి తండ్రులు ధర్హరాలో చాలామంది ఉన్నారు. పిల్లలకు కట్నా లిచ్చి పెళ్లిళ్లు చేశారు. కొందరైతే బిడ్డ పేరు మీద నాటిన చెట్లనే అల్లుళ్లకు రాసిచ్చారు. దాంతో వరకట్న చావులు లేకుండా పోయాయి. ఇంకా చెప్పు కోవాల్సిన విషయమేమిటంటే... ఆ గ్రామస్థుల ఆలోచనకు ముచ్చటపడి యువకులు ఆ ఊరి అమ్మాయిల్ని కట్నం తీసుకోకుండానే వివాహం చేసు కుంటున్నారు. దాంతో మెల్లగా వరకట్నం అన్న మాట వినబడకుండా పోయింది. ఆడపిల్లలు నవ్వుతూ, తుళ్లుతూ బతుకుతున్నారు. చదువు కుంటున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు.

 

బహుశా ప్రపంచంలో మరెక్కడా ఆడపిల్లలు ఇంత సంతోషంగా ఉండరేమో. ఆడపిల్లను ఆనందానికి ప్రతిరూపంగా మార్చిన ఘనత ధర్హరా గ్రామస్తులదే. వారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశంలో భ్రూణ హత్యలుండవు. వరకట్న చావులుండవు. అసలు ఏ ఆడపిల్ల కళ్ల నుండీ కన్నీళ్లన్నవే జాలువారవేమో!



- సమీర నేలపూడి

 

ఒకప్పుడు ధర్హరాలో ఓ దురాచారం ఉండేది. ఆడపిల్లని ముందు మామిడి చెట్టుకిచ్చి పెళ్లి చేసేవారు. తర్వాతే వరుడితో తాళి కట్టించేవారు. కానీ ఇప్పుడా ఆచారం లేదు. మామిడి చెట్టుతో కాదు, మామిడి చెట్ల సాయంతో పిల్లలకు మనువు జరిపిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి చేయగలమన్న ధీమా రావడంతో ఆడపిల్లలను చక్కగా చదివిస్తున్నారు కూడా! దాంతో అక్కడ బాలికల అక్షరాస్యతా శాతం కూడా పెరుగుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top